Vijaya Lakshmi
Published on Nov 08 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“గుగుతల్లి కెన్యా వెళ్ళి వచ్చాక కొత్త తెలివితేటలూ, కొత్త మాటలు చాలా నేర్చేసుకుంది. నిన్ను ఏమీ అనటల్లేదు మహారాణి... ఏదో సరదాకి అంటున్నాను అంతే. టేక్ ఇట్ ఈజీ” అంది శరణ్య నవ్వుతూ.
“గుగు ఎందుకంత సీరియస్ అవుతావు. శరణ్య ఏదో జోక్ గా అంది” అన్నాడు ఆయుష్.
“గుగు. ఏదో ఎవరో సరదాకి అంటుంటాం. జస్ట్ టూ లైటేన్ అవర్ టెన్షన్. నువ్వు మరీ ఆయుష్ కూచివి అయిపోయే మమ్మల్ని అందరని వదిలి పెట్టేసేలా ఉన్నావు. మేము అందరం కుడా నీ పాత ఫ్రెండ్స్ మేనమ్మా” అంది హసిత.
“గుగు! నవ్వు… నవ్వు... ఈ ఆదివారం నువ్వు మా అందరికి పెద్ద పార్టీ ఇస్తున్నావు. ఎస్! అంతే” అంటూ గుగు భుజాలు పెట్టి కుదపసాగింది స్నేహ.
గుగు నవ్వడం మొదలు పెట్టింది.
“హమ్మయ్య... పాపం ఆయుష్ కి రాబోయే కష్టాలని తలుచుకుంటుంటే జాలి వేస్తోంది” అంది శరణ్య.
“ఏం?” అంది హసిత .
“ఈ గుగు మహారాణిగారి అలకలకు పాపం ఎలా వేగుతాడో!?” అంది శరణ్య గెడ్డం కింద చెయ్యి పెట్టుకుని.
“శరణ్య... నిన్ను...” అంటూ శరణ్యని కొడుతున్నట్టు ఆక్షన్ చేస్తూ పకపకా నవ్వసాగింది గుగు.
“తుఫాను వెలిసింది... ఇక లెట్ అస్ రిలాక్స్” అంది హసిత.
“నీ పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తాను” అంది హసిత గుగు వైపు చూపుడు వేలు చూపుతూ.
“నా పెళ్లికా... నువ్వు ఇద్దరు పిల్లల తల్లిగా... ఉంటే ఇంకొకళ్ళని కడుపులో పెట్టుకు వస్తావు. అప్పుడు నన్ను ఏం చేయగలవు... అంత వరకు నా పెళ్ళి కాదు” అంది హసిత.
“అమ్మాయిలు ఇక ప్రేమలు, పెళ్ళిళ్ళు కబుర్లు ఆపి, కాస్త చదువు మీద దృష్టి పెట్టండి... లేకపోతే మా జువాలజీ రీడర్ చెప్పినట్టు కంపౌండర్లు అయిపోతారు” అన్నాడు ఆయుష్.
“ఎవరా జువాలజీ రీడర్? ఏమా కధ?” అంది గుగు.
“మాకు ఇంటర్మీడియట్ లో ఒక జువాలజీ రీడర్ ఉండేవాడు. ఆయన ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంలో అనేవాడు ‘బైపీసీ గ్రూప్ లో చేరిన వాళ్ళు అందరూ డాక్టర్ లు అయిపోయామనుకుంటారు. ఇప్పుడు తెలుస్తది ఎంతమంది డాక్టర్ లు అవుతారో ఎంతమంది కంపౌండర్లు అవుతారో అని” అన్నాడు ఆయుష్ .
“మనం మెడిసిన్ కోర్స్ లో చేరిపోయాం కనుక చచ్చేలోపల డాక్టర్ అవుతాం. కంపౌండర్లు అయ్యే ఛాన్స్ లేదు” అంది అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న నివేదిత.
“చచ్చే లోపల ఎందుకు... ఒక ఏభై ఏళ్ళలో అయిపోతాం” అంది హసిత నవ్వుతూ. అందరూ ఆమె నవ్వుతో శ్రుతి కలిపారు.
“ఇంక మింగడానికి వెళ్ళి, ఆ కార్యక్రమం పూర్తిచేస్తే, కాస్త పుస్తకాలు దుమ్ముదులిపి రాబోయే యుద్ధానికి రెడీ అవ్వవచ్చు” అంది గుగు.
“ఆయుష్ మీ గుగు కి కష్టపడి తెలుగు నేర్పించాను. చూడు ఇప్పుడు ఎంత పండితురాలు అయ్యిందో. నువ్వు, నేను చేయలేని పద ప్రయోగం చేసేస్తోంది. నాకు ఏమి ఇస్తావో చూసుకో” “అంది హసిత.
“ఏదో ఒకటి ఇవ్వక తప్పదంటావా!?” అని అడిగాడు అయుష్.
“సరే... మా పెళ్ళి అయ్యాక నీకు ఒక మేనల్లుణ్ణి ఇస్తా. నీ కూతురికి వాణ్ణి కట్నం లేకుండా చేసుకోవచ్చు” అన్నాడు ఆయుష్ మళ్ళీ.
“అనుమానం లేదు. ఇవి నీ బుద్ధులు కాదు. గుగు నీకు నేర్పించినవే” అంది హసిత .
“ఏమైనా గుగు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. అంత తెలివైన ఆయుష్ ని బుట్టలో చాలా తేలిగ్గా పడేసావు” అంది శరణ్య.
“శరణ్య... ఇలా మనం మాట్లాడుతుంటే మెస్ తలుపులు, తాళాలు కూడా వేసేస్తారు. ఇంక నీళ్ళు తాగి ఈ రాత్రంతా చెక్క భజన చెయ్యాలి” అంది స్నేహ.
“పదండి” అంటూ అందరినీ లేవదీసింది హసిత .
అందరూ నడుచుకుంటూ మెస్ వైపు వెళ్ళసాగారు.
స్నేహ చెప్పినట్టే ఇంకొక్క పావు గంట అయితే మెస్ తలుపులు మూసివేసే వారే!?
********************
క్లినికల్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. చలి తగ్గు మొఖం పట్టి వాతావరణం మెల్లిగా వేడెక్కడం ప్రారంభించింది. విద్యార్థులకు చదువులో వాతావరణం వేడిగా అనిపిస్తోంది. ఆయుష్ ఫ్రెండ్స్ అనుకున్నట్టు మెడిసిన్ ప్రోఫెసర్ పరమేశం చండశాసనుడు కాదు. చాలా మంచివాడు. చక్కగా చదువుకునే విద్యార్ధులకి ఆయన దేవుడే. కాకపోతే అల్లరి చిల్లరిగా ఉంటూ, చదువు పట్ల శ్రద్ధ చూపని వాళ్ళకి ఆయన యమధర్మరాజు!?
అలాగే సర్జరీ ప్రోఫ్ఫెసర్ వివేక్, అసిస్టెంట్ ప్రోఫ్ఫెసర్ లు మంచివాళ్ళే. గైనికాలోజి ప్రోఫ్ఫెసర్ ఛాయాదేవి మాత్రం సినిమాలో ఛాయాదేవిని గుర్తుకు తెస్తుంది. అమ్మాయిల పట్ల మరీ నిర్దయగా ఉంటుంది.
ఆ ఆదివారం పార్క్ మీటింగ్ లో ఆయుష్ మిత్రబృందానికి ఆవిడే డిస్కషన్ టాపిక్ అయ్యింది.
“ఛాయా మేడం సినిమాలలో సూర్యాకాంతం, ఛాయాదేవిల మిక్స్చర్. ఆమ్మో! ఆ ముఖమే భయంకరంగా ఉంటుంది. మొన్న ఫైనల్ సెమిస్టరు అమ్మాయి, అబ్బాయి ఎవరితోనో అర్థరాత్రి వేళ ఆవిడ కంటపడిందట. అసలు ఆ రాత్రివేళ వరకు ఆవిడ ఎందుకు ఉండిపోయిందో తెలియదు. కాని మరునాడు ఆ అమ్మాయిని ,అబ్బాయిని అందరిలో పెట్టి మోహం వాచేటట్టు చివాట్లు పెట్టిందట“ అంది శరణ్య.
“ఆ రోజు ఏదో హైలీ కాంప్లికేటేడ్ కేసు వచ్చిందట. మేడం లేట్ ఇన్ ది నైట్ ఉండిపోయారుట. అసలు ఆ అబ్బాయి, అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిదికాదట” అంది గుగు.
“నీకూ ఇవన్నీ ఎలా తెలుసు!?” అని అడిగింది హసిత.
“నిన్న మెస్ లో నా పక్కన కూచున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చెప్పుకుంటుంటే విన్నాను” అంది గుగు.
“చూసారా మనం అందరినీ దుర్మార్గులు అనుకుంటాం. కాని మా నాన్నగారు అంటూ ఉంటారు “డోంట్ సీ థింగ్స్ థ్రూ కలర్ గ్లాసెస్” అని. ఇప్పుడు అదే నిజమయ్యింది. ఎక్కడో ఉన్నారని మనం మన టీచర్స్ ని దుర్మార్గులు, దుష్టులు అనుకోకూడదు. అసలు అలా అనుకోవడం వల్ల మనకే నష్టం. వచ్చీ చదువు కూడా రాదు” అన్నాడు ఆయుష్.
“నిజమే... అదీకాక మెడికల్ కాలేజీ లోనూ, ఇంజనీరింగ్ కాలేజీ లోనూ, టీచింగ్ స్టాఫ్ లో, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు దురభిప్రాయాలు ఎక్కువట. మా అన్నయ్య అంటూ ఉంటాడు” అంది స్నేహ.
“అయినా ఎవరు ఎలాంటి వాళ్ళయితే మనకు ఏమిటి? మన చదువు మనం చదువుకుంటాం. మన పరీక్షలు మనం పాస్ అవుతాం” అంది నివేదిత.
“కరెక్ట్ నివేదితా. మన ఇక్కడకి ఎందుకు వచ్చాం అన్నది మనం జాగ్రత్తగా గమనించుకుని, మన చదువు మనం చూసుకుని పోతే ఏ గొడవా ఉండదు” అన్నాడు ఆయుష్ .
“దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది” అంది శరణ్య గంభీరంగా మోహం పెట్టి.
“ఏమిటి అది!?” అని అడిగాడు ఆయుష్.
“గుగు ని ప్రేమించడం” అంటూ ఫక్కున నవ్వింది శరణ్య. మిగిలిన అందరి మొహాల్లో నవ్వులు విరిశాయి.
“యు నాటి గర్ల్” అంది గుగు.
“నైస్ విషయాలు మాట్లాడే వాళ్ళందరని నాటి అంటే ఎలా?” అంది శరణ్య.
“అందరినీ నేను అనడం లేదే. నువ్వు మాత్రం చాలా నాటి అండ్ మిస్చివస్ పర్సన్” అంది గుగు.
“ఆయుష్ మీ గుగు...” శరణ్య మాటలకు మధ్యలో అడ్డు వచ్చాడు ఆయుష్.
“మీ గుగు ఏమిటి? మన గుగు” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“పోనీలే మన గుగు మేడం గారే” అంది శరణ్య.
“అదిగో మళ్ళీ...” ఈసారి గుగు అందుకుంది.
“మన గుగు సూదిలా వచ్చి దబ్బనంలా కాదు... గునపంలా అయిపోయింది” అంది శరణ్య నవ్వుతూ.
“ఏదైనా మనం భరించాల్సిందే” అంది నివేదిత.
“భరించక చస్తామా తల్లీ. అందులోనూ గుగు ని ఏమైనా అన్నామంటే ఆయుష్ వీపు పగలగొడతాడు” అంది శరణ్య భయం నటిస్తూ.
“అందరూ నేను, గుగు అంటే అంత భయపడి పోతున్నారా?” అన్నాడు ఆయుష్.
“నువ్వు అంటే భయం లేదనుకో... కాని గుగు...” అంటూ, గుగు కొట్టే దెబ్బలు తప్పించుకోడానికా అన్నట్టు, గుగు కి చేతులు అడ్డం పెడుతూ దూరంగా జరిగింది హసిత.
పైకి ఎవరు ఏమన్నా, వాళ్ళ మనస్సులు, భావాలూ తెలిసిన గుగు తనకి అంత మంచి స్నేహితులు దొరికినందుకు, ఉన్నందుకు లోలోపల ఎంతగానో సంతోషించింది.
“హసిత... మరీ అంత భయం నటించక్కర్లేదు” అంది గుగు హసిత నెత్తి మీద మొట్టినట్టు నటిస్తూ. అందరూ మనసారా నవ్వుకున్నారు.
“ఏదో ఈ కాసేపు నవ్వుకున్నాం. కాని మళ్ళీ రేపు క్లాసులు... హాస్పిటల్ పోస్టింగ్స్ తలుచుకుంటే గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి” అంది స్నేహ దిగులుగా.
“భయం ఎందుకు” అని అడిగాడు ఆయుష్.
“ఎందుకేమిటి... మెడిసిన్ అసిస్టెంట్ ప్రోఫ్ఫెసర్, ఒక పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి, సింటమ్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రోగ్నోసిస్ గురించి మాట్లాడుతూ సడన్ గా, ఎవరో ఒక స్టూడెంట్ ని పట్టుకుని, పలానా డ్రగ్ ఏక్షన్ ఏమిటి, వేరే మందులతో ఇంటర్ ఏక్షన్ ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, వాటి మేనేజ్ మెంట్ ఏమిటి, కాంట్రా ఇండికేషన్ ఏమైనా ఉందా... అని డీ.ఏం. స్టూడెంట్ ని అడిగినట్టు అడిగేస్తున్నాడు” అంది స్నేహ.
“అంటే నువ్వు ఫార్మకోలోజి అనే సబ్జెక్టు ఎప్పుడన్నా చదువుకున్నావో లేదోనని తెలుసుకుందుకు. మనకు గంటక్రితం చదువుకున్నదే గుర్తు ఉండదని పాపం ఆయనికి తెలియదు” అంది హసిత నవ్వుతూ.
“మరి ఆ విషయం తెలిసి ఎందుకు అడగాలి?” అంది స్నేహ.
“రేపు నువ్వు డాక్టర్ అయ్యాక ట్రీట్ చేయబోయే పేషెంట్ కి ఆ విషయం తెలియదు కదా. అందుకుని అడుగుతున్నాడు ఆయన” అంది నివేదిత.
“అయినా మనం ముందు ఒకసారి అనుకున్నాం మెడిసిన్ లో చదివినవి అన్నీ మన జీవితాంతం గుర్తు ఉండాలి అని” అన్నాడు ఆయుష్.
“నిజమే” అంది గుగు.
“అసలు మనం మెడిసిన్ చదువులోకి అడుగు పెట్టామంటే మన జీవితం ప్రజాసేవకి అంకితం అని. అంతే కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు పేషంట్లని రెఫెర్ చేసి, లాబ్స్ కి టెస్ట్లు రాసి కమిషన్ తీసుకోవడం కాదు“ అంది నివేదిత.
“అంటే నీ ఉద్దేశ్యం మనం ఫ్రీ సర్వీస్ చెయ్యాలనా?” అంది స్నేహ.
“అని కాదు. ఏ వృత్తిలోలాగే మన వృత్తిలో కూడా మనం పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం తీసుకోవచ్చు. కాని కష్టపడకుండా కమిషన్, దొంగ వైద్యం చేసి, అనవసర ఆపరేషన్లు చేసి అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు. మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకుంటే అసలు అన్యాయంగా ఒక రూపాయ కూడా సంపాదించం. భగవంతుడు తనకు మారురూపంలో మనలని సృష్టించి, రోగులకు సేవ చేసే, రోగుల బాధలను తగ్గించే. రోగులను ఎన్నో విపత్కర పరిస్థుల నుంచి బయటకు తెచ్చే, బతికించే శక్తి మనకు ఇచ్చాడు. అటువంటి వరం పొందిన మనం ధన పిశాచులలా మారి జనంని దోచుకు తినడం అత్యంత హేయం, అమానుషం” అంది నివేదిత ఆవేశంగా.
“నివేదితా నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం. మనం డాక్టర్ అయినందుకు జీవితం సార్ధకం చేసుకోవాలి. నేను మా దేశం లో మా నాన్నగారి బిజినెస్ లో లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. కాని నాకు డాక్టర్ అయ్యి ప్రజల సేవ చెయ్యడం ఇష్టం. అందుకని ఇంత దూరం వచ్చి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదువుకుంటున్నాను. నివేదిత అన్నట్టు అన్యాయంగా ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు” అంది గుగు.
“ఇక్కడకు వచ్చి వందలకోట్లు పెట్టినా పొందలేని మా ఆయుష్ ని పొందావు కదా. అది న్యాయమా? అన్యాయమా ?” నవ్వుతూ అడిగింది శరణ్య.
“అతన్నే అడుగు” అంది గుగు సిగ్గు పడుతూ.
“ఇంక ఏమిటి అతన్ని, నన్ను అడిగేది. జాక్ పాట్ కొట్టేసి ఏమీ ఎరుగని నంగనాచిలా ఎన్ని కబుర్లు చెపుతున్నావు” అంది శరణ్య.
“ఎవరికి, ఎవరికీ ఏ బంధమో రాసి ఉంచాడు విధి ఎప్పుడో” అంటూ పాడసాగింది హసిత.
“హసితమ్మా... నువ్వు ఆ పాటలు చదవడం ఆపితే కాస్త మేం ప్రశాంతంగా బతకగలం” అంది స్నేహ.
“హసిత పాటలు చాలా బాగా చదవగలదు. నువ్వూ,నేను చదవగలమా?” అంది గుగు హసితని వేళాకోళం చేస్తూ.
“గుగు... ఒకసారి మీ ఆఫ్రికన్ పాటలు చదవగలవా... అదే పాడగలవా అని అడిగింది శరణ్య.
“నాకు పాటలు రావు శరణ్య” అంది గుగు.
“నీకు పాటలు రాకపోతేనేలే ఆయుష్ తో సహా అందరిని అడిస్తున్నావు” అంది శరణ్య .
“అసలు విషయం ఎక్కడి నుంచో ఎక్కడకో వెళ్ళిపోయాం. ఇంతకు మా పోఫెస్సాసురుడిని ఎలా ఎదుర్కోవాలో ఒక్కరూ చెప్పి చావడం లేదు” అని విసుక్కుంది స్నేహ.
“వన్ పాయింట్ ఫార్ములా... కష్టపడి చదువుకోడమే” అని తేల్చేసింది హసిత.
“హసిత చెప్పిందే కరెక్ట్ స్నేహా” అన్నాడు ఆయుష్.
“అయ్యో.. మీ జువాలజీ రీడర్ చెప్పినట్టు కంపౌండర్ లేక నర్స్ అయినా బాగుందేది” అంది హసిత తల మీద చేతులు వేసుకుంటూ.
“చేతులు కాలాక ఆకులు పట్టుకేంటే లాభం ఏముంది” అంది గుగు.
“ఆకులు కాదు గుగు... తల పట్టుకుంటాను” అంటూ గుగు తల అందుకోబోయింది స్నేహ. గుగు స్నేహకి దొరక్కుండా పారిపోయింది. స్నేహ పరుగు అందుకునేసరికే గుగు పార్క్ కి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతైనా ఆఫ్రికన్ పిల్ల !!??.
***********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో