Vijaya Lakshmi
Published on Oct 21 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?‘
“అవునే నివ్వూ... ఆ అమ్మాయి ఎవరే? ఇందాకటి నుంచి అలా బయటే నుంచుండి పోయింది” అంది రమ మెయిన్ డోర్ బయట నుంచున్న గుగు ని ఉద్దేశించి.
నివేదిత అప్పడివరకు గుగుని గమనించనేలేదు. తన వెంటే లోపలకి వచ్చింది అనుకుంది .
“కం గుగు! వై ఆర్ యు స్టాండింగ్. దిస్ ఈస్ మై హౌస్. ప్లీజ్ ట్రీట్ దిస్ ఏజ్ యువర్ హౌస్.” అంటూ గుగుని చెయ్య పట్టుకుని లోపలకు తీసుకువచ్చింది నివేదిత.
“ఆ పిల్ల ఎవరే? మరీ అంత కర్రి మొద్దులా ఉంది! ఆ ముఖం అదీ... మన దేశస్థరాలు కానట్టుంది“ అంది రమ నివేదిత చెవిలో మెల్లిగా.
“మరీ అలా అన్యాయంగా మాట్లాడుతావేమిటే? రంగు, రూపు రఖలు భగవంతుడే ఇస్తాడని అస్తమాను అంటుంటావు” అంది నివేదిత కూడా మెల్లిగా .
“ షి ఈస్ మై ఫ్రెండ్ గుగు. దిస్ ఈస్ మై మదర్ రమ.” అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది నివేదిత .
“నమస్టే” అంది గుగు రమకి చేతులు జోడిస్తూ, భయం భయం గా ఇంట్లోకి అడుగు పెడుతూ .
“నమస్తే. తెలుగు వచ్చామ్మా?” అని అడిగింది రమ .
“కంచం వట్టు”అంది గుగు ముద్దగా .
‘నీ తెలుగు తెల్లవారినట్టే ఉంది ‘ అని మనస్సులో అనుకుంది రమ.
“అమ్మా. ఆ అమ్మాయి ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశం నుంచి వచ్చింది. డాక్టర్ కావాలన్న ఆశ. మన దగ్గర స్టాండర్డ్ బాగుంటుందని ఇక్కడ చేరింది. గుగు తల్లిదండ్రులు కూడా బాగా ఆస్తిపరులుట. తండ్రి ఏదో చాలా పెద్ద బిజినెస్ చేస్తాడట. తల్లి హౌస్ వైఫ్ ట. జూలై లో మాతోపాటే చేరింది. ఇప్పుడిప్పుడే మన దేశం గురించి, మన కల్చర్ గురించి అర్థం చేసుకుంటోంది. మేము ఆ ఆమ్మాయితో ఇరవై నాలుగు గంటలు వాగుతూ ఉంటాం కదా. మధ్యమధ్యలో మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటాం. అలాగే ఆ అమ్మాయికి అర్థం కాక పోయినా ఆపుడప్పుడు తెలుగులో మాట్లాడతాం. అలా ఒకటి రెండు తెలుగు మాటలు నేర్చుకుంది.” అంది నివేదిత.
“అది కాదే ఎక్కడో ఆఫ్రికా అంటున్నావు...! అమ్మాయి చూస్తే అదోలా ఉంది. అసలు ఆ అమ్మాయి ఎటువంటిదో, క్యారెక్టర్ ఏమిటో, దొంగతనం ఉందో, దురుసుతనం ఉందో... ఏకంగా ఇంటికే తీసుకువచ్చేశావు!!??” అంది రమ నివేదితతో రహస్యంగా .
“అమ్మా. ఆరు నెలల నుంచి చూస్తున్నానమ్మా .నాకు ఆ మాత్రం తెలియదా? అయినా పాపం అది ఏం చేయగలదు!? ఊరు తెలియదు. బాష తెలియదు... అర్థంలేని భయాలు పెట్టుకోకమ్మా.” అంది నివేదిత కాస్త కోపంగా .
“నిజం చెప్పాలంటే ఆ అమ్మాయే భయపడాలి. తెలియని ప్రదేశం తెలియని మనుషల దగ్గరికి రావాలంటే.” అంది నివేదిత మళ్ళా .
“ఏం భయపడిపోతుందేమిటి!? ఇంతోటి అందగత్తెని ఎవడు మోహించేస్తాడు. ఎవడు కామించేస్తాడు!?” అంది రమ కాస్త చీప్ గా.
“అమ్మా .సాటి ఆడదానివి అయి ఉండి అలా మాట్లాడకూడదమ్మా. అమ్మాయికి తెలుగు రాదు కాని లేకపోతే నీ మాటలకు ఎంత బాధపడి ఉందేదో... ఇంకో విషయం... ఆ అమ్మాయికి తెలుగు మాట్లాడడం రాదు కాని అంతో ఇంతో తెలుగు అర్థం అవుతుంది. కనుక నువ్వు చుట్టు పక్కల అమ్మలక్కలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త.” అంది నివేదిత .
“ఇటువంటి పిల్లను పండక్కి అంటూ ఇంటిమీదకు తెచ్చావు. ఇక మన ఇంటిఛాయలకి కూడా ఎవరూ రారు. ఈసారికి పండగా లేదు. పబ్బం లేదు“ అంది రమ.
“అమ్మా... ఏదో ఆ అమ్మాయిని ఇంటికోడలుగా తీసుకొచ్చినట్టు ఓ ఇదయ్యిపోతున్నావు... ఒకవేళ కోడలే అయినా నువ్వు కాదనలేవు. నాకు అన్నదమ్ములు లేరు కనుక, నీక భయం లేదనుకో” అంటూ గట్టిగా అంది నివేదిత. అరవాలనుకున్నా గుగు అక్కడే ఉండడం చేత ఆ ప్రయత్నం మానుకుంది నివేదిత. ఏం జరుగుతోందో అర్థం కాని గుగుకి భయం వేసింది.
“కం గుగు లెట్ అస్ గో టూ అవర్ రూమ్.” అంటూ గుగు చెయ్యి పట్టుకుని లోపలకి నడిచింది నివేదిత.
వాళ్ళు వెళ్ళిన వైపే వింతగా చూస్తూ నిలబడిపోయింది రమ.
***************
నివేదిత, గుగు ఆ ఊరికి వచ్చిన మరునాడు ఆయుష్ ఇంటికి వెళ్ళారు. ఆయుష్ తండ్రి జగన్నాధం, తల్లి సీత ఇంట్లోనే ఉన్నారు.
ఆయుష్ ఇంటికి వచ్చిన ఇద్దరిని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. వాళ్ళని తన తల్లిదండ్రులకు పరిచయం చేసాడు. గుగు గురించి చెప్పాడు.
ఆయుష్ తల్లిదండ్రులకు చేతులు జోడించి “నమస్టే “అంది గుగు.
జగన్నాధం నవ్వుతూ, సీత... ‘ఈ పాడు మొహంది పండగ పూట మా ఇంటికి ఎందుకు వచ్చిందో‘ అన్నట్టు సీరియస్ గా మోహంపెట్టి, ప్రతి నమస్కారం చేసారు.
జగన్నాధం ఇంగ్లీష్ లో “చాలా ధైర్యంగా మీ దేశం నుంచి ఇంతదూరం వచ్చి చదువుకుంటున్నావు. బాగుంది. నీ లాంటి డాక్టర్ల అవసరం మీ దేశంలోనూ, మీ ఖండంలోనూ బాగా ఉంది. ఏదైనా సూపర్
స్పెషాలటీ కోర్స్ చేసి అప్పుడు మీ దేశానికీ వెళ్ళు. డబ్బులు ఇబ్బంది లేదంటున్నావు. కనుక పేదలకు ఉచిత వైద్యం చెయ్యొచ్చు. వాళ్ళు సంతోషిస్తారు. దేవుడు దీవిస్తాడు.” అన్నాడు నవ్వుతూ .
“తప్పకుండా ప్రయత్నిస్తాను సర్” అంది గుగు కూడా ఇంగ్లీష్ లో .
“నాన్నగారు నివేదితని, గుగుని తీసుకుని సరదాగా అమ్మమ్మగారి ఊరు వెడదాం అనుకుంటున్నాను” అన్నాడు ఆయుష్ .
“వెళ్ళండి. దానికి చెప్పేది ఏముంది? కాని ఉన్న రెండురోజులు... అక్కడా ఇక్కడా తిరిగావని మీ అమ్మ బాధపడుతుందేమో చూసుకో” అన్నాడు జగన్నాధం.
“వెళితే వెళ్ళనివ్వండి. మా ఇంటికేగా... ఆ అమ్మాయిని కూడా తీసుకు వెళ్ళాలా?” అంది సీత, తన కొడుకుతో గుగుని ఉద్దేశించి.
“అవునమ్మా. చక్కగా మన పల్లెటూరి వాతావరణం, ఎడ్లబండ్లు, గొబ్బెమ్మలను, బొమ్మలకొలువు లాంటివి చూడడం, చెరుకుగడలు తినడం, సరదాగా మన దేశ పల్లెటూరి వాతావరణం చూస్తుంది” అన్నాడు ఆయుష్.
“మరి పిల్లకి తెలుగు వచ్చా?” అని అడిగింది సీత.
“ఆ అమ్మాయికి రాకపోతే మేము ఇద్దరం ఉన్నాం కదా ఆంటీ.” అంది నివేదిత.
“మీ ఇద్దరిమధ్యలో ఆ అమ్మాయి ఎందుకు? అసలు అలాంటి అమ్మాయిని ఎందుకు తీసుకు వచ్చావు? కాలేజీ, చదువులు అంటే తప్పదు. ఇలా ఇళ్ళకి ఎందుకు తీసుకు రావడం?” అంది సీత.
“ఏమిటి అవుతుంది ఆంటీ !!??” ఆశ్చర్యంగా అడిగింది నివేదిత.
“అలా నల్లగా, సిద్ధిలా, కురూపిగా ఉన్న పిల్లని, ఎక్కడో ఆఫ్రికాఖండంలో పిల్లని మన ఊరు తీసుకు వెళితే ఏ బావుంటుంది” అంది సీత తన కొడుకుతో.
నివేదితకి తన తల్లి మాటలు గుర్తుకు వచ్చి, సీత మాటలు విని నషాళం అంటింది.’ ఆడదానికి మగాళ్ళు, మృగాళ్ళు శత్రువులు అని అంటున్నారు ఇప్పుడు అందరూ. కాని పూర్వీకులు చెప్పినట్టు ఆడదానికి ఆడదే శత్రువు. నిజం చెప్పాలంటే అతిపెద్ద శత్రువు’ అనుకుంది నివేదిత .
“అదేమిటి ఆంటీ మీరు కూడా అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి కూడా మాతో చదువుకుంటోంది. రేపు డాక్టర్ అవుతుంది. ఆ అమ్మాయి మీ కోడలుగా వచ్చేయడం లేదు కదా ?” అంది నివేదిత .
“అదేమిటి నివేదితా అలా అంటున్నావు? మీరు వెళ్ళేది పల్లెటూరు కదా... అంతా వింతగా చూస్తారు... అందుకని అంటున్నాను” అంది సీత సంజాయిషీ ఇచ్చుకుంటున్న ధోరణిలో .
“ఏమీ పరవాలేదు ఆంటీ. ఎవరు ఇష్టపడితే వాళ్ళే దగ్గరికి వస్తారు. అలాగే మమ్మల్ని కావాలి అనుకున్న వాళ్ళకి ఆమె ఏమి అవరోధం కాదు కదా. ఆ అమ్మాయికి తెలుగు రాదు కాని వస్తే మీ మాటలకి ఎంత బాధ పడి ఉండేది?” అంది నివేదిత.
మొదట సారిగా నివేదిత నోట అటువంటి మాటలు విన్న సీత కించిత్ ఆశ్చర్య పోయింది. సీతకి నివేదిత, తన కొడుకు చిన్నప్పటినుంచి కలిసి చదువుకోవడం, కలిసి ఆడుకోవడం వలన ఇంట్లోపిల్లలా ఉండేది. అందాలరాసిలా ఉన్న నివేదితని చూసి ముచ్చటపడేది. నివేదిత తెలివితేటలు చూసి అబ్బురపడేది. చాలాసార్లు చాలామంది తల్లులలాగే తన కొడుక్కి నివేదితని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. నివేదిత మనస్సులో ఆయుష్ కి స్థానం ఉందని గ్రహించింది సీత. ఆ మాటే భర్త జగన్నాధంతో అంది. ఆయన కూడా ఆ ప్రస్తావనకి సంతోషించాడు. వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు బాగా సరిపోతారన్నాడు. అయితే వాళ్ళు బాగా చిన్నపిల్లలు అని, వయసు వచ్చాక, సమయం సందర్భం చూసుకుని, నివేదిత తల్లి తండ్రులు అయిన రమ, వినోద్ లతో మాట్లాడవచ్చని అన్నాడు.
అయితే, ఆ గుగు... లేకపోతే ఇంకో భౌభౌ... నివేదితకి ఏ విషయంలోనూ సరితూగరని, తన కోడలు కావడానికి పోటీపడరని సీతకి బాగా తెలుసు. అందుకని పెద్ద బాధపడలేదు. కాని ఆ గుగు తన తల్లి ఇంటికి వెళ్ళడం సీత ఎందుకో ఇష్టపడడంలేదు. ఎందుకు అంటే అదంతే !!??
మొత్తానికి తల్లిని ఒప్పించి నివేదిత, గుగులతో అమ్మమ్మగారి ఊరికి బయలుదేరాడు ఆయుష్.
తన మనవడిని చూసి బ్రహ్మానందపడిపోయింది ఆయుష్ అమ్మమ్మ తాయారమ్మ .
“ఏరా మనవడా! డాక్టర్ అవుతున్నావుట కదా. ఇంక నీ దగ్గరే నా వైద్యం. ఆ ఆచారి ఇచ్చే మందులు మింగలేక చస్తున్నాను. కాని ఒక మాటరోయ్. నువ్వు డాక్టర్ అయ్యాక నాకు తియ్యని మందులు ఇవ్వాలి. ఇంజక్షన్ లు ఇవ్వకూడదు” అంది తాయారమ్మ నవ్వుతూ .
“అమ్మమ్మా నేను ఇంగ్లీష్ డాక్టర్ ని అవుతాను. నేనిచ్చే మందులు చేదుగానే ఉంటాయి. పోనీలే నువ్వు మా అమ్మమ్మవి కనుక ఇంజక్షన్లు ఇవ్వనులే.”
“అదిరా నా మనవడు అంటే. నేను, నువ్వు డాక్టర్ అయ్యేదాకా, బతికి బావుండాలే గాని అప్పుడు నా వైద్యం నీ దగ్గరే” అంది తాయారమ్మ ఆయుష్ బుగ్గలు నొక్కుతూ .
ఆప్యాయతకు అద్దంపట్టే ఆ దృశ్యం చూసిన నివేదిత ఆనందం తో తబ్బిబ్బయ్యింది .గుగుకి బాష రాకపోయినా విషయం కొంతవరకు అర్థం అయ్యింది. భారతీయ అనుబంధాలలో మాధుర్యం మొదటిసారిగా చూసింది .
“అమ్మాయి నువ్వు పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు?” అంటూ నివేదితని నవ్వుతూ అడిగింది తాయారమ్మ .
“ఏం బామ్మగారు మీ ఊళ్ళో పప్పులు దొరకడం లేదా?” అంటూ తాయారమ్మని అట పట్టించింది.
“ఊరుకోవే! కొంటె మనవరాలా. పెళ్ళి ఎప్పుడు? నువ్వు కుడా డాక్టర్ అవుతున్నావుట కదా. డాక్టర్ నే పెళ్ళి చేసుకుంటావేమో. మా మనువడిని చేసేసుకో. చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు కదా.” అంది తాయారమ్మ నవ్వుతూ.
“నేనింకా డాక్టర్ అవ్వాలి ఆ తరువాతే పెళ్ళి గిళ్ళి. అయినా మీ మనవడి కంటే అందగాడు, తెలివైన వాడు నాకు దొరకకపోడు.” అంది క్రీగంట ఆయుష్ ని చూస్తూ .
“గాడిద గుడ్డు కాదూ. మా మనవడిలాంటివాడు ఈ భూప్రపంచంలో దొరకడు” అంది తాయారమ్మ గర్వంగా .
“ఆహా!” అంది నివేదిత.
“అమ్మమ్మా ఇంకా చదువు ఉంది. జీవితంలో సెటిల్ అవ్వాలి. ఆ తరువాత ...ఊ... నువ్వు, నివేదితా ఇప్పుడు గొడవ పడిపోక్కర్లేదు. అయినా నువ్వు అన్నట్టు నీ మనవడిని వెతుక్కుంటూ భూలోక సుందరి ,రంభ, ఊర్వశి లాంటి అమ్మాయి వస్తుంది.” అన్నాడు ఆయుష్ కొంటెగా నివేదిత వైపు చూస్తూ .
“అవును .కాలేజీలో రోజూ నేను చూస్తున్న క్యూ అదే కాబోలు”అంది నివేదిత.
“ఎస్ “అన్నాడు ఆయుష్ .
“ఇంతకీ ఆ నల్లపిల్ల ఎవరురా?” అంటూ, గుగుని గురించి అడిగింది తాయారమ్మ .
‘తరాలు మారినా, మనుషులు మారినా అడబుద్ధి మారదనుకుంటాను’ అనుకుని పళ్ళు నూరుకుంది నివేదిత.
“ఏం బామ్మగారు మీ మనవడికి చేసుకుంటారా? ఆ అమ్మాయి రంగు ,రూపురేఖలు అంత నిశితంగా పరిశీలిస్తున్నారు.” అని వ్యంగంగా అడిగింది నివేదిత.
“ఆ పిల్ల ఎవరు అని. ఆ పిల్లకి, నా మనవడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది” అంది తాయారమ్మ పొడిగా.
“మరి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే బాగుంటుంది. రంగు, రూపుల ప్రస్తావన ఎందుకు?” అంది నివేదిత చిరుకోపంగా .
“ఊరికే అడిగానమ్మాయి ...” అంది తాయారమ్మ.
“గుగు అని మా కాలేజీలోనే మాతోనే చదువుతోంది. కెన్యా దేశం నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి మన దేశం లో చుట్టాలు ఎవరూ లేరట .తెలుగుకాని మరే ఇతర భారత బాషలు కాని రావు. ఏదో ఒకటీ అరా తెలుగుముక్కలు నేర్చుకుంది. పాపం ఒక్కత్తే ఉంది కదా అని మా ఊరు తీసుకొచ్చాం. అలాగే మీ ఊరు వచ్చాం. పండగ పుటా ఇక్కడ అన్ని వింతలు, విశేషాలు చూస్తుంది అని” అన్నాడు ఆయుష్.
“నమస్టే” అంటూ తాయారమ్మకి చేతులు జోడించింది గుగు.
“నమస్కారం” అంటూ నమస్కరించింది తాయారమ్మ .
“అలాగా... అయితే మన పొలాలు, కొబ్బరిచెట్లు చూపించి, చెరుకు గడలు తినిపించండి. రేపు పొద్దున్నే గంగిరెద్దులమేళాన్ని రమ్మంటాను. అలాగే హరిదాస్ కి కబురు పంపిస్తాను. మనింటి ముందు పెద్ద భోగిమంట ఏర్పాటు చేయిస్తాను.... అసలు మీ తాతగారు ఉండే టైంలో ఊరంతా పండగ ఆయన చేతుల మీద జరిపించేవారు” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది తాయారమ్మ .
‘అయ్యో తొందర పడి అనవసరంగా ఆ పెద్దావిడని నొప్పించానే’ అనుకుంది నివేదిత.
ఆ మరునాడే భోగి. ఇంటి ముందర ఉదయం నాలుగు గంటలకు భోగిమంట ప్రారంభం అయ్యింది. కొంచంసేపటికి ఆ మంట ఆకాశాన్ని అంటుతోందన్న భ్రమ కలిగింది చూసే వాళ్ళందరికి. నివేదిత భోగిమంట వెనక ఉన్న సంప్రదాయం, శాస్త్రీయత గుగుకి వివరించసాసగింది. గుగు ఆసక్తిగా అన్ని వింటూ, ఆశ్చర్యంగా చూడసాగింది. అదే సమయంలో తన దగ్గర ఉన్న ఆపిల్ ఫోన్ లో అంతా రికార్డు చేయసాగింది.
తాయారమ్మ తెల్లవారకుండానే తమ పనిమనిషి చేత నివేదితకి, నివేదితో బాటు గుగుకి కూడా నువ్వులనూనె రాయించి, సున్నిపిండితో నలిపించి, మంచి కుంకుడుకాయరసంతో తలంటుస్నానం చేయించింది. నివేదితకి ఎప్పుడో చిన్నప్పుడు అవన్నీ అలవాటు ఉన్నా, కాలక్రమేణా అన్నీ వదిలేసింది. ఇన్నాళ్ళకి మళ్ళీ శాస్త్రీయంగా తలంటు పోసుకుంది. గుగుకి అంతా వింతగాను ఆసక్తికరంగానూ ఉంది. తలంట్లు అయిన తరువాత ఇద్దరినీ ఒక గదిలో కూచో బెట్టి, తలారా గవ్వ సాంబ్రాణి ధూపం వేయించింది. గుగు కి అలవాటులేక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కొంతసేపటకి సర్దుకుంది.
నివేదిత పట్టు చీర కట్టుకుని ముస్తాబయ్యింది. గుగుకి కూడా తాయారమ్మ చీర కట్టిస్తానంటే గుగు ఒప్పుకోలేదు. ఒకటి అలవాటు లేదు. రెండవది చీర తన వంటిమీద ఉంటుదన్న నమ్మకంలేదు ఆమెకి!!
తెల్లవారగానే హరిదాస్ వచ్చి ఇంటిల్లపాదిని దీవించాడు. తరువాత గంగిరెద్దులను తీసుకువచ్చి తాయారమ్మ ఇంటి ముందు దాదాపు గంట సేపు ఆడించారు. అది చూసి ఆయుష్, నివేదిత కేరింతలు కొట్టారు. గుగు కూడా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ గంగిరెద్దుల ఆటను పూర్తిగా ఆస్వాదించింది.
అప్పుడు మొదటి సారిగా ఊళ్ళో జనం గుగును చూడడం జరిగింది. చాలామంది వింతగాను, ఆసక్తిగాను చూసి తాయారమ్మను గుగు వివరాలు అడిగి తెలుసుకున్నారు .
తాయారమ్మ కుటుంబం అంటే కిట్టని ఒకరిద్దరు, ‘మంత్రగత్తెలు అంటే ఇలాగే ఉంటారు. ఆ మంత్రగత్తె ఈ ఊరికి రావడం, ఊరికి మంచిది కాదు’ అని గుసగుసలాడుకున్నారు.
*************************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో