Vijaya Lakshmi
Published on Oct 31 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఎన్ని కబుర్లు చెప్పినా నివేదితకి తల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది.
అదే క్షణంలో నివేదితకి గుగు గుర్తుకు వచ్చింది. ’పాపం ఆ అమ్మాయికి కూడా జ్వరం వచ్చినప్పుడు తన వాళ్ళని చూడాలని అనిపించి ఉంటుంది. కాని కుదరదు. తన తల్లి అంటే వెంటనే వచ్చింది. కాని అంతదూరం నుంచి గుగు తల్లి రాలేదు కదా’ అనుకుంది నివేదిత.
“ఆంటీ… నువ్వు ఇక్కడ ఈ రూమ్ లోనే ఉంటానంటే ఏర్పాట్లు చేస్తాను. లేదా గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు. నివేదిత రూమ్ లో పగలు అంతా గడిపి రాత్రి అక్కడ పడుకోడానికి వెళ్ళవచ్చు” అన్నాడు ఆయుష్.
“థాంక్స్ ఆయుష్” అంది రమ.
“వెల్కమ్” అన్నాడు అయుష్.
“అమ్మా! గుగు అని మన ఊరు వచ్చింది. ఆఫ్రికన్ అమ్మాయి. గుర్తుందా?” అని రమని అడిగింది నివేదిత.
“ఆ గుర్తుకు లేకేం. నీకు రెండురోజులనుంచి హెల్ప్ చేస్తోంది అని చెప్పావు గదా” అంది రమ.
“గుగు వస్తానని ఫోన్ చేసింది. బహుశా ఈపాటికి దార్లో ఉండి ఉంటుంది. పాపం ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసిందమ్మా. ఒక సొంత అక్క, చెల్లి ఉంటే ఎలా మసులుతారో అలా ఉందమ్మా...” అంటూ ఇంకా నివేదిత ఏదో అనే లోపలే
“ ఏయ్ నివేదితా! ఎలాగున్నావు? ఆంటీ నమస్తే. ఎలా ఉన్నారు? ఎంత సేపు అయింది వచ్చి మీరు?” అంది గుగు రమతో చనువుగా. రమకు ఆ మాటలలో ఆప్యాయత ధ్వనించింది.
“గుగు తెలుగు బాగా మాట్లాడుతోందే” అంది రమ నవ్వుతూ.
“నీకన్నా నాకన్నా బాగా మాట్లాడుతుంది” అంది నివేదిత నవ్వుతూ.
“ ఏమ్మా. తెలుగు చాలా బాగా నేర్చుకున్నావే?” అంది రమ.
“అంతా మీ అమ్మాయి, ఇతర ఫ్రెండ్స్ నేర్పించారు ఆంటీ.”
“అమ్మా! ఇపుడు గుగు తెలుగులో సామెతలు, చాటువులు కూడా చెప్పే స్థితికి వచ్చింది.” అంది నివేదిత.
“సంతోషం. ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి పెరిగిన పిల్ల, ఇక్కడకు వచ్చి మన బాష నేర్చుకోవడం... అదీ అంత చక్కగా మాట్లాడడం సంతోషం”
“ఆంటీ. నేను మొన్నటినుంచి నివేదితతోనే ఉంటున్నాను. ఈ రోజు మీరు వస్తారంటే ఉదయమే నా రూమ్ కి వెళ్ళాను... అదీగాక నివేదిత జ్వరం కూడా తగ్గింది కదా”‘ అంది గుగు నివేదిత నుదిటి మీద చెయ్యి వేస్తూ.
“చాలా థాంక్స్ గుగు” అంది రమ.
“అయ్యో థాంక్స్ ఎందుకు ఆంటీ! అయినా నాకు రెండుసార్లు జ్వరం వస్తే నివేదిత ఎంత సహాయం చేసిందో తెలుసా!?” అంది గుగు.
“గుగు మనం అనుకున్న చాప్టర్ ఫినిష్ చేసేద్దామా. మళ్ళీ ఎల్లుండి పరీక్ష కదా... ఈ లోపల ఆయుష్ అమ్మని గెస్ట్ హౌస్ లో దింపి వస్తాడు. అమ్మ ఫ్రెష్ అయి వస్తుంది. తరువాత మనం కబుర్లు చెప్పుకోవచ్చు” అంది నివేదిత.
“రండి ఆంటీ… మిమ్మల్ని గెస్ట్ హౌస్ లో దింపి వస్తాను” అంటూ రమ చేతిలో బ్రీఫ్ కేసు అందుకున్నాడు ఆయుష్. ఆయుష్ ని అనుసరించింది రమ.
ఆ తరువాత నివేదిత, గుగు దాదాపు గంట సేపు ఏదో చదువుకున్నారు.
గంటలో రమ రెడీ అయి ఆయుష్ కి ఫోన్ చేసింది.
రమని నివేదిత రూమ్ లో దింపేసి మళ్ళీ వస్తానని బయటకు వెళ్ళాడు ఆయుష్.
“అబ్బ ఆయుష్ ఎంత వద్దన్నా వినకుండా కడుపు బద్దలు అయ్యేటట్లు టిఫిన్ పెట్టించాడు. ఇంక రేపు మధ్యాహ్నం వరకు భోజనం అక్కర్లేదు” అంది రమ ఆపసోపాలు పడుతూ లోపలకు వస్తూ.
“ఆయుష్ అంతే ఆంటీ. అతనికి ప్రేమ ఎక్కువ” అంది గుగు.
నివేదిత గుగు మాటలకు ఆమె వైపు చురుగ్గా చూసింది .
‘ఏమిటి గుగు, ఆయుష్ కి అమ్మ ముందే అలా సర్టిఫికేట్ ఇచ్చేస్తోంది! అతని ప్రేమ గురించి ఆ మాట ఎలా అంది?’ అనుకుని ఒక నిమషం ఏదో ఆలోచించసాగింది నివేదిత.
“గుగు ఏమిటి మా దేశం... ఈ కాలేజీకి వచ్చి చాలా కాలం అయ్యింది. బాగా సర్దుకు పోయావా?” అని అడిగింది రమ.
“బాగానే అలవాటు పడ్డాను ఆంటీ. ఇంక మీ అమ్మాయి, మిగతా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసారు. నేను పరాయిదాన్ని కాదని వాళ్ళలో ఒకత్తెనని నన్ను స్వీకరించారు. అందుకే బెంగ లేకుండా ఉండిపోగలిగాను. నాకు చిన్నప్పడినుంచి డాక్టర్ కావాలని కోరిక. కాని మా దేశంలోకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ బావుంటుందని తెలుసు. మా నాన్నగారు తరుచుగా ఇంగ్లాండు వెడుతుంటారు. నన్ను అక్కడే జాయిన్ అవమన్నారు. కాని నాకు ఎందుకో భారతదేశమన్నా, భారతీయ నాగరికత అన్నా, ఇక్కడ సంప్రదాయాలన్నా ఇష్టం. నా అదృష్టం కొద్ది ఇంతమంది మంచి స్నేహితులున్న ప్రదేశానికి వచ్చాను. ఉత్తర భారతదేశంలోనూ ఒకటి, రెండు చోట్ల సీట్లు వచ్చాయి. కాని నాన్నగారు అక్కడ సెక్యూరిటీ తక్కువ అని జాయిన్ చెయ్యలేదు. అంతలో ఇక్కడ రాంపూర్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నాన్నగారు వెంటనే డబ్బు, కాగితాలు ఇచ్చి నన్నే వెళ్ళి జాయిన్ అయిపొమ్మన్నారు. సరిగ్గా ఆ టైంలో ఆయనికి అత్యవసరంగా లండన్ వెళ్ళవలిసి వచ్చింది. పిల్ల కన్నా బిజినెస్ ముఖ్యమా అని అమ్మ దెబ్బలాడింది... కాని నాన్నగారు అప్పుడు వెళ్ళకపోతే వందలకోట్లలో నష్టపోతామని అన్నారు. అలాగే “నా కూతురు చాలా ధైర్యవంతురాలు, తెలివి గలది. ఆన్నీ అదే చూసుకోగలదు” అని అమ్మతో అని నన్ను పంపించారు. ఆ దేవుడే నాకు ధైర్యం ఇచ్చాడు ఆంటీ. వచ్చి జాయిన్ అయిపోయాను. ఇంత మంచివాళ్ళు క్లాస్మేట్స్ గా దొరికారు“ అంది గుగు.
“చాలా బావుందమ్మా” అంది రమ గుగు వైపు మెచ్చుకోలుగా చూస్తూ.
“మరి ఒక్కత్తవి ఉంటే బెంగ అనిపించడం లేదా?” అని అడిగింది రమ.
“అప్పుడప్పుడు అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అనిపించింది. కాని నివేదిత నాకు చాలా ధైర్యం చెప్పి, చాలా సహాయం చేసింది. అదే విషయం మా అమ్మతో చెపితే, ఈసారి కెన్యా వచ్చినప్పుడు నివేదితని కూడా తీసుకు రమ్మంది. కాని నాకు వెళ్ళడానికి అసలు కాళీ ఉండడం లేదు ఆంటీ. ఎప్పుడూ క్లాసులు, ఆసుపత్రి పోస్టింగులు, పరీక్షలు. వీడియోలో మాట్లాడడమే కాని నిజంగా అమ్మను చూసి చాలాకాలం అయ్యింది ఆంటీ.” అంది గుగు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటూ.
“అలా బాధ పడకమ్మా. నన్ను మీ అమ్మే అనుకో” అంటూ గుగుని దగ్గరకి తీసుకుంది రమ.
“థాంక్స్ ఆంటీ ఆ మాట అన్నందుకు. ఇక్కడ వచ్చిన కొత్తలో నన్ను అందరూ వింతగా చూసేవారు ఆంటీ. కొంత మంది అయితే నా మోహం మీదే అసహ్యించుకునే వారు. నన్ను ఉద్దేశించి ‘నల్లకొరివి’ లాంటి మాటలు అనే వాళ్ళు... కాని అప్పుడు నాకు తెలుగు రాదు కదా. అందుకని ఏమీ అర్థం అయ్యేది కాదు. అప్పుడు తెలుగు రాకపోవడం ఒకందుకు మంచిదే కదూ ఆంటీ” అంది గుగు కళ్ళమ్మట సుళ్ళు తిరుగుతున్న నీళ్ళు ఆపుకుందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ.
రమ గుగు భుజం తట్టింది.
“అయినా నల్లగా ఉండడం నేరమా ఆంటీ. నేను పుట్టిన దేశం, నా తల్లిదండ్రుల రంగు,రూపురేఖలు నాకు వచ్చాయి.దానికి నేను ఏమి చేయగలను. కాని నివేదిత, శరణ్య, స్నేహ, హసిత, ఆయుష్... వీళ్ళు లేకపోతే నేను ఏమయిపోయేదాననో అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఆంటీ” అంది గుగు.
“అమ్మా. ఒక రోజు అందరం సినిమాకు వెళ్ళాం. గుగుకి మంచి చీర కట్టేం. హాలులో అందరూ గుగుని చూడడమే. తెల్లటి పాల నురుగులాటి చీర, జాకెట్టులో మెరిసిపోయింది అంటే నమ్ము. శోభనపు పెళ్ళి కూతురు కూడా అంత అందంగా ఉండదు అనిపించింది” అంది నివేదిత నవ్వుతూ.
గుగు సిగ్గుపడింది .
“గుగు... ఇక్కడబ్బాయినే ఎవరినో చూసుకుని పెళ్ళి చేసుకో” అంది రమ నవ్వుతూ.
“ఈ నల్ల బంగారంని ఎవరు చేసుకుంటారు ఆంటీ...! అయినా, నల్లటి నన్ను చేసుకోవాలంటే మల్లెపువ్వు లాంటి తెల్లని మనసు కావాలి ఆంటీ” అంది గుగు నవ్వుతూ.
“చూసావా అమ్మా! గుగు తెలుగు ఎలా మాట్లాడుతోందో. బ్రహ్మాండమైన ఉపమానాలు, పోలికలు ఎలా చెప్పేస్తోందో చూసావు కదా” అంది నివేదిత నవ్వుతూ.
“గుగు... నాకు ఎందుకో నీకు నచ్చిన వాడు, నిన్ను మెచ్చినవాడు ఇక్కడే దొరుకుతాడు అనిపిస్తోంది” అంది రమ.
“అంటే ఆఫ్రికన్ బ్రైడ్ గ్రూమ్స్ వాంటెడ్ అని వేయించాలంటావా అమ్మా!?” అంది నివేదిత.
“అక్కర్లేదు. ఆ పిల్లకి ఇక్కడే... అంటే ఈ కాలేజీలో కాకపోవచ్చు... ఈ దేశంలోనే మంచిమొగుడు దొరుకుతాడని, దొరకాలని గుగుకి నా దీవెన” అంది రమ.
“థాంక్స్ ఆంటీ” అంది గుగు. ‘నాకు కాబోయే వాడిని ఇంతకు ముందే చూసారు కదా ఆంటీ... అతని మనస్సు పాలవలె తెల్లనిది ఆంటీ’ అని మనస్సులో అనుకుంది గుగు. తను రూమ్ లో బట్టలు నానబెట్టి ఉంచిన సంగతి గుర్తుకు వచ్చింది గుగు కి.
“ఆంటీ నేను వెళతాను. బై నివేదితా” అంటూ బయటకి నడిచింది గుగు.
“ఆఫ్రికన్ పిల్ల అయినా మంచిపిల్లలా ఉంది. ఆ మాటతీరు, నిష్కల్మషమైన మనస్సు... మన పిల్లలకన్నా నెమ్మదిగా ఉంది” అంది రమ.
“అందుకే కదమ్మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మంచితనం, గొప్పతనం ఉండడానికి దేశ, జాతి, మత, ప్రాంత, కులబేదాలు లేవని. అటువంటి వాళ్ళకి మంచి ఉదాహరణ గుగు” అంది నివేదిత.
“నాకే గనుక ఒక కొడుకు, నీకు అన్నో, తమ్ముడో ఉంటే స్పటికం లాంటి తెల్లని మనస్సు గల, పాల మీగడలాంటి స్వభావంకల ఈ అమ్మాయిని చేసుకునేదాన్నే” అంది రమ.
“ఓహో. అయితే నాకు అలాంటి అబ్బాయి దొరికితే నేను చేసుకోవచ్చా?” అని అడిగింది నివేదిత .
ఒక నిమషం కంగారు పడ్డ రమ, తన భావం బయటకు కనిపించనీయకుండా “ఏమే !? నీకు ఎవరన్నా ఉన్నారేమిటి!?” అని అడిగింది.
“ఊరికేనే అన్ననమ్మా .అటువంటిది ఏమీ లేదు .ఒకవేళ ఉంటే నీకు కాక మరెవరికి చెపుతాను “అంది నివేదిత . ఆ క్షణం లో నివేదిత మనస్సులో ఆయుష్ మెదిలాడు .