Vijaya Lakshmi
Published on Oct 30 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
మొత్తానికి ఫోర్త్ సెమిస్టరులో అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు.
ఆ రోజు ప్రిన్సిపాల్ ఫిఫ్త్ సెమిస్టరులో ఎంటర్ అయిన విద్యార్ధులకు ఒక మీటింగ్ పెట్టాడు.
“గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్“ అన్నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు .
“గుడ్ మార్నింగ్ సర్“ అన్నారు స్టూడెంట్స్ అందరూ కోరస్ గా.
రామరాజు తన ఉపన్యాసాన్ని ఇంగ్లీష్ లో సాగించాడు.
“స్టూడెంట్స్. మీరందరు ప్రీక్లినికల్ కోర్స్ కంప్లీట్ చేసుకుని, పారా క్లినికల్లో ఆఖరి సెమిస్టరులోకి వచ్చారు. ఇంత వరకు మీరు ప్రీ క్లినికల్ లో నేర్చుకున్నవి డాక్టర్ గా మీ జీవితానికి పునాదులు, పారా క్లినికల్ లో ఇంతవరకూ నేర్చుకున్న, అలాగే ఇప్పుడు ఈ సెమిస్టరులో నేర్చుకోబోతున్న విషయాలు మీ డాక్టర్ జీవితానికి గోడలు, కిటికీలు, గుమ్మాలు. ఇక ఆరు నుంచి తొమ్మిది సెమిస్టరులలో నేర్చుకునేవి పైకప్పు లాంటివి. భవంతిలో ఏ భాగం ఆ భాగానికి ప్రాముఖ్యత ఉన్నట్లే మీరు చదువుకున్న ప్రతి అంశం, ప్రతి విషయానికి ప్రాముఖ్యత ఉంది. కాని బిల్డింగ్ లో పైకప్పు లేనిదే తక్కినవి ఎలా నిరుపయోగమో, అలాగే
మీరు క్లినికల్ సబ్జెక్ లు చక్కగా చదువుకోకపోతే ఇంతవరకు చదివినది అంతా వ్యర్ధమే. కనుక స్టూడెంట్స్ ఈ సెమిస్టరు, తరువాత వచ్చే ఆరు నుంచి తొమ్మిది సెమిస్టరులలో శ్రద్ధగా చదువుకుని, తరువాత సంవత్సరం హౌస్ సర్జెన్సీ ముగించుకుని మంచి డాక్టర్లలా మీరు అందరూ తయారవ్వాలని నా ఆకాంక్ష.
ఈ వయస్సులో అనేక విషయాలు మిమ్మల్ని ఊరిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ అతి తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి. కాని మీ జీవితాల్ని దుఃఖం లో ముంచుతాయి. కనుక మీరు అటువంటి వ్యర్ధ విషయాల వైపు దృష్టి సారించకుండా జీవితాల్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని మీకందరికీ నా సలహా. మీ తల్లిదండ్రులు మీమీద ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి, ఎన్నెన్నో ఆశలు పెంచుకుని, తమ ఓపికకి మించి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి చదివి, మంచి డాక్టర్లుగా, మంచి పిల్లల్లాగ, మంచి భారతీయపౌరులుగా తయారవ్వాలి. బెస్ట్ అఫ్ లక్” అంటూ తన భాషణాన్ని ముగించాడు ప్రిన్సిపాల్.
అందరూ చప్పట్లు కొట్టారు.
‘ఆ ఏదో చేపుతాడులే’ అని కొందరంటే, ‘రాముడు చెడ్డ బాలుడుగా మారిపోయాడని ఆయనకి తెలియదు‘ అని వెకిలిగా నవ్వుకున్నారు కొందరు. కాని ఆయుష్, అతని స్నేహితులు ఆయన చక్కగా మాట్లాడాడని, తమ బాధ్యత మరొక్కసారి గుర్తుచేసాడని అనుకున్నారు.
ప్రిన్సిపాల్ చెప్పినట్టు అయిదవ సెమిస్టరు మొదటనుంచి కూడా విద్యార్థులకు కాస్త కష్టంగానే ఉంది. మొట్టమొదటి రోజు నుంచి బాగా శ్రమిస్తే గాని ఇక నుంచి ముందుకు వెళ్ళడం అసాధ్యం అన్న విషయం వాళ్ళకి అర్థం అయిపోయింది. ఈసారి ఆరునెలలు భారంగా గడిచాయనిపించింది అందరికి.
మళ్ళీ పరీక్షలు మొదలు అయ్యాయి. మొదటి పరీక్ష ముందు రోజే నివేదితకి జ్వరం మొదలయ్యింది.
నివేదితని చూడడానికి వాళ్ళ గ్రూప్ లో మిగిలిన అయిదుగురు వెళ్ళారు.
“ఏమిటి నివేదితా మేడం! నువ్వు గుగు మహాదేవి ప్రారంభించిన ట్రెడిషన్ కొనసాగిద్దామని నిర్ణయించుకున్నావా!?” అని నవ్వుతూ అడిగింది స్నేహ.
“ఆయుష్ కారు రెడి చేసుకో” అంది గుగు.
“తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. అలా ఉంది గుగు వ్యవహారం. తను హాయిగా పడుకుని, చక్కగా కారులో వెళ్ళి పరీక్షలు రాసి వచ్చింది. ఇప్పుడేమో ఉచిత సలహాలు ఇస్తోంది” అంది హసిత.
“నేను ఆఫ్రికన్ కోతిని. మీకంటే ప్రమాదకరమైన దాన్ని” అంది గుగు నవ్వుతూ.
“ఎక్కడ కోతులైనా... వాళ్ళే మన పూర్వీకులు అని చెప్పాడు డార్విన్ మహాశయుడు” అంది శరణ్య.
“పోనీలే.ఆ విషయంలో మనం నా జాతి, నా మతం, నా కులం అని కొట్టుకోడానికి అవకాశం ఇవ్వలేదు ఆయన” అంది హసిత.
“ఇప్పుడు రోజులలో అయితే పాపం ఆయనని కూడా ఏదో విధంగా ఏడిపించేవారు” అంది గుగు.
“అప్పుడూ వదలలేదుగా. పాపం నానా బాధలు పెట్టారు” అంది శరణ్య.
“అబ్బా! ముందు నివేదితకి కాస్త మందులు, బ్రెడ్ లాంటివి తెచ్చి ఇవ్వకూడదూ... తినేసి హాయిగా పడుకుంటుంది” అంది స్నేహ.
“నేను వెళ్ళి పట్టుకొస్తాను. మీరు నివేదితతో మాట్లాడుతూ ఉండండి” అన్నాడు ఆయుష్.
“కారు కూడా రెడీ చేసుకో” అంది గుగు మళ్ళా నవ్వుతూ.
“ఈసారి కారుకి బిల్ వేయమని, మొత్తం గుగు చేత కట్టించు. అప్పుడు తిక్క కుదురుతుంది” అంది హసిత.
వాళ్ళందరి మాటలు వింటున్న నివేదిత నవ్వుతూ కళ్ళు మూసుకుని పడుకుంది.
కొంతసేపటికి ఆయుష్ బ్రెడ్డు, పాలు, మందులు పట్టుకొచ్చాడు. నివేదిత పాలు మాత్రం తాగి, మందులు వేసుకుంది.
“థాంక్స్ ఆయుష్. ఇక మీరు అందరూ వెళ్ళిపొండి. మళ్ళీ పొద్దున్నే పరీక్షలు” అంది నివేదిత.
“నివేదిత... కారు రెడీ చేశాను. ఉదయం తొమ్మిది గంటలకల్లా కారు వస్తుంది” అన్నాడు ఆయుష్ .
గుగు పకపకా నవ్వసాగింది .
“ఆయుష్ ఈసారి ఈ మహారాణికి జ్వరం వస్తే నడిచి వెళ్ళి పరీక్ష రాయమను. అప్పుడు తెలుస్తుంది పిల్లకి” అంది శరణ్య .
“ఓ. కే.” అంది గుగు భుజాలు ఎగరేస్తూ .
“పిల్ల సూదిలా వచ్చి దబ్బనంలా తయారు అయ్యింది” అంటూ గుగు తలమీద సున్నితంగా మొట్టింది శరణ్య,
వెళ్ళడానికి అందరూ సిద్ధమయ్యారు .
“నివేదితా నేను భోజనంచేసి రూమ్ కి వెళ్ళి బట్టలు తెచ్చుకు వస్తాను. రాత్రి ఇక్కడే ఉంటాను” అంది గుగు.
“ఎందుకు గుగు... అంత అవసరం లేదు. ఫుడ్, మందులు ఉన్నాయిగా!?” అంది నివేదిత.
. “జ్వరంతో ఒక్కత్తివీ ఎలా ఉంటావు? ఏమీ పరవాలేదు నేను వస్తాను” అంటూ, ఇంక నివేదిత సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచింది గుగు. ఎవ్వరు చూడకుండా గుగుకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ఆయుష్. గుగు మోహం ఎర్రబడింది. పెదాలు వణికాయి.
బయటకు వెళుతున్న శరణ్య, స్నేహ, హసిత గుగు వేపు మెచ్చుకోలుగా చూసారు.
“గుగు గుడ్ గర్ల్” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“ఇప్పుడు నీ సర్టిఫికెట్స్ ఏమీ నాకు అక్కర్లేదు” అంది గుగు ఎవరూ చూడకుండా ఆయుష్ ని వెక్కిరిస్తూ. నవ్వుకున్నాడు ఆయుష్.
రెండు రోజులైనా నివేదిత జ్వరం తగ్గలేదు. నివేదిత తల్లికి ఫోన్ చేసి తనకి జ్వరంగా ఉందనీ, ఫ్రండ్స్ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది.
కాని నివేదితకి జ్వరం వచ్చిందని తెలిసిన ఆమె తల్లి రమ చాలా కంగారుపడిపోయింది.
“నివ్వూ... వెంటనే బయులుదేరి కారు మాట్లాడుకుని వచ్చేయ్” అంది రమ కూతురితో.
“అబ్బా! ఏమిటమ్మా ఏదో కాస్త జ్వరానికి అంత కంగారు పడిపోతావేమిటి!? అసలు మా ఫ్రెండ్స్ ఈ విషయం చెప్పొద్దు అన్నారు...” అంటూ ఏదో అనబోతున్న నివేదిత మాటలకి తన తండ్రి వినోద్ గొంతు అడ్డం వచ్చింది.
“తల్లీ... నీ మాటలు నేను కూడా స్పీకర్ లో వింటున్నాను. నేను కారు తీసుకుని వెంటనే బయలుదేరుతున్నాను. రెడీగా ఉండు వచ్చేద్దుగాని” అన్నాడు వినోద్.
“అమ్మకంటె కంగారు. నువ్వు కూడా ఏమిటి నాన్నా!? నాకు ఒక పక్క పరీక్షలు అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేస్తే అంతా వేస్ట్ అయిపోతుంది. అయినా పాపం మా ఫ్రెండ్స్ అంతా చాలా సహాయంగా ఉన్నారు. అన్నీ చూసుకుంటున్నారు” అంది నివేదిత.
“పోనీ నివ్వూ... నేను, నాన్నగారు వస్తాం. నేను ఉండిపోతాను. నాన్నగారు వచ్చేస్తారు” అంది రమ.
“ఎందుకమ్మా!?” అంది నివేదిత విసుగ్గా.
“నీకు తెలియదు. నేను వస్తాను” అంది రమ దృడంగా.
“వచ్చి ఎక్కడ ఉంటావమ్మా?” అని అడిగింది నివేదిత.
“నీ రూమ్ లోనే“ అంది రమ.
“అమ్మా నా రూమ్ లో ఒకటే మంచం ఉంది. నువ్వు కింద పడుకోలేవుకదా. పాపం నా ఫ్రెండ్ గుగు నాకు సహాయంగా ఉంటానని రెండురోజులనుంచి నేలమీద పడుకుని అవస్తపడుతోంది. నువ్వు రావక్కర్లేదమ్మా” అని తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది నివేదిత.
రమ ఏదో చెప్పబోతుండగా “ఒక్క నిమషం ఉండమ్మా” అంటూ తను మాట్లాడుతుండగా లోపలకి వచ్చిన ఆయుష్ కి అంత వివరించి చెప్పింది నివేదిత.
“మార్చి తప్పితే సెప్టెంబర్ ఉందిగా... రూమ్ ఇబ్బంది అయితే గెస్ట్ హౌస్ ఉందిగా” అంటూ పాడసాగాడు ఆయుష్.
“ఆయుష్ పాట ఆపి ఏం చెయ్యమంటావో చెప్పు.” అంది నివేదిత.
“ఆవిడని రమ్మను. కాస్త నీకు సాయంగా ఉంటుంది. గెస్ట్ హౌస్ లో ఉండవచ్చు లేదా వార్డెన్ పర్మిషన్ తీసుకుని ఎక్స్ట్రా కాట్ తెప్పించవచ్చు” అన్నాడు ఆయుష్.
“సరే అమ్మా... నాన్నగారు రావక్కర్లేదు. నువ్వు రా. కారులోనే రా.” అంటూ ఫోన్ పెట్టింది నివేదిత.
నివేదిత తల్లి వెంటనే బట్టలు సర్దుకుని రాంపూర్ బయలుదేరింది .
*****************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో