మానూ మాకును కాను – నవల – 5 | 2019 స్వాతి అనిల్ అవార్డ్ పొందిన నవల | Swathi Award winning novel by MVSS Prasad

Vijaya Lakshmi

Published on Oct 23 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మానూ మాకును కాను – పార్ట్ 5

2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల

రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్


“గుగు ఈ చెట్లు, పళ్ళు మీ దేశంలో కూడా ఉంటాయా?” అని అడిగింది నివేదిత ఇంగ్లీష్ లో .

“ఉంటాయి. కాకపోతే ఈ రకమో కాదో చెప్పలేను.” అంది గుగు.

“సీజన్లో అయితే మనం చక్కగా మామిడికాయలు ఉప్పు, కారం వేసుకుని తినేవాళ్ళం. ఇంకా కొంతకాలం ఆగితే మంచి పళ్ళు తినే వాళ్ళం“ అంది నివేదిత మామిడి కాయలు జ్ఞాపకం రాగానే నోరు ఊరి.

“మనం బయలుదేరి చాలా సేపు అయ్యింది. అమ్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది పదండి“ అని గుగుని, నివేదితని బయలుదేరతీసాడు ఆయుష్.

వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి తాయారమ్మ ఎదురు చూస్తూ వీధి గుమ్మంలో కూచుని ఉంది .

“ఏరా మనవడు పిల్లలని తీసుకుని అదేపోత పోయావు?” అంది తాయారమ్మ నవ్వుతూ .

“ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగి పోయాననుకో “అన్నాడు ఆయుష్ నవ్వుతూ.

“నోరు ముయ్యరా భడవా” అంటూ ప్రేమగా మనమడి నెత్తి మీద మొట్టికాయ వేసి, “తొందరగా కాళ్ళు, చేతులు కడుక్కుంటే భోజనాలు చెయ్యవచ్చు“అంది తాయారమ్మ .

డైనింగ్ టేబుల్ మీద అమర్చిన పదార్ధాలను వింతగా చూడసాగింది గుగు. ఎందుకంటే ఇండియా వచ్చినప్పటినుంచి కాలేజీ మెస్ లో ఏదో వింతఆకారాలు, విచిత్రమైన రుచులు కలిగిన ఆహారలకి అలవాటు పడిపోయింది. ప్రతి వారం టైంటేబుల్ ప్రకారం అవే  ఐటమ్స్ ఉంటాయి. కాని ఇక్కడ వడ్డించిన పదార్థాలు ఏవో కొత్త వాసనలు, రంగులతో ఉన్నాయి.

కోయరాజు ‘అమ్మాయి మంచిదే’ అని చెప్పిన తరువాత గుగు పట్ల తాయారమ్మ వైఖరిలో తేడా వచ్చింది.

“ఏమిటే పిల్లా!  అలా చూస్తున్నావు? పులిహోర, దద్దోజనం, బొబ్బట్లు, పరమాన్నం చేశాను. అన్నీ కాస్త కాస్త రుచి చూడు” అంది గుగుని ఉద్దేశించి తాయారమ్మ.

గుగు ఏమి అర్థం కానట్టు మోహం పెట్టింది. ఆయుష్ పగలబడి నవ్వుతూ “ఏమిటే అమ్మమ్మా! అలా చేప్పేసావు. ఆ అమ్మాయికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు” అన్నాడు .

“అవును కదూ! నా మతిమరపు మండా. నువ్వు కాస్త ఇంగ్లీష్ లో చెప్పరా” అంది తాయారమ్మ .

“గుగు దిస్ ఈస్ కాల్డ్ టైగర్ ఫుడ్” అంటూ పులిహోరని చూపించాడు .

“వ్హాట్?? టైగర్ ఫుడ్? బట్ టైగర్ విల్ నాట్ ఈట్ రైస్ !!” అంది గుగు ఆశ్చర్యంగా మోహం పెడుతూ .

“ది నేమ్ ఈస్ పులిహోర ఇన్ తెలుగు. టైగర్ మీన్స్ పులి. సో ఫుడ్ దట్ ఈస్ ఇన్ ది నేమ్ అఫ్ టైగర్ ఈస్ టైగర్ ఫుడ్“ అంటూ నవ్వుతూ వివరించాడు ఆయుష్.

ఆ తరువాత నివేదిత, మిగిలిన పదార్థాలు ఏమిటి, అవి ఎలా తాయారు చేస్తారు, వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి లాంటివన్నీ గుగుకి వివరించింది. గుగు అన్నీ ఆసక్తిగా వింది.

“ఏమిటే నివేదితా అలా అన్ని కొత్త కోడలకి వివరించి చెపుతున్నట్టు చెప్పావు. ఆ పిల్ల ఈ రోజు ఉండి రేపు వాళ్ళ దేశం పోయేది. దానికి ఎందుకు అవన్నీ. ఏదో మన వంటలు, మన రుచులు తింటుందని చేశాను. అదీ కాక రాకరాక నా మనవడు వచ్చాడు. అసలు ఎప్పుడూ రాని  నువ్వు వచ్చావు” అంది తాయారమ్మ .

“లేదు బామ్మగారు. గుగుకి ఇండియా కి వచ్చాక మన బాష అన్నా, మన తిండి అన్నా చాలా ఆసక్తి కలిగింది. కానీ తిండి ఇంకా సరిగ్గా తినలేకపోతోంది. ఇక మీకు తెలిసిన విషయమే...  ఏమిటంటే మన బాషని ఖూనీ చేస్తుంది” అంది నివేదిత నవ్వుతూ.

గుగుకి ఏదో అర్థం అయినట్టు, “మాకి తెల్గు వెళ్ళింది” అంది .

“కంగారు పడకండి బామ్మగారు... నాకు  తెలుగు వచ్చింది అని చెప్పబోయింది మా గుగు” అంది నివేదిత నవ్వుతూ .

“చాల్లేవే... నీ వేళాకోలం నువ్వున్నూ. ముందు భోజనాలు కానివ్వండి. అన్నం ముందు కూచుని అస్సలు మాట్లాడకూడదు అట. మీ తాత గారు అనేవారు” అంది తాయారమ్మ.

అందరూ తినడంలో మునిగి పోయారు. ఆయుష్, నివేదిత చక్కటి రుచి కలిగిన పదార్ధాలు తృప్తిగా తింటూ ఉంటే, గుగు మాత్రం కోడి కెక్కరించినట్లు తింటోంది.

“అమ్మమ్మా. గుగుకి కోడి కావాలేమో” అన్నాడు ఆయుష్.

         “నోరు ముయ్యరా. పాపం ఆ పిల్ల మన తిండి తినలేక ఓ పక్క అవస్థ పడుతుంటే ” అని ప్రేమగా మనవణ్ణి కసురుకుంది తాయరమ్మ .

“గ్రాండ్ మాచెల్లా బెగుండి” అంది గుగు పులిహోరని చూపిస్తూ .

“ఆరు నెలల్లో వారు వీరు అవుతారు అంటారు కదా బామ్మగారు. కానీ దీనికి వచ్చి ఆరునెలలు అయినా ఒక్క తెలుగు ముక్క మాట్లాడం రాలేదు. చాలా బాగుంది అంటోంది మీ ఆఫ్రికన్ మనుమరాలు గుగు” అంది నివేదిత.

“పోనేలేవే ....పాపం అభిమానంగా పొగుడుతోంది” అంది తాయారమ్మ గుగు వైపు మెచ్చుకోలుగా చూస్తూ .

“అవునులెండి. ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటారు. అలాగ మీకు నా కన్నా ఆ మనమరాలే నచ్చినట్టుంది” అంది నివేదిత .

“ఎందుక్ నివేదితా అలా ఫీల్ అయిపోతావు. అమ్మమ్మ గుగుని కూడా ఏక్సెప్ట్ చేయగలుగుతోంది అంటే ఆవిడని మెచ్చుకోవాలి” అన్నాడు ఆయుష్.

“అబ్బా నేనేదో తమాషాకి అన్నాను” అంది నివేదిత నవ్వుతూ .

గుగు కి ఏమి అర్థం కానట్టు  మోహం పెట్టింది .

“నువ్వు అర్జెంటుగా తెలుగు నేర్చుకో తల్లీ. హాస్టల్ దాటావంటే నేను పెద్ద  తర్జూమాదారు అవతారం ఎత్తాల్సి వస్తోంది” అంది నివేదిత గుగు వైపు తిరిగి.

నివేదిత బాష అర్థం కాకపోయినా భావం అర్థం అయినట్టు ఉంది గుగుకి .

“అగాలే”అంది.

మిగలిన ముగ్గురూ పకపకా నవ్వేసారు. వాళ్ళ నవ్వుతో తనూ శ్రుతి కలిపింది గుగు.

ఆ సాయంత్రం “అమ్మమ్మా! నాన్న, అమ్మా ఎదురు చూస్తుంటారు. భోగి అయిపోయింది కదా. ఇక సంక్రాంతి పండగ వాళ్ళతో గడపాలి. బయలుదేరుతాం” అన్నాడు ఆయుష్ తాయారమ్మతో.

“మంచిదిరా మనవడా. మీరు ఎలాంటి బట్టలు కొనుక్కుంటారో నాకు తెలయదు. ఇక ఆ గుగ్గు పిల్ల సంగతి చెప్పక్కర్లేదు” అంది తాయారమ్మ గుగు వైపు చూస్తూ .

“అబ్బా!! బామ్మగారు... గుగ్గు, ఉగ్గు కాదు. గుగు... అంటే వాళ్ళ బాషలో ఒక విలువైన వ్యక్తి అని అర్థం” అంది నివేదిత .

“పోనీలేవే. నా కొత్త మనమరాలు నేను ఎలా పిలిచినా పలుకుతుంది” అంది తాయారమ్మ .

‘అవును ‘అన్నట్టు తల ఊపింది గుగు.

“ఒరేయ్ మనవడా! ఈ ఏభై వేలు తీసుకుని, మీ ఊళ్ళో రేపే బట్టలు కొనుక్కోండి” అంటూ కొత్త అయిదు వందల రూపాయల కట్ట ఆయుష్ చేతులో ఉంచింది .

“ఇవన్నీ ఎందుకు అమ్మమ్మా? నీ దీవెనలకోసం వచ్చాం” అన్నాడు అయుష్ .

“ఈ డబ్బు నేను దీవించి ఇచ్చేదే” అంది తాయారమ్మ.

ఆయుష్, నివేదిత ఒకేసారి వంగి తాయారమ్మకి దణ్ణం పెట్టారు .

“శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవించింది తాయారమ్మ. అది ఎవరిని, ఇద్దరినీనా? లేదా ఇద్దరిని కలిపి దీవించిందా? అన్నది ఆ దేవుడికే తెలియాలి. తాయారమ్మ కర్ణాకర్ణిగా ఆయుష్ కి నివేదితని ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉవ్విళ్ళురుతున్నారని వింది. అలాగే తన కూతురు, అల్లుడు కూడా ఆ సంబంధం చేసుకోడానికి సంసిద్దులే అని తెలిసింది. అందుకని బహుశా దీవెన ఇద్దరినీ కలిపి అయి ఉంటుంది.

వాళ్ళను చూసి గుగు కూడా వంగి తాయారమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టింది .

“కళ్యాణ ప్రాప్తిరస్తు” అంటూ గుగు తల మీద చేతులు పెట్టి దీవించింది తాయారమ్మ. నివేదిత ఆ దీవెనకి అర్థం వివరించి చెప్పింది .

గుగు నవ్వుతూ, “గ్రాండ్ మా ఆఫ్టర్ బికమింగ్ డాక్టర్” అంది .

 “వెళ్ళి వస్తాం అమ్మమ్మా” అంటూ కారు వైపు నడిచాడు ఆయుష్ .

నివేదిత, గుగు కూడా తాయారమ్మకి చేతులు ఊపి కారు ఎక్కారు. కారు బయలదేరగానే తాయారమ్మ కి మళ్ళీ వంటరితనం ఆవహించింది.

*****************

సంక్రాంతి పండుగ  తమ తమ తల్లిదండ్రులతో అయుష్, నివేదిత గడిపి తిరిగి కాలేజీకి ప్రయాణమయ్యారు. గుగుకి కూడా ఆ రెండు రోజులు నూతనోత్సాహం వచ్చింది. మళ్ళీ కాలేజీ అనేసరికి కాస్త దిగులు ఆవహించింది ఆ ముగ్గురులో. కాని తప్పదు అన్నట్టు ప్రయాణమయ్యారు .

“పెళ్ళికి వెడుతూ పిల్లిని చంకన  పెట్టుకున్నట్టు ఆ ఆఫ్రికన్ పిల్లను ఎందుకు తీసుకువచ్చారో? వీళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలా” అంది సీత భర్త తో.

“అదేమిటి సీతా! పాపం ఆ పిల్ల ఏదో సరదాగా వచ్చింది. అయినా వీళ్ళిద్దరు భార్యా భర్తలు కాదు కదా. కేవలం స్నేహితులు. ఇంకో స్నేహితురాలు వాళ్ళతో కలిసి వచ్చింది” అన్నాడు జగన్నాధం .

“మీరూ అలా మాట్లాడుతారేమిటి? మనవాడికి ఆ నివేదితని ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారని తెలిసింది కదా. మనకూ అభ్యంతరం లేదు” అంది సీత.

“అవుననుకో... కానీ... అది ఎప్పుడో .చదువు అవ్వాలి. ఇద్దరూ స్థిరపడాలి... అప్పటిమాట కదా... అప్పుడు కూడా ఇద్దరూ ఒకరు ఒకరు ఇష్టపడాలి” అన్నాడు జగన్నాధం సాలోచనగా .

“ఎప్పడినుంచో అనుకుంటున్నదే కదా. వాళ్ళకి మనసులో ఉండే ఉంటుంది బయట పడలేదు అంతే” అంది సీత .

“కావచ్చు... కాని చాలా టైం ఉంది కదా. ఈ లోపల ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోక్కరలేదు”

“అదేమిటండి? ఏదైనా మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచేయడం మంచిది” అంది సీత.

“నువ్వు ఏం మాటలాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు !!??” అన్నాడు జగన్నాధం .

“ఇందులో అర్థం కాకపోడానికి ఏముంది!? ఆ పిల్ల వీళ్ళ మధ్య లోకి రాకూడదు” అంది సీత దృడంగా .

“నువ్వు చెప్పేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ పిల్ల వాళ్ళ క్లాసు మేట్. ఎక్కడో ఆఫ్రికా నుంచి వచ్చింది. ఆ పిల్లతో స్నేహంగా ఉండడం వలన మనకి, మన అబ్బాయికి వచ్చిన నష్టం ఏమిటి?” అని అడిగాడు జగన్నాధం .

“మీరు మరీ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు. తావలచినది రంభ అని ఏనాడో అన్నారు పెద్దలు” అంది సీత.

“సీతా... నీ అనుమానానికి... ఊహలకి... ఒక అర్థం ఉండాలి. ఏదో ఒక అమ్మాయితో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన అంత భయంకరంగా ఊహించుకోక్కర్లేదు. అయినా వాళ్ళు చదివేది మెడిసిన్. ఉండేది హాస్టల్. నీ కొడుకు ఇంకా ఎంత మంది అమ్మాయిలతో ఇంతకంటే ఎక్కువ చనువుగా తిరుగుతూ ఉన్నాడో! అది అక్కడ సహజం. అయినా ఈ రోజులలో అమ్మాయిలు, అబ్బాయిలు అతి చనువుగా తిరుగుతున్నారు. వాళ్ళు నైతిక హద్దులు దాటనంత వరకూ పరవాలేదు. ఏదో వేరే దేశం పిల్ల... వంటరిగా ఉంటోంది. కాస్త మన ఊర్లు, పండగలు, సంస్కృతి పరిచయం చేద్దామని తీసుకు వచ్చి ఉంటాడు. అయినా నివేదిత కూడా ఉంది కదా? దానికి ఇంత రాద్ధాంతం చేస్తావేమిటి సీతా?” అన్నాడు జగన్నాధం.

“మీకు మగవాళ్ళకి కొన్ని తెలియవండి. నా భయం నాది” అంది సీత .

“అర్థం లేని భయాలతో మనస్సు పాడు చేసుకోకు. ఇంకొక విషయం చెప్పనా? నిజంగా నువ్వు ఊహించినట్టే జరిగినా మనం ఏమీ చేయలేం. తెలుసుకో” అన్నాడు జగన్నాధం.

“ఏమండీ మరీ అలా మాట్లాడి నన్ను భయపెట్టకండి” అంది సీత అదోలా మోహం పెట్టి .

“నేను చెప్పేది కూడా అదే. నువ్వు లేనిపోనివి ఊహించుకొని భయపడవద్దు. అలాంటిది ఏమీ జరగదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నాలుగేళ్ళ తరువాత ఆ అమ్మాయి ఎవరో? మన వాడు ఎవరో?” అన్నాడు జగన్నాథం.

“అంటే పిల్ల మరీ కొరివి లా ఉందండి “

“ఇంత చెప్పాక కూడా... అయితే... పిల్ల తెల్ల తోలుది అయితే ఏ దేశానిది అయినా, ఏ జాతిది అయినా పరవాలేదా? సీతా నువ్వు అనుకుంటున్నది అంతా కేవలం నీ భ్రమ. యు ఆర్ సీయింగ్ ఫాన్తోమ్స్” అన్నాడు జగన్నాధం అనునయంగా సీత భుజం మీద చెయ్యి వేస్తూ.

“అంతేనంటారా? మన అబ్బాయికి, నివేదిత కి పెళ్ళి అవుతుంది కదా” అంది సీత.

“తప్పకుండా” అంటూ “ఒక మంచి కాఫీ ఇయ్యి. తాగి అలా వాకింగ్ కి వెళ్ళి వస్తా” అంటూ అక్కడే ఉన్న ఆ రోజు పేపర్ అందుకున్నాడు జగన్నాధం. సీత ఇంకా ఏదో ఆలోచిస్తూనే వంటింట్లోకి నడిచింది .

*********************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts