మానూ మాకును కాను – నవల – 6 | 2019 స్వాతి పత్రిక అనిల్ అవార్డ్ పొందిన నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad

Vijaya Lakshmi

Published on Oct 24 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మానూ మాకును కాను – పార్ట్ 6

2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల

రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

కాలేజీకి వెళ్ళిన తరువాత ఆయుష్, నివేదిత, గుగు తమ చదువుల్లో పడిపోయారు. రోజులు వేగంగా గడవసాగాయి. ఫస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పరీక్షలు అయ్యాయి. కొన్ని సబ్జెక్ట్ లలో  ఆయుష్ క్లాసు ఫస్ట్ వస్తే, కొన్ని సబ్జెక్టులలో నివేదిత ఫస్ట్ వచ్చింది. సహా విద్యార్థులను, ప్రోఫ్ఫెస్సోర్లను ఆశ్చర్యపరుస్తూ గుగు కొన్ని సబ్జెక్టులలో ఫస్ట్ వచ్చింది. గుగు ఆఫ్రికా బాలిక కావచ్చు. కాని తెలివితేటలకి, చదువుకి, దేశ, కుల, మత, ప్రాంతీయ, లింగబేదం లేదని గుగు రుజువు చేసింది. అంతవరకు గుగుని కాస్త చిన్నచూపు చూసిన తోటి విద్యార్ధులు, కాలేజీ ఫాకల్టీ గుగుని గౌరవించడం నేర్చుకున్నారు.

ఆ ఆదివారం సాయంత్రం పార్క్ లో కలిసిన ఆయుష్, నివేదిత, గుగు, శరణ్య, స్నేహ, హసిత త్వరలో రాబోయే ఫైనల్ పరీక్షల గురించి, వాటికీ తాము ఎలా ప్రిపేర్ అవ్వాలి మొదలగు విషయాలు  వివరంగా చర్చించుకున్నారు. గుగు ఇప్పుడు తెలుగు మాట్లాడడం నేర్చుకుంది.

“ఆయుష్  గుగు నీ గోల్డ్ మెడల్ లిస్టుకి గండికొట్టేలా ఉంది. మన కాలేజీలోనే నీకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక యూనివర్సిటీ లెవెల్ లో కూడా మీ ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. జాగ్రత్త” అంటూ నవ్వుతూ హెచ్చరించింది నివేదిత.

“నాకే కాదు. మీకూ పోటీయే” అన్నాడు అయుష్  నవ్వుతూ .

“నేను హేవ్వర్కి పోటీ కాదు. నేను అంత తెల్వి గల దానిని గదు. ఏదో చద్వు కోసం హిక్కడకి వచ్చాన్. మీర్ అంతా ఫస్ట్ వస్తార్” అంది గుగు నేర్చుకుంటున్న తెలుగులో.

“అమ్మా గుగు చాపకిందనీరులా మాకు ఎసరు పెడుతున్నావు” అంది శరణ్య.

శరణ్య తెలివైన అమ్మాయి. ఇంటర్ లో స్టేట్ రాంకర్. అయితే అంత తెలివైన శరణ్యకి ఒక్క సబ్జెక్టు లో కూడా ఫస్ట్ మార్క్ రాలేదు. నీట్ లో బాగా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకని డొనేషన్ కట్టి అక్కడ జాయిన్ అయ్యింది.


“చప్ప కిండ నేరు అంటే !?” అని అడిగింది గుగు.

“నీలాంటి వాళ్ళను అలా అంటారు “ అంది స్నేహ .

“సూదిలా వచ్చి దబ్బనం అయ్యావు తల్లీ. చదువులో మమ్మల్ని అందరిని మించిపోతున్నావు” అంది హసిత.

గుగు కి వాళ్ళ వేళాకోలాలు అర్థం కాలేదు .

“నేను హేమ టాప్పు చేసాన్ ?”అని అడిగింది నివేదితను .

“గుగు నువ్వు ఏమీ తప్పు చేయలేదు. వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయని వాళ్ళే ఉడుక్కుంటున్నారు” అన్నాడు ఆయుష్. అతని మాటలకి అర్థం తెలియక బ్లాంక్ ఫేస్ పెట్టింది గుగు.

ఇంగ్లీష్ లో వివరించాడు ఆయుష్. నవ్వింది గుగు.

“గుగు ఏదో సరదాకి అన్నాం గాని నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి, అయినవాళ్ళని అందరినీ వదిలేసి ఇక్కడకు వచ్చి చదువుకుంటూ మమ్మల్ని మించిపోతున్నావంటే మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సారి యూనివర్సిటీ లెవెల్ లో నువ్వూ, ఆయుష్ లు గోల్డ్ మెడల్స్ సంపాదించాలి. మేము కూడా కనీసం మీ దరిదాపుల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బెస్ట్ అఫ్ లక్ “అంటూ గుగుకి చేయి అందించింది శరణ్య. అందరూ చప్పట్లు కొట్టారు.

“ఏయ్ శరణ్య! నువ్వు ఏదో అలా అనేసి తప్పించుకుందామనుకుంటున్నావా? అదేం కుదరదు. ఈసారి మన గ్రూప్ లో వాళ్ళం అందరం పోటీపడి గోల్డ్ మెడల్స్ తెప్పించుకోవాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు“ అంది నివేదిత .

“ఏమో తల్లీ... మేము నీ అంత తెలివైన వాళ్ళం కాదు” అంది హసిత .

“అలా అని షికార్లు, సినిమాలు చూస్తూ గడిపెయ్యోచ్చనా? ఎంత తెలివి తేటలు. హసితా! నువ్వు క్లాసులో ఎవరి కేసి దొంగ చూపులు చూస్తున్నావో నాకు తెలిసిపోయిందిలే” అంది శరణ్య .

“దొంగ చూపులా... కంగ్రాట్స్.. ఎవరే ఆ కలల రాజకుమారుడు? మాకు కాస్త వారి పరిచయ భాగ్యం కలిగించకూడదు” అంది స్నేహ .

హసిత నవ్వి ఊరుకుంది.

“ఓహో... హసిత ఎవరినో తన దరహాసంతో పడేసింది. ఇక ఈవిడగారిది, ఆ ప్రభుద్ధిడిది చదువు అటక ఎక్కినట్లే. పోనీలే ఒక పోటీదారు తగ్గింది అనుకుందాం” అన్నాడు ఆయుష్.

“పెళ్ళి ఎప్పుడు హసిత ?” అని అడిగింది నివేదిత .

“అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. అలా ఉంది నువ్వు అడిగేది. అతను చదువు పూర్తి అయ్యేవరకు పెళ్ళి గిళ్ళి లేదు పొమ్మన్నాడు” అంది హసిత.

“అంటే నువ్వు రడీ అన్నమాట. పాపం అయిదు ఏళ్ళు కనీసం వెయిట్ చెయ్యాలి... సరేలేగాని... పెళ్ళి లోపల ఏమి పిచ్చి వేషాలు వెయ్యకు. జాగర్త. రోజులు అస్సలు బాగా లేవు” అంటూ హసితని హెచ్చరించింది  నివేదిత .

“ఏమిటి నివేదితా! నేను అంత తెలివితక్కువదానిలా కనిపిస్తున్నానా? లేక అతను అంత మోసగాడు అనుకుంటున్నావా?” అంది హసిత కాస్త కోపంగా .

“కోపం తెచ్చుకోకు హసితా. నివేదిత నీ బాగు కోరే చెపుతోంది. అది తెలుసుకో. మన పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు చూడు. అలాగ ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అని నిర్ణయించుకోలేని వయసు మనది. ఇక నుంచి ఆ విషయంలో మేము ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏమి అన్నా నీ బాగుకోసమే అని తెలుసుకో” అంది స్నేహ.

“నిజం హసిత. మనందరం ఒకటి. ఎవరికీ ఏ ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చినా ఒకరికి ఒకరం. లేకపోతే నిజమైన స్నేహానికి అర్థం లేదు. ప్లీజ్ టేక్ అస్ ఇన్ టూ కాన్ఫిడెన్సు” అన్నాడు ఆయుష్ సీరియస్ గా.

“ఓ.కే.మీరందరు నాకు తోడు ఉన్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది” అంది హసిత. నిజానికి పైకి ఆ మాట అంది గాని లోలోపల ‘వీళ్ళందరూ నా పర్సనల్ విషయంలో పట్టించుకుంటున్నారు ఏమిటి‘ అనుకుంది.

బాగా లేట్ అయ్యింది ఇక ఎవరి రూమ్ కి వాళ్ళు పయనిద్దామా?” అన్నాడు ఆయుష్ నవ్వుతూ .

అందరూ పార్క్ నుంచి మెల్లిగా బయలుదేరి ఎవరి రూమ్ కి వాళ్ళు చేరుకున్నారు .

*********************

సెకండ్ సెమిస్టరు పరీక్షలు మొదలు అయ్యాయి. కాలేజీలో విద్యార్ధులు అందరూ ఆ హడావిడిలో పడిపోయారు. కనీసం ఒకరిని ఒకరు పలకరించుకోవడం కూడా లేదు.

రెండు పరీక్షలు అయ్యాయి. ఆయుష్, అతని ఫ్రెండ్స్ అందరూ బాగానే రాసారు. మూడవ పరీక్ష ముందు రోజు గుగుకి జ్వరం వచ్చింది. నివేదిత, గుగుని, హాస్టల్ లో ఉండే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. డాక్టర్ పరీక్ష చేసి ఏవో మందులు రాసాడు. నివేదిత, గుగు ని రూమ్ లో వదిలేసి, మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తెచ్చి ఇచ్చింది. అలాగే బ్రెడ్, బిస్కెట్స్ కొని ఇచ్చింది.

“గుగు... రెస్ట్ తీసుకో. ఇన్నాళ్ళు చదివావు కదా. ఈ ఒక్క రోజులో ఏమీ అయిపోదు. రేపు పరీక్ష టైంకి జ్వరం శుభ్రంగా తగ్గిపోతుంది. పరీక్ష మామూలుగా రాయొచ్చు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి వస్తాను” అని చెప్పి తన రూమ్ కి వెళ్ళింది  నివేదిత.

జ్వరం రావడంతో చాలా కాలం తరువాత గుగుకి మళ్ళీ బెంగ అనిపించింది. తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. వెంటనే ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడింది. ఇద్దరూ గుగుకి ధైర్యం చెప్పారు. గుగు ఫ్రెండ్స్ లాంటి ఫ్రెండ్స్  ఉండడం చాలా అదృష్టమన్నారు. అటువంటి వాళ్ళు దగ్గర ఉండగా గుగు దేనికి బెంగ, భయపడక్కర్లేదని చెప్పారు. అప్పటికి గుగు బెంగ కాస్త తగ్గింది. ఒక పక్క జ్వరం  తీవ్రత, మరొక పక్క బెంగతో గుగుకి తిండి ఏమీ  సహించలేదు. కాని మందులు వేసుకోవాలి గనుక బలవంతంగా కొంచం తిని, మందులు వేసుకుని పడుకొంది. కాని నిద్ర పట్టలేదు. తెల్లవార్లూ జాగరణ చేసింది. ఆమెకి తల్లితండ్రుల మీద బెంగతో పాటు మరునాడు పరీక్ష ఎలా రాస్తానా? అనే బెంగ మొదలయ్యింది.

తెల్లవారిన తరువాత నివేదిత గుగు రూమ్ కి వెళ్ళింది. గుగుకి ఇంక జ్వరం తగ్గలేదు. వెంటనే ఆయుష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయుష్ గుగు రూమ్ కి వచ్చాడు.

“ఆయుష్ ఈ అమ్మాయికి జ్వరం అలాగే ఉంది. మరి పరీక్ష...” అంది నివేదిత .

“నేను ఎక్షామ్ రాస్తాను” అంది గుగు.

“కాని ఇక్కడనుంచి హాల్ వరకు అర కిలోమీటర్ ఎలా నడవగలవు?” అని గుగుని ప్రశ్నించింది నివేదిత .

“ఒక పని చేద్దాం.అనాటమీ రీడర్ ఒకాయిన నాకు బాగా పరిచయం అయ్యాడు. ఆయన కారు తీసుకుని హాల్ వరకు గుగుని తీసుకువెళదాం. అలాగే పరీక్ష అయిపోయిన తరువాత  అదే కారులో హాస్టల్ లో దింపేద్దాం. తరువాత పరీక్షకి నాలుగు రోజులు టైం ఉంది కనుక పరవాలేదు” అన్నాడు ఆయుష్.

“ఆ అయిడియా బావుంది. ఏం గుగు అలా చేద్దామా?” అంది నివేదిత .

నీరసంగా నవ్వుతూ “థాంక్స్” అంది గుగు.

ఆయుష్ వెంటనే గుగు కి కారు అరేంజ్ చేసే పని లో నిమగ్నం అయ్యాడు .

నివేదిత గుగు రెడీ అవడానికి సహాయం చేసింది.

అనుకున్న ప్రకారం పరీక్షకి గంట ముందు కారు వచ్చింది.కారులో ఆయుష్, నివేదిత, గుగు బయలుదేరి పరీక్ష హాల్ కి వెళ్ళారు.

****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts