Vijaya Lakshmi
Published on Nov 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
గుగు నైరోబి ఎయిర్ పోర్ట్ కి చేరుకునేసరికే ఆమె తల్లిదండ్రులు కారుతో సహా వెయిట్ చేస్తున్నారు .
దాదాపు రెండు సంవత్సరాల తరువాత చూసింది తన తల్లిదండ్రులను. గుగు వాళ్ళని చూడగానే బిగ్గరగా ఏడ్చేసింది.
“గుగు... ఏమిటి ఇది... నువ్వు చిన్న పిల్లవి కాదు. త్వరలో డాక్టర్ కాబోతున్నావు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్” అన్నాడు తండ్రి అడోఫో “కికుయు” బాషలో.
తల్లి చికె కూడా గుగు ని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యింది.
“అయ్యో గుగు అంత సన్నగా అయిపోయావు. తిండి తినడం లేదా? అయినా మనకి ఆ వాతావరణం, ఆ తిళ్ళు ఎక్కడ సరిపోతాయి” అంది చికె.
“అమ్మా నువ్వు, నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బిజినెస్ ఎలా ఉంది? లండన్ ఈ మధ్య వెళ్ళారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించిది గుగు.
“మేము బాగానే ఉన్నాం. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అతని పేరు ఏమిటి అఫుఫ్... అతను నీకు చాలా సహాయం చేసాడు కదా” అన్నాడు అడోఫో.
“అయుష్ నాన్నా అతని పేరు” అంది గుగు. ఆయుష్ ప్రస్తావని రాగానే ఆమెకి తెలియకుండానే సిగ్గు, సంతోషం వచ్చేసాయి.
“మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు అందరూ బాగున్నారా? నావ... ఎవరది నీకు జ్వరం వచ్చినప్పుడు సహాయం చేసింది...” అంది చికె.
“నివేదిత అమ్మా. చాలా మంచి అమ్మాయి. వాళ్ళ ఆస్తి మన ఆస్తి కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. కాని అమ్మాయికి అసలు గర్వం లేదు. నేను వేరే దేశం పిల్లని అని ఎప్పుడూ అనుకోదు.” అంది గుగు.
“గుగు మరి అక్కడి బాష నువ్వు నేర్చుకున్నావా?” అని అడిగాడు అడోఫో.
“అక్కడి బాష తెలుగు నాన్నా. బాగా నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ వేళాకోళం అడతారు. మా కంటే నువ్వే తెలుగు బాగా మాట్లాడుతున్నావని” అంది గుగు నవ్వుతూ.
డ్రైవర్ వచ్చి గుగు చేతులో సామానులు అందుకుని బయటకు నడిచాడు. అందరూ అతనిని అనుసరించారు.
గుగు ఇంటికి వెళ్ళగానే చుట్టూ పక్కల వాళ్ళు పలకరించారు. ఆ రోజు సాయంత్రం చిన్ననాటి స్నేహితులు గుగు ఇంటికి వచ్చారు. వాళ్ళు గుగు కాలేజీ విశేషాలు, ఫ్రెండ్స్ సంగతులు, ఇంకా ఇండియా గురించి విశేషాలు అడగసాగారు. వాళ్ళ ప్రశ్నలు అన్నిటికీ ఓపికగా సమాధానం ఇచ్చింది గుగు.
ఆ రాత్రి నుంచి గుగు కి ఇష్టమైన వంటకాలు చేయడం మొదలు పెట్టింది చికె. గుగు కూడా ఎన్నాళ్ళ తరువాతో తన వంటలు, అదీ తన అమ్మ చేతితో వండినవి తినడంలో ఆనందం పొందసాగింది.
గుగుకి అనుక్షణం ఆయుష్ గుర్తుకు వస్తున్నా తల్లిదండ్రుల ఎదుట అతనితో మాట్లాడే అవకాశం లేక ఊరుకుంది.
రాత్రి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే ఆయుష్ కి ఫోన్ చేసింది. ఆయుష్, గుగు ఒకరి గొంతు విని ఒకరు సంతోషించారు.
ఎన్నేళ్ళ తరువాతో మాట్లాడుతున్నట్లనిపించింది ఇద్దరికీ. ఆయుష్ తో ఫోన్లో దాదాపు రెండుగంటల సేపు మాట్లాడుతూనే ఉంది గుగు. మధ్యలో ఒకటి రెండు సార్లు చికె కూతురికి స్వీట్ ఇద్దామని వచ్చి, వెళ్లిపోయింది. ‘ఎవరితోనో అంత సేపు ఫోన్? ఈ కాలం పిల్లలు ఇంతే’ అనుకుంది చికె.
టైం చూసింది గుగు. టైం రాత్రి పన్నెండు అయింది. ’అంటే ఆయుష్ కి రాత్రి రెండున్నర’ అయ్యో బాగా లేట్ అయిపోయింది’ అనుకుంది గుగు.
రెండులు రోజుల తరువాత తన చిన్ననాటి మిత్రులతో “నైరోబి నేషనల్ పార్క్” కి పిక్నిక్ ఏర్పాటు చేసింది గుగు. మొత్తం ఒక పదిమంది వరకు పోగయ్యారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ బాగా ఎంజాయ్ చేసారు.
గుగు తన చదువు, కాలేజీ, అలాగే తన ఇండియన్ ఫ్రెండ్స్ గురించి అందరికీ చెప్పింది. అయితే ఆయుష్ కి తనకి మధ్య ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పలేదు. దానికి ఇంకా సమయం రాలేదు అనిపించింది గుగుకి.
కాని తన ఫ్రెండ్స్ తో ఒక విషయం అంది. తన పెళ్ళి అయిన తరువాత తన భర్తతో ఆ పార్క్ కి రావాలని తన కోరిక అంది.
“ఎవరినన్నా అక్కడే చూసుకో. పెళ్ళి కూడా అక్కడే చేసుకుంటే, మాకు అంత స్తోమతు లేదు కనుక, మేము నీ డబ్బులతో ఇండియా వస్తాం. హాయిగా ఇండియా అంతా చూడొచ్చు” అన్నారు గుగు ఫ్రెండ్ ఎవరో నవ్వుతూ.
“ఆ! అక్కడ మనలాంటి నల్లపిల్లలని చేసుకోడానికి పాపం రెడీగా కాసుకుకూచున్నారు” అంది గుగు నవ్వుతూ.
“వాళ్ళు కూడా అంత తెలుపు కాదు కదా?” అన్నారు అన్నాడు ఒక ఫ్రెండ్.
“కాని మనకన్నా చాలా తెలుపు. చాలా అందంగా ఉంటారు. కాకిలాంటి మనల్ని బొగ్గులాంటి ఇక్కడ వాళ్ళే చేసుకోవాలి గాని... తెల్లగా, నాజుకుగా, అందంగా ఉండే ఇండియన్స్ గురించి ఆశ పడకూడదు” అంది గుగు ఫ్రెండ్ ఒక అమ్మాయి.
“నువ్వెప్పుడు చూసావే ఆ అందగాళ్ళని!?” అని అడిగింది గుగు.
“నెట్ లో చూసాను లేవే. నువ్వు అక్కడ మూడేళ్ల నుంచి ఉంటున్నావు కదా...! ఎవరన్నా నిన్ను ఒక్కసారన్నా లాగించేసారా!?” అని కన్ను గీటి కొంటెగా నవ్వుతూ అంది ఇంకొక స్నేహితురాలు.
“మనం ఏమైనా అందగత్తులం ఏమిటి... అక్కడి వాళ్ళు మన మీద ఆశ పడడానికి” అంది గుగు.
“అందం లేకపోతే ఆడతనం ఉందిగా. ఈ రోజుల్లో ప్రపంచంలో అందరికి కావాల్సింది అదేగా. అందం, అణుకువ, మంచితనం లాంటి వాటి కోసం వెతకడం ఎప్పుడో వదిలేసారుగా జనం.” అంది ఒక స్నేహితురాలు.
“కాని భారతదేశం అన్ని దేశాలలాంటిది కాదే. ఇంకా అక్కడ నీతి, నిజాయతీ, విలువలు, సంస్కారం లాంటివి చక్కగా ఉన్నాయి” అంది గుగు.
“ఆ నువ్వు ఏదో అంటావు గాని నెట్ లో చూసేవి నేను చూస్తూనే ఉన్నాను” అంది గుగు ఫ్రెండ్ ఒకరు .
“నెట్ అంతా మాయ అని నీకూ తెలుసు, నాకూ తెలుసు కదే. నేను అక్కడ ప్రత్యక్షంగా ఉండి, చూసి, చెపుతున్నాను. ఇంకా భారతదేశం ఉత్తమమైన సాంప్రదాయం, సంస్కృతి, ఆచార వ్యవహారాలతో ఉంది. అది ఎప్పటికి ఒక గొప్ప దేశమే” అంది గుగు దృడంగా.
“మరి అంత ఇదిగా చెపుతున్నావు అక్కడ వాణ్ణి ఒకణ్ణి చూసుకుని పెళ్ళి చేసేసుకో. మీ నాన్న డబ్బు అంతా వాడిదేగా. అప్పుడు తెలుపు, నలుపు, అందం, చందం అవేమి అడ్డు రావు” అంది గుగు ఫ్రెండ్.
“నిజంగా నాకు నచ్సినవాడు, నేను మెచ్చిన వాడు దొరికినప్పుడు పెళ్ళి చేసుకుంటాను“అంది గుగు సాలోచనగా.
“నీ పెళ్ళి సరే గాని లేట్ అయ్యిందంటే నా పెళ్ళి చేస్తుంది మా అమ్మ. బయలుదేరండి” అంటూ అందరనీ బయలుదేరదీసింది ఒక అమ్మాయి.
అందరూ నవ్వుకుంటూ తమ తమ ఇళ్ళకు బయలుదేరారు. అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వాళ్ళ బాషలోనే జరిగింది.
గుగు ఇంటికి వెళ్ళడం ఆలస్యం... ఆయుష్ కి ఫోన్ చేసేసి ఆ రోజు జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది.
“ఆయుష్ వాళ్ళందరు కూడా నాకు నచ్చినవాడు దొరికితే ఇండియాలోనే ఎవరో ఒకరని పెళ్ళి చేసుకోమన్నారు” అంది గుగు.
“మరి నువ్వు ఏమన్నావు?” అని అడిగాడు ఆయుష్.
“నేను సరే అన్నాను” అంది గుగు.
“మన విషయం మీ ఫ్రెండ్స్ కి చెప్పావా?” అని అడిగాడు ఆయుష్.
“లేదు... ముందు ఇంట్లో చెప్పి... వాళ్ళు ఒప్పుకున్నాక... బయట వాళ్ళకి చెపుతాను... నిజానికి నా ఫ్రెండ్స్ ఏదో అలా అన్నారు గాని, నేను నిజంగా నిన్ను పెళ్ళి చేసుకోపోతున్నానని తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు” అంది గుగు.
“గుగు మన విషయం మీ తల్లిదండ్రులకి ఎప్పుడు చెపుతావు?” అని అడిగాడు ఆయుష్.
“అదే ఆలోచిస్తున్నాను... ముందు నాన్నగారికి చెపితే మంచిదా లేక అమ్మతో చెప్పి, అమ్మ ద్వారానే నాన్నగారికి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను” అంది గుగు.
“ఎవరితో ముందు చెపితే మంచిదో, ఏ టైంలో చెప్పాలో బాగా ఆలోచించుకో. కంగారుపడకు. నువ్వు ఇంకా వారంపైన ఉంటావుగా” అన్నాడు ఆయుష్.
“ఉంటాను గాని... నాకు చాలా కంగారుగా ఉంది. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది.” అంది గుగు... తన గొంతులో ఆదుర్దా, కంగారు ధ్వనింపజేస్తూ.
“పోనీ నన్ను కూడా వచ్చెయ్యమంటావేమిటి?” అన్నాడు ఆయుష్.
“అమ్మో!!?? అలాంటి పనులు చేసి కొంపముంచకు. నేనే ఏదో రకంగా మా వాళ్ళకి చెప్పి ఒప్పిస్తా. ఒక విచిత్రం తెలుసా? ఇక్కడ మా కుటుంబాలలో పెద్ద సెంటిమెంట్స్ ఉండవు. కాని మా కుటుంబంలో అవి చాలా ఎక్కువ. అందుకనే నాకు కాస్త భయంగా ఉంది.” అంది గుగు.
“ఎక్కడ అయితే ప్రేమ ఉంటుందో అక్కడ సెంటిమెంట్స్ ఉంటాయని నా నమ్మకం. మా చుట్టాల్లో కొంత మంది నన్ను ‘సెంటిమెంటల్ ఫూల్’ అంటూ ఉంటారు. మా ఇళ్ళల్లో కూడా ప్రేమలు ఎక్కువే. నువ్వు చూసావు కదా మా అమ్మమ్మని. మా నాయనమ్మ ఈ మద్యే పోయింది. ఆవిడ దగ్గరే నేను జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే అమ్మమ్మ కూడా నాకు చాలా నేర్పింది. విచిత్రం ఏమిటంటే, భయం వల్ల అను, భక్తి వల్ల అను, నాకు నా తల్లిదండ్రుల దగ్గర చనువు తక్కువే. నాయనమ్మ, అమ్మమ్మల దగ్గర ఉన్న చనువు, స్వాతంత్రం నాకు మా పేరెంట్స్ దగ్గర లేవు.” అన్నాడు ఆయుష్.
“ఇంతకు ముందే నీకు చెప్పాను కదా. నాకు అసలు మా తల్లిదండ్రులు తప్ప ఆ జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ తెలియదు. నేను ఒకటి రెండు సార్లు అడిగితే వాళ్ళు నేను పుట్టకముందే పోయారని చెప్పారు.” అంది గుగు.
“సరే గుగు డియర్ మంచి ముహూర్తం చూసుకుని ఆ విషయం మీ వాళ్ళకి చెప్పి, ఒప్పించేస్తే మన భారం దిగిపోతుంది. ఇక ఇటు యుద్ధం మొదలు పెట్టాలి” అన్నాడు ఆయుష్.
“నేను ఒకటి రెండు రోజులలో విషయం కదుపుతాను... అవసరం అయితే నువ్వు లైన్ లోకి రావడానికి సిద్ధంగా ఉండు” అంది గుగు.
“అబ్బా గుగు. నీ మాటలు అస్సలు అర్థం కావడం లేదు. ఒక పక్కన నన్ను రావద్దు అంటావు... మరోపక్క నన్ను సిద్ధంగా ఉండమంటావు!?”
“ఆయుష్ అంటే నిన్ను ఇక్కడకి రమ్మని కాదు... ఫోన్ లో మన విషయం మా వాళ్ళతో మాట్లాడడానికి రెడీ గా ఉండమని” అని వివరించింది గుగు.
“చిత్తం మేడం” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“దూరంగా కూచున్న నీకు నవ్వులాటగానే ఉంటుంది. నాకు ఎంత కంగారుగా ఉందో నీకేం తెలుసు. హాయిగా ఇక్కడ మా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకున్నా పోయేది” అంది గుగు ఆయుష్ ని ఉడికించడానికి.
“చేసుకో. ఇక్కడ ఎవ్వరూ నీ కోసం కాసుకు కూచోలేదు” అన్నాడు ఆయుష్ కోపం నటిస్తూ.
“అదుగో అప్పుడే కోపం వచ్చేసింది అబ్బాయిగారికి. అసలు ఈ గుగు జీవితంలో నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేరు, ఉండబోరు. నీలాంటి మనిషిని భర్తగా పొందడం నా అదృష్టం” అంది గుగు.
“నేను అదే అనుకుంటున్నాను గుగు. నువ్వు ఎక్కడో పుట్టి పెరిగావు? నేను ఇక్కడ వాడిని. భగవంతుడు విచిత్రంగా మనల్ని కలిపాడు. ఇద్దర్ని ఒకటిగా చేసే భారం ఆయనదే. నువ్వు ఏమీ భయపడకు. నేను ఉన్నాను. నిజంగా అంత అవసరం అనిపిస్తే నేను కూడా అక్కడకి వస్తాను” అన్నాడు ఆయుష్.
“ఓ.కే. ఆయుష్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను... నాన్నగారు వచ్చే వేళయ్యింది” అంటూ ఫోన్ లోనే ఆయుష్ కి ముద్దు పెట్టి, అటునుంచి ముద్దుల వర్షం అందుకుని, ఫోన్ పెట్టేసింది గుగు.
************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో