Vijaya Lakshmi
Published on Nov 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“అన్ని బాగానే ఉన్నాయి... కాని ఈ పెళ్ళి జరిగితే రేపు స్నేహితులలో, చుట్టాల్లో మేము తలెత్తుకోగలమా !?” సందేహం వ్యక్తం చేసింది సీత.
“తలెత్తుకోలేకపోడడానికి మీరేమైనా తప్పు చేస్తున్నారా? ఆయుష్, గుగు ఏదైనా దొంగతనం, లేదా మరోతనం చేస్తున్నారా? ప్రేమించుకున్నారు. దర్జాగా పెళ్ళి చేసుకుంటున్నారు.” అంది శరణ్య .
“రేపు మా కోడలు, మా కోడలు అంటూ అందరితో అంటావా? లేకపోతే ఆఫ్రికా అమ్మాయి, నల్ల అమ్మాయి, అంత అందంగా ఉండని అమ్మాయి అని చెపుతావా? ఒకసారి ఆయుష్ ని పెళ్ళి చూసుకుని మీ ఇంటికి వచ్చాక గుగు మీకోడలు. ఆయుష్ కి భార్య అంతే. మిగితా విషయాలన్నీ అనవసరం.” అంది నివేదిత.
“అంత ఎందుకు ఆంటీ... మీకు మనవడో, మనుమరాలో పుడితే ఎత్తుకు ముద్దుచేస్తారా... లేదా? లేకపోతే ఆఫ్రికన్ అమ్మాయికి పుట్టినవాడు అని, పుట్టింది అని దూరంగా ఉంటారా? అసలు గుగు ఎప్పుడైతే మీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమె ఆయుష్ భార్య. జగన్నాధం గారి కోడలు, సీత గారి కోడలు అవుతుంది కదా. అప్పుడు ఏ మిగతా విషయాలు లెక్కలోకి రావు కదా“ అంది శరణ్య .
“ఆంటీ! ఎందుకు అనవసరంగా అలోచించి, మనసు పాడుచేసుకుని, బాధ పడడం? ఇంకో విషయం చెప్పనా? గుగు ఎదురుకుండానే చెపుతున్నాను. నువ్వు ఏమనుకున్నా జరిగేది జరగక మానదు. హాయిగా నువ్వు, అంకుల్ సంతోషంగా ఉంటూ, వాళ్ళని కూడా సంతోషంగా ఉండనివ్వండి. నువ్వు పెళ్ళికి ఒప్పుకో.
మా ఫ్రెండ్ అని చెప్పడం కాదు గాని గుగు మేలిమి బంగారం. అది ఎక్కడ ఉంటే అక్కడ సుఖ శాంతులు, ఆనందం ఉంటాయి. అంత మంచి పిల్లకి ఎవ్వరూ అన్యాయం చెయ్యరు. నువ్వు కూడా ఒప్పుకో.
నువ్వు తీసుకునే ఈ అతిపెద్ద మంచినిర్ణయం మీ అందరి జీవితాల్ని మార్చివేస్తుంది. ఇంక రెండో ఆలోచన చేయకు. ముందుగా మీ కోడలికి ఎస్ చెప్పు. తరువాత ఆయుష్ కి, అంకుల్ కి చెపుదాం. కమాన్... ఆంటీ... ఒప్పుకున్నావు... ఎస్ అంటున్నావు... ఎస్ అంటున్నావు... ఎస్ అంటున్నావు” అంటూ హిప్నోటైజ్ చేస్తున్నట్లుగా అంది నివేదిత.
“ఆంటీ ఇప్పుడే చుట్టపక్కల వాళ్ళని పిలిచి గుగుని మీ కాబోయే కోడలుగా పరిచయం చెయ్యండి. నేను స్వీట్ బాగా చేయగలను. మీరు ఓకె అంటే వంటింట్లోకి మీ పర్మిషన్ లేకుండా దూకేస్తాను” అంది శరణ్య.
“ఆంటీ మేము ఒకసారి మీ పూమొక్కలు అన్నీ చూసి వస్తాం.” అని హఠాత్తుగా అంది నివేదిత.
ముగ్గురమ్మాయిలు బయటకు నడిచారు.
“గుగు... ఇకనుంచి వచ్చినప్పుడల్లా ఈ తోట బాగోగులు చూసుకుని, తోటమాలికి పురమయించాల్సిన విషయాలు చెప్పేసి వెళుతుండాలి” అంది శరణ్య నవ్వుతూ. గుగు సిగ్గుపడింది.
“ఆంటీ ఆలోచనలో పడింది.ఆవిడకి కొంచం టైం ఇవ్వాలని ఇలా మిమ్మల్ని ఇద్దరినీ బయటకు తీసుకు వచ్చా” అంది నివేదిత.
“మీ ఇద్దరికీ ఎంతో థాంక్స్.” అంది గుగు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటూ.
“ఈ ఫార్మాలిటీస్ మన మధ్య వద్దు గుగు... ఏదో మీ పెళ్ళికి మమ్మల్ని కెన్యా తీసుకెళ్ళి, మీరు హనీమూన్ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు, మాకు, స్నేహకి, హసితకి ఆల్ ఆఫ్రికన్ టూర్ టికెట్లు కొనేసి మా మొహాన్న పడేయండి.” అంది శరణ్య.
“ఏమిటి శరణ్య...! పెళ్ళి చేసి వాళ్ళ నాన్నగారిని అప్పులపాలు అయిపోమంటావా?” అంది నివేదిత.
“అవన్నీ నాకు తెలియదు. నా అతి చిన్న కోరిక అది” అంది శరణ్య.
“గుగు... ఈ శరణ్యని ఆఫ్రికా గుహలలో ఏవో క్రూర జంతువులుకు ఆహారంగా పడెయ్యి” అంది నివేదిత నవ్వుతూ.
గుగు, శరణ్య నవ్వసాగారు. అలా వాళ్ళు ముగ్గురూ తోటలో జామచెట్టు కింద కూచుని మాట్లాడుకోసాగారు.
“ఈ జామచెట్టుకి కాసిన కాయలు నువ్వు ఒక ముక్క, ఆయుష్ ఒక ముక్క తింటూ, ఒకరి ఒడిలో ఒకళ్ళు విశ్రమిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఊహించుకో గుగు” అంది శరణ్య నవ్వుతూ.
“ఛీ! శరణ్య నీకు అసలు సిగ్గు లేకుండా పోతోంది” అంది గుగు కోపం నటిస్తూ.
“ఇదేమిటి పెళ్ళి చేసుకునేది నువ్వు. ఆయుష్ ఒళ్ళో గారాలు పోయేది నువ్వు. నాకు సిగ్గు ఎందుకు?” అంది శరణ్య అమాయకంగా మోహం పెట్టి.
“అంటే శరణ్య... తన ప్రేమ గుట్టులు నువ్వు విప్పేస్తున్నావని” అంది నివేదిత.
“సరే... రేపు పెళ్ళి అయ్యాక గుగు వాళ్ళ ఆయన ముందు బట్టలు విప్పదా ఏమిటి ?” అంది శరణ్య.
“శరణ్య... ఇక ఉర్కుంటావా?” అంది గుగు.
“ఊర్కునే ఉంటాం తల్లీ! లేకపోతే ఉరేసుకుంటానేమిటి?” అంది శరణ్య.
“నా పెళ్ళి సంగతేమో గాని... మనం అర్జెంటుగా శరణ్య పెళ్ళి చేసేయాలి” అంది గుగు.
“ఇప్పటికి అర్థం అయ్యిందన్నమాట నీకు. దాని గోల అంతా అదే” అంది నివేదిత నవ్వుతూ.
“పోనీలే ఇప్పటికన్నా అర్థం చేసుకున్నారు అంతే చాలు” అంటూ అప్పుడే చెట్టుమీదకి వచ్చిన చిలుకల జంట వైపు చూడ సాగింది శరణ్య. మిగతా ఇద్దరి దృష్టి కూడా ఆ చిలుకల జంటమీద పడింది.
అక్కడ సీత మొదటిసారిగా ఆలోచనలో పడింది. సినిమాలలోలాగ వివిధ విషయాలు ఆవిడ కళ్ళ ముందు రీలులా తిరగసాగాయి. చాలా సేపు అలోచించి, అలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంటి బయటకు వెళ్ళి తోట వైపు తొంగిచూసింది.
ఆతృతగా ఎదురు చూస్తున్న అమ్మాయిలు ముగ్గురూ ఇంట్లోకి పరిగెట్టారు.
“ఆంటీ... కాయా...? పండా...? పండే కదా” అని అడిగింది నివేదిత.
సీత ఏమీ మాట్లాడ లేదు. కొంచంసేపు మౌనంగా ఉండిపోయింది.
నివేదిత, శరణ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
గుగు గుండె వేగం, పనితీరు, లయ ఆ టైంలో ఎవరైనా కార్దియోలిజిస్ట్ చూసి ఉంటే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చేది!!??
సీత ఏమీ మాట్లాడకుండా లోపలకి వేగంగా నడుచుకుంటూ వెళిపోయింది.
అమ్మాయిలు ముగ్గురూ అటువైపే ఆత్రం గా చూస్తున్నారు. కొన్ని నిమషాల తరువాత మెల్లిగా బయటకి వచ్చింది సీత.
ఆమె చేతిలో వెండి పళ్ళెం, అందులో చీర, జాకెట్ గుడ్డ, పళ్ళు, పూవులు ఉన్నాయి.” అనుకోకుండా మా కోడలిని తీసుకు వచ్చేసారు. పోనీలెండి. ఈవాళ మంచిదే. గుగు తూర్పుకి తిరుగు.. ఇటు” అంటూ గుగు ని పట్టుకుని తూర్పుదిశగా తిప్పింది సీత.
గుగు యాంత్రికంగా సీత చెప్పినట్టు తిరిగి నుంచుంటే, శరణ్య, నివేదిత విస్తుపోయి చూస్తూ నిలుచుండి పోయారు.
సీత గుగుకి కుంకుమ బొట్టు పెట్టి, చీర, జాకెట్టుగుడ్డ, పూలు, పళ్ళు అందించింది. గుగు కళ్ళమ్మట నీళ్ళు ధారగా కారుతుండగా సీత కాళ్ళమీద పడి నమస్కరించింది.
“లే గుగు” అంటూ గుగు ని హృదయానికి హత్తుకుని కొన్నినిమషాలు అలాగే ఉండిపోయింది సీత.
గుగు జారిపోతుందేమోనన్న ఆనందం అందుకున్నందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
శరణ్య, నివేదిత సంతోషంగా కాబోయే అత్త, కోడళ్ళను చూడసాగారు.
“ఏమ్మా నివేదితా మీరు, మా కోడలిని, పెళ్ళి అయి, మా ఇంటికి వచ్చే వరకు, చాలా జాగర్తగా చూసుకోవాలి” అంది సీత.
“ఏమిటి ఆంటీ అప్పుడే మా గుగు... మీ కోడలు అయిపోయిందా!!! ?” అంది ఆశ్చర్యంగా నివేదిత.
“ కొంత మందికి దొరికిన కోడళ్ళు తెల్లగా ఉన్నా మానసిక అందవికారులు. నా కోడలు స్వచ్చమైన తెల్లని మనుసు కల అందకత్తె. సుగుణాల రాశి. ప్రేమ దేవత” అంది సీత మాటలలో గర్వం తొణికిసలాడుతుండగా.
శరణ్య ఆయుష్ కి ఫోన్ చేయ్యబోతుండగా ఆయుష్, జగన్నాధం లోపలి వచ్చారు.
“కంగ్రాట్స్ అయుష్. మీ అమ్మగారు ఒప్పుకున్నారు. అప్పుడే, తన కోడలని జాగర్తగా చూసుకోవాలని, మాకు వార్నింగ్ కూడా ఇచ్చేసారు” అంది శరణ్య సంతోషంగా.
“ఆయుష్, గుగు, ఎలాగైనా సరే మీ వాళ్ళని కూడా పెళ్ళికి ఒప్పించాలని, వాళ్ళ అంగీకారం తోనే పెళ్ళి చేసుకోవాలని పడిన తాపత్రయం ఫలించింది. తను కావలనుకున్న ఆనందం అందుకుంది.” అంది నివేదిత.
“థాంక్స్ నివేదిత, శరణ్య “ అన్నాడు ఆయుష్ .
“ఎందుకు స్వీట్ ముక్క లేకుండా థాంక్స్” అంది శరణ్య నవ్వుతూ.
“నీ ఓపిక” అంటూ కే.జీ. స్వీట్ పాకెట్ శరణ్య కి ఇచ్చేసాడు ఆయుష్.
గుగు సిగ్గు పడుతూ సీత పక్కనే నుంచుంది.
“ఇంకా సిగ్గు, బిడియం ఎందుకు? వెళ్ళి మీ ఆయన పక్కన నుంచో” అంది సీత నవ్వుతూ.
సీత నవ్వుతో అక్కడ అందరూ శ్రుతి కలిపారు.
###
నవల సమాప్తం
తరువాతి బ్లాగ్ లో మరో కొత్త నవల