Vijaya Lakshmi
Published on Nov 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“మాకు ఉన్న ఒక్కగాని ఒక్క బిడ్డవి... మా జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడం కన్నా కావలిసినది ఏమి లేదమ్మా... సరే నీ ఇష్ట ప్రకారమే కానీ...” అంటూ ఇంక ఏదో అనబోయాడు అడోఫో.
“అలా ఒప్పేసుకుంటారేమిటి!? అది చిన్నపిల్ల... మీరన్నా చెప్పండి” అంది చికె బాధగా.
“చికె. మనకి మాత్రం జీవితంలో అమ్మాయి సుఖం, సంతోషం కంటే కావాల్సింది ఏముంది? అది చిన్నపిల్ల కాదు. దాని భవిష్యత్తు అది నిర్ణయించుకుంది. లెట్ అస్ బ్లెస్ హర్. కాని గుగు ఈ పిచ్చి తండ్రిది ఒకే కోరికమ్మా... మేము బతికున్నంతకాలం మా దగ్గరికి నువ్వు, అల్లుడు... రేపు పుట్టబోయే మనమలతో వస్తూ ఉండాలమ్మా. అలాగే మేము కూడా మీ దగ్గరకు వస్తుంటాం. సరేనా. ఈ చిన్న కోరికను కాదనువుగా” అంటూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నాడు అడోఫో.
తండ్రిని అలా చూసిన గుగు చలించిపోయింది. ఎందుకంటే తను పుట్టి బుద్ధి ఎరిగాక, ఎటువంటి పరిస్థుతలలో కూడా, తండ్రి డీలా పడడం కాని, కన్నీరు కార్చడంకాని చూడలేదు.
“నాన్నగారు” అంటూ తండ్రిని కౌగలించుకుని బావురుమంది గుగు. అడోఫో కళ్ళమ్మట నీళ్ళు కారుతూనే ఉన్నాయి. చాలా సేపు తండ్రి, కూతుళ్ళను చూస్తూ ఉండిపోయింది చికె.
ఆ తల్లిదండ్రుల పరిస్థితి దీనంగా మారింది. ఒక పక్క కూతురి మొండిపట్టుదల, ఇంకొకపక్క కూతురి భవిష్యత్తుపట్ల ఆందోళన. ఏమి చెయ్యాలో, ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు అడోఫో, చికె.
చాలా ఆలోచించారు వాళ్ళు ఇద్దరూ. కొంతసేపయ్యాక అడోఫో గుగు వైపు చూసాడు.
“సరే నీ ఇష్టప్రకారమే కానీ” అన్నాడు అడోఫో.
ఆ రోజు రాత్రి గుగు హుషారుగా ఆయుష్ కి ఫోన్ చేసింది. జరిగినది అంతా ఆయుష్ కి చెప్పింది.
“కంగ్రాట్స్ డియర్ గుగు” అన్నాడు ఆయుష్.
“ ఉత్తి కంగ్రాట్స్యేనా!?” అంది గుగు చిలిపిగా.
“నువ్వు వేల మైళ్ళ దూరంలో ఉన్నావు... లేకపోతేనా... నువ్వు మొత్తం ఎర్రగా అయిపోయేదానివి” అన్నాడు అయుష్ నవ్వుతూ.
“ఇప్పుడు మాత్రం నా బుగ్గలు నువ్వు కొరికేసినట్టుగా ఎర్రగా అయిపోయాయి” అంది గుగు.
“అటు క్లియరెన్స్ రాగానే నీకు సిగ్గు పూర్తిగా పోయినట్లు ఉందే” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“కాని అయుష్ ఇంత ఈజీగా అవుతందని అనుకోలేదు” అంది గుగు.
“పోనీలే హాఫ్ ది బేటిల్ ఈస్ వన్. ఇక మావాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అమ్మకి అసలే చాదస్తం. ఈపాటికి అసలు లోపాయకారిగా... అంటే నివేదిత తల్లిదండ్రుల ద్వారా తెలిసే ప్రమాదం ఉంది. కాని తెలసి ఉండక పోవచ్చు. లేకపోతే ఈ పాటికి పెద్ద భూకంపం వచ్చి నా మీదకి పెద్ద దండయాత్ర వచ్చేది” అన్నాడు ఆయుష్.
“ఆయుష్ నువ్వు ఇంక వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఇంతవరకూ వచ్చిన మనం గెలవాలి. మీవాళ్ళని కూడా ఒప్పించి మనం పెళ్ళి చేసుకోవాలి. బహుశా ఇంతవరకు మీ దేశం వాళ్ళు యూరోపియన్సు ని, అమెరికన్సుని, ఆస్ట్రేలియా దేశం వాళ్ళని చేసుకుని ఉంటారు. నాలాంటి నల్లని బొగ్గుముక్కలాంటి ఆఫ్రికన్ ని చేసుకున్న మొదటి ఇండియన్ నువ్వేనేమో” అంది గుగు నవ్వుతూ.
“అవును బొగ్గుగారు... నిన్ను నీ రంగు గురించి మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అయినా వినవు” అన్నాడు ఆయుష్ కోపంగా.
“ఓహ్ సారీ... సారీ... ఇంకెప్పుడు అలా పిచ్చిగా మాట్లాడి నీకు కోపం తెప్పించను. ఇదుగో చెంపలు వాయించుకుంటున్నాను” అంటూ చెంపలు బాదుకుంది గుగు. అది వీడియో కాల్ లో ఉన్న ఆయుష్ కి కనిపించింది.
“గుగు ఇక ఆపు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు” అంటూ ప్రేమగా కసురుకున్నాడు.
“ఇందాకటి నుంచి అమ్మా, నాన్న... ఇప్పుడు నువ్వు... ఈవాళ తిట్ల డే అనుకుంటాను”
“ముద్దుల డే ముందు తిట్ల డే” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“ఆ డే ఎప్పుడు వస్తుందో గాని ప్రస్తుతం మీ వాళ్ళ తిట్లు ఎలా ఎదుర్కోవాలో అని భయపడుతున్నాను” అంది గుగు.
“నిన్ను ఏమీ తిట్టరులే. తిట్లు నాకు. రేపు పెళ్ళి అయ్యాక దీవెనలు నీకు... ఇక మెల్లిగా విషయం అమ్మా, నాన్నగారికి చెప్పాలి. నివేదిత సహాయం తీసుకోవచ్చు గాని... ఆ అమ్మాయి ఈ విషయంలో ఎంత వరకు సహకరిస్తుందో డౌట్ఫుల్. కాని శరణ్య మంచి మాటకారి, తెలివితేటలూ ఉన్న అమ్మాయి. ఎస్... శరణ్య హెల్ప్ తీసుకోవచ్చు” అన్నాడు ఆయుష్.
“ఏం. నీకు పడే తిట్లు దానికి పడతాయనా. పాపం” అని శరణ్య మీద జాలి చూపించింది గుగు.
“వాళ్ళందరూ నీ కోసం తిట్లే కాదు, దెబ్బలు కూడా తినడానికి సిద్ధం. అంతగా మెస్మరైజ్ చేసేసావు వాళ్ళని. అసలు పని అయ్యిపోయింది కనుక నువ్వు తొందరగా బయలు దేరి వచ్చేయ్. క్లాసులు బిగిన్ అయ్యిపోవచ్చు” అన్నాడు ఆయుష్.
“అవును. ఈవాళే టికెట్ బుక్ చేసుకుంటాను... కాని ఆయుష్ మా అమ్మా వాళ్ళతో ఇంకొన్నాళ్ళు ఉండాలని ఉంది... క్లాసులు ఇంకా మొదలు కాలేదు కదా... కొన్ని డుమ్మా కొట్టినా.. కవర్ చేసుకుంటాను” అంది గుగు.
“ఇప్పుడు సరే. రేపు పెళ్ళి అయ్యాక కూడా ఇలాగే ఉండిపోతానని బేరాలు పెడతావేమో!?” అన్నాడు ఆయుష్.
“అప్పుడు ఏమీ బేరాలు పెట్టను. నిన్నే వచ్చేయమంటాను” అంది గుగు నవ్వుతూ.
“నిన్నూ...” అంటూ ఒక ముద్దు ఇచ్చాడు ఆయుష్.
“ఒకటేనా...” అంటూ గారాలు పోయింది గుగు.
ఆ తరువాత కొన్ని నిమషాలపాటు ముద్దులవర్షం కురిపించేసాడు ఆయుష్.
“సరే క్లాసులు కరెక్ట్ గా ఎప్పుడు ప్రారంభం అవుతాయో కనుక్కుని ఫోన్ చెయ్యి. అప్పుడు నా జర్నీ ప్లాన్ చేసుకుంటాను. ఇంకో ముఖ్య విషయం. అన్ని ముద్దులు ఇప్పుడే ఇచ్చేయకు. కొన్ని దాచిపెట్టుకో. నేను వచ్చాక వాడవచ్చు” అంది గుగు. ఆ తరువాత గుగు ముద్దులు మొదలు పెట్టింది. అలా ఆయుష్, గుగు లు కనీసం రెండు గంటలపాటు వీడియో కాల్ లో ముద్దు ముచ్చట్లలో మునిగిపోయారు.
వాళ్ళకి టైం తో పని లేదు. వేరేవ్వరితో సంబంధం లేదు. వాళ్లిద్దరు ఇరవైనాలుగు గంటలు ఒకరికి ఒకరుగా బతుకుతున్నారు.
************
గుగు ఇండియా వచ్చిన మరునాడే ఆరవ సెమిస్టరు క్లాసులు మొదలు అయ్యాయి. విద్యార్థులకు తమ చదువులో చాలా ముఖ్యమైన దశ ప్రారంభం అయ్యింది. దానర్ధం తక్కిన సబ్జక్ట్స్ తక్కువ ఇంపార్టెంట్ అని కాకపోయినా ఇకనుంచి వాళ్ళు చదివేది ఒక డాక్టర్ గా వాళ్ళ వృత్తిలో ఎక్కువ, సన్నిహిత సంబంధం ఉన్నది.
మళ్ళీ మొదటిరోజు ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు ఉపన్యాసం అయ్యింది.
ఆ సెమిస్టరుకి ప్రారంభంలో విశేషమేమిటంటే ఇక ముందు ముందు వాళ్ళకి సబ్జెక్టులు చెప్పే స్టాఫ్ అందరిని పేరు పేరున విద్యార్ధులకి పరిచయం చేసారు. అది రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది. ఒకటి విద్యార్థులకు అందరూ తెలుస్తారు. రెండు విద్యార్థులకు టీచింగ్ స్టాఫ్ అంటే భయం, బెరకు పోయి, వాళ్ళతో ఫ్రీగా మూవ్ అయి సబ్జెక్టు తెలుసుకోవడంలో ఉపయోగ పడుతుంది.
మెడిసిన్ ప్రోఫ్ఫెసర్, సర్జరీ ప్రోఫ్ఫెసోర్, గైనికాలోజి ప్రోఫ్ఫెసోర్ కూడా విద్యార్ధులని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది.
ఆ సాయంత్రం ఆయుష్ మిత్ర బృందం ఆయుష్ రూమ్ లో కలిసింది .
“అమ్మా గుగు తల్లీ! మొత్తానికి మా ఆయుష్ ని బుట్టలో వేసేసావు. నీ తల్లిదండ్రులను బెదిరించేసావు. ఇక కాబోయే అత్త, మామలను కూడా ఒక అట ఆడించేస్తే నీకు అడ్డు లేదు” అంది శరణ్య.
“శరణ్య... మనం ఏదో ముందున్నామని అనుకున్నాంగాని, ఈ గుగు ఆయుష్ లు మనకన్నా ముందు పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని వాళ్ళని కూడా క్లాసులకు తీసుకు వచ్చేలా ఉన్నారు“ అంది హసిత దిగులుగా ఉన్నట్టు నటిస్తూ.
“పోనీలే హసిత! మనం వాళ్ళ మనుమలతో చదవకుండా చూసుకో. మెడిసిన్ ప్రోఫ్ఫెసర్ కర్కోటకుడుట. ప్రతీ స్టూడెంట్ ని మూడుచెరువుల నీళ్ళు తాగిస్తాడట. ఒక పట్టాన ఎవ్వరిని పాస్ అవ్వనివ్వడుట. తన కాలేజీడేస్ లో తనని అలాగే ఏడ్పించిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాడట.” అంది స్నేహ.
“ఆ... ఏదో అనుకుంటాం గాని, మనల్ని ఏడిపించాలనే కోరిక ఎవరికి మాత్రం ఎందుకుంటుంది?” అన్నాడు ఆయుష్.
“ఆయుష్ నీకు తెలియంది ఏముంది. మన ఫీల్డ్ లో కొంతమంది అమ్మాయిల శీలం అర్పిస్తే గాని పాస్ చేయని మహానుభావులు ఉన్నారని విన్నాను” అంది శరణ్య.
“ఏదో... ఒకరో ఇద్దరో ఉండొచ్చు. అయినా అలాంటే వేషాలు మనదగ్గర ఎవరైనా వేస్తే చర్మం వలిచి చేతులో పెడతాం” అన్నాడు ఆయుష్.
“అంతే కాదు బోడిగుండు గీయించి గాడిద మీద ఊరేగిస్తాం” అంది హసిత.
“అయితే మనం ఈనెల నుంచి డబ్బులు సేవ్ చేసి గాడిద కొనడానికి దాచాలి” అంది స్నేహ.
అందరూ ఫక్కున నవ్వారు .
“సరే... వేళాకోళాలకి ఏం గాని, ఈ రోజునుంచి మనం అందరం ఇంకా ఎక్కువ కష్టపడాలి. మన పేరెంట్స్ మనకోసం కన్నకలలు తీర్చాలి. వారి ఆశలకు మనం జీవం పోయాలి” అన్నాడు ఆయుష్.
“నువ్వు, గుగు కలిసి మీ తల్లిదండ్రులకు వాళ్ళ కలలు ఈస్ట్మన్ కలర్ లో చూపించేసారు” అంది శరణ్య.
“అదేమిటి శరణ్య! అలా అంటావు!? మేము ఏమి తప్పు చేయలేదుకదా. ప్రేమించుకోవడం తప్పా!?. ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం తప్పా!?” అని సీరియస్ గా అడిగింది గుగు.
***********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో