Vijaya Lakshmi
Published on Nov 01 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“మన ఊరి ఆయుష్ ఇక్కడే కదే ఉన్నాడు. పైగా మీరందరు ఫ్రెండ్స్ అంటోంది గుగు. మరి నీకుగాని, అతనికిగాని అలాంటి ఉద్దేశ్యం లేదా?” అని కూతురిని అడిగింది రమ.
“నేనైతే ఏమి అనుకోవడం లేదు. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్... అతనికి కూడా ఆ ఉద్దేశ్యం ఉన్నట్లు లేదు” అంది నివేదిత.
“మీరు ఇద్దరూ చిన్నప్పడి నుంచి కలిసి తిరిగారు, ఆడుకున్నారు, చదువుకున్నారు. మరి... ఈమధ్య నాన్నగారితో అంటే ఆయన చూచాయగా విషయం ఆయుష్ తల్లిదండ్రుల దగ్గర కదిపారట. వాళ్ళు కూడా ఇంకా ఏమీ అనుకోవడం లేదని, అబ్బాయి, అమ్మాయి ఉద్దేశ్యం కనుక్కుంటే మంచిది అని అన్నారుట. ఇంతకీ నీ ఉద్దేశ్యం ఏమిటే !!??” అని అడిగింది రమ.
“ఇంకా చదువు ప్రారంభం లో ఉన్నామమ్మా. నేనేమీ ఆలోచించుకోలేదు. ఆయుష్ తో ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకు రాలేదు. అతను కూడా ఏ భావంతో ఉన్నాడో తెలియదు. కానీ ముందు మెడిసిన్ అన్నా అవనీ. అప్పుడు అతను ఇష్టపడితే చూడొచ్చు” అంది నివేదిత.
కూతురి మాటలలో, కూతురికి ఆయుష్ ని చేసుకోవడం ఇష్టమేనని, అతనికి ఇష్టం అయితే తనకు ఏమీ అభ్యంతరం లేదని, అర్థం అయ్యింది రమకి.
“సరే. అలాగే కానీ. అప్పుడే చూద్దాం” అంది రమ.
రమ ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోయంది. అప్పడికి నివేదిత బాగా కోలుకుంది.
ఆ ఆదివారం ఆయుష్ పుట్టినరోజు. తన ముఖ్య స్నేహితులు అందరినీ లంచ్ కి ఆహ్వానించాడు.
ఒక కాబ్ బుక్ చేసి అందరని తనతో హైదరాబాద్ సిటీకి తీసుకెళ్ళాడు. సిటీ అంతకు ముందు అందరూ చూసి ఉన్నదే అయినప్పటికీ, కాసేపు ఇందిరాపార్క్ లో గడిపి హోటల్ కి వెడదామని నిర్ణయించుకున్నారు. ఇందిరాపార్క్ లో జనం బాగానే ఉన్నారు. ఆయుష్ బృందం ఒక చెట్టునీడన స్థానం సంపాదించగలిగారు.
తమతో పాటు తెచ్చుకున్న బెడ్ షీట్ లు పరచి అందరూ కూచున్నారు.
“ఒన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే ఆయుష్” అంది శరణ్య ఫ్రెండ్స్ అందరి తరుఫున తెచ్చిన బొకే అతనికి అందిస్తూ. మిగతా అందరూ కూడా ఆ మాట చెప్పి, షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయుష్ కి.
“హారతి ఇచ్చి పాట పాడాలేమో!?” అంది హసిత నవ్వుతూ.
“సెల్ లో లైట్ తో హారతి ఇద్దాం. మరి పాటలు నాకైతే రావు” అంది స్నేహ.
“నాకు వచ్చు గాని ఈరోజే గొంతు కొంచం ఇబ్బందిగా ఉంది” అంది నివేదిత.
“మరి వచ్చేటప్పుడు ఆ ఈ.ఎన్.టీ. మేడంని కలిసి రాలేకపోయవా?” అంది శరణ్య.
“ఏమిటి మేడంనా!!?? ఇంకా నయం రెండు చెవులు, లారింగ్స్ తీసి చేతిలో పెడుతుంది” అంది నివేదిత నవ్వుతూ .
“పాపం మరీ అలా అనేయకు. కష్టపడి బట్టీ పట్టుకు వచ్చింది క్లాసులో చెపుతుంది కదా” అంది హసిత నవ్వుతూ.
“అందుకే పొరపాటున ఏదైనా అడిగామంటే కంగారు పడిపోతుంది” అంది స్నేహ.
“మీరు మేడంని మరీ అటపట్టిస్తున్నారు. పాపం సబ్జెక్టు బాగానే చెపుతుంది. మనం చెవులు అప్పగించి వినం. ఆ టైం లో మనం కళ్ళతో ఏటో చూస్తూ, ఏదేదో మాటలాడుకుంటూ ఉంటాం” అన్నాడు ఆయుష్.
“ఎంతైనా మగవాడు కదా పాపం... అమ్మాయి అంటే జాలి ఉంటుంది” అంది గుగు.
“నేను ఆవిడమీద జాలిపడితే నీకు నష్టమేమిటో?” అని అడిగాడు ఆయుష్.
“నాకు నష్టం లేదు. నీకు లాభం లేదు. ఒకటి... మేడం నీకంటే పెద్దది. రెండు ఆవిడకి పెళ్ళి అయ్యింది.” అంది గుగు నవ్వుతూ.
“నాకైతే ఆ రెండు అభ్యంతరం లేదు... మరి ఆయుష్ ఏమంటాడో!?” అంది నివేదిత నవ్వుతూ.
“తప్పు... గురువులో అందం చూడడం మహా తప్పు” అంటూ ముక్కుమీద వేలు వేసుకున్నాడు ఆయుష్.
“నువ్వు అలా అంటే పాపం ఆ పెతోలాజీ అసిస్టంట్ ప్రోఫ్ఫెసర్, స్నేహ ఏమైపోతారు?“ అని సీరియస్ గా ప్రశ్నించింది శరణ్య.
“ఏమిటి!? స్నేహ ఆయనతో అంత దగ్గర స్నేహం చేస్తోందా!?” అని అడిగాడు ఆయుష్.
“ఇంకా నువ్వు చాలా వెనకబడి ఉన్నావు. స్నేహ రేపో మాపో వెడ్డింగ్ కార్డు ఇవ్వపోతుంటే” అంది హసిత నవ్వుతూ.
“స్నేహ! ఈ ఫ్రెండ్ కి అంత ద్రోహం చేస్తావా?” అని ఆయుష్ సీరియస్ గా అనేసరికి శరణ్య, హసిత కించిత్తు ఆశ్చర్యపోయారు. నివేదిత ఆదుర్దాగా ఆయుష్ వైపు చూసింది ఆయుష్ ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నాడో అని. గుగు కి అయితే గుండె వేగం హెచ్చింది. స్నేహ ఆయుష్ వైపు చూస్తూ ప్రశ్నార్ధకంగా మోహం పెట్టింది.
“అందరూ ఊ... కంగారుపడిపోకండి... నేను ఆ వ్యక్తిని పెళ్ళి ప్రేమించానని, త్వరలో పెళ్ళి చేసుకుంటున్నానని స్నేహ చెప్పి ఉంటే, ఈ రోజు తాజ్ వివంటాలో లంచ్ ఆరేంజ్ చేసి ఉండేవాడిని. పాపం స్నేహకి ఏడాదికి ఖర్చులకు సరిపడా తెచ్చుకున్న డబ్బులు హారతి కర్పూరంలా హరాయించేసే వాళ్ళం... కంగ్రాట్స్ స్నేహ” అంటూ చెయ్యి అందించాడు ఆయుష్ .
“థాంక్స్” అంది స్నేహ సిగ్గుతో బుగ్గలు కందిపోతుండగా.
“ఇంక మిగిలింది గుగు, నివేదితలు. గుగు ఎలాగూ తన దేశంలో అబ్బాయిని చూసుకునో, చూస్తునో ఉంది ఉంటుంది. ఇక మిగిలింది నివేదిత, ఆయుష్ లు. మీరు కూడా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే బావుంటుంది.
“నాకు మీలా పెళ్ళికి తొందర లేదు. ముందు నాకు చదువు కంప్లీట్ కావాలి” అంది నివేదిత .
“ఓకే బాబు... ఆయుష్ ఇక నీ సంగతి చెప్పు. ఇది మాత్రం చెవులారా వింటాం” అన్నది శరణ్య తన రెండు చేతులతో చెవులు పట్టుకుంటూ.
“ఏమే శరణ్య... తల్లీ! నువ్వు ఇలా పెళ్ళి మీద పెళ్ళి కుదుర్చుకుంటూ పోతే ఇక మనం గైనకాలజిస్ట్ దగ్గర స్టూడెంట్స్ గా కాక పేషెంట్లా వెళ్ళాల్సి వస్తుంది” అంది హసిత పెద్దగా నవ్వుతూ. అందరూ ఆమె నవ్వుతో శ్రుతి కలిపారు .
“శరణ్య... నేను ఒక అనౌన్స్మెంట్ చెయ్యాలనుకున్నాను... అంతలో నువ్వే అడిగావు” అన్నాడు ఆయుష్ గుగు వైపు చూస్తూ.
“ఏమిటి ఆయుష్ అది?” అని ఆసక్తిగా అడిగింది స్నేహ.
“నేను ,గుగు ప్రేమించుకున్నాం... ఇక మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి, చదువు అయిపోయిన తరువాత పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం” అన్నాడు ఆయుష్.
“కంగ్రాట్స్” అని శరణ్య, హసిత, స్నేహ అరిచారు. నివేదిత మాములు గొంతుతో అంది ఆ మాట. అది అమెకి గొంతు బాగా లేకపోవడం వలనో లేక విన్నది కొంచం మనస్సుకి కష్టం కలిగించడం వలన కలిగిన నిరాశ వల్లో ఆమెకే తెలియదు. కాని ఆయుష్ పట్ల, మనుస్సులో, తను ఎప్పడినుంచో పెంచుకున్న ఆశలు ఆ క్షణంతో ఆవిరి అయిపోయాయని గ్రహించిన నివేదిత మనస్సు బాధతో మూలిగింది. కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. కాని అవి ఎవరూ చూడకుండా తుడుచేసుకుంది. అక్కడ ఇంక కూచోలేక లేచి వెళ్ళిపోదామని అనుకుంది. కాని సభ్యత కాదని అక్కడే కూచుంది. అదీకాక తను లేచి వెళ్ళిపోతే తను ఇన్నాళ్ళు కేవలం మనస్సులో పెట్టుకున్న ఆశలు అందరికి తెలిసిపోతాయని గ్రహించి కూచుండిపోయింది. ఉత్సాహంలో ఉన్న మిగిలన వాళ్ళు అసలు నివేదిత స్పందన గాని, ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడంగాని పట్టించుకోలేదు.
“అమ్మ గుగు! గుంభనంగా ఎంత కధ నడిపించావే!!?? మా ఆయుష్ ని బుట్టలో వేసేసావు. హార్టీ కంగ్రాట్స్” అంటూ గుగుని కౌగలించుకుంది శరణ్య.
“కంగ్రాట్స్ గుగు” అన్నారు మిగిలిన ముగ్గురూ.
“థాంక్స్” అంది గుగు సిగ్గు పడుతూ, ఆయుష్ వైపు చూస్తూ.
“ఇక ఆ కౌగలింతలు, ముద్దు ముచ్చట్లు ఆయుష్ కి వదిలెయ్యి. మనం ఇకనుంచి గుగుతో మాటలకే పరిమితం. ఫోన్ లో కూడా దొరకపోవచ్చు. అయినా మనస్సు ఎక్కడో ఉంటే మనతో ఆ పిల్ల మాత్రం ఏ మాట్లాడుతుందిలే.” అంది హసిత నవ్వుతూ.
“గుగు చాప కింద నీరు అంటే ఏమిటి? అని నువ్వు ఎప్పుడో అడిగినట్టు గుర్తు. ఇప్పుడు నువ్వు చేసింది అదే. ఎవ్వరికి ఏమీ తెలియకుండా, లేశ మాత్రం అనుమానం రాకుండా పని చక్కపెట్టెయ్యడం... అయితే ఆ సామెతని నెగటివ్ సెన్స్ లో వాడతారనుకో” అంది స్నేహ.
“మా గుగు పెళ్ళికూతురు ఆయేలే... మా అయుష్ పెళ్ళికొడుకు ఆయేలే.” అంటూ పాడసాగింది హసిత.
“హసిత ఈ సంతోష సమయంలో పాటలు చదివి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. పాట పాడితే సంతోషం గాని... నువ్వు పాటలు చక్కగా చదువుతావు.” అంది శరణ్య.
“పోనీలే... ఈ గొప్ప సంగీత సరస్వతి పాటలు వినే భాగ్యం మీకు లేదనుకుంటాను” అంది హసిత నవ్వుతూ.
“ఇక ఎవరి పెళ్ళి ముందు అన్నది సమస్య” అంది స్నేహ ఏదో తీవ్రంగా అలోచిన్నట్లు నటిస్తూ.
“వివాహే విద్యా నాశనాయ అన్నారు పెద్దలు. కనుక అందరం చదువు అయ్యేవరకు పెళ్ళిమాట ఎత్తకూడదు” అన్నాడు ఆయుష్.
“ఆ మాట అనడానికి గుగు పర్మిషన్ తీసుకున్నావా?” అని అడిగింది శరణ్య సీరియస్ గా మోహం పెట్టి.
“గుగు నీ మాటలు అన్ని మూటగట్టి ఆయుష్ కి దాచేయ్యక్కర్లేదు. మాతో కూడా మాట్లాడు.
వచ్చినప్పడినుంచి నోరు విప్పడం లేదు నువ్వు.” అంది హసిత పెద్దగా నవ్వుతూ.
“నాకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారా? ఎంతసేపు మీరే మాట్లాడుతున్నారు” అంది గుగు.
“పెళ్ళయ్యే వరకు మాతో మాటలు, ఆటలు, తరువాత నీకు ఆయుష్, ఆయుష్ కి నువ్వే లోకం. మేము ఎవ్వరం గుర్తుకు రాం. మమల్ని అందరిననీ మర్చిపోతావు“ అంది నివేదిత... తను కూడా మాట్లాడకపోతే బాగుండదని, మనస్సులోని బాధని అణుచుకుంటూ.
********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో