Vijaya Lakshmi
Published on Oct 22 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?‘గుగు’ మంత్రగత్తేమో అన్న ఊరివాళ్ళ మాటలు తాయారమ్మ చెవిని పడ్డాయి. తాయారమ్మ పాత కాలం నాటి మనిషి అనే చెప్పాలి. ఊళ్ళో మాటలు విన్న ఆవిడకి ఎందుకో, ‘అది నిజం కాదు కదా!? ‘అని చిన్న సందేహం, భయం పట్టుకున్నాయి.
ఎందుకైనా మంచిదని తనకు చిన్నప్పటినుంచి పరిచయం ఉన్న కోయదొరని ఉన్నపళాన రమ్మని కబురు పంపించింది. కోయదొర ఆఘమేఘాల మీద వచ్చాడు. అతనికి వయస్సు ఎనభై సంవత్సరాల పైనే ఉంటుంది. అయితే మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. వయస్సు అసలు తెలియడం లేదు. అతని ముఖంలో ఏదో చెప్పలేని వింత వర్చస్సు గోచరిస్తోంది. ఈ రోజుల్లో సైన్స్ అన్నింటిని కొట్టి పారేసినా అటువంటి వాళ్ళకి ఇంకా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి చెప్పగలిగే శక్తి ఉందని ఆ చుట్టూ పక్కల గ్రామాల్లో నమ్ముతారు.
తాయారమ్మకి అతను చిన్నతనం నుంచి పరిచయం ఉండడం వలన అతనిమీద అపారమైన నమ్మకం ఉంది. అందుకే అంత హడావిడిగా అతనిని పిలిపించింది. అయితే గుగు చెయ్యి చూపించడం లాంటివి చేస్తే ఆయుష్ కి, నివేదితకి అనుమానం వస్తుందని భయపడింది తాయారమ్మ .
తాయారమ్మ గుగు గురించి చెప్పి, ఊళ్ళో కొంతమంది అనుకుంటున్న మాటలను కూడా ఆ కోయదొరకు చెప్పింది. అయితే తను కబురుచేసిన విషయం, గుగును చూసి అతను తెలుసుకున్న విషయాలు, రహస్యంగానే ఉంచాలనీ, కేవలం తనకి, కోయదొరకి తప్ప మూడోకంటి వాడికి ఆ విషయం తెలియకూడదని, తాయారమ్మ, కోయదొరని హెచ్చరించింది
“దొరా! అమ్మాయిని పిలిపిస్తాను. చూడు. రహస్యంగా పరీక్షించు. వాళ్ళు బయటకు వెళ్ళాక అసలు విషయం నాకు మాత్రం చెప్పు” అంది తాయారమ్మ. తాయారమ్మ లోపల ఉన్న ఆయుష్ ని, నివేదితని, గుగుని పిలిపించింది. వాళ్ళ ముగ్గురిని కోయదొరకి పరిచయం చేసింది.
ఆయుష్, గుగుకి కోయదొర గురించి చెప్పి... ఏమైనా చెప్పించుకోమని అన్నాడు.
తమ దేశం లో కూడా అటువంటి వాళ్ళు ఉంటారని, అయితే తనకు అటువంటి వాళ్ళ పట్ల అంత ఆసక్తి లేదని చెప్పింది గుగు.
“అమ్మమ్మా గుగుకి ఇంట్రెస్ట్ లేదట. నాకు నమ్మకం లేదు. ఇక నివేదిత కాబోయే మొగుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చెప్పించుకోమను” అన్నాడు అయుష్ నవ్వుతూ.
“నా మొగుడు ఎవరో నాకు తెలుసు. ఎవరూ చెప్పక్కర్లేదు” అంది నివేదిత మూతిని ముప్పై మూడు వంకర్లు తిప్పి.
“సరే... అమ్మమ్మా! మేము కాసేపు అలా తిరిగి వస్తాం” అంటూ ఆడపిల్లలని ఇద్దరినీ బయలుదేరదీసాడు ఆయుష్.
కోయదొర గుగుని నిశితంగా పరిశీలించడం మొదలు పెట్టాడు. గుగు లో ఏ అంశము అతని డేగ కళ్ళను తప్పించుకోలేదు. ఆ ఒకటి రెండు నిమిషాల్లోనే ఏదో గ్రహించినట్టు తల ఊపాడు. అది చూసిన తాయారమ్మ మరింత భయపడి పోయింది.
వాళ్ళు వెళ్ళగానే తాయారమ్మ సంభాషణ ప్రారంభించింది.
“చూసావు కదా దొరా...! అమ్మాయి ఇక్కడకు వచ్చినందువల్ల గానీ, మా అమ్మాయిగారి ఇంటికి వెళ్ళినందువల్లగాని, మా కుటుంబాలికి ఏమీ ప్రమాదం లేదు కదా !!??” అని ఆదుర్దాగా అడిగింది .
“ఏమిటి దొరసాని... నీ ఉద్దేశం కూన మంత్రాలు నేర్చిన కూన అనా !?”అని అడిగాడు కోయదొర .
“అవును. అదే నా భయం” అంది తాయారమ్మ .
“నాకు అయితే ఆ కూనలో అటువంటి లక్షణాలు గాని, శక్తి యుక్తులు ఉన్నట్టు గాని అనిపించలేదు“
“మరి ....!!??”అర్తోక్తిలో ఆగిపోయింది తాయారమ్మ.
“దొరసాని... ఆ కూన నల్లగా మెరిసే వజ్రం” అన్నాడు కోయదొర.
“ఏమిటి దొరా;.. వజ్రమా? నాకు అర్థం కావడం లేదు. అయినా ఆ పిల్ల కేవలం మా మనవడితో చదువుకుంటోంది. మన దేశం కాదు. మన జాతి కాదు” అంది తాయారమ్మ .
“అమ్మా! కూన ఎక్కడది అయితేనేం గాని, మహారాణి యోగం మోహంలో ఉట్టి పడుతోంది” అన్నాడు కోయదొర.
“మహారాణి యోగమా!? అంత మహారాణి అయితే, ఇలా ఎక్కడకో వచ్చి చదువు వెలగ బెడుతోంది ఎందుకు?”
“దొరసాని... ఆ కూన అయినవాళ్ళకి దగ్గరగా వెళుతోంది. అయితే సరిగ్గా చెప్పాలంటే నేను ఈ పౌర్నిమ రోజున దేవత పుజలో కూచోవాల. అప్పుడు తెలుస్తుంది“ అన్నాడు కోయదొర సాలోచనగా .
“దొరా... ఆవన్నీ ఎందుకు గాని... ఇప్పుడు మా కుటుంబాలికి వచ్చిన భయం ఏమి లేదు కదా !?” అంది తాయారమ్మ.
“దొరసాని... ఆమేమీ మంత్రగత్తె కాదు. కూన కాబోయే మహారాణి. నాకు కూడా కాబోయే మహారాణితో కొంత సమయం గడిపే యోగం వచ్చింది”అన్నాడు కోయదొర.
“ఏదో నువ్వు అంటున్నావు గాని దొరా! ఈ రోజుల్లో మహారాజులు, రాణులు ఎక్కడ ఉన్నారు?” అని అడిగింది తాయారమ్మ.
“దొరసాని... మహారాణి అంటే అంతఃపురంలో ఉండక్కర్లేదు. అంత దర్జాగా బతుకుతాది అని“ అన్నాడు కోయదొర .
“సరే... నువ్వు వచ్చిన విషయం గాని, మనం మాట్లాడుకున్న విషయం గాని ఎవరికీ తెలియకూడదు” అంటూ, అతని చేతులో రెండు ఐదువందల రూపాయల నోట్లు పెట్టింది .
“వస్తా దొరసాని. నీకేమి భయం లేదు. అంతా నిశ్శబ్ధం.” అంటూ చేతులు జోడించి శలవు తీసుకున్నాడు కోయదొర.
“ఏం పిల్లో. ఏం గొడవో“ అనుకుంటూ సాలోచనగా వంటగదిలోకి నడిచింది తాయారమ్మ.
********************
ఆయుష్, నివేదిత, గుగు... ఆయుష్ వాళ్ళ తాతగారి పొలంలో తిరుగుతున్నారు.
ఆయుష్ కి చిన్నప్పుడు తల్లితో తాత గారింటికి వెళ్ళడం, పొలాల వెంట, పుట్టల వెంట తిరగడం అలవాటే. అతను ముందు వెడుతుంటే నివేదిత, గుగు అతనిని అనుసరిస్తున్నారు. చాలాచోట్ల ధాన్యం కోతలు, కుప్ప నూర్పిళ్ళు అయిపోయాయి. వాళ్ళని కొబ్బరి చెట్లు ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు ఆయుష్ . అక్కడ రైతు కి చెప్పి ముగ్గురికి లేత బొండాలు కొట్టించాడు. “గుగు... నేను చిన్నప్పుడు చెట్ల దగ్గర ఉండి, కొబ్బరి బొండాలు కిందకు దింపించి, వలిపించేవాడిని తెలుసా?” అన్నాడు గర్వంగా. సంభాషణ ఇంగ్లీష్ లో సాగుతోంది .
“ఓహ్ !నువ్వు కూడా చెట్టు ఎక్కగలవా?” అని అడిగింది గుగు.
“నేను ఎందుకు ఎక్కుతాను. లేబర్ ఉంటారు కదా?” అన్నాడు ఆయుష్.
“నేను కొబ్బరి చెట్టు ఎక్కనా?” అని అడిగింది గుగు.
“ఏమిటి నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కుతావా!!??” అని ఆశ్చర్యం గా అడిగింది నివేదిత.
“అవును. నా చిన్నతనంలో మా ఊళ్ళో అస్తమాను ఎక్కుతూ ఉండేదానిని” అంటూ, తన జీన్ ప్యాంటు కొంచం పైకి లాక్కుని, గబాగబా కొబ్బరి చెట్టు ఎక్కడం ప్రారంభించింది గుగు. ఆయుష్, నివేదిత నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తుండగా నిమషాల్లో చెట్టుపైకి వెళ్లిపోయింది గుగు.
గ్రే కలర్ ప్యాంటు, రెడ్ టీషర్టు వేసుకుని కోతిలా చక చకా కొబ్బరి చెట్టు ఎక్కుతున్న గుగుని పొలాలలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా, విచిత్రంగా చూడసాగారు .
‘తాయారమ్మ ఇంటికి ఎవరో నల్ల కోతిపిల్ల వచ్చినట్టు ఉందే‘ అనుకుంటూ, గుగు చెట్టు ఎక్కడం చూసిన వాళ్ళలో కొంతమంది కామెంట్ చేసారు. మెల్లిగా గుగు ఎక్కిన కొబ్బరి చెట్టు చుట్టూ జనం పోగవడం మొదలు పెట్టారు.
అది చూసిన ఆయుష్ “చాలు .దిగు ..దిగు “అంటూ అరిచాడు .
‘ ఈ పిల్లకు ఉన్న అంతో ఇంతో భయం పోయింది. ఇక పట్టుకోలేమేమో!!??’ అనుకున్నాడు ఆయుష్ .
ఆయుష్ అరుపు విన్న గుగు సెకన్లలో చెట్టు దిగిపోయింది.
“కంగ్రాట్స్ గుగు. నువ్వు వచ్చిన నిమషాల్లో అందరిలో పాపులర్ అయిపోయావు.” అంటూ గుగు కి చేయి అందించి అభినందించింది నివేదిత.
“కంగ్రాట్స్ గుగు“ అంటూ తను కూడా చేయి అందించాడు ఆయుష్. ఆయుష్ చెయ్యి తగిలిన క్షణంలో గుగులో ఏదో వింత చలనం కలిగింది. సిగ్గుతో మోహం కొంచం ఎర్రబడింది. అయితే గుగు బాగా నలుపు కనుక అది పెద్దగా ఎవ్వరకీ తెలయలేదు. కాని ఆ క్షణం గుగు జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది అని చెప్పవచ్చు. వచ్చినప్పడి నుంచి భయంగా, బెరుకుగా ఉన్న ఆమెలో కొత్త భావోద్వేగం మొదలు అయ్యింది. అయితే అదేమి పట్టని, తెలియని ఆయుష్ “రా గుగు .వెళదాం. ఇంక ఇక్కడ నువ్వు ఎక్కువ సేపు ఉంటే కష్టం“ అంటూ గుగు చేయి అందుకున్నాడు.
అదో రకం భయం, సిగ్గు మిళితమైన భావంతో మృదువుగా ఆయుష్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని, నివేదిత చెయ్యి పట్టుకుని నడవసాగింది గుగు .
అక్కడనుంచి ముగ్గురూ మామిడితోటల్లోకి వెళ్ళారు. అప్పుడే పూతపట్టిన మామిడిచెట్లు అందంగా ఉన్నాయి.
**********************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో