Vijaya Lakshmi
Published on Nov 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మానూ మాకును కాను – పార్ట్ 18
2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల
రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
ఆ రోజు గుగు తండ్రి ఎక్కడకీ వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉండిపోయాడు.
గుగు తల్లి చికె మధ్యాహ్నం ముగ్గురికి భోజనం వడ్డించింది.
“ఉగాలి” అనబడే కార్న్ మీల్ కప్పుల్లో ఉంచింది. ముద్ద చేసిన బంగాళాదుంపల, బటానీల “ఇరియో”, “న్యామా చోమా” అనబడే వేయించిన మాంసం, “వలివానజి” అనబడే కోకో నట్ రైస్, ప్లైన్ రైస్ అందరికీ ప్లేట్లలో ఉంచింది చికె.
“అమ్మా ఇవన్నీ తినడానికే !?” అంది గుగు నవ్వుతూ.
“తిను గుగు. అక్కడ హాస్టల్ లో ఏం తింటున్నావో, వాళ్ళు ఏం పెడుతున్నారో” అన్నాడు అడోఫో.
“అక్కడ తిండికి మనం తినే వాటికీ చాలా పోలికలు ఉన్నాయి నాన్నగారు. కాకపోతే కాస్త పదార్ధాల పాళ్ళు అటు ఇటూగా ఉంటాయి. అలాగే రుచులు కొంచం వేరే” అంది గుగు.
“పోనీలే. నువ్వు మరీ ఇబ్బంది పడడం లేదు కదా” అంది చికె.
“ఉదాహరణికి ఉగాలి, ఇరియో లాంటివి అక్కడ హోటల్స్ లో దొరుకుతాయి. న్యామాచోమా కూడా దొరుకుతుంది. అలగే మనం చేపల్తో చేసుకునే “సమకి చోమా”, చికెన్ తో చేసుకునే “తంకు చొమా” కూడా దొరుకుతాయి” అంది గుగు టేబుల్ మీద తల్లి ఉంచిన అన్నిటిని రుచి చూస్తూ.
“ఏమిటి మీ హాస్టల్లో కూడా చేస్తారా!?” అని అడిగాడు అడోఫో, న్యామా చొమా ని రైస్ తో కలుపుకుంటూ.
“హాస్టల్లో చేయరు నాన్నగారు... కాని బయట దొరుకుతాయి”అంది గుగు.
“అయితే తిండికి మరీ ఇబ్బంది లేదన్నమాట” ‘అంది చికె.
“దేనికీ ఏ ప్రాబ్లం లేదమ్మా. మీరు వచ్చినప్పుడు చూసారు కదా. నాకు మంచి స్నేహితులు దొరికారు” అంది గుగు.
“నిన్ను ఇక్కడ దానివని... వేరే రంగు, రూపురేఖలతో ఉన్నావని... తక్కువగా చూడడం లేదు కదా గుగు” అని అడిగాడు అడోఫో.
“అదేమీ లేదు నాన్నగారు... వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేను వాళ్ళలో ఒకదానిలా చూస్తారు. అన్ని విషయాలలో నేను ఏదో వేరే దేశం పిల్లని అన్నట్లు అస్సలు భావించరు. చూడరు. అందరూ ఎంతో సరదాగా ఉంటారు” అంది గుగు.
“అవును అనుకో. మేము వచ్చినప్పుడు చూసాం” అన్నాడు అడోఫో ఉగాలిని రైస్ లో నంచుకుంటూ.
“నివేదిత అనే అమ్మాయి నాకు జ్వరం వచ్చినప్పుడు ఎంతో సహాయం చేసింది. ఇంక ఆయుష్ అనే అబ్బాయి అయితే పాపం ఎవరిదో స్టాఫ్ కారు తీసుకు వచ్చి మరీ పరీక్షకి తీసుకు వెళ్ళాడు. అతను చాలా మంచివాడు నాన్నగారు” అంది గుగు ఏదో తింటూ కన్నులచివరల నుంచి తండ్రిని గమనిస్తూ.
“ఏం మంచి వాళ్ళమ్మా... మన దేశం కాదు, మన ఊరు కాదు. ఏదో జాగర్తగా గడుపుకు వచ్చేయ్యడమే” అన్నాడు అడోఫో .
“అసలు నిన్ను అంత దూరం పంపడం మాకు ఇష్టం లేదు. హాయిగా ఇంగ్లాండ్ లో చదువుకుంటే అయిపోయేది” అంది చికె.
“అక్కడ నాకు సీట్ రావాలి కదమ్మా. అదీకాక నాకు ఎందుకో మొదటనుంచి భారతదేశం అన్నా, భారతీయులు అన్నా ఇష్టం. అందుకే అక్కడకు వెళ్ళాను. నా అదృష్టం కొద్ది మంచివాళ్ళు క్లాసు మేట్స్ గా దొరికి, తరువాత ఫ్రెండ్స్ గా మారారు. అసలు నాకు మిమ్మల్ని వదలి ఉంటున్నానని గాని, ఎక్కడో దూరంగా ఉంటున్నానని గాని అనిపించడం లేదమ్మా” అంది గుగు.
“నువ్వు వాళ్ళ బాష తెలుగు కూడా నేర్చుకున్నాను అన్నావు?” అన్నాడు అడోఫో “మటోల్ద్” అనే అరటిపళ్ళకి సంబంధించిన పదార్ధం తీసుకుంటూ.
“వాళ్ళ భాషే కాదు, వాళ్ళ ఆచారవ్యవహారాలు కూడా నేర్చుకున్నాను” అంది గుగు.
“అవన్నీ మనకు ఎందుకే?” అంది చికె.
“ఎప్పడికి అన్నా పనికి వస్తాయని” అంది గుగు.
“అవి మనకు ఎందుకే!!??” అంది చికె ఆశ్చర్యం గా మోహం పెట్టి.
“అమ్మా. నేను డాక్టర్ ని. ఎక్కడ పని చేయాలో, ఎవరితో పనిచేయాలో, ఎవరితో జీవించాలో తెలియదు కదా. అందుకని జీవితంలో నేర్చుకునేది ప్రతీది ఉపయోగిస్తుంది అని నా నమ్మకం” అంది గుగు.
“నిజం మై డాటర్” “అంటూ మెచ్చుకోలుగా కూతురి వైపు చూసాడు అడోఫో.
“సరే... మీ మాటలు కాస్త తగ్గించి భోజనం చెయ్యండి. అసలే అమ్మాయి రాకరాక వచ్చింది. మళ్ళీ రెండు రోజులలో వెళ్ళిపోతుంది” అంది చికె.
అందరూ మాటలు ఆపి భోజనం చెయ్యడం మీద దృష్టి పెట్టారు.
ఆ రోజు సాయంత్రం అందరూ అడోఫో ఫార్మ్ హౌస్ కి వెళ్ళారు. అక్కడ చాలా ఆహ్లాదకరమైన ప్రకృతి వింతలు, చల్లని పైరు గాలి, దగ్గరలో అద్భుతమైన అడవులు... మొత్తానికి అన్నీ మనసును ఆహ్లాదపరిచేవిగా ఉన్నాయి.
“నాకు అచ్చు ఇండియాలో ఉన్నట్లు ఉంది” అంది గుగు ఉత్సాహంగా.
అడోఫో, చికె ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అక్కడ రెండుగంటలు గడిపి ఇంటికి చేరుకున్నారు ఆ కుటుంబ సభ్యులు.
ఆ రాత్రి గుగు ఆయుష్ కి ఫోన్ చేసి ఆ రోజు తమ భోజనంలో తన తల్లి చేసిన వంటల దగ్గర నుంచి, తాము తండ్రి ఫార్మ్ హౌస్ కి వెళ్ళడం వరకు అన్నీ విపులంగా, వివరించి చెప్పింది.
అడోఫో తన బెడ్ రూమ్ లో ఏదో కాగితాలు చూసుకుంటున్నాడు. అక్కడకు వచ్చినా చికె “సర్ వారు ... నాకు ఎందుకో మన అమ్మాయి మునపటి అమ్మాయిలా కనిపించడం లేదు” అంది చికె.
“ఏమయ్యిందేమిటి? మన పిల్ల మారిపోయి, వేరే పిల్ల ఏదైనా మారువేషంలో వచ్చింది అంటావా?” అన్నాడు అడోఫో నవ్వుతూ.
“నేను చాలా సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు వేళాకోళంగా ఉందా? ముందు ఆ కాగితాలు పక్కన పడేసి నేను చెప్పేది వినండి” అంటూ అడోఫో చేతిలో కాగితాలు లాక్కుని పక్కన పడేసింది చికె.
చికె ఆఫ్రికన్ తల్లి అయినా ఆంధ్ర తల్లిలాగే ఆలోచిస్తోంది. మాట్లాడుతోంది. అసలు తల్లికి దేశ, జాతి, మత, ప్రాంత, కుల బేదాలు ఏమిటి. నిజం చెప్పాలంటే ఎనుబదినాలుగు లక్షల జీవులలో ఏ తల్లి అయినా ఒకటే !?
“ఏమయ్యింది చికె !?” అని ప్రశ్నించాడు అడోఫో .
“మీరు ఒక విషయం గమనించారా. గుగు ప్రతి విషయానికి ఇండియా... ఇండియా అంటూ చెపుతోంది. వాళ్ళ విషయాలు అన్నీనచ్చాయని అంటోంది” అంది చికె.
“అందులో ఆశ్చర్యపడవలిసింది ఏముంది? అమ్మాయి అక్కడే ఉండి చదువుకుంటోంది కనుక సహజంగా అక్కడి పద్ధతులు, ఆచార వ్యవహారాలు నచ్చి ఉండొచ్చు. అందులో వింత ఏముంది? ’అన్నాడు అడోఫో.
“అందులో ఏమిలేదు. కాని అమ్మాయి ఎవరితోనో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతోంది” అంది చికె ఆందోళనగా.
“చికె ఈ రోజుల్లో పిల్లలు ఫోన్ లోనే మాట్లాడుతారు. నీతో, నాతో మాట్లాడే ఉత్సాహం, తీరిక వాళ్ళకు లేవు” అన్నాడు అడోఫో.
“అబ్బా!! నేను చెప్పేది పూర్తిగా వినండి... మొన్న ఒకరోజు నేను దాని బట్టలు సర్దుతుంటే... దాని ఫ్రెండ్... అతని పేరు ఆష్... అగుష్... ఏదో ఉంది కదా, అతని ఫోటోలు కనిపించాయి” అంది చికె.
“ఫోటోలు కనిపించాయా? అయినా ఈ రోజులలో మొబైల్లో అన్నీ ఉన్నప్పుడు ఇంక మామూలు ఫోటోల అవసరం ఏవుంది? ఏదో సరదాగా పెట్టుకుని ఉంటుంది. అలాగే మిగతా ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయేమో చూడలేకపోయావా?” అని అడిగాడు అడోఫో.
“ఆ అబ్బాయి ఫోటో మాత్రమే ఉంది... ఇంకో విషయం ఆ ఫోటో మీద ‘విత్ లవ్’ అని రాసి సంతకం పెట్టి ఉంది” అంది చికె.
“అదే రోజు నేను ఒకసారి గదిలోకి వెళ్ళినప్పుడు విన్నాను. ఫోన్ లో అవతల మగగొంతు వినిపిస్తోంది. అమ్మాయి తెలుగులో మాట్లాడుతోంది” అంది చికె.
“అంటే మనమ్మాయిని ఆ అబ్బాయి ప్రేమించేస్తున్నాడంటావా? అర్థం లేని ఆలోచనలు చేసి మనస్సు పాడు చేసుకోకు. అతను అందంగా, తెల్లగా ఉంటాడు. ఆ అబ్బాయి ఎక్కడ, మనమ్మాయి ఎక్కడ? ఏదో ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లని పిల్లని ప్రేమించే అంత ఇంట్రెస్ట్, సాహసం ఏ కుర్రాడికి ఉండదు. అదీ కాక మనం వెళ్ళినప్పుడు చూసాం కదా. అతను అద్భుతమైన తెలివిటలు కలవాడు. మనకు ఉన్నది ఒక్కత్తే అమ్మాయి.పోనీ ఏదో ఆస్తి కోసం అన్నా... మన దేశం ఎక్కడ, ళ్ళ దేశం ఎక్కడ? అదీకాక అతని మాటలను బట్టి అతను మనకన్నా ఎన్నో రెట్లు ఆస్తి కలవాడు అని తెలిసింది” అన్నాడు అడోఫో.
“లేదు... నాకు చాలా అనుమానం గా ఉంది” అంది చికె.
“అంత కంగారు పడిపోయే బదులు రేపు అమ్మాయిని అడిగేస్తే పోలా?” అన్నాడు అడోఫో.
“రేపు ఉదయం మీరు కాస్త ఇంట్లో ఉండండి... విషయం తేలేవరకు. ఒక తల్లిగా నాకు కంగారుగా ఉంది” అంది చికె.
“ఉదయం మాట్లాడుదాం. అంతవరకు నువ్వు కంగారు పడకు... నన్ను కంగారు పెట్టకు.” అంటూ మళ్ళీ టేబుల్ మీద ఉన్న పేపర్స్ అందుకున్నాడు అడోఫో.
మంచం మీద పడుకున్న అడోఫోకి మొదటిసారిగా ఏదో విధమైన భయం, కంగారు మొదలు అయ్యింది.
తన భార్యతో కూతురుతో ఏం మాట్లాడాలి? కూతురికి ఎలా నచ్చ చెప్పాలి? ఒకవేళ గుగు మొండికేస్తే ఏం చేయాలి? అనే విషయాలు దీర్ఘంగా చర్చించాడు. తెల్లవార్లూ ఆలోచిస్తూనే గడిపాడు అడోఫో. చికె కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
నిజం చెప్పాలంటే భార్య భర్తలు ఇద్దరూ ఎప్పుడు తెలవారుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇదేమీ తెలియని గుగు కూడా మరుసటి రోజు ఉదయం తన తల్లిదండ్రులకి విషయం చెప్పాలని నిర్ణయించుకుంది.
*****************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో