Vijaya Lakshmi
Published on Nov 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
ఆయుష్ గుగు చెయ్యి గట్టిగా పట్టుకుని కారు వైపు లాక్కుపోయాడు.
కారులో కూచున్న తరువాత, “గుగు నీకు తెలియంది కాదు. ఆ స్థానం లో నువ్వు ఉన్నావు కనుక అలా కామెంట్ చేసారు. అదే ఇంకో తెల్లటి అమ్మాయి ఉంటే ఇంకోరకంగా మాట్లాడేవారు. ఆ వెధవల స్వభావం అంతే. ఏనుగులు వీధిలో వెడుతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏనుగులు పట్టించుకోవు. అయితే వాటి దర్జా ఏమీ తగ్గదు కదా. మనం మన జీవితంలో కూడా అలాగే వెళిపోతూ ఉండాలి. రేపు పెళ్ళి అయ్యాక మనం భార్య, భర్త అంతే. ప్రేమించి పెళ్ళి చేసుకున్నామా. పెద్దలు పెళ్ళి చేసారా. నీది ఏ దేశం, ఏ రాష్రం, నాది ఏ దేశం, ఏ రాష్రం అవన్నీ అసందర్భం ఏమంటావు? మనం కాస్త కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. రేపు మనం పెద్దలను ఒప్పించి, లేకపోతే నువ్వు అన్నట్లు వాళ్ళు ఒప్పుకోకపోయినా, పెళ్ళి చేసుకునే వరకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. పెళ్ళి అయ్యాక కూడా సమస్యలు ఉంటాయనుకో. అయినా ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు
‘సమస్యలు లేని వాళ్ళు సమాధుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే’ ఏమంటావు?” అన్నాడు ఆయుష్.
‘అవును’ అన్నట్లు తల ఊపి ఆయుష్ భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకు పడుకుంది గుగు.
హాస్టల్ కి వెళ్ళేసరికి శరణ్య, హసిత, స్నేహ, నివేదిత ఎదురు చూస్తూ ఉన్నారు.
“హాయ్ వుడ్ బి కపుల్. వెల్కమ్. ఇప్పుడు కేక్ కట్ చేసి మీ పెళ్ళి ప్రయత్నాలికి అంకురార్పణ చేస్తున్నారన్నమాట” అంది శరణ్య.
ఆయుష్ ని, గుగుని తన రూమ్ లోకి తీసుకెళ్ళింది శరణ్య. అప్పడికే రూమ్ అంతా రంగురంగుల దీపాలతో అలంకరింపబడి ఉంది. టేబుల్ మీద అందమైన కేకు పెట్టబడి ఉంది. కేకు మీద “బెస్ట్ అఫ్ లక్ గుగు అండ్ ఆయుష్” అన్న అక్షరాలు ఉన్నాయి. కేకు మీద రెండు కొవ్వొత్తులు పెట్టబడి ఉన్నాయి.
“శరణ్య... ఈ హడావిడి అంతా ఏమిటి!? ఇవన్నీ ఎలా, ఎప్పుడు రెడీ చేసారు?” అని అడిగాడు ఆయుష్ .
“రాజావారు, రాణివారు వనవిహారంలో ఉన్నప్పుడు, మేము ఈ ఏర్పాట్లలో మునిగిఉన్నాం ప్రభూ!” అంది హసిత నవ్వుతూ.
“ప్రభువుల వారి అనుమతి లేకుండా ఈ ఏర్పాటు చేసినందుకు మన్నించండి” అంది స్నేహ.
“రాణి వారి ఆగ్రహానికి గురి అవుతామేమోనని సందేహిస్తూ ఏర్పాట్లు చేసాం ప్రభూ” అంది నివేదిత. నివేదిత తన నిరాశ, నిస్పృహల నుంచి అతి త్వరగా కోలుకుంది లేదా కనీసం కోలుకున్నట్టు నటిస్తోంది.
“థాంక్స్...” అంది గుగు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. నిష్కల్మషమైన స్నేహ బంధం ఆ రూమ్ లో రాజ్యంచేసింది.
“ఆయుష్, గుగు కేకు కోసి, ఒకరి నోట్లో ఒకరు పెట్టుకున్నారు. తరువాత స్నేహితురాళ్ళు అందరూ వాళ్ళ ఇద్దరికీ, వాళ్ళు అందరికి తినిపించారు.
“మనం గుగు పెళ్ళిలో కూడా ఇలాగే కలవాలి. గుగు మాకు చిన్నదో, పెద్దదో హోటల్లో రూమ్ లు బుక్ చేయి. ఏదో కోపం మా మీద పెట్టుకుని ఏ సింహాల, పులుల బోనులోనన్నా పడేశావు కనుక” అంది హసిత నవ్వుతూ. హసిత నవ్వుతో అందరూ శ్రుతి కలిపారు.
**********
అయిదవ సెమిస్టరు అయిపోయింది. పరీక్షలు ముగిసాయి. ఆరవ సెమిస్టరు ప్రారంభం కావడానికి కొంత సమయం ఉంది. ఆ రోజు ఆయుష్, గుగు ఇద్దరూ గుగు రూమ్ లో కూచున్నారు.
“ఆయుష్. నేను ఒకసారి కెన్యా వెళ్ళి వస్తాను” అంది గుగు.
“వెళ్ళిరా గుగు. కాని నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనో ?” అన్నాడు ఆయుష్.
“నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలనిలేదు ఆయుష్. కాని అమ్మా నాన్నని చూసి చాలాకాలం అయ్యింది. అదీకాక నేను అసలు వచ్చిన తరువాత మా ఊరు వెళ్ళలేదు” అంది గుగు
“అవును కదూ. వెళ్ళు గుగు” అన్నాడు ఆయుష్.
“నేను వెళ్ళినప్పుడు మన ప్రేమ విషయం గురించి కూడా కదుపుతాను. ఎలాగైనా ఒప్పించాలి. నాన్నగారితో పెద్ద ప్రాబ్లం లేదనే అనుకుంటున్నాను. కాని అమ్మ అంత తేలికగా ఒప్పుకుంటుంది అనుకోను. మీ దేశంలో ముసలివాళ్ళు ఎలా చాందసంగా ఉంటారో... ఇంచుమించు అలాంటిదే మా అమ్మ. అదే కాక ఇంతదూరం లో ఉండి నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పెళ్ళి అయ్యాక రాకపోకలు ఉండాలి కదా. అమ్మ ఇంతదూరం విమానాలు మారి రావాలంటే కష్టమే... కాని అయుష్! మనకి ఆఫ్రికా దేశాల్లో మంచిజీతం మీద ఉద్యోగాలు వస్తాయి. నన్ను పెళ్ళి చేసుకున్నాక నువ్వు ఎటూ ఆఫ్రికా అల్లుడవే కదా” అంది గుగు నవ్వుతూ.
“అప్పుడే పుట్టింటి వైపు వైపు మొగ్గు చూపిస్తున్నావే?” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“ప్రపంచంలో ఎక్కడన్నా తల్లి ఒకటే. అలాగే ఎక్కడున్నా అమ్మాయికి పుట్టింటి మీద ఇష్టం, దృష్టి ఉంటాయి. అది సహజం” అంది గుగు.
“సరే. ఎప్పుడు బయలుదేరుతున్నావు? టికెట్స్ బుక్ చేస్తాను”
“రేపే బయలుదేరుతాను” అంది గుగు ఉత్సాహంగా .
“టికెట్స్ దొరుకుతాయా?” అన్నాడు ఆయుష్.
“దొరుకుతాయి. కాకపోతే కాస్ట్లీ ఎయిర్ లైన్స్ లో వెళ్ళాలి.” అంది గుగు తన క్రెడిట్ కార్డు బయటకు తీస్తూ.
“కార్డు లోపల పెట్టు... ఎప్పుడైతే మనం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామో ఆ రోజు నుంచే నీది, నాది అని లేదు. అన్నీ మనవి” అన్నాడు ఆయుష్.
“నైస్. ఐ లవ్ యు సో మచ్” అంది గుగు ఆయుష్ నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ.
“నీ ముద్దు కాస్త కింద పెట్టుకోవచ్చు కదా. పాపం నా పెదాలు ఎలా ఎదురు చూస్తున్నాయో” అన్నాడు ఆయుష్ చిలిపిగా నవ్వుతూ
“పాపం అందరూ నువ్వు ఏదో అమాయకుడివని, మంచివాడవని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఇంత అల్లరి చేస్తావని వాళ్ళకి తెలియదు. ఉండు నిన్ను మాట్లాడనిస్తే అలాగే మాట్లాడుతూ ఉంటావు” అంటూ తన పెదవులతో ఆయుష్ పెదవులు మూసేసింది గుగు. తన ప్రేయసి అదర మధురాన్ని గ్రోలసాగాడు ఆయుష్. గుగు కూడా ప్రియుని అదరాలలోలో తీయదనం అనుభవిస్తోంది.
కొన్ని క్షణాలకి “ఆయుష్ నువ్వు టికెట్ సంగతి చూడు. మనం ఇలాగే ఉంటే మన ఆరవ సెమిస్టరు ప్రారంభం అయ్యే సమయం వచ్చేస్తుంది” అంది గుగు.
“అబ్బా!! మంచి మూడ్ పాడుచేసావు” అంటూ ప్రేమగా విసుక్కున్నాడు ఆయుష్.
“సారీ” అంది గుగు ప్రేమగా అతని జుట్టులోకి వెళ్ళు పోనిస్తూ.
“సరే. నైరోబి బుక్ చేస్తాను. అక్కడ నుంచి కారులో వెళ్ళిపోతావు కదా?” అన్నాడు ఆయుష్.
“అంతే. బహుశా నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వస్తారు” అంది గుగు ఉత్సాహంగా.
ఆయుష్ టికెట్ బుక్ చేసాడు.
“పదిహేను రోజులలో వచ్చేస్తాను” అంది గుగు.
“పదిహేను రోజులే!!??” అన్నాడు ఆయుష్ గుండెలమీద చెయ్యి వేసుకుంటూ.
మరునాడు బయలుదేరింది గుగు. ఆయుష్ ఎయిర్ పోర్ట్ వరకూ వెళ్ళాడు.
“నేను కూడా ఎయిర్ పోర్ట్ వరకు వస్తాను... ఆయుష్ విరహ వేదనతో బాధ పడుతుంటే ఓదార్చాలి కదా” అంటూ హసిత కూడా బయలుదేరింది.
“ముగ్గురు వెళ్ళకూడదు. నేనూ వస్తాను” అంటూ తను కూడా కారు ఎక్కింది స్నేహ .
శరణ్య అక్కడనుంచే గుగుకి గుడ్ విషెస్, వీడ్కోలు చెప్పింది.
ఎయిర్ పోర్ట్ లో ఆయుష్ కి, గుగు కి కావాలనే దూరంగా కూచున్నారు హసిత, స్నేహ.
ఆయుష్, గుగు దగ్గరగా కుర్చుని ఏదో మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. అరగంట అయ్యింది. గుగు వెళ్ళే విమానంకి వెళ్ళే వాళ్ళు సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలని అనౌన్స్మెంట్ వినిపించింది.
గుగు అయుష్ ని గట్టిగా హత్తుకుని, వెళ్ళలేక వెళ్ళలేక వెడుతూ, అయుష్ కి టాటా చెప్పింది. ప్రేమలోని మధురిమ, గొప్పతనం అదేనేమో. ఇదంతా దూరం నుంచి చూస్తున్న హసిత, స్నేహ నవ్వుకున్నారు.
గుగు కనిపించినంతవరకు చూస్తూ నిలుచున్నాడు ఆయుష్. తరువాత కూడా అక్కడే నుంచుని గుగు విమానం బయలుదేరే సమయం అయ్యేక వెనక్కి తిరిగాడు. వడివడిగా అడుగులు వేసుకుంటూ ఎయిర్ పోర్ట్ బయటకి నడిచాడు. అక్కడే కూచున్న హసిత, స్నేహ అతనిని అనుసరించారు.
ముగ్గురూ కారులో కుచోగానే, “విరహ వేదన గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదు నాయనా. మనమెంత?” అంది హసిత నవ్వుతూ.
“నేనేదో బాధ పడిపోతున్నానని నువ్వు బెంగ పెట్టుకోకు” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“ఫేస్ ఈస్ ది ఇండెక్స్ అఫ్ మైండ్... నీ బాధ నువ్వు దాచినా... నీ మోహంలో తెలిసిపోతోంది” అంది స్నేహ.
“ఓహో. గొప్ప సైకోలిజిస్ట్... మిస్ స్నేహ” అన్నాడు ఆయుష్.
“థాంక్స్” అంది స్నేహ నవ్వుతూ.
“ఆయుష్ కాస్త నీకు బోర్ లేకుండా కంపెనీ ఇద్దామని వచ్చాం... మాకు ఏ ఐస్ క్రీమో, ఫ్రెంచ్ ఫ్రై లాంటివి ఇప్పిస్తే బావుంటుందేమో... ఆ మెస్ తిండి తిని జిహ్వ చచ్చిపోయింది” అంది హసిత.
“అవును ఆయుష్. అసలు డిన్నర్ కూడా చేసేసి వెడితే మంచిది. ఆ మెస్ కూడు ఒక పుట తప్పినా తప్పినట్టే” అంది స్నేహ.
“ఓ.కే. గర్ల్స్ యు నేమ్ ఇట్ అండ్ యు విల్ హావ్” అంటూ డ్రైవర్ కి మంచి హోటల్ కి పోనిమ్మని చెప్పాడు ఆయుష్.
హసిత, స్నేహ తిండికి మొహం వాచిన వాళ్ళలా తినడం మొదలు పెట్టారు. ఆయుష్ పరిస్థితి పెద్దగా తేడా లేదు. ముగ్గురూ హాస్టల్ పక్షులే కదా!!??. వాళ్ళు ముగ్గురూ డిన్నర్ చేసి హాస్టల్ కి వెళ్ళేసరికి రాత్రి పదకొండు అయ్యింది.
మరునాడు ఉదయం లేచి ‘’గుగు లేకుండా ఒక రోజు గడిపేసాను. ఇంక పద్నాలుగు రోజులే’ అని లెక్క పెట్టుకున్నాడు ఆయుష్.
*******************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో