మానూ మాకును కాను నవల – 10 | 2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad

Vijaya Lakshmi

Published on Oct 28 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మానూ మాకును కాను – పార్ట్ 10

2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల

                                   రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

   ‘తను గుగు ప్రేమని స్వీకరిస్తున్నాడు. అంతే కాదు ఆ క్షణం నుంచే గుగుని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాడు‘.

ఫోన్ అందుకుని అందులో గుగు ఫోటోని చూసి ప్రేమగా నవ్వుకున్నాడు ఆయుష్.

సినిమాకి వెళ్ళిన జనానికి గుగు, ఆయుష్ లకు తలెత్తిన మానసిక తుఫాన్ గురించి ఏ మాత్రం తెలియదు. తరవాత రోజు ఆయుష్ కొంచం ఇబ్బందిగా ఫీల్ అయితే, గుగు సిగ్గుతో, భయంతో ముడుచుకుపోయింది.

రోజులు నడుస్తూనే ఉన్నాయి. విద్యార్థులు చదువులో మునిగిపోయారు.

ఆ రోజు సోమవారం. ఆయుష్ గుగుకి ఫోన్ చేసాడు.

“గుగు… అలా పార్క్ వైపుకు రాకూడదు... ఈ రోజు పార్క్ లో పెద్దగా జనం ఉండరు. మన బెంచ్. నువ్వు వస్తున్నట్లు ఎవరికీ చెప్పకు. అంతకీ ఎవరన్నా అడిగినా, మనల్ని చూసినా ఏదో సబ్జెక్టులో డౌట్స్ డిస్కస్ చేసుకోడానికి అని చెప్పవచ్చు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను” అంటూ ఫోన్ పెట్టేసాడు ఆయుష్.

గుగు కి  ఫోన్ మాట్లాడుతుంటే నోరు తడారిపోయింది.  చేతులు వణికిపోయాయి. గుగు ఆశ్చర్యపోయింది. తన శరీరం ఎందుకు అలా స్పందిస్తోందో ఆమెకి అర్థం కాలేదు.

‘ఆయుష్ ఏమంటాడో? తిడతాడేమో? లేకపోతే తన ఫ్రెండ్స్ అందరికి చెపుతానని అంటాడేమో? లేకపోతే కొంపముంచి తన తల్లితండ్రులకుగాని ఫోన్ చేసి చెప్పడు కదా?’ ఇలా పరి విధాలైన ఆలోచనలతో భయంభయంగా పార్క్ కి బయలుదేరింది  గుగు.

 ఆ రోజు వర్కింగ్ డే అవడం వలన రోజు పార్కులో అసలు జనం లేరు.

పార్క్ కి గుగు వెళ్ళేసరికే అక్కడ ఆయుష్ కూచుని ఉన్నాడు. గుగు చాలా నెమ్మదిగా తల వంచుకుని ఆయుష్ ని సమీపించింది.

“కూచో గుగు” అంటూ తన పక్కనే  చోటు చూపించాడు ఆయుష్.

గుగు బెదురూ చూపులు చూస్తూ కూచుంది .

“ఏమిటి? అంత భయ పడిపోతున్నావు?” అని అడిగాడు ఆయుష్.

“అంటే... అంటే…” గుగు కి మాటలు బయటకు రాలేదు. గొంతు ఎండిపోయింది. విచిత్రం అంతకు ముందు ఎన్నో సార్లు గుగు, ఆయుష్ ని కలుసుకుంది. ఒక్కోసారి మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కోసారి వాళ్ళిద్దరే ఉన్నారు. కాని ఆ రోజులాంటి మానసిక పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు గుగుకి.

“ఏదో చెప్పబోయి ఆగిపోయావు.” అన్నాడు ఆయుష్.

“అదే... ఆ రోజు పొరపాటుగా మాట్లాడాను. తరవాత ఆలోచించుకున్నాను. నాకు ఆశ ఉండచ్చు కాని అంత అత్యాశ ఉండకూడదని... తెలిసింది” అంది గుగు .

“గుగు నీది అత్యాశ కాదు నీది… నా మీద నీకు ఉన్న ప్రేమ... ఎస్ ప్రేమ... నేను కూడా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను గుగు. అవును. ఇక ఈ క్షణం నుంచి మనం జీవితాంతం కష్ట సుఖాలు పంచుకుంటాం.”

“ఆయుష్!!??” అతని మాటలు నమ్మలేనట్లు గా అరిచింది గుగు కనుకొలనలులో నీరు నిలస్తుండగా.

“నిజం గుగు. కాని మన పెళ్ళి, మన చదువులు అయ్యాకే. అంతవరకు అలా సరదాగా ప్రేమించుకుంటూ ఉందాం.” అన్నాడు ఆయుష్ గుగు వైపు సూటిగా చూస్తూ.

అతని మాటలు, ఎండకి ఎండి బీటవారిన నేలమీద కురిసిన  తొలకరిజల్లులా కురిసాయి గుగు మనస్సులో.

“ఆయుష్! థాంక్స్... నీకు ఎన్ని జన్మల వరకో రుణపడి ఉంటాను” అంది గుగు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.

“నువ్వు తెలుగు బాగానే నేర్చుకున్నావు. పెద్ద పెద్ద పదాలు కూడా ఉపయోగించేస్తున్నావు. గుగు! మనం ఒకరికి ఒకరు రుణపడడం ఏమిటి? మనం కాబోయే భార్యాభర్తలం. ఇక జీవితం అంతా ఒకరికి ఒకరు ప్రేమ పంచి ఇస్తూ, కష్ట సుఖాల్లో బాగం పంచుకుంటూ ఉండాలి” అన్నాడు ఆయుష్ ప్రేమగా గుగు కళ్ళలోకి చూస్తూ.

గుగు సిగ్గు పడ్డుతూ కళ్ళు మూసుకుంది .

“ సిగ్గు పెళ్ళికి, శోభనానికి దాచుకో” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.

“శోభనం అంటే?” నిజంగా ఆ పదానికి అర్థం తెలయక అడిగిందో, కొంటెగా అడిగిందో తేల్చుకోలేకపోయాడు ఆయుష్.

“శోభనం అంటే...” అంటూ గుగు మోహం దగ్గరగా తీసుకుని, ముద్దు పెట్టుకుని చెవిలో చెప్పాడు ఆయుష్.

“బాడ్ బాయ్” అంది గుగు అతను ముద్దు పెట్టిన చోట మృదువుగా తడుముకుంటూ, అతని మాటలకు సిగ్గు పడుతూ. ఆమెకి శరీరంలో ఏమిటేమిటో ఎప్పుడూ చవిచూడని, కొత్త కదిలకలు కలిగాయి. రక్తం వేల కిలో మీటర్ల వేగంతో పరుగెడుతున్న భావం కలిగింది. శరీరం అంత వేడిగా తయారయ్యింది.

“అదిగో మళ్ళీ సిగ్గు....” అన్నాడు అయుష్ .

గుగు నవ్వుతూ తల దించుకుంది .

“గుగు! మన పెళ్ళి అవ్వాలంటే కనీసం డిగ్రీ పూర్తి కావాలి” అన్నాడు ఆయుష్.

‘డిగ్రీ... పీజీ... డీఎం అంటూ లెక్చర్ లు దంచిన ఆయుష్ ఇతనేనా?’ అనుకుని నవ్వుకుంది గుగు.

యవ్వనంలో ప్రేమకి అంత గొప్ప విలువ ఉంది. మనష్యుల ఆలోచనా ధోరణిని మార్చి వేస్తుంది. ఈ రోజులలో కొన్ని చోట్ల ఆలోచన పెడదారి పట్టి నేరాలు ,ఇంకొన్ని చోట్ల అవాంఛనీయ సంబంధాలకి దారి తీస్తోంది. ఇంక కొన్ని చోట్ల వావి వరస లేకుండా ప్రేమ అనే పేరుతో, లోకాన్నిమోసం చేస్తూ, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, అక్రమ సంబంధాలకి ఎగబడడం కూడా జరుగుతోంది.

కాని ఆయుష్, గుగుల ప్రేమ అన్ని సరిహద్దులు దాటిన స్వచ్చమైన, నీతివంతమైన, ఉత్తమమైన ప్రేమ.

ఆయుష్, గుగులు చాలా సేపు పార్క్ లో గడిపారు. మనుసులు విప్పి  ఊసులాడుకున్నారు. ఎన్నో సంగతులు మాట్లాడుకున్నారు. కొత్త విషయాలు చర్చించుకున్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే వాళ్ళిద్దరు మాటలలోగాని, భౌతికంగాగాని ఏ విధమైన హద్దులు మీరలేదు. తమ పెళ్ళి వరకు అలాగే ఉండాలని నిర్ణయించుకున్నారు.

“గుగు ప్రస్తుతానికి ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఇటు మన ఫ్రెండ్స్ కి గాని, అటు మీ తల్లిదండ్రులకు గాని, మా తల్లిదండ్రులకు గాని తెలియకూడదు. ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు ఆయుష్.

“ఆయుష్ ఈ క్షణం నుంచి నువ్వు ఏం చెపితే నేను అది” అంది గుగు నవ్వుతూ   .

“అలాగా? అయితే ఇప్పడినుంచి తిండిమానేయ్” అన్నాడు అయుష్ నవ్వుతూ.

“అలాగే” అంది గుగు తను కూడా నవ్వుతూ.

“పద. మనం హాస్టల్ కి వెళ్ళాలి. లేకపోతే మన వాళ్ళు అసలే కోతులు. ఏదైతే రహస్యంగా ఉంచుదాం  అనుకున్నమో దానిని బట్టబయలు చేసేసి, నానా అల్లరి చేస్తారు” అన్నాడు ఆయుష్.

ఇదివరకు ఎప్పుడూ లేనంత దగ్గర దగ్గరగా నడుస్తూ హాస్టల్ వైపు దారితీసారు ఆయుష్ గుగు.

నిజానికి వాళ్ళు భౌతికంగా కంటే మానసికంగా బాగా దగ్గర అయ్యారు.

*******************

రోజులు వేగంగా దొర్లుతున్నాయి. విద్యార్ధులకి క్లాసులని, నోట్స్ అని, టెస్ట్స్ అని అసలు ఊపిరి సలపకుండా చేస్తున్నారు.

ఫోర్త్ సెమిస్టరు పరీక్షలకి నోటీసు వచ్చింది.

         ఆ రోజు ఆదివారం కావడం చేత ఆయుష్, అతని ఫ్రెండ్స్ అందరూ పార్క్ లో కూచున్నారు.

“బాబోయ్… ఇదేమి బతుకో అర్థం కావడంలేదు. ఎప్పుడూ పరీక్షలే. లేకపోతే స్పెషల్ క్లాసులు. ఆదివారాలు లేవు. శలవలు లేవు. పండగలు లేవు. బొత్తిగా బానిస బతుకు అయిపోయింది” అంది హసిత ఒళ్ళు విరుచుకుంటూ, విసుగ్గా మోహం పెట్టి.

“హసితా నువ్వు త్వరలో ఇంకొకరిని బానిస చేసుకుంటున్నావు కదా. పాపం ఆయనికి నీ బాధలు తప్పవు. బానిసగా బతకడం ఎంత కష్టమో నీకూ తెలియాలి కదా” అంది శరణ్య నవ్వుతూ.

“హసితకి కాబోయే భర్తకి మనందరి సానుభూతి” అంది స్నేహ జాలిగా మోహం పెట్టి.

“ఏమిటి నేను అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా? మీరందరు అతని మీద అంత జాలి పడిపోతున్నారు” అంటూ కోపంగా మోహం పెట్టింది హసిత.

“తల్లి పుట్టిల్లు మేనమామకి ఎరుకా అని... నిన్ను రెండేళ్ళ నుంచి చూస్తున్నాం కదూ తల్లీ” అంది నివేదిత.

“అసలు మీ మాటలు వినే ఏమో, అతను పెళ్ళి రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నాడు” అంది హసిత ఉక్రోషంగా.

“అంటే నువ్వు విరహ వేదన అనుభవించలేక పోతున్నావా హసితా” అంది గుగు నవ్వుతూ.

“అమ్మా గుగు తల్లీ... నీకు తెలుగు దగ్గర ఉండి నేర్పించినందుకు... నా చెప్పులతో నేనే కొట్టుకోవాలి. నీ బాషా జ్ఞానం, పద ప్రయోగం అంతా నా మీదే చేస్తున్నావు” అంది హసిత నవ్వుతూ.

“గుగుకి నీలా బాధలు లేవులే. అక్కడ ఆఫ్రికాలో అబ్బాయి సిద్ధంగా ఉండి ఉంటాడు. గుగు డిగ్రీ చేతబట్టుకు బయలుదేరగానే అతను ఎయిర్ పోర్ట్ లో రెడీగా ఉంటాడు. ఏం గుగు అంతేనా?” అంది శరణ్య. 

“నాకు అలాంటిది ఏమి లేదు. ముందు చదువు కావాలి. ఆ తరువాతే ఏ ఆలోచన అన్నా” అంది గుగు ఆయుష్ వైపు చూస్తూ.

“పోనీ మా దేశంలోనే ఎవరినన్నా చూసేసుకో. నీ పెళ్ళి మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం.” అంది స్నేహ.

“అయినా మన దేశంలో అమ్మాయిలకి గిరాకి ఎక్కువ. అమ్మాయిల కోసం పెళ్ళికొడుకులు వెంటపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అయిపోయారు. అందు గురించే మనం మినిమం డాక్టర్ విత్ ఫిఫ్టీ లాక్  పెర్ ఏనం డిమాండ్ చెయ్యవచ్చు“ అంది శరణ్య.

“ఆ నీ కోతి మొహానికి ఫిఫ్ట్టి లాక్, తౌసాండ్ కే అబ్బాయిలు వస్తారు” అంది స్నేహ.

“ఏం నువ్వు పెద్ద అందగత్తెవా?” అని స్నేహని అడిగింది శరణ్య.

“నేను అందగత్తెనైనా, కోతినైనా నన్ను చేసుకోవడానికి మా బావ రెడీగా ఉన్నాడు” అంది స్నేహ.

“ఓహ్. కంగ్రాట్స్. ఎప్పుడూ చెప్పలేదు” అంటూ స్నేహకి చెయ్య అందించాడు ఆయుష్.

“సో నాతో రెండు వికెట్స్ డౌన్. ఇక మన గ్రూప్ లో మిగిలింది శరణ్య, నివేదిత, గుగు, నువ్వు” అంది స్నేహ ఆయుష్ ని ఉద్దేశించి.

“ఏమే స్నేహా? నీకు పెళ్ళి పిచ్చి ఎక్కువ అయ్యింది... ఐ సీ సిమ్టంస్ అఫ్ నిమ్ఫో మేనియా ఇన్ యు” అంది నివేదిత నవ్వుతూ.

“నీ సైకియాట్రీ తెలివికి సంతోషించాం గాని. ఎంతో అమాయకురాల్లా కనిపించే నీలాంటి వాళ్ళే హఠాత్తుగా వెడ్డింగ్ కార్డు చేతికి ఇస్తారు” అంది స్నేహ.

“అలా అయితే కొంత వరకు పరవాలేదు. కాని నివేదితలాంటి వాళ్ళు, మనం చదువులు అయిపోయి ఎవరికి వారు విడిపోయిన తరువాత కొన్నాళ్ళకు, ఒక నెలల కుర్రాణ్ణి మనకు చూపించి, ఇదుగో మా అబ్బాయి! అన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.

“ఏం? నీకు అలా కనిపిస్తున్నానా?  అయినా ఒక ఊరివాళ్ళం. చిన్నప్పటినుంచి కలిసి చదువుకుని, కలిసి తిరిగిన వాళ్ళం. నీకు తెలయకుండా అలాంటిది ఏదీ జరగదులే” అంది నివేదిత. నివేదిత మాటలలో శ్లేష అందరికకీ అర్థం అయినా, ఆ అమ్మాయి మాటలకు అర్థం ఏమిటో సరిగ్గా తెలియలేదు!!??

గుగు ఆయుష్ వైపు చూసింది.

‘నువ్వు ఏమి బాధపడకు ‘అన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేసాడు ఆయుష్ .

అయితే ఆ సమయం లో వాళ్ళిద్దరినీ ఎవరూ గమనించడం లేదు.

***************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts