Vijaya Lakshmi
Published on Nov 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“అదేం కాదు నివేదితా. మిమ్మల్ని ఎవ్వరిని నా జన్మలో మర్చిపోలేను. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకకపోతే అసలు నేను ఎలా ఉండగలిగేదాన్నో తలచుకుంటుంటేనే భయంవేస్తుంది. ఎటూ ఇంక నా అత్తవారిల్లు భారతదేశం కనుక ఇక ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని అందరిని తరుచుగా కలుస్తూ ఉంటాను.”అంది గుగు .
“గుగు అంత కష్ట పడి, అంత తొందరగా తెలుగు నేర్చుకోవడంలో ఉద్దేశ్యం ఇదన్నమాట. ఆయుష్ మీ ప్రేమ వ్యవహారంలో నేను సహాయపడ్డాను. గుగుకి కష్టపడి తెలుగు నేర్పాను. కనుక ఒకవేళ మీపెళ్ళి కెన్యాలో అయితే నువ్వే ఖర్చులు పెట్టుకుని నన్ను తీసుకువెళ్ళాలి” అంది హసిత నవ్వుతూ.
“అదేం కుదరదు. నన్ను, అప్పడికే నా పెళ్ళి అయిపోతే మా ఆయనని కూడా తీసుకెళ్ళాలి. నాకు చిన్నప్పడినుంచి ఆఫ్రికాలో జంతువులని సఫారీలలో చూడాలని సరదా” అంది శరణ్య.
“నేను, నివేదిత ఏం పాపం చేసావేమిటి? మమ్మల్ని కుటుంబ సమేతంగా తీసుకెళ్ళాలి” అంది స్నేహ.
“సరే. మా నాన్నగారికి చెప్పి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తా” అంది గుగు.
“బాబూ అయుష్ ఆ భోజన కార్యక్రమం ఏదో కానిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మన కాలేజీకి వెళ్ళి కారు పంపిస్తాం. అప్పుడు నువ్వు, గుగు వద్దురు గాని. ఈ లోపల పానకంలో పుడకలలా మేము ఎందుకు మీ మధ్యలో” అంది శరణ్య.
“అదేమిలేదు శరణ్య. అందరం కలిసే సాయంత్రం వెళ్ళవచ్చు” అన్నాడు ఆయుష్.
“చూడు ఆ మాటే నీ గుగు అనడం లేదు” అంది హసిత వేళాకోళంగా.
“నీ గుగునా!!?? అప్పుడే మేము వేరు అయిపోయామా!?” అంది గుగు.
“వేరు కాకపోతే మొక్కేమిటి తల్లీ... ఊరికే తమాషాగా అన్నాను. మీరు హాయిగా ఎంజాయ్ చేసి రండి. శరణ్య అన్నట్టు మేము వెళిపోతాం” అంది హసిత.
“అవునవును” అని శరణ్య, హసిత, స్నేహ,నివేదిత అరవసాగారు.
“సరే... గట్టిగ అరవకండి. అందరూ మనల్నే చూస్తున్నారు” అన్నాడు ఆయుష్.
“ఓ.కే” అంటూ బొటన వేలు చూపించింది శరణ్య .
“ఇకనుంచి ఎక్కడకి వెళ్ళినా గుగు పక్క సీట్ నాదే” అంది హసిత ఆయుష్ ని చూస్తూ.
“అలాగే. ఇప్పుడు కాదని ఎవరన్నారు?” అంది గుగు .
“అమ్మో!!?? ఎంత తెలివి మీరిపోయావు గుగు. ఎలాగన్నా నీ పక్కన ఆయుష్ ని కుచోపెడతామని తెలిసి అలా అంటున్నావు” అంది హసిత.
“రేపు నీ లవర్ వస్తే అంతే కదా హసితా. అలాగే నా కాబోయేవాడు వచ్చినా అతని పక్క సీట్ నాదే” అంది శరణ్య .
“తెలుసు. ఊరికేనే గుగు ని అట పట్టించాలని” అంది హసిత.
“గుగు ని ఏం అట పట్టిస్తాం? ఆయుష్ నే ఆడించేసింది” అంది స్నేహ.
“అసలు గుగు చిన్నప్పుడు పులుల, సింహాల మీసాలతో ఉయ్యాలలు ఉగి ఉంటుంది. ఆయుష్ ని, నన్ను అట పట్టించడం దానికో లెక్కా?” అంది హసిత.
“ఆయుష్ నడు భోజనాలకి బయలుదేరదాం. తరువాత మిమ్మల్ని ఎక్కడ దింపమంటే అక్కడ దింపి మేము వెళ్ళిపోతాం.” అంది శరణ్య లేచి నుంచుంటూ.
అందరూ ఆమెని అనుసరించారు. కారు వైపు నడుస్తుంటే గుగు ఇప్పుడు ధైర్యంగా ఆయుష్ పక్కనే, ఆయుష్ చెయ్యి పట్టుకుని నడుస్తోంది. నివేదిత తనకి సంబంధించిన ఆస్తి ఎవరో దోచుకు పోతున్నారు అనే భావంతో వాళ్ళిద్దరి వైపు చూడసాగింది.
మంచి హోటల్లో భోజనాలు అయిన తరువాత ఆయుష్ ని, గుగుని లుంబిని పార్క్ లో వదిలేసి మిగతా వాళ్ళు కారులో తమ కాలేజీకి వెళ్ళిపోయారు.
లుంబిని పార్క్ లో ఒక మూల కూచున్నారు ఆయుష్,గుగు.
“ఆయుష్... ఆయుష్ ఐ లైక్ యు సోమచ్.” అంటూ మొట్టమొదటసారిగా ఆయుష్ ని గాడంగా కౌగిలించుకుంది గుగు. అలా కొన్ని నిమషాలు ఉండిపోయింది. ఆయుష్, గుగు పెదాలను తన పెదాలతో అందుకుని అలాగే ఉండిపోయాడు. వాళ్ళని ఎవరు చూడడం లేదు. ఒకవేళ చూసినా ఈ రోజులని బట్టి ఎవ్వరూ ఏమీ అనుకోరు, అనుకోవడం లేదు. అయితే చూసిన ఒకరిద్దరు వాళ్ళు కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం గురించి పట్టించుకోకపోయినా, తెల్లగా బంగారుతండ్రిలా మెరిసిపోతున్న ఆయుష్ ని, కారు నలుపుగా ఉన్న ఆఫ్రికా అమ్మాయి గుగు ని చూసి “ప్రేమ అంటే ఇదేనేమో” అనుకున్నారు.
మెల్లిగా పక్క పక్క నే కూచున్నారు ఆయుష్, గుగు.
“ఆయుష్ బంగారం లాంటి నువ్వు కాకిలాంటి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు?” అని గోముగా అడిగింది గుగు.
“నాకు సినిమా డైలాగ్ లు చెప్పడం ఇష్టం లేదు గుగు. మొదట నువ్వు ప్రపోస్ చేసినప్పుడు చాలా ఆలోచించాను. మనం మన గురించే కాకుండా మన తల్లిదండ్రుల గురించి, మన హక్కుల గురించి, మన బాధ్యతల గురించి, రేపు రాబోయే సమస్యల గురించి బాగా ఆలోచించుకునే ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నాను. ఎంతో ఆలోచించాను. నువ్వు మనిషి ఎంత నలుపో, నీ హృదయం అంత తెలుపు అని అర్థం అయ్యింది. నీ అమాయకత్వం, నీ ఫ్రాంక్ ఐడియాస్ నాకు బాగా నచ్చాయి. అన్నింటికన్నా ఎక్కడో దేశం కాని దేశంలో ఉంటున్న నన్ను ప్రేమించి, నమ్మి, అన్నివిధాలా ఇష్ట పడ్డావు. అది నాకు నచ్చింది. మనం జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్ళం. నేను ప్రేమించే వ్యక్తి కన్నా, నన్ను ప్రేమించే వ్యక్తి నాకు దొరకడం నేను అదృష్టంగా భావించాను... మనం ఇంతకు ముందు చర్చించుకున్న... మీ కుటుంబంతో సమస్యలు... మా కుటుంబంతో వచ్చే సమస్యలు... వాటిని ఎలా కలిసి పరిష్కరించుకోవాలో నువ్వు ఆలోచించిన, చెప్పిన తీరుకు ముగ్ధుణ్ణి అయ్యాను.
నేను జీవితంలో చాలా ప్రాక్టికల్గా ఉంటాను. సరిగ్గా నాలాంటి నిన్ను చూసి నేను ఇష్టపడ్డాను. అయినా అదంతా గతం. ఇప్పుడు వర్తమానం, భవిష్యత్ ల గురించి మనం ఆలోచించుకోవాలి.” అంటూ ఆయుష్ గుగు ని దగ్గరకు తీసుకున్నాడు. గుగు అతని ఒడిలో గువ్వలా ఒదిగిపోయింది. గడియారంలో ముళ్ళు పరిగెడుతున్నాయి. ఆయుష్, గుగు ల మధ్య మానసిక, భౌతిక బంధం చిక్క పడుతోంది. కాని ఆయుష్ గాని, గుగు గాని హద్దులు దాటడానికి ఉత్సాహం చూపలేదు. పెళ్ళి అయ్యేవరకు తమ బంధం పవిత్రంగా ఉండాలనే ఉన్నతభావం కలది ఆ జంట.
సాయంత్రం ఆరు గంటలకు కారుడ్రైవర్ వచ్చానని, బయట పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు.
“కం గుగు వెళదాం. ఇక అసలైన పర్వతాలు మనం ఎక్కవలిసి ఉంది. అప్పుడే మనం మన ప్రేమ సామ్రాజ్యం నిర్మించుకోగలం.” అన్నాడు ఆయుష్.
ఇద్దరూ లేచి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళసాగారు.
“నిజమే ఆయుష్... మీ వాళ్ళని, మా వాళ్ళని ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఇక సంఘమంటావా... దానిని గురించి పెద్దగా పట్టించుకోకూడదని నా అభిప్రాయం” అంది గుగు సాలోచనగా.
“నిజమే గుగు. అయితే సంఘం అనే దానిని పూర్తిగా విస్మరించలేము. ఎందుకంటే మనం దానిలో ఒక భాగమే” అన్నాడు ఆయుష్.
“అయి ఉండవచ్చు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం కన్విన్సు చేయాలి... మిగతా వాళ్ళని సమాధానపరచవలసిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు” అంది గుగు.
“గాడ్ ఫర్బిడ్... ఒకవేళ మన తల్లిదండ్రులు నో అంటే?” అన్నాడు ఆయుష్.
“ఆయుష్ వాళ్ళకి చెప్పడం, వీలు అయితే ఒప్పించడం మన ధర్మం. కాదు అన్నప్పుడు మన దారి మనం చూసుకోవాలి కదా. లేకపోతే అన్ని హద్దులు, ఎల్లలు దాటి ప్రేమించుకున్న మన ప్రేమకు అర్థం లేదు”
అంది గుగు సూటిగా ఆయుష్ మోహంలోకి చూస్తూ.
“ఈ పట్టుదలే నీలో నాకు నచ్చే విషయం. తెలుగు నేర్చుకోవడం దగ్గరినుంచి నన్ను ప్రేమించడం దాకా ప్రతి చోట పట్టుదల చూపించావు గుగు. ఐ రియల్లీ లైక్ ఇట్” అంటూ ఆయుష్ మెచ్చుకోలుగా చూసాడు గుగు వైపు.
“నీ కాబోయే పెళ్ళాం కి ఆ మాత్రం పట్టుదల లేకపోతే ఎలా?” అంది గుగు నవ్వుతూ.
ఇద్దరూ పార్కింగ్ దగ్గరకు వచ్చారు.
“కాకి ముక్కు కి దొండపండు అంటే ఇదేరా” అన్నాడు ఎవడో.
“ఏ ముక్కు అయితేనేమిటిరా. మనకు కావాల్సింది ఉంటే చాలు” అని అసభ్యం గా, వెకిలిగా కామెంట్ చేసాడు ఇంకొకడు.
గుగు ఒక్కసారి వాళ్ళవైపు చూసింది.
************************
సశేషం
మిగిలిన కథ తరువాతి బ్లాగ్ లో