మానూ మాకును కాను – నవల – 24 | 2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad

Vijaya Lakshmi

Published on Nov 11 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మానూ మాకును కాను – పార్ట్ 24

2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల

                                  రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

“ఏం ఆంటీ బాగున్నావా?” పలకరించింది నివేదిత సీతను.

“ఇంకా  బతికిఉన్నానో లేదోనని చూడడానికి వచ్చావా?” అంది సీత నిష్టూరంగా.

“అదేంటి ఆంటీ అలా అంటావు. సరదాగా పండగకి వచ్చిన ఆయుష్ తో, మాతో సంతోషంగా ఉండాలి గాని!”

“నువ్వు అసలు ఎలా ఉండగలుగుతున్నావు? నాకయితే వాడు చెప్పినది విన్నప్పటినుంచి ఒంటి మీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్టు ఉంది... అసలు ఎప్పడినుంచో నీకు, వాడికి పెళ్ళి అని అనుకుంటున్నాం కదా. మరి నీకు సంగతి తెలిసిన తరువాత బాధగా లేదూ?” అని అడిగింది సీత.

“ఇందులో బాధపడడానికి ఏముంది ఆంటీ? మనం ఎన్నో అనుకుంటాం. జరగవు. ఇదీ అంతే. అసలు ఆయుష్ కి ఇప్పుడు ఆ అభిప్రాయం లేదట. నేను, నువ్వు అనుకున్నాం గాని అతను నన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదట.”అంది నివేదిత.

“ఇప్పుడు కొత్త, కొత్త మోజులు వచ్చాక వాడికి మనం ఎవ్వరం కనిపించడం లేదు. నువ్వు చెప్పు నివేదిత... అసలు ఆ పిల్ల ఎలా ఉంది? నల్లగా, కొరివిలా... ఒక అందంచందం లేదు. రూపు రేఖలు లేవు” అంటూ అదో రకంగా మోహం పెట్టింది.

“ఆంటీ... ఒకసారి ఆ అమ్మాయిని పిలుస్తాను. మాతో  శరణ్య అని ఇంకో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా తీసుకు వస్తాను. నువ్వు ఈ వేడిలో  వంటింట్లో  ఏమి కుచుంటావు గాని ఆయుష్ రూమ్ లో కూచో. నేను వచ్చాక ఏ.సీ. వేస్తాను.” అంది నివేదిత సీత ఏదో అనబోతుంటే ఆ అవకాశం ఇవ్వకుండా.

“నివేదితా... వాళ్ళు అందరూ... ఇంట్లోకి ఎందుకు !?” అంది సీత.

“వాళ్ళందరూ ఎవరు ఆంటీ? నీ కాబోయే కోడలు, శరణ్య అని మా ఫ్రెండ్” అంది నివేదిత నవ్వుతూ.

“ఇదిగో! ఆ కోడలు... కోడలు అన్నావంటే నిన్ను కూడా లోపలకి రానివ్వను” అంది సీత.

“సరే... ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్”

“ఎప్పటికీ అంతే!” అంది సీత దృడంగా.

నివేదిత నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి “ఆయుష్... అంకుల్ నువ్వు, ఎక్కడైనా అలా బయట తిరిగి రండి. మీరు వచ్చేసరికి  గుడ్ న్యూస్ చెపుతాను” అంది నివేదిత.

“నీ ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్ననమ్మా” అన్నాడు జగన్నాధం మెచ్చుకోలుగా నివేదిత వైపు చూస్తూ.

“కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్సు గుగు” అన్నాడు జగన్నాధం గుగు వైపు తిరిగి.

“థాంక్స్ ...మామగారు” అంది గుగు.

“అమ్మో గుగు... నీవి మాములు తెలివితేటలు కాదు... అసలు మేము ఎందుకు? నువ్వే మీ అత్తగారితో మాట్లాడేసుకో” అంది నివేదిత, గుగు నెత్తి మీద ఒక్కటి ఇచ్చుకుంటూ.

అందరూ నవ్వుకున్నారు.

”ఆంటీ. ఈ అమ్మాయి తెలుసు కదా గుగు. ఇక ఆ అమ్మాయి శరణ్య... మా ఫ్రెండ్.”

“ఏమిటి ఏకంగా ఇందరిని వేసుకొచ్చాడు మావాడు? నన్ను నయానో, భయాన్నో ఒప్పించేద్దమనా?” అంది సీత.

‘ఆంటీ నువ్వు ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టె రకం. నీకు గుగు అయితేనే సరిపోతుంది.’ అని మనస్సులో అనుకుంది నివేదిత.

మోహంమీద నవ్వు పులుముకుని “అయినా నీముందు మా ఆటలు సాగుతాయా. ఆంజనేయుడి ముందు కుప్పిగంతలలా.” అంది నివేదిత. సీత నవ్వుకుంది.

“అత్తయ్య గారు నమస్తే” అంది గుగు చేతులు జోడిస్తూ.    అంతే సర్రున ఇంతెత్తు లేచింది సీత.

“ఎవరే నీకు అత్తయ్య? మా వాడిని ఏం చెప్పి వల్లో వేసుకున్నావే? నువ్వు ఎక్కడ, మా అబ్బాయి ఎక్కడ? నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు, వాడికి. మా వాడు బంగారుతండ్రిలా  పచ్చగా ఉంటాడు. నువ్వు నల్లగా సిద్ధిలా ఉంటావు. వాడి అందం జిల్లా అంతా ప్రఖ్యాతి గాంచింది...” అంది సీత ఉద్రేకంతో ఆయాస పడుతూ.

గుగు ఏదో అనబోతుంటే వద్దని సంజ్ఞ చేసింది నివేదిత.

“నువ్వు ఆఫ్రికన్ వి. అందంగా లేవు. నల్లగా ఉన్నావు” అంది సీత మళ్ళీ. ఇక మాట్లాడలేక ఆగిపోయిందో లేక మామూలుగా ఆగిపోయిందో నివేదిత కి అర్థం కాలేదు.

గుగు మాత్రం ఇక మాట్లాడాలని నిర్ణయించుకుంది.

“మేడం” అని సంబోధన మార్చివేసి, “మీరు ఎంతసేపు ఆఫ్రికన్ వి, నల్లగా ఉన్నావు, అందంగా లేవు అంటున్నారే గాని నన్ను ఒక అమ్మాయిగా మాట్లాడరేం. నేను ఒక అమ్మకి పుట్టిన బిడ్డనే. మాదీ గౌరవమైన కుటుంబమే. మా నాన్నగారు బిజినెస్ చేసి, అది  కూడా న్యాయంగా సంపాదిస్తున్నారు. అమ్మా మీలాగే హౌస్ వైఫ్. మరి ఎందుకు నన్ను తక్కువగా చూస్తున్నారు? నేను ఆఫ్రికా అమ్మాయినే కావచ్చు. అనాకారిని అయి ఉండవచ్చు. నల్లగా కొరివిలా ఉండవచ్చు. కానీ నేను ఒక అమ్మాయిని మేడం... నేను “మానూ మాకును కాను. రాయీ  రప్పను కానే కాను. మాములు మనిషిని” అన్న ఒక మహానుభావుడి పాటలో ఒక భాగాన్ని. నేను మానూ మాకును కాను మేడం. మనిషిని... నాకూ ఆశలు, కోరికలు ఉంటాయి.” అంది గుగు.

గుగు ధైర్యానికి శరణ్య గుండెల మీద చెయ్యి వేసుకుంది. నివేదిత మనస్సులో గుగు మాటలకి సంతోషం, భయం, ఆశ్చర్యం మిళితమైన భావాలూ ప్రవేశించాయి.

“నా కొడుకు. నా ఇష్టం” అంది సీత మొండిగా.

“అది కాదనను. నేను చెప్పేది కాస్త వినండి మేడం. నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ఇష్ట పడ్డాడు. మేము మీకు ఎవ్వరికి ఏమీ చెప్పకుండా... ఆఖరికి ఈ ఫ్రెండ్స్ కి కూడా తెలియకుండా మెడిసిన్ అయిపోయిన తరువాత పెళ్ళి చేసుకుంటే మీరందరు ఏమి చేయగలరు” అంది గుగు.

“నీ మీద పోలీసుకేసు పెట్టి  జైలులో పడేయించేద్దును.” అంది సీత పళ్ళు నూరుతూ.

“ఆంటీ కేసు ఎలా వేస్తారు? వాళ్లిద్దరు మేజర్ లు... వారి ఇష్టప్రకారం వాళ్ళు పెళ్ళి చేసుకుంటుంటే వద్దనే అధికారం ఎవ్వరికి లేదు... మీరు ఒకటి గమనించారా? మెడిసిన్ అయిన తరువాత అంటోంది. అప్పటికి ఇద్దరూ కూడా భారత చట్టప్రకారం వివాహవయస్సుకు వస్తారు” అంది శరణ్య.

“కోడలా కొరివా? అయినా కోడలు నలుపైతే కులం అంతా నలుపు అంటారు. ఈ తుమ్మమొద్దుని చేసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలు అంతా నల్లగా పుట్టుకొస్తారు.” అంది కోపంగా.

“ఆంటీ మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు... పాపం ఆ పిల్ల ఎదుట అలా మాట్లాడొచ్చా?” అంది నివేదిత కోపంగా.

“ఆంటీ మీ మనుమలు మీ పోలికలోనే లేకపోతే  మీ అబ్బాయిలాగా తెల్లగా ఉండొచ్చు కదా! అయినా ఆంటీ! మీకు ఇంత వయస్సు వచ్చింది... ఎన్నో చూసి ఉంటారు. ఎన్నో చదివి ఉంటారు... ఎన్నో విషయాలు విని ఉంటారు. నల్లటి మనసున్న తెల్లటి మనుషులకన్నా తెల్లటి పాలమీగడలాంటి మనసున్న ఈ గుగు చాలా బెటర్ ఆంటీ.” అంది శరణ్య.

“ఆంటీ ఇంతటి మంచిమనసున్న గుగు మీ అబ్బాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. మేము మూడేళ్ళుగా చాలా దగ్గరగా  చూస్తున్నాం. గుగు  ఏదో ప్రేమ పేరుతో మోసగించేసే రకం కానేకాదు. ఒక వేళ అలాంటి మోసకారి అయితే మేమే తెలుసుకునే వాళ్ళం కదా! ఆంటీ... నేను చెపుతున్నాను, ఈ గుగు ని చూడండి... ఆ అమాయకమైన మోహంలో మీకు ఎక్కడైనా అన్యాయం చేసే ఛాశరణ్య అందుకుంది.

“ఆంటీ గుగు ని మీ కోడలిగా చేసుకుంటే ఆయుష్ ని అన్నివిధాలా బాగా చూసుకుంటుంది. మిమ్మల్ని, అంకుల్ ని ఎంతో గౌరవిస్తుంది. ప్రేమగా ఆదరిస్తుంది. మిమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటుంది. ఆంటీ... పెళ్ళవగానే అత్త, మామలను బయటకి గెంటేసే అమ్మాయిలకన్నా వెయ్యిరెట్లు నయం. పెళ్ళయిన మూడోరోజే వేరే కాపురం పెట్టేసి, వీలైతే అత్త, మామలను శాశ్వతంగా ఓల్డ్ ఏజ్ హోం లో పడేసే మన దేశ, మత, జాతి,కులం కల తెలుగు అమ్మాయి కావాలా లేక పెళ్ళి అయ్యాక మీ అబ్బాయిని సుఖపెట్టే, మిమ్మల్ని ఆదరించే ఆఫ్రికన్ అమ్మాయి గుగు కావాలో మీరే తేల్చుకోండి.” అంది శరణ్య .

“ఇవన్నీ సినిమాలలో, కధలలో బావుంటాయి. నిజ జీవితం వేరు” అంది సీత.

“జీవితాన్ని నరకం చేసే అమ్మాయి కోడలుగా రావలునుకుంటున్నావా ఆంటీ? గుగు లాంటి మంచిపిల్ల తరతరాలకు మంచి పేరు తెస్తుంది. మనకందరకి తెలిసిన విషయమే. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివి అన్నీ నీళ్ళు కాదు అని. గుగు నల్లని బంగారం ఆంటీ. నువ్వు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటున్న చాలామంది కంటే చాలా మంచిది ఈ అమ్మాయి. నువ్వు భ్రమపడే ఆ కాకిబంగారం కంటే ఎన్నో వందలరెట్లు మేలైన అసలు సిసలు బంగారం గుగు.” అంది నివేదిత.

“ఇన్ని చెపుతున్నావు అమ్మాయి... ఇటువంటి అమ్మాయిని నీ అన్నగారికో, తమ్ముడికో చేసుకుంటావా?” అని అడిగింది సీత.

“నువ్వు అడిగేది చాలా అసంబద్ధమైనా... తప్పక వాళ్ళని ఒప్పిస్తాను... మంచి అమ్మాయిలను రికమెండ్ చేయడానికి నాకేమి అభ్యంతరం లేదు. తెలిసి తెలిసి ఒక చెడ్డ అమ్మయిని కొడుకుకి చేసుకోవడం  ఎంత ప్రమాదమో, ఎంత తెలివితక్కువో... అలాగే తెలిసి, తెలిసి ఒక మంచి అమ్మాయిని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఆంటీ. ఇంకొక విషయం మళ్ళీ చెపుతున్నాను. మీకు చెప్పకుండా వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఏమి చేసేవారు. ఉన్న ఒక్క కొడుకు పెళ్ళి  చూసే భాగ్యం కోల్పోయి, జీవితాంతం బాధపడుతూ ఉండేదానివి. అల్లాంటిది మీ ఇద్దరిని గౌరవించి, మీ ఆశీస్సులతోనే పెళ్ళి చేసుకుందామని, వాళ్ళు నిర్ణయించుకోవడం ఎంత అదృష్టమో ఆలోచించు” అంది నివేదిత సూటిగా సీత మొహంలోకి చూస్తూ.

“ఆంటీ మామూలుగా వాళ్ళు ప్రేమించుకున్నారు కనుక వాళ్ళు వచ్చి మీకు నచ్చచెప్పో, దెబ్బలాడో, బెదిరించో ఒప్పించే వారు .లేదు... మీరు ఒప్పుకోకపోతే మీ చావు మీరు చావండని, వాళ్ళు చేసేది వాళ్ళు చేసే వారు. కాని ఇక్కడ నేను, నివేదిత ఎందుకొచ్చామో అర్థం చేసుకోండి. ఈ విషయాలన్నీ మీకు తెలియదు అని కాదు. ఒక్కోసారి మనం ఆవేశంలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేం. వివేకంగా తర్కించలేం. మీకు అలోచిండడంలో కాస్త సహాయం చెయ్యడం మా ఉద్దేశ్యం. ఇంక తుది నిర్ణయం మీదే” అంది శరణ్య.

 క్రికెట్ లో రెండువైపులా నుంచి స్పిన్నర్లను ఎదుర్కోలేక ఇబ్బందిపడుతున్న బాట్స్మన్ లా ఉంది సీత పరిస్థితి !!??

*****************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే...  | shri sailam bramhmotsavam
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే......
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి వివాహం...  | Who is goddess lingabhairavi? What is bhootshuddhi marriage?
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి...
మానూ మాకును కాను – నవల – 25  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
మానూ మాకును కాను – నవల – 24  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...