Vijaya Lakshmi
Published on Nov 09 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“ఏమిటిరా నువ్వు అనేది!!?? అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా!!?” అంటూ కళ్ళల్లో అగ్ని జ్వాలలు కురిపిస్తూ గట్టిగా అరిచింది ఆయుష్ తల్లి సీత.
“సీతా అంత గట్టిగా అరవకు చుట్ట పక్కల వాళ్ళు వింటారు.” అన్నాడు జగన్నాధం సీత ని శాంత పరిచే ధోరణిలో .
“వింటే విననివ్వండి. అయినా మీరు వాడికి బుద్ధి చెప్పాల్సిందిపోయి నా నోరు నొక్కేస్తారేం!?” అంటూ ఇంకా గట్టిగ అరిచింది.
జగన్నాధం కంగారుగా వీధి తలుపులు వేసేసి, సీతని భౌతికంగా బెడ్ రూమ్ లోకి లాక్కుపోయాడు.
“నా నోరు కాదు. పీక నొక్కేయండి .పీ డా వదిలిపోతుంది“ అంది సీత పొగలు కక్కుతూ.
“సీతా... కంగారు పడకు. కాస్త ఆగు. కొంచం నెమ్మదిగా ఆలోచించుకుని, మాట్లాడుకుంటే మంచిది” అన్నాడు జగన్నాధం.
“ఇంకా కంగారు అంటారేమిటండీ!? వాడు ఎంతకు తెగించాడో విన్నారా? అసలు తల్లిదండ్రులు బతికి ఉన్నారనుకున్నడా లేకపోతే చచ్చారనుకున్నాడా?” సీత కంఠంలో కోపం ఏ మాత్రం తగ్గలేదు.
“నువ్వు ముందు కూచో. ఇదుగో మంచి నీళ్ళు తాగు” అంటూ ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ సీత కి అందించాడు జగన్నాధం.
“నాకు మంచి నీళ్ళు కాదు. ఇంత విషం ఇవ్వండి. తాగి హాయిగా చస్తాను. తరువాత ఎవరి ఇష్టం వాళ్ళది” అంది సీత.
“సీతా... పాపం ఆయుష్ పెళ్ళి ప్రస్తావన తెస్తే నువ్వు చావు అంటావేమిటి? పండగ పుటా ఏమిటి సీత ఆ మాటలు?” అన్నాడు జగన్నాధం.
“వాడు ఆ పెళ్ళి చేసుకోకముందే నేను చస్తాను. అప్పుడు మీరు ఆ పెళ్ళిచేసి కొడుకు, కోడలితో హాయిగా ఉందురు గాని” అంది సీత కోపంగా.
“ఇది బావుంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావేమిటి? నువ్వు కొంచం కూల్ అవ్వు. అన్ని విషయాలు నేను మాట్లాడుతాను” అన్నాడు జగన్నా ధం.
జగన్నాధం ఎంత సమాధాన పరచడానికి ప్రయత్నించినా సీత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
జగన్నాధం ఉదయం నుంచి జరిగిన విషయాలు నెమరు వేసుకున్నాడు. ఆ ఉదయం ఆయుష్ వచ్చాడు. అతనిని చూడగానే సంతోషంతో మోహం వెలిగిపోయింది అతని తల్లి సీతకి.
“ఏరా ఆయుష్ ఎలా ఉన్నావు? బాగా చిక్కిపోయావు. నీకు ఆ హాస్టల్ గడ్డి పడినట్టు లేదు. కనీసం పళ్ళు తింటున్నావా?” అని ఆప్యాయంగా అతనిని పలకరిచింది.
“నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు నాన్నగారు ఎలా ఉన్నారు?” అని అడిగాడు ఆయుష్.
“ఏరా చెప్పా చేయకుండా వచ్చావు. పరీక్షలు అయిపోయాయా? ”అంటూ ప్రశ్నించాడు తెల్లవారు జాముననే ఎక్కడకో వెళ్ళి అప్పుడే బయటి నుంచి లోపలకి వచ్చిన జగన్నాధం.
“పరీక్షలు అవలేదు నాన్నగారు. ఇంకా ఇప్పుడే కదా ఆరవసెమిస్టరు మొదలయ్యింది. ఉగాదికి కాలేజీ వాళ్ళు రెండు రోజులు సెలవ ఇచ్చారు. ఇంకో రోజు ఆదివారం కలిసి వచ్చింది. నిన్ను, అమ్మని చూసి పోదామని వచ్చాను. నాతో పాటు నివేదిత, ఇంకో ఇద్దరూ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు నివేదిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు“ అన్నాడు ఆయుష్.
“ఏం వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకు రాలేకపోయవా?’ అన్నాడు జగన్నాధం.
“కొంచం మొహమా పడ్డారు నాన్నగారు” అన్నాడు ఆయుష్.
“ఒరేయ్ ఆయుష్ మోహం కడుక్కో. హాయిగా తలంటుకుని ఉగాది పచ్చడి తిందువు గాని” అంటూ కొడుకికి వేడినీళ్ళు రెడీ చేయడానికి లోపలకు వెళ్ళింది సీత.
ఆయుష్ స్నానం చేసి వచ్చి, దేవునికి దణ్ణం పెట్టుకుని, హాల్లో కూచున్నాడు.
సీత ఉగాది పచ్చడి భర్త కి, కొడుక్కి పెట్టింది. ఆతరువాత జగన్నాధం, ఆయుష్ లు టిఫిన్ చేసారు .
ఆ తరువాత తండ్రి తో ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు ఆయుష్.
అక్కడ తండ్రి కొడుకులు మాటలలో పడ్డారు. మెల్లిగా ఆయుష్ తను గుగు ని ప్రేమిస్తున్నానని, ఆ విషయం అమ్మతో చెప్పి ఎలాగైనా ఒప్పించమని తండ్రిని వేడుకున్నాడు. తమ బంధం ఎప్పడినుంచి ఎలా అభివృద్ధి చెందుతూ వస్తోందో వివరించాడు. తను… గుగు, తనని ప్రేమిస్తోందని చెప్పాక, ఎంత ఆలోచించాడో, తర్జన బర్జన పడ్డాడో తండ్రికి తెలియజేసాడు. తనని ప్రేమించే అమ్మాయి ఎంత మంచిదో, వాళ్ళ కుటుంబం కూడా ఆ దేశంలో ఎంతటి పరువుమర్యాదలు కలదో విపులీకరించాడు. దాదపు రెండు గంటలు తనగురించి. గుగు గురించి, గుగు కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు ఆయుష్.
జగన్నాధం కొడుకు చెప్పిందంతా ఓపికగా విన్నాడు. “ఆయుష్ .మన కుటుంబం గురించి, మన పరువు ప్రతిష్టలు గురించి నీకు తెలుసు. మన బంధువర్గాలలో, స్నేహితులలో మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలో నీకు తెలియంది కాదు. ఇప్పుడు నువ్వు ఎవరో జాతి, కులం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించు. నిజానికి నాకు ఈ కుల, మతాల మీద నమ్మకం లేదు. కాని అమ్మని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. నీ పరిస్థితి నాకు అర్థం అయ్యింది. ఇరవయి ఏళ్ళు నువ్వు మా దగ్గర పెరిగావు. కనీసం డెబ్బయి, ఎనభయి ఏళ్ళు భార్య తో గడపాలి. నీకు మాతో గడిపిన జీవితం కన్నా ముందు ఉన్న జీవితమే ఎక్కువ. కాని నవమాసాలు మోసి, కని,ని న్నుకంటికి రెప్పలా కాపాడిన మీ అమ్మ ని సంతోష పెట్ట వలసిన భాధ్యత నీ పై ఉంది.”
“నాన్నగారు... నేను ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. అమ్మని కష్ట పెట్టడం, బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు... మిమ్మల్ని ఇద్దరినీ సమాధానపరిచి ఈ పెళ్ళి చేసుకోవాలనేది నా ఉద్దేశ్యం“
అన్నాడు ఆయుష్.
“అంటే వెంటనే పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగాడు జగన్నాధం.
“లేదు” అన్నాడు ఆయుష్ .
“మరి కంగారుపడి ఇప్పుడే చెప్పేయడం ఎందుకు!?” అన్నాడు జగన్నాధం.
“నాన్నగారూ... పాపం ఆ అమ్మాయి వైపు నుంచి కూడా మనం కొంచం ఆలోచించాలి కదా. ఎక్కడి నుంచో వచ్చింది. మరి నాలో ఏమి నచ్చాయో నేనంటే ఇష్టపడింది. నన్ను ప్రేమించింది. ఆ విషయమే నాతో చెప్పింది నేను మీకు ఇందాక చెప్పినట్లు నా డెసిషన్ తీసుకునే ముందు ఎన్నోవిషయాలు, ఎంతో దీర్ఘంగా ఆలోచించాను. విషయాలను విశ్లేషించాను. ఎంతో సమయం ఎన్నో విషయాలను గురించి వెచ్చించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. నేను గుగు ని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను నాన్నగారు” అన్నాడు ఆయుష్.
జగన్నాధం ఏదో ఆలోచిస్తూ కూచున్నాడు .సమయం గడుస్తూనే ఉంది. కొంత సేపటికి జగన్నాధం మాట్లాడాడు.
“ఆల్రైట్... నువ్వు ఇంత అలోచించి నిర్ణయం తీసుకున్న తరువాత నేను కాదనను. అసలు మాకు చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే మేము ఏం చేయగలం. లేకపోతే ఆ సహాజీవనమో, నా పిండాకుడో అంటే ఏం చేస్తాం. నువ్వు మా గౌరవాన్ని మాకు ఇచ్చావు. నా తరఫు నుంచి నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి గుగు ని పెళ్ళి చేసుకోవడం నాకూ ఎటువంటి అభ్యంతరం లేదు” అన్నాడు జగన్నాధం.
“థాంక్స్ నాన్నగారు... చాలా థాంక్స్” అన్నాడు ఆయుష్ ఉద్వేగంగా.
“నువ్వు అమ్మని కన్విన్సు చెయ్యాలి... నువ్వు జాతి, మత, కుల... దేశ బేదాలు లేకుండా గుగు ని పెళ్ళి చేసుకుంటున్నందుకు నేను గర్వ పడుతున్నాను. నిన్ను అభినందిస్తున్నాను. ఐ ఏం రియల్లీ ప్రౌడ్ అఫ్ యు మై బాయ్” అని కొడుకుని అభినందిస్తూ, చెయ్యి అందించాడు.
“థాంక్స్” అంటూ తండ్రికి పాదాభివందనం చేసాడు ఆయుష్.
“ఓకె.ఒక చిన్న పర్వతం ఎక్కావు. ఇంక ఎవరెస్ట్ ఎక్కాల్సి వుంది... అమ్మను ఒప్పించు... బెస్ట్ అఫ్ లక్ అన్నాడు” జగన్నాధం.
“మీరు నాకు అండగా ఉంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నాకు ఉంది నాన్నగారు” అన్నాడు ఆయుష్. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. సీత ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఆయుష్ అన్ని పదార్థాలు కొసరి, కొసరి తినిపించింది.
సాయంత్రం టీ తాగి హలో కూచున్నారు జగన్నాధం, సీత,ఆయుష్.
తండ్రి కేసి రెండుమూడు సార్లు చూసి, తల్లికేసి చూసి ఏదో చెప్పబోయాడు ఆయుష్. మళ్ళీ ఆగిపోయాడు.
ఆయుష్ ఇబ్బందిని గ్రహించాడు జగన్నాధం.
“సీతా అబ్బాయి నీతో ఏదో మాట్లాడుదామని అనుకుంటున్నాడు” అన్నాడు జగన్నాధం.
“ఏమిటి కన్నా !? నువ్వు నాతో మాట్లాడడానికి మీ నాన్నగారి రికమండేషన్ కావాలా1?” అంది సీత నవ్వుతూ.
“అమ్మా... అదే నా పెళ్ళి గురించి మట్లాడుదామని...” నసిగాడు ఆయుష్.
“దానికి అంత సంకోచం ఎందుకురా!? ఏం ఇప్పుడే నివేదిత అమ్మ రమ కి ఫోన్ చెయ్యమన్నావా?” అంది సీత ఉత్సాహంగా.
*********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో