Vijaya Lakshmi
Published on Nov 06 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఆ మరునాడు ఉదయం ముగ్గురూ టిఫిన్ చేయడానికి కూచున్నారు.
“గుగు నీతో ఒక విషయం మాట్లాడాలని మీ అమ్మ అనుకుంటోంది” అన్నాడు అడోఫో.
“ఏమిటమ్మా అది!?” అని అడిగింది గుగు.
“నువ్వు టిఫిన్ చేసాక మాట్లాడుతాను” అంది చికె .
“అలాగేనమ్మా” అంటూ సాలోచనగా, తొందరగా టిఫిన్ ముగించింది గుగు.
అడోఫో, చికె, గుగు ముగ్గురూ టిఫిన్ పూర్తి చేసి హాల్లో కూచుని ఉన్నారు.
“గుగు నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాం. మనం చిన్నప్పడి నుంచి అనుకుంటున్న, పక్కింటి అబ్బాయి, ఉన్నాడు కదా! అతనితో నీ పెళ్ళి. అతను మీ నాన్నగారితో పాటు బిజినెస్ చేస్తున్నాడు. మంచి కుటుంబం. మనకి ఎప్పటినుంచి తెలిసిన కుర్రాడు...” అంటూ ఇంకా చికె ఏదో చెప్పబోతుంటే అడ్డుపడింది గుగు.
తను వచ్చినప్పడినుంచి అనుకుంటున్న విషయం తల్లిదండ్రులే కదిపేసరికి ఒకవిధంగా కంగారు పడ్డా, ఒకవిధంగా సంతోష పడింది గుగు.
“అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు“ అంది గుగు తల వంచుకుని.
“అదేమిటి!? మనం ఎప్పడినుంచో అనుకుంటున్నదే కదా?” అంది చికె.
“మీరు అనుకుంటున్నారు. కాని నేను ఎప్పుడు అనుకోలేదు” అంది గుగు.
“అంటే దాని అర్థం!?” అని అడిగాడు అడోఫో.
“నాకు ఇష్టం లేదు” అంది గుగు పొడిగా.
“ఈ అబ్బాయి ఇష్టం లేకపోతే పోనీ ఎవరు ఇష్టమో చెప్పు” అంది చికె.
“నాకు ఎవ్వరూ ఇష్టం లేదు” అంది గుగు ఏటో చూస్తూ.
“పోనీ వేరే ఎవరినన్నా గాని ఇష్టపడ్డావా? ప్రేమించావా?” అని అడిగింది చికె.
“అమ్మా నేన... నేను... నేను ఒకబ్బాయిని ప్రేమించానమ్మా” అంది గుగు భయం భయంగా తల్లి వైపు చూస్తూ.
“ప్రేమించావా !!?? ఎవరిని !!??” అంది చికె.
“మీరు చూసిన ఆయుష్ ని” అంది గుగు మెల్లిగా.
“నీకేమన్నా పిచ్చి పట్టిందా!?” ఒక్క సారిగా అరిచాడు అడోఫో.
తండ్రి అరుపుకి ఉలిక్కి పడింది గుగు.
“గుగు నువ్వు అక్కడకు వెళ్ళింది చదువుకోడానికా. ప్రేమలు, పిచ్చిలు అనడానికా?’ కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటే అన్నాడు అడోఫో.
“నాన్నగారు. నేను, అతను ప్రేమించుకున్నాం. పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం”అంది గుగు.
గుగు మాటలు విన్న ఆమె తల్లిదండ్రులు నోట మాట లేదు .
ఆ తరువాత కొంత సేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది.
కొంతసేపటికి “అంతా నీ ఇష్టమేనా? అసలు మన దేశం ఏమిటి? అతని దేశం ఏమిటి? అతను ఎవరో ఎలా పెరిగాడో. వాళ్ళ కుటుంబం ఎటువంటిదో... ఏవీ చూసుకోక్కర్లేదా?” అప్పడికి కొంచం కోపం తగ్గి, కోపం, బాధ మిళితమైన స్వరంతో అన్నాడు అడోఫో.
“అతను చాలా మంచివాడు నాన్నగారు. వాళ్ళ ఊరు కూడా వెళ్ళి వచ్చాను. వాళ్ళ తల్లిదండ్రులను కలిసి వచ్చాను” అంది గుగు.
“అయితే వాళ్ళతో అన్నీ మాట్లాడేసావా?” అంది చికె.
“అప్పుడు మేము ఇంకా ప్రేమలో పడలేదమ్మా. కేవలం స్నేహితులమే. వాళ్ళందరిని చూసాక నేను అతన్ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను నా నిర్ణయం విన్న తరువాత ఆలోచించుకొని, తను కూడా నన్ను పెళ్ళి చేసుకోడానికి ఇష్టం ఉందని చెప్పాడు” అంది గుగు.
“గుగు... ఎక్కడో, ఎవరినో, దేశం కాని దేశం లో పెళ్ళి చేసుకుని, ఎలా బతుకుతావే?” అంది చికె.
“అమ్మా మేము అంతా ఆలోచించాకే ఒక నిర్ణయం తీసుకున్నాం. పెళ్ళికి ముందు, పెళ్ళి తరువాత కూడా కలిగే ఇబ్బందులను, సాధకబాధకాలను అన్ని చర్చించుకునే మేము పెళ్ళి చేసుకోవాలనుకున్నాం”
అంది గుగు .
“అతను సరే ఇష్టపడ్డాడు అంటున్నావు. వాళ్ళ వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో !? నిన్ను ఎన్ని కష్టాలు పెడతారో? అసలు వాళ్ళు నీలాంటి అమ్మాయిని చేసుకోడానికి ఇష్టపడతారని నేను అనుకోను” అన్నాడు అడోఫో సాలోచనగా.
“ఇండియాలో కులాలు, మతాలు పట్టింపులు ఎక్కువ అని విన్నాను... మరి...” అర్తోక్తిలోనే ఆగిపోయింది చికె.
“అమ్మా... అవన్నీ ఆలోచించుకున్నామమ్మా. మేము ఏమీ పసి పిల్లలం కాదు. మెడిసిన్ చదువుతున్నాం. ఆ మాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటామా?” అంది గుగు.
“చూడు గుగు. నీ పెళ్ళికన్నా... వాళ్ళు రావాలి లేదా మేము రావాలి. అప్పుడు నీ కాబోయే అత్త మామలు, వాళ్ళ చుట్టాలు మనల్ని స్వీకరిస్తారా? ఎక్కడో పరాయి దేశం వాడిని పెళ్ళి చేసుకుంటే, మాకు, రేపు నీకు పుట్టబోయే పిల్లలకి ఎంత కష్టమో ఊహించావా” అన్నాడు అడోఫో.
“నాన్నగారు పెళ్ళి అయిన తరువాత అతను మీ అల్లుడు, నేను వాళ్ళ కోడలిని. ఇక దేశం, రాజ్యం గొడవ ఏముంది” అని అడిగింది గుగు.
“ఇప్పుడు తెలియదే... రాను రాను ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నీకు తెలియదు. మా మాట విను. అతనిని స్నేహితుడిగానే ఉంచుకో. మన వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకో. నీకు ఇబ్బందిగా ఉంటే, మొహమాటంగా ఉంటే ఇక ఇండియా వెళ్ళకు. నాన్నగారు ఇంగ్లాండ్ లో సీట్ ఇప్పిస్తారు. అక్కడ మెడిసిన్ చదువుకో... నా మాట విను” అంది చికె బతిమాలే ధోరణిలో .
“అమ్మా నన్ను అతనిని మోసం చెయ్యమని చెపుతున్నావా? అది నన్ను నేను మోసం చేసుకోవడం, మన కుటుంబం అతనిని, అతని కుటుంబాన్ని మోసం చెయ్యడం అవుతుందమ్మా” అంది గుగు.
“గుగు ఇప్పుడు నీ తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా చెపుతున్నాను. ఈ యవ్వనపు వేడిలో అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాని రోజులు గడచే కొద్ది తప్పు చేసామన్న భావన, ఆ తప్పు వల్ల కలిగే కష్టాలు నిన్నువేదనకి గురిచేస్తాయి. వాళ్ళ దేశంలో అన్నా, మన దేశం లో అన్నా కొన్ని నియమాలు, కట్టుబాట్లు పెట్టారంటే అవి మన మంచికే. తెలుసుకో. పిచ్చి, పిచ్చి ఆలోచనలు మానుకుని హాయిగా మనం దేశంలో నీకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకో. నువ్వు సుఖ పడు. మమ్మల్ని సుఖ పెట్టు “అన్నాడు అడోఫో .
“నాన్నగారు మేము నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి కరుణిస్తారో లేక మా చావు మమ్మల్ని చావమని చెప్తారో మీ ఇష్టం” అంది గుగు దృడంగా.
“అంటే ఇన్ని రకాలుగా ఇంత చెప్పినా నీ నిర్ణయం మారదా? ఒక్కసారి బాగా ఆలోచించుకో గుగు”
అన్నాడు అడోఫో.
“నా నిర్ణయం ఎప్పుడూ ఒకటే నాన్నగారు... మేము ఇద్దరం పెళ్ళి చేసుకోవలా వద్దా అని అనుకునే ముందే చాలా ఆలోచించాం. ఆ తరువాతే ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోడానికి ఏమీ లేదు.” అంది గుగు తండ్రి కళ్ళలోకి సూటిగా చూస్తూ.
“అంతేనా... మరోసారి ఆలోచించుకో... కావలిస్తే రెండు రోజులు టైం తీసుకో” అంది చికె.
“అమ్మా! మీ కూతురు సంతోషంగా ఉండాలా? లేక మీమాట విని జీవితాంతం బాధ పడాలా?” అంది గుగు.
ఆటం బాంబ్ లాంటి గుగు అల్టిమేటంకి గుగు తల్లిదండ్రులు కంగుతిన్నారు.
***********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో