Vijaya Lakshmi
Published on Nov 10 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“ఆవిడకి అక్కర్లేదు...” అన్నాడు ఆయుష్ ఏటో చూస్తూ.
“పోనీ నాన్నగారిని నివేదిత వాళ్ళ నాన్నగారికి... అదే వినోద్ గారికి, ఫోన్ చెయ్యమన్నా!?” అని కొడుకుని అడిగింది సీత .
“అదేమీ అక్కర్లేదు” అన్నాడు ఆయుష్.
“అంటే ...అంటే !!?? మాకు చెప్పకుండా నువ్వు, నివేదిత పెళ్ళి చేసుకున్నారా ఏమిటి!?” అంది సీత తన్నుకొస్తున్న ఉత్సాహంతో కూడిన ఆత్రుతతో.
“ఇంకా నాకు ఇరవై ఒకటి నిండలేదమ్మా. అప్పుడే పెళ్ళి ఎలా చేసుకుంటాం?’ అన్నాడు ఆయుష్.
“మరి విషయం ఏమిటిరా!?’ అని ఆతృతగా అడిగింది సీత.
“అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా” అన్నాడు ఆయుష్ మెల్లిగా తల దించుకుంటూ.
“ప్రేమించావా!!?? అంటే నివేదితని పెళ్ళి చేసుకోవా!!??” అంది సీత ఆశ్చర్యంగా మోహంపెట్టి.
“అవునమ్మా. నేను మా కాలేజీలో నాతో చదువుతున్న అమ్మాయిని ప్రేమించాను” అన్నాడు ఆయుష్ .
“ఎవరా అమ్మాయి!? మన వాళ్ళేనా?” అని అడిగింది సీత.
“అమ్మాయి పేరు గుగు. ఆఫ్రికా నుంచి చదువుకోడానికి వచ్చింది. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం” అన్నాడు ఆయుష్.
అంతే… ఫస్ట్ స్టేజిలో రాకెట్ లా మండిపోయింది సీత.
ఆ తరువాత పెద్దగ అరవడం మొదలుపెట్టింది సీత.
********
మళ్ళీ వర్తమానం లోకి వచ్చాడు జగన్నాధం .
“ఆయుష్ నువ్వు ఈ పెళ్ళి చేసుకోదలచుకుంటే ముందు నా తద్దినం పెట్టి పెళ్ళిపీటల మీద కూచో ” అంది సీత .
“సీతా... నీకు ఎన్నిసార్లు చెప్పాలి... పండగ పూటా ఏమిటి ఆ మాటలు?” కసురుకున్నాడు జగన్నాధం.
“నాకు ఇంక పండగా లేదు. పబ్బం లేదు. అసలు దాన్ని ఎవత్తినో తీసుకువచ్చాక నాకు పండగ ఏమిటి? తద్దినం కూడా పనికి రాదు” అంటూ ఏడవసాగింది సీత.
“అమ్మా! రేపు ఆ అమ్మాయి మనింటికి వస్తుంది. గుగు ని నువ్వు ఇంతకుముందే చూసావు గుర్తుందా?” అని అడిగాడు ఆయుష్.
“ఎందుకు గుర్తులేదురా. బొగ్గులా తళతళ మెరిసిపోయింది కదా” అంది సీత వ్యంగంగా.
తన కాబోయే భార్య గురించి తల్లి అలా మాట్లాడడం బాధ అనిపించింది ఆయుష్ కి. కాని వెంటనే మాములు అయ్యాడు. తల్లి దగ్గర నుంచి ఇలాంటి స్పందన ఉంటుందని అతను ముందే ఊహించాడు.
“అమ్మా ఆ అమ్మాయి కూడా ఒక తల్లి కన్నదే. అ అమ్మాయి తల్లిదండ్రుల ముద్దులకూతురే. అంత అన్యాయంగా మాట్లాడకూడదమ్మా” అన్నాడు అయుష్.
“చాలా బాగుందిరా, నాకు నీతులు చెపుతున్నావా? గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని” అంది సీత కోపంగా. అసలు ఆయుష్ తన సంగతి చెప్పినప్పడినుంచి ఆవిడ కోపంతో ఊగిపోతూనే ఉంది.
“సరే అమ్మా! నేను బయటకు వెడుతున్నాన” అంటూ తల్లి రియాక్షన్ కోసం ఎదురుచూడకుండా బయటకు వెళ్ళిపోయాడు ఆయుష్.
అతను తిన్నగా నివేదిత ఇంటికి వెళ్ళాడు. అక్కడ నివేదిత, శరణ్య, గుగు అతని రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జరుగుతున్న, జరగబోయే విషయాలు ఫోన్ లో మాట్లాడుకునేవికాదని వాళ్ళకి తెలుసు.
“ఏమయ్యింది ఆయుష్?” అని అడిగింది నివేదిత.
“నాన్నగారు కొంతసేపటికి కన్విన్స్ అయ్యారు. కాని అమ్మ మాత్రం మనం ఊహించినట్టుగానే మండిపోతోంది” అన్నాడు ఆయుష్.
“‘ఓహో! అయితే ఆవిడని మనం మెల్లిగా కన్విన్స్ చెయ్యాలి” శరణ్య అంది.
“నివేదిత నీకు థాంక్స్ ఎలా చెప్పలోతెలియడం లేదు. నా మీద ఎన్నో అశలు పెంచుకున్నావు. నాకు ఎప్పుడూ నీమీద ఆ అభిప్రాయం లేదు. కాని నిన్ను కాదు అని అంటున్నానని తెలిసి కూడా నువ్వు ఎంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చావు.” అన్నాడు ఆయుష్.
“ఆయుష్... మనం ఒకదాన్ని కోరుకుంటాం. అది మనది అయితే మంచిదే. కానప్పుడు ఇంక అదే విషయాన్ని పట్టుకోకూడదు. నా ప్రేమ అంతే. నువ్వు నావాడివి కాదు అన్న తరువాత కొంతకాలం బాధ పడ్డాను. తరువాత నన్ను నేనే సమాధాన పరచుకున్నాను. ఘంటసాల గారి పాట గుర్తుందా ఆయుష్. ’అనుకున్నామని జరగవు అన్నీ,అనుకోలేదని ఆగవు కొన్నీ, జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ’ నేను ఆ ఫిలోసిఫి బాగా నమ్ముతాను. ఇక్కడ గుగు ని కూడా మెచ్చుకోవాలి ఆయుష్. నేను నిన్ను ఇష్టపడడం, నువ్వు కాదనడం తెలిసి కూడా నీ పట్ల తన ప్రేమలో ఎటువంటి తేడా లేదు. అలాగే నా పట్ల అసూయ గాని, ద్వేషభావం గాని లేవు.” అంది నివేదిత మెచ్చుకోలుగా గుగు వైపు చూస్తూ.
“నివేదిత నిజమైన ప్రేమలో అసూయలు, ద్వేషాలు ఉండవు. నువ్వు ఎప్పడికీ నా స్నేహితురాలివే” అంది గుగు నివేదితని కౌగలించుకుంటూ.
“థాంక్స్ గుగు. ఆయుష్ కి నువ్వు జీవిత భాగస్వామి అయితే మాకు మంచి స్నేహితురాలివి. నువ్వు నాకైతే జీవితాంతం గుర్తుండి పోతావు” అంది నివేదిత.
“థాంక్స్... నివేదితా! అలాగే మీ అమ్మగారిని, నాన్నగారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన కూతురి నోటికూడు లాగేసిన నన్ను ప్రేమగా ఆదరిస్తున్నారు” అంది గుగు.
“ఇక మీ వోట్ అఫ్ థాంక్స్ ఆపితే, రేపు మనం ఏం చెయ్యాలో ఆలోచించుకోవాలి” అంది శరణ్య .
“ఆయుష్ రేపు ముగ్గురం మీ ఇంటికి వస్తాం. మనం నలుగురం కలిసి నయానో, భయాన్నో ఆంటీని అదే మీ అమ్మగారిని ఒప్పించగలం అనే నమ్మకం ఉంది. ఆవిడ అనుమతితోనే మీరు ఒకటి అవుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది.” అంది నివేదిత.
“రేపు నేను కూడా అక్కడ మాట్లాడచ్చా!?” అని అడిగింది గుగు.
“తప్పకుండా... హీరోయిన్ మాట్లాడకుండా సినిమా క్లైమాక్స్ ఎలా అవుతుంది!?” అని అంది నివేదిత.
“అయితే ఈ కేరక్టర్ ఆక్టర్ రోల్ లేదా ?” అంది శరణ్య.
“ఇంకా నయం ఓపెనింగ్ సీన్స్ అన్ని నీవే” అంది నివేదిత.
“ఈ సినిమా ఆక్టర్స్ అందరం. డైరక్షన్ నివేదితది.” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.
“నేను స్కూల్ నాటకాలకి దర్శకత్వం వహించేదానిని. ఎటొచ్చి ఇది రియల్ లైఫ్ మూవీ. డైరక్షన్ రిస్కీ” అంది నివేదిత.
“రేపు ఉదయం సరిగ్గా పదిగంటలకి మనం కలుస్తున్నాం” అన్నాడు ఆయుష్.
“మేము టిఫిన్ తినేసి బయలుదేరుతాం. ఫైటింగ్ కి బలం కావాలి కదా. అలాగే అక్కడ తిట్లు తప్ప మాకు టిఫిన్ లాంటివి ఏమీ ఇవ్వరు కదా.” అంది శరణ్య నవ్వుతూ .
“మొట్టికాయలు తినకుండా ఉంటే చాలు” అంది గుగు నవ్వుతూ.
“ఏయ్ గుగు... ఇంక పెళ్ళి అన్నా కాకుండా అత్తగారికి తాటాకులు కడతావా? అమ్మా.. నీ విషయం తెలిస్తే అత్తగారు బాగా కాల్చిన అట్లగాడ పట్టుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జాగర్త.” అంది నివేదిత గుగు భుజం తడుతూ.
“ఇంక పెట్టినా తిట్టినా ఆవిడే కదా!?” అంది గుగు.
“గుగు కొంచెంసేపు నీతో మాట్లాడి నీ తెలివితేటలు గ్రహించిందనుకో... ఇంక నిన్ను అప్పడికప్పుడు తన కొడుకు చేత తాళి కట్టించేస్తుంది” అంది శరణ్య.
“ఆయుష్ నేను ఒక కొత్త కధ తయారు చేసుకు వస్తున్నాను. నీకు చెప్పాను కదా...” అంది శరణ్య.
“ఆ... ఆ...గుర్తుకు వచ్చింది. ఆ కధ సందర్భం బట్టి” అన్నాడు ఆయుష్.
“నివేదిత దర్శకత్వం మీద ఆధారపడి ఉంటుంది” అన్నాడు ఆయుష్ మళ్ళీ.
“ఒకే” అంది శరణ్య బొటన వేలు పైకి చూపిస్తూ.
************
ఉదయం పదిగంటలకి ఆయుష్ ఇంటికి వచ్చారు శరణ్య, గుగు, నివేదిత. ముగ్గురూ ఒకే రంగు కల చీర, జాకెట్ తో వచ్చారు. వాళ్ళని చూడగానే మోహం తిప్పుకు లోపలకి వెళిపోయింది సీత.
“నమస్తే అంకుల్” అంది నివేదిత ఇంట్లోకి గుగు, శరణ్య తో అడుగు పెడుతూ.
హల్లో కూచున్న జగన్నాధం “రా నివేదితా... రండి అమ్మాయిలూ.” అంటూ వాళ్ళని లోపలి ఆహ్వానించాడు.
“నమస్తే అంకుల్” అన్నారు గుగు, శరణ్య.
అప్పుడే బయటకి వచ్చిన ఆయుష్ “హాయ్” అన్నాడు.
“నీ పేరు మర్చిపోయాను... నువ్వు ఇంతకు ముందు వచ్చావు కదా” అన్నాడు జగన్నాధం గుగుతో.
“అవును అంకుల్ సంక్రాంతి పండగకి ఆయుష్ తో వచ్చాను. నా పేరు గుగు” అంది గుగు తల వంచుకుంటూ.
“నాన్నగారు ఈ అమ్మాయి శరణ్య. మా క్లాసు మేట్” అంటూ శరణ్యని తండ్రికి పరిచయం చేసాడు పరిచయం చేసాడు ఆయుష్.
“కూచోండి” అన్నాడు జగన్నాధం వచ్చినవాళ్ళకి సోఫా చూపిస్తూ.
“ఆయుష్... ఎండన పడి వచ్చారు. కొంచం చల్లని మంచినీళ్ళు ఇయ్యి” అన్నాడు జగన్నాధం.
“అమ్మాయిలు మా ఇంట్లో ఫ్రిజ్ ఉంది అందులో నీళ్ళు తాగుతారా? లేకపోతే ఇండియన్ ఫ్రిజ్ లో చల్లని, తియ్యని నీళ్ళు తాగుతారా?” అని అడిగాడు జగన్నాధం.
“ఇండియన్ ఫ్రిజ్ అంటే ఏమిటి అంకుల్!?” అని చనువుగా అడిగింది గుగు.
“ఇండియన్ ఫ్రిజ్ అంటే మట్టితో చేసిన కుండ గుగు. అందులో నీళ్ళు చల్లగా, తీయగా ఉంటాయి.” అంది నివేదిత.
“అయితే ఆయుష్... ఇండియన్ ఫ్రిజ్ లో నీళ్ళే తాగుతాను” అంది గుగు.
జగన్నాధం గుగుని, ఆమె హావ భావాలను, మాటలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఎంతైనా కాబోయే కోడలు కదా... ఆయన గుగు తన కాబోయే కోడలు అన్న నిర్ణయానికి వచ్చేసాడు!!??
“నువ్వుండు ఆయుష్ మంచి నీళ్ళు నేను పట్టుకొస్తాను” అంటూ ఇంటిలోకి వెళ్ళింది నివేదిత. అందరికి నీళ్ళు ఇచ్చేసి “ఆయుష్ నేను ఆంటీని పలకరించి వస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి” అంటూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది నివేదిత. బయట ఆయుష్ మిత్ర బృందం, జగన్నాధం పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. జగన్నాధం పెద్దవాళ్ళతో పెద్దవాడిగా, యువకులతో వాళ్ళలా, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోతాడు. అది ఆయనలోని గొప్ప తనం. అందుకే ఆయనంటే ఇష్టపడని వాళ్ళు అరుదు. ప్రస్తుతం ఆయన వచ్చిన వాళ్ళతో, వాళ్ళ కి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మాటలాడుతూ, అప్పుడప్పుడు మాటలలో తన అనుభవం జోడిస్తున్నాడు.
“ఏం ఆంటీ బాగున్నావా?” అంది నివేదిత.
“ఇంకా బతికిఉన్నానో లేదోనని చూడడానికి వచ్చావా?” అంది సీత నిష్టూరంగా.
**********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో