Vijaya Lakshmi
Published on Oct 18 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“ఇంత చెప్పినా నీ మనసును సమాధానపరచుకోలేకపోతున్నావంటే... నేను నిన్ను ఎంత వేధించానో నాకు అర్థమైంది. నేను ముందే చెప్పాను. నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టమే... అని. సరే! మరి నేను వెళ్తాను” అంటూ అడుగు ముందుకు వేశాడు విజయ్.
అప్పుడు కదిలింది తార.
అతడు ఏది దాచకుండా తన మనసంతా బయట పెట్టాడు. ఇప్పుడు కూడా తను అర్థం చేసుకోకుండా మొండిగా ఉండిపోతే... ఇక ఎప్పటికీ తమ మధ్య దూరం తరగదేమో... అని భయం వేసింది. అందుకే... చప్పున అతని చెయ్యందుకుంది.
వెనక్కి తిరిగి చూసాడు విజయ్. అతని వైపే చూస్తోంది తార. పెదవి విప్పి పలకకపోయినా... ఆమె మనసులోని భావాలు బాగానే అర్థమయ్యాయి అతనికి. ఆ చూపుల్లో పట్టుదల, పౌరుషాల మాటున అణచిపెట్టిన దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికిందామెలో. ఒక్క ఉదుటున లేచి అతని భుజాలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇన్నాళ్ళ నుంచి ఏ మూల దాగి ఉందో మరి... ఆ బాధంతా కన్నీటి రూపంలో వెల్లువలా బయటకు వస్తోంది.
ఆ సమయంలో ఆమెను ఓదార్చడానికి మాటలు రాలేదతనికి. ఆమెను దగ్గరకు తీసుకుని మెల్లగా తల నిమురుతూ ఉండిపోయాడు. ఆ స్పర్శ, ఏ అవాంతరం వచ్చినా నిన్నేదబాయను అని చెబుతున్నట్టే ఉంది.
**************
రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ దిగారు విజయ్ తార. ఇద్దరి చేతుల్లోనూ సూట్ కేసులున్నాయి. ట్రైన్ దిగిన తార చుట్టూ చూసింది. ‘నాటకం వేయడానికి ఈ ఊరు వచ్చిన మొదటిసారి ఎన్నో సమస్యలతో, భయాలతో... మనసు నిండా ఎన్నో అనుమానాలతో వచ్చింది ఆరోజు.
మరి ఈరోజు... ఎలాంటి భయాలు, సంకోచాలు లేకుండా నిర్భయంగా... నిస్సంకోచంగా అడుగుపెట్టింది ఈ ఊర్లో. అప్పటికి... ఇప్పటికీ ఎంత తేడా!? తను ఆరోజు ఒంటరిగా భయంతో వచ్చింది. ఈరోజు... భయాలన్నీ పటాపంచలైపోయాయి. అందుకే విజయ్ తో సహా వచ్చింది ఈరోజు. ఈరోజు తను బిరుదు తీసుకోవడమే కాదు... ముఖ్యమైన తన నిర్ణయం కూడా ప్రకటించబోతోంది సభలో.
జనాల్ని తప్పించుకుని ముందుకు దారి తీసాడు విజయ్. అతన్ని అనుసరించింది తార. స్టేషన్ బయటికి వచ్చారు. ఒక రిక్షాను పిలిచి, సభకు వచ్చే కళాకారులు ఉండడానికి, నిర్వాహకులు ఏర్పాటుచేసిన అడ్రస్ చెప్పి కూర్చున్నారు. రిక్షా ఒక పెద్ద భవనం ముందు ఆగింది. వాళ్ళు చెప్పిన అడ్రస్ దగ్గరకు తీసుకొచ్చాడు రిక్షా. అడ్రస్ సరైనదే... అని నిర్ధారించుకుని, రిక్షా దిగి డబ్బులు ఇచ్చి లోపలికి నడిచారు విజయ్ తార.
ఆ భవంతి మధ్యలో ఉన్న పెద్ద హాలును రంగురంగుల కాగితాలతో అలంకరిస్తున్నారు కొందరు. ఆహూతులు కూర్చోవడానికి తెచ్చిన కుర్చీలు దొంతర్లుగా పెట్టి ఉన్నాయి. ఒక పక్కన వేదిక ఏర్పాటుకు కాబోలు పొడుగాటి బల్లలు, టేబుళ్ళు, ఫ్లవర్ వాజ్లు, టేబుల్ క్లాత్ లు కనబడుతున్నాయక్కడ.
బహుశా సభ జరిగేది అక్కడేనేమో. హాలుకు ఒకవైపు వరుసగా గదులున్నాయి. కళాకారులకు విశ్రాంతి కోసం ఇచ్చినట్టున్నారు ఆగదుల్ని. అప్పటికే అక్కడికి చేరుకున్న కళాకారులు, గదుల ముందున్న వరండాలో ఉన్న కుర్చీల్లో విశ్రాంతిగా కూర్చున్నారు. అందులో కొందరు తారకు తెలిసినవారే. ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండగా వచ్చారు నిర్వాహకులు.
తారను పలకరించి ఆమె కోసం కేటాయించిన గదిని చూపించి, సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభమవుతుందని, అంతవరకు విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్లిపోయారు. గదిలోకి వెళ్లి సూట్ కేసులు ఓ పక్కన పెట్టి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యారిద్దరూ. బయలుదేరేటప్పుడే ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు రాజమండ్రి చేరగానే అనుకున్న స్థలానికి చేరుకొని కాస్త సేదతీరిన తర్వాత, ధవళేశ్వరం ఆనకట్ట, మ్యూజియం చూసి రావాలని... సాయంత్రం సభ అయిపోగానే ఆ టైంలో ఏ ట్రైన్ ఉంటే దాన్ని పట్టుకుని వైజాగ్ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే రూమ్ కి తాళం పెట్టి బయటపడ్డారు. హోటల్లో భోజనం చేసి, సైట్ సీయింగ్ లో పడ్డారు.
మ్యూజియంలో తిరుగుతుంటే... అప్రయత్నంగానే జ్యోత్స్న జ్ఞాపకం వచ్చింది తారకు. “అక్కా... అక్కా...” అంటూ తన వెంటవెంటే తిరిగేది. మొదటిసారి వచ్చినప్పుడు తామంతా కలిసి తిరిగారా ప్రదేశాలన్ని. త్రోవలో కనబడిందల్లా కొనుక్కొని తింటూ, చిన్నపిల్లలా గంతులు వేస్తూ ఉత్సాహంగా తిరిగిన జ్యోత్స్న కళ్ళ ముందు కదులుతోంది. అంత చురుగ్గా తిరిగిన పిల్ల... ఆఖరికి ఒళ్ళంతా కాలిపోయి, వికృతంగా తయారైన దేహంతో... ఆచేతనంగా మంచం మీద పడున్న దృశ్యం తలుచుకుంటుంటే... ఒళ్లంతా జలదరిస్తుంది. కన్నీటితో పరధ్యానంగా నడుస్తున్న తారను ఆశ్చర్యంగా చూశాడు విజయ్.
“తారా! ఏమైంది?” విజయ్ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది తార.
“అబ్బే! ఏం లేదు. ఏదో జ్ఞాపకం వచ్చిందంతే...” అంటూ కళ్ళు తుడుచుకుంది.
చూడదలుచుకున్నవన్నీ చూసి, రూమ్ కి చేరుకున్నారు. అప్పటికే సాయంత్రం కావస్తోంది. హాల్లో సభ ఏర్పాట్లు అన్నీ పూర్తికావచ్చినట్టున్నాయి. కళాకారుల్ని త్వరగా రెడీ కమ్మని చెప్పారు నిర్వాహకులు. గబగబా సూట్కేస్ తెరిచి, సన్నటి జరీ బోర్డరున్న గులాబీరంగు వెంకటగిరి చీర తీసింది. చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని వచ్చింది. చల్లటి నీళ్లు మొహం మీద పడేసరికి అలసట అంతా ఎగిరిపోయి, హాయిగా ఉంది. మొహం తుడుచుకుని తనతో పాటు తెచ్చుకున్న మేకప్ కిట్ తెరిచి ముస్తాబయింది. జరిచెరుతో సింపుల్గా ఉన్న ముస్తాబుతో, హుందాగా కనబడుతోంది తార.
“విజయ్... మీరు కూడా తయారైతే సభకు వెళ్దాం”. అంది అతను కూడా తయారై వచ్చాక హాల్లోకి చేరుకున్నారు. ముందు వరసలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.
సభకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి, డయాస్ ముందు నిలబడి ఒక్కొక్కరినే వేదిక పైకి ఆహ్వానిస్తున్నాడు. సంస్థ ప్రెసిడెంట్, సెక్రటరీ, పలు ఉత్తమనాటకాలను డైరెక్ట్ చేసిన రామారావు గారు, ఇంకా ఒకరిద్దరు ప్రముఖులు వేదికపై తమ తమ స్థానాల్లో కూర్చున్నారు.
“మా సంస్థ రజితోత్సవ వేడుకల సందర్భంగా... ఇంతవరకు అతి తక్కువ కాలంలో ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించి, నాటకకళకు విశేషంగా సేవలు అందిస్తున్న ఒక నటిని మహానటి బిరుదుతో సత్కరించాలని నిర్ణయించుకున్నాం. ఆ అవార్డుకుగాను మీ అందరికీ సుపరిచితురాలు అయిన కుమారి తారగారిని ఎంపిక చేసామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తారగారు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం” అన్నాడు వ్యాఖ్యత.
చప్పట్లు మారుమోగాయి. చప్పట్ల మధ్య వ్యాఖ్యాత అందమైన పదాలతో... తను ఆ అవార్డుకు ఎంత అర్హురాలో వర్ణిస్తుండగా... ఒకనాటి తన కల మదిలో మెదులుతూ ఉండగా, హుందాగా వేదిక మీదకు నడిచి తన సీట్ లో కూర్చుంది.
“చిన్న వయసులోనే ఇంతటి ఉత్తమ పురస్కారాన్ని అందుకుంటున్న తార అభినందనీయురాలు. ఏవో నాలుగు డైలాగులు ముక్కును పెట్టుకుని వల్లించడం కాకుండా, నటన అంటే ఏంటి... భావ ప్రకటన అంటే ఏమిటి అన్నది తారను చూసి నేర్చుకోవాలి. అటువంటి నటిని మా సంస్థ తరఫున సత్కరించడం మా సంస్థకే గౌరవంగా భావిస్తున్నాం” అన్నాడు ప్రెసిడెంట్.
రామారావు గారు మాట్లాడుతూ, “ఇంతటి పురస్కారానికి గ్రహీత అయిన తారను మొట్టమొదట ఈ రంగానికి పరిచయం చేసింది నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. వక్తలందరూ అందరూ మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం, బిరుదు ప్రధానం జరిగింది. చివరిగా తారను మాట్లాడమని కోరారు.
డయాస్ ముందుకొచ్చింది తార, “నేను మహానటిని అన్నారు సంస్థ వారు. పెద్దలందరూ ఆ బిరుదుకు నేనెంత న్యాయం చేసానో నాకు తెలియదు. ఇంత గొప్ప సన్మానానికి అర్హురాలినో... కాదో... కూడా నాకు తెలియదు. అయినా, నువ్వు అర్హురాలివే అంటూ నన్ను గౌరవించిన సంస్థకు, సంస్థ సభ్యులకు, పెద్దలకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఒకప్పుడు నేను ఈ రంగంలోకి రాకముందు ఒక నృత్య కళాకారిణి ఇలాంటి గౌరవం పొందడం చూసి, నేను కూడా ఎప్పటికైనా ఆ స్థాయికి చేరుకుంటానా... అని కలలు కన్నాను. ఆ కల ఇప్పటికి నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే బాగా ఆలోచించి, నేను తీసుకున్న నిర్ణయం మీ ముందు ఉంచుతున్నాను. నేనిక ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరమైన జీవితం గడపాలనుకుంటున్నాను. అందుకే... ఇకమీదట నేను నటించదలచుకోలేదు. నన్ను ఆదరించిన అభిమానులకు, ఆర్టిస్టులకు, కళా సంస్థలకు, పెద్దలకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...” అంటూ ముగించింది.
ఆమె ప్రకటించిన ఈ హఠాత్తు నిర్ణయానికి అందరూ ఆశ్చర్యంగా చూశారు. విజయ్ కైతే మరీ విస్మయంగా ఉంది. తార ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు మాటమాత్రంగానైనా చెప్పలేదేంటి?’ అనుకున్నాడతను.
సభ ముగిసింది. తెలిసిన వాళ్ళందరూ తారను, ఆమె నటన నుంచి తప్పుకోవడం గురించి అడుగుతుంటే వాళ్ళకేవో సమాధానాలు చెప్పి, విజయ్ తో పాటు రామారావు గారి దగ్గరకు వెళ్ళింది.
“విజయ్! రామారావు గారు మీకు తెలుసు కదా?” “సార్! ఇతను విజయ్ అని... వైజాగ్ లోనే కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం” అని పరిచయం చేసింది.
కాసేపు మాట్లాడి... “ఇక వెళ్ళొస్తాం” అంటూ లేచారు.
‘పోనీలే ఇంతకాలం... నీ జీవితం ఇలా సమస్యలమయం కావడానికి పరోక్షంగా నేనే కారణమేమో అని బాధపడేవాడిని. ఇకనైనా నీ జీవితం కుదుటపడుతున్నందుకు ఆనందంగా ఉంది. కలకాలం చల్లగా బ్రతకండి...” జంటగా వెళుతున్న ఆ ఇద్దరిని చూస్తూ మనసులు అనుకున్నారాయన.
****************
నెలరోజుల తర్వాత విజయ్ తరపున అతని తల్లిదండ్రులు స్నేహితులు, తార తరుపున కృష్ణ, అనిత, సుబ్బలక్ష్మి, చంద్రమణి సాక్షులుగా రిజిస్టర్ ఆఫీసులో వారిద్దరి వివాహం జరిగింది. సంప్రదాయ బద్దంగా వివాహం జరిపిస్తామని తల్లిదండ్రులు ఎంత చెప్పినా విజయ్ మాత్రం రిజిస్టర్ పెళ్లికే మొగ్గు చూపించాడు. సంప్రదాయపు వివాహమైతే తన వైపు తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలా ఎంతో మంది బంధువులు వస్తారు. కాని అలాంటి అవకాశం లేని తార ఆ లోటు ఫీల్ అయి బాధపడుతుందని విజయ్ భయం.
మొత్తానికి ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా ఆనందంగా వివాహం జరిగిపోయింది. ఆ సాయంత్రం విజయ్ ఇంట్లో... బాగా దగ్గర బంధువులకి, స్నేహితులకి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్లంతా తమకు తోచిన విధంగా తార, విజయ్ లను అభినందిస్తున్నారు.
“తారా! నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నీ జీవితం ఒక గాడిన పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది సుబ్బలక్ష్మి.
“దేవుడి దయవలన... మీ మధ్య వచ్చిన అపార్ధాలు తొలగిపోయాయి. ఇక ముందు ఆ మాట కూడా మీ మధ్య రావడానికి వీల్లేదు. ఇదేమిటి పెద్ద ఆరిందాలాగా చెప్తోందని మాత్రం అనుకోకు సుమా!” అంది అనిత.
“అలా ఎప్పుడూ అనుకోను అనితా... ఈ మాత్రం చెప్పడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు” కన్నీళ్ళతో బదులిచ్చింది తార.
పార్టీకి వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు. విజయ్ తల్లి లోపల ఏదో సర్దుతుంది. విజయ్ తండ్రి ఆహ్వానితుల్ని సాగనంపుతూ వీధిలో గేటు దగ్గర ఉన్నారు.
హాల్లో కూర్చున్నారు విజయ్ తార. ఇంత హడావిడిలో కూడా తార మనసులో మాత్రం దిగులుగానే ఉంది. ఈ సమయంలో తల్లి ఉంటే ఎంత సంతోషపడేది... చివరి నిమిషం వరకు తన కోసమే బాధపడింది. ఈ ఆనందాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోయింది. కళ్ళు నీటితో నిండిపోయాయి తారకు.
తార దేనికో బాధపడుతోందని గ్రహించాడు ఆమెనే గమనిస్తున్న విజయ్. “తారా! ఏమైంది? ఎందుకలా ఉన్నావ్?” అడిగాడు.
“ఏం లేదు విజయ్... అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు తనుంటే ఎంత బాగుండేది...” బాధగా అంది.
“ఏం చేస్తాం... కొందరు ఎంత ప్రయత్నించినా కొన్ని ఆనందాలు అందుకోకుండానే వెళ్ళిపోతారు.” ఓదార్పుగా అన్నాడతను.
“అది సరేగాని... తారా మన వివాహం సందర్భంగా నువ్వు ఊహించని బహుమతి ఒకటి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. పద... మన గదికి వెళదాం” అన్నాడు మాట తప్పిస్తూ.
ముందుకు దారితీస్తున్న విజయ్ ని అనుసరించింది తార. విజయ్ తిన్నగా గదిలో ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి అక్కడున్న పుస్తకాలు తీస్తున్నాడు. ఏదైనా మంచి పుస్తకం బహుమతిగా ఇస్తాడేమో అనుకుంటూ రూమంతా పరిశీలిస్తూ నిలబడింది తార.
“తారా! చూడు... నేనిచ్చే ఈ బహుమతి చూసి, నీకు నచ్చిందో లేదో చెప్పు” అంటూ ఏదో కవర్ చేతిలో పెట్టాడు.
గోడకున్న అందమైన సీనరీలు చూస్తున్న తార, ఆ కవర్ చూసి ఉలిక్కిపడింది. “ఇదేంటి!? ఇది... ఇది... విజయ్ దగ్గరికి ఎలా వచ్చింది!?” ఆశ్చర్యంగా కవర్ తెరిచింది. అదే లేత గులాబీ రంగు కాగితం. కాగితానికి పైభాగంలో ఒక పక్క అందమైన జంటగులాబీలు ఆత్మీయంగా పలకరిస్తున్నాయి. కాగితం మధ్యలో ఎప్పటిలాగే క్లుప్తంగా ‘వివాహ మహోత్సవ శుభాకాంక్షలు’ అని ఉంది.
తారకంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరం విజయ్ చేతిలో నుంచి అందుకుంది. అంటే... ఇన్నాళ్లు... రకరకాల భావాలు కదిలిపోతున్నాయి ఆమె వదనంలో. చిద్విలాసంగా చూస్తూ నిలబడ్డాడు విజయ్.
“మీరు... అంటే... ఇన్నాళ్లు ఈ ఉత్తరాలన్నీ...” ఆశ్చర్యం, ఆనందం, కంగారు ఇలా రకరకాల భావాలతో ఏది స్పష్టంగా మాట్లాడలేకపోతోంది.
“అవును... నేనే...” అన్నట్టు చిన్నగా తల పంపించాడు విజయ్.
“విజయ్... నేను... నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆ ఉత్తరాలు వ్రాసింది మీరా?”
“అవును తారా! మీ కాలేజీ వార్షికోత్సవంలో మొదటిసారి నిన్ను చూశాను. ఆరోజు అనిత ఆహ్వానం మీద వచ్చాను. ఆ ప్రోగ్రాం లో నీ నటన చూసి నిన్ను అభినందించాలనిపించింది. అంతలోనే ఓ చిలిపి ఆలోచన డైరెక్ట్ గా కాకుండా, ఉత్తరంలో అది నేను ఎవరన్నది తెలియకుండా అభినందనలు అందజేయాలనిపించింది. అందుకే అలా చేశాను. ఆ తర్వాత నుంచి నిన్ను పలకరించాలనిపించినప్పుడల్లా ఉత్తరంలో పలకరించేవాడిని.
“మరి... మధ్యలో ఆ లేఖలు రావడం ఆగిపోవడం... మళ్లీ అప్పుడప్పుడు రావడం... ఏంటిదంతా...?”
“అదా! మనకు పరిచయమై... అది కాస్త ప్రేమగా మారిన తర్వాత, ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇక ఈ అజ్ఞాతలేఖల అవసరమేముంది? దురదృష్టవశాత్తు మనస్పర్ధలతో మనం కొంతకాలం దూరం అయ్యాము. నాకు మళ్ళీ ఆ లేఖలే శరణ్యమయ్యాయి. ఆఖరికి మీ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నిన్ను ఓదార్చాలని వచ్చాను. కానీ నన్ను చూస్తేనే ముఖం ముడుచుకునే నిన్ను చూస్తే ఏదో జంకు. అందుకే... అప్పుడు కూడా ఈ లేఖల్ని ఆశ్రయించాను. తారా! ఇంతకాలం ఆకాశరామన్నలా నిన్ను సస్పెన్స్ లో పెట్టినందుకు కోపంగా ఉందా?”
“ఒట్టి కోపమా! అసలు మిమ్మల్ని... నన్ను సస్పెన్స్ లో పెట్టి... ఈ లేఖారచయిత ఎవరని నేను బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే.... మీరు... మీరు వినోదం చూశారా? మిమ్మల్ని...” అంటూ మీదిమీదకి వస్తున్న తారను చూసి నవ్వుకున్నాడు విజయ్.
“సరే తల్లి! సరే... ఇదిగో నా తప్పుకు శిక్షగా గుంజీలు తీయమంటావా? చెప్పు!” అంటూ అంత పనీ చేయడానికి రెడీ అవుతున్న విజయ్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని ఆపేసింది తార.
“విజయ్! నాకు ఇదంతా కలలా ఉంది. ఇక మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసి బ్రతుకుతాం కడూ...” అంది.
“ఖచ్చితంగా... స్పర్ధలతో... అపార్థలతో మనల్ని దూరం చేసిన ఆ రాహుకాలం వెళ్ళిపోయింది తార. ఇక నీకు ఎలాంటి భయాలు అక్కర్లేదు. హాయిగా ఆనందంగా ఉండు.” చిరునవ్వుతో చెబుతూ ఆత్మీయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు విజయ్.
**************