మానూ మాకును కాను – నవల – 7 | 2019 స్వాతి పత్రిక అనిల్ అవార్డ్ పొందిన నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad

Vijaya Lakshmi

Published on Oct 25 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మానూ మాకును కాను – పార్ట్ 7

2019 స్వాతి పత్రిక, అనిల్ అవార్డ్ పొందిన నవల

                               రచన : శ్రీ. ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్


గుగు జ్వరం ఉన్నా పరీక్ష బాగానే రాసింది. ఆ విషయం విన్న ఫ్రెండ్స్ అందరూ సంతోషించారు. గుగుకి జ్వరం ఇంకో రెండు రోజులకి తగ్గింది. ఫ్రెండ్స్ అంతా వంతులు వేసుకుని గుగు రూమ్ లో ఉన్నారు.

ఆ జ్వరం ఎపిసోడ్ తో గుగు తో స్నేహబంధం ఫ్రెండ్స్ కి మరింత బలపడింది.

గుగు ఆ తరువాత పరీక్ష నడిచి వెళ్ళే రాసింది. మిగిలిన పరీక్షలు అన్నీ చాలా బాగా రాసింది.

ఆ విషయమే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఎంతో సంతోషించారు. గుగు తండ్రి అడోఫో, తల్లి చికె నివేదితతోను, ఆయుష్ తోను ఫోన్లో మాట్లాడారు. మొదట తమను తాము పరిచయం చేసుకుని, తరువాత ఇద్దరికీ థాంక్స్ చెప్పారు. ఆయుష్, నివేదిత కూడా గుగు తల్లితండ్రులతో మాట్లాడే అవకాశం  వచ్చినందుకు సంతోషించారు. అడోఫోకి, చికేకి తమ కూతురు గురించి ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనీ. అన్నీ తాము చూసుకుంటామని నివేదిత, ఆయుష్ లు అభయం ఇచ్చారు.

అది మొదలు చికె తరుచుగా నివేదితతో మాట్లాడడం ప్రారంభించింది.

”ఏమ్మా. నువ్వు నివేదితనే నీ కూతురు చేసేసుకుని నన్ను మర్చిపోయేలా ఉన్నావే” అంటూ తల్లిని వేళాకోళం ఆడింది గుగు. నవ్వుకుంది గుగు తల్లి చికె. ఆ తరువాత ఒక రోజు శరణ్య, స్నేహ, హసిత కూడా చికెతో మాట్లాడారు.

ఏదైనా మన మంచికే అన్న పెద్దల నానుడి గుగు విషయంలో నిజం అయ్యింది అనే చెప్పాలి.ఎందుకంటే గుగుకి జ్వరం రావడం వల్ల, స్నేహ బృందంతో, అంతకు ముందే గట్టిగా ఉన్నస్నేహం, మరింత బలపడింది. అలాగే గుగు తల్లిదండ్రులు గుగు ఫ్రెండ్స్ కి పరిచయం అయ్యారు.

పరీక్షల పర్వం ముగిసి తిరిగి కాలేజీ ప్రారంభం అయ్యింది .

ఫస్ట్ ఇయర్ లో  రెండు సెమిస్టరులలో  ప్రీ క్లినికల్ సబ్జక్ట్స్ అయిన అనాటమీ, ఫిసియోలోజి, బయో కెమిస్ట్రీ అయ్యాయి.

సెకండ్ ఇయర్ క్లాసులు మొదలు అయ్యాయి. సెకండ్ ఇయర్ లో అంటే మూడు, నాలుగు, అయిదు సెమిస్టరులలో పారా క్లినికల్ సబ్జక్ట్స్ అయిన కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, ఫార్మకోలోజి, మైక్రో బయోలజి విద్యార్ధులకి నేర్పిస్తారు. ఆ సబ్జెక్ట్స్ ద్వారా ఒక స్టూడెంట్ డాక్టర్ అవడానికి తొలి అడుగులు వేసినట్టు అవుతుంది. ఆ సెమిస్టరులలోనే, విద్యార్థులకి, ఆసుపత్రిలో వార్డ్స్ లో రోగులతో ప్రత్యక్ష సంబంధం మొదటిసారిగా ఏర్పడుతుంది. రాను రాను చదువు మీద ఎక్కువ శ్రద్ధ ,ఎక్కువ దృష్టి పెట్టవలిసి ఉంటుంది.అలాగే ఒక విధంగా చెప్పాలంటే చదువు ఆసక్తికరంగా ఉంటుంది.

ఆ తరువాత ఆరు నుంచి తొమ్మిది సెమిస్టరులలో వివిధ శారీరక వ్యాధుల గురించి, చికిత్సా విధానం గురించి వివరించపడుతుంది. ఆ తరువాత వివిధ వార్డులలో స్టూడెంట్ గా విషయాలు నేర్చుకుంటారు.

మెడిసిన్ కోర్స్ అయిన తరువాత వార్డులలో చికిత్స చేయడం నేర్చుకుంటారు, ఆ విధంగా ట్రైన్ అవుతారు.

గుగుకి ఇంటిమీద మనస్సు మళ్ళింది. ఆ విషయమే నివేదితతో ప్రస్తావించింది.

“అదేమిటి గుగు. ఒక పక్కన కొత్త సబ్జక్ట్స్ ప్రారంభం అవుతూంటే ఇప్పుడు ఇల్లు అంటావు!?” అంది నివేదిత.

“నివేదిత మా వాళ్ళను చూడాలని ఉంది. ఎంత వీడియో చాటింగ్ చేసినా ఏదో బెంగగా ఉంటోంది” అంది గుగు.

 “తెలుగు చక్కగా నేర్చుకున్నావు. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు ఇంక నీకు బెంగ దేనికి !?” అంది నివేదిత నవ్వుతూ.

“నీకు అలాగే ఉంటుంది... ఒకసారి వెళ్ళి వస్తే... కాస్త బాగుంటుంది అనిపిస్తోంది” అంది గుగు.

“ఇప్పుడు వెళ్ళకూడదు గుగు. అన్నీ మిస్ అయిపోతావు. నీకు తెలుసు కదా. మనం ఒక్క రోజు మిస్ అయినా ఎంతో కోల్పోతాం. చాలా రోజులు మానేస్తే మళ్ళీ దారిలో పడడం కష్టమేమో ఆలోచించుకో ” అంది నివేదిత.

“నాకు తెలుసు. ఒక్క పది రోజులు...” అంది గుగు.

గుగు మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న నివేదితకి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు.

“పోనీ ఆయుష్ ని అడుగుదామా? ఏం సలహా ఇస్తాడో” అంది నివేదిత.

“అలాగే. అతను ఏమంటాడో చూద్దాం. కాని నివేదితా నేను ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటున్నాను” అంది గుగు స్థిరమైన స్వరంతో.

“సరే వెడుదువుగాని. కాని ఆయుష్... ఎన్ని రోజులు ఉండవచ్చో మనకంటే బాగా అలోచించి సలహా ఇస్తాడు. అలాగే అతనికి కొంత మంది రీడర్స్, ప్రోఫ్ఫెసర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళ సలహా కూడా తీసుకుని కరెక్ట్ డెసిషన్ సజెస్ట్ చేయగలడు” అంది నివేదిత సాలోచనగా.

“అయితే సాయంత్రం అతని రూమ్ కి వెళదాం” అంది గుగు.

“ఓ.కే. పద ఫార్మకాలజీ క్లాసు ఉంది. ఈ రోజు క్లాసు ప్రోఫ్ఫెసర్ మేడం తీసుకుంటుందట. ఆవిడ అసలే చండ శాసనరాలుట”అంది నివేదిత.

 “చండ శాసనరాలు అంటే !?” అని అడిగింది .

“అమ్మా తల్లీ! నీకు తెలుగు నేర్ప, నేర్పి నేను తెలుగు పండితురాలిని అయ్యేలా ఉన్నాను. నా డాక్టర్ గిరి అటక ఎక్కేలా ఉంది. చండశాసనరాలు అంటే తను చెప్పినది వినకపోతే చర్మం వలుస్తుంది అన్నమాట” అంది నివేదిత.

“ నా నల్ల చర్మం ఏం ఉపయోగములే?” అంది గుగు .

“మళ్ళీ మొదలు పెట్టావా నీ ధోరణి!” అంటూ గుగు చెయ్య పట్టుకుని ఫార్మకాలజీ డిపార్టుమెంటు వైపు బయలుదేరింది నివేదిత .

ఆ సాయంత్రం గుగు, నివేదిత కలిసి ఆయుష్ రూమ్ కి వెళ్ళారు. ఆయుష్ ఇద్దరినీ ఆహ్వానించాడు.

“రండి ..రండి ..దయచేయండి“ అన్నాడు అయుష్ నవ్వుతూ.

“ఓహో ఆయుష్ నీకు పాటలు కూడా వచ్చా!? నాకు తెలియదే” అంది నివేదిత తను కూడా నవ్వుతూ.

“నాకే ఇంక చాలా కళలు వచ్చు కాని ఇంతకీ మీరు వచ్చిన విశేషం ఏమిటి ?” అని అడిగాడు ఆయుష్.

గుగు ఆయుష్ రూమ్ అంతా  పరిశీలించసాగింది. ‘చాలా అందం గా పెట్టుకున్నాడే రూమ్’ అనుకుంది గుగు.

“ఆయుష్ నీ రూమ్ చాలా అందంగా ఉంచుకున్నావే” అంది గుగు ప్రసంశాపూర్వకంగా.

“నా హృదయం కూడా అలాగే నీట్ గా ఉంటుంది“ అన్నాడు  ఆయుష్.

ఆయుష్ ఆ మాటలు ఏదో సరదాకి అన్నా, అవి గుగు మనస్సు మీద చాలా ప్రభావం చూపాయి. నివేదిత ఒకసారి ఆయుష్ ని చురుగ్గా చూసింది .

“అదే ఆయుష్... గుగు వాళ్ళ ఊరు వెడుతుందట. నేనేమో ఇప్పుడు కొత్తగా క్లాసులు ప్రారంభం అవుతున్నాయి కదా ఎందుకు అంటున్నాను” అంది నివేదిత.

“నిజమే. సెమిస్టరు జస్ట్ ప్రారంభం అయ్యింది. వెళ్ళడం రావడం అంటే కనీసం పది, పదిహేను రోజులు పడుతుంది” అన్నాడు ఆయుష్.

“పది రోజులలో వచ్చేస్తాను“ అంది గుగు.

“అసలు ఇప్పుడు ఎందుకు వెళ్ళడం!?” అని గుగు ని అడిగాడు ఆయుష్ .

“అదేమిటి ఆయుష్ అలా మాట్లాడతావు? ఆడ పిల్ల. ఎక్కడో దూరదేశంలో ఉంటోంది. తల్లిదండ్రులను చూడాలని, వాళ్ళతో నాలుగు రోజులు గడిపి వద్దామని అనుకుంటోంది” అంది నివేదిత.

“మరి చదువు...” అర్తోక్తిలో ఆగిపోయాడు ఆయుష్.

“నువ్వు అమ్మకూచిలా నెలకి ఒకసారి మీ ఊరు వెళ్ళి వస్తావు. పాపం ఆ అమ్మాయి వచ్చి ఏడాది దాటిపోయింది.”

“అలా అయితే సెకండ్ సెమిస్టరు పరీక్షలు అవగానే వెళ్ళవలిసింది. ఇప్పుడా!?” అన్నాడు ఆయుష్.

“ఇప్పుడు వెళ్ళాలనిపించింది. నీకు స్టాఫ్ కొంతమందితో పరిచయం ఉంది కదా. వాళ్ళని అడిగితే సలహా ఇస్తారు కదా” అంది నివేదిత.

“ఊ... గుగు... నేనో సలహా చెప్పనా?”అన్నాడు ఆయుష్ .

“చెప్పు ఆయుష్” అంది గుగు.

“మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారో... నువ్వు చెప్పావు కాని నేను మర్చిపోయాను” అన్నాడు ఆయుష్ .

“మా నాన్నగారు పేరు అడోఫో. మా అమ్మగారి పేరు చికె...” అంటూ చెప్పసాగింది గుగు.

“నిన్ను మీ ఫ్యామిలీ బయోడేటా చెప్పమనలేదు” అన్నాడు ఆయుష్ నవ్వుతూ.

         ఆ మాటలకి గుగు చిన్నబుచ్చుకుంది .

అది చూసి, “ఊర్కో ఆయుష్’... వేళాకోళానికి కూడా సమయం సందర్భం ఉండాలి”  అంటూ కసురుకుంది నివేదిత.

“ఊరికే సరదాగా అన్నాను గుగు. డోంట్ టేక్ ఇట్ సీరియస్. చెప్పు“ అన్నాడు ఆయుష్.

“మా నాన్నగారు టీ ,కాఫీ ,రక రకాల పళ్ళు మా తోటలలో పండిస్తారు .వాటిని ఇంగ్లాండ్ వంటి దేశాలకి ఎగుమతి చేస్తారు .” అంది గుగు.

“అంటే ఆయనికి స్టాఫ్, అసిస్టెంట్స్ ఉంటారు కదా?” అని అడిగాడు ఆయుష్.

“ఆయనిది చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఆయన దగ్గర కొన్ని వందలమంది పని చేస్తారు” అంది గుగు.

         “మరి ఆయనకి ఇంగ్లాండ్ కనెక్షన్ ఉన్నప్పుడు నువ్వు మెడిసిన్ కి ఇంగ్లాండ్ వెళ్ళలేకపోయవా!?” తన సందేహం వెలిబుచ్చాడు .

“నాకు అంత మెరిట్ లేదు. అదీ కాక నాకు చిన్నప్పడినుంచి భారతదేశం అన్నా, భారతీయులన్నా, భారతీయ సంస్కృతి అన్నా చాలా ఇష్టం. అందుకనే ఇండియా వచ్చాను” అంది గుగు .

“గుగు... అంటే మీ నాన్నగారు కొన్నాళ్ళు అక్కడ లేకపోయినా పరవాలేదు కదా? ఐ మీన్ బిజినెస్ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు కదా?” అని అడిగాడు ఆయుష్.

“మా నాన్నగారు అస్తమానూ బిజినెస్ పనిమీద ఇంగ్లాండ్, ఇంకా వేరే దేశాలు వెడుతుంటారు” అంది గుగు.

“అయితే ఐడియా. మీ పేరెంట్స్ ని ఇక్కడకు రమ్మను. కొన్నాళ్ళు నీ దగ్గర ఉండి, తరువాత దేశంలో ముఖ్యమైన వింతలు, విశేషాలు చూసి వెడతారు” అన్నాడు ఆయుష్.

“ఈ ఐడియా చాలా బాగుంది ఆయుష్. గుగు... అలా రమ్మని మీ అమ్మగారికి ఫోన్ చెయ్యి. వాళ్ళు నిన్ను, నువ్వు వాళ్ళని చూస్తారు. అలాగే నీతో కొన్నాళ్ళు గడుపుతారు. ఏమంటావు?” అని గుగు ని అడిగింది నివేదిత.

“ఆయుష్ యు ఆర్ ఏ జీనియెస్” అంది గుగు ఆయుష్ వైపు మెచ్చుకోలుగా చూస్తూ.

“ఇక ప్రాబ్లం సాల్వ్ అయి పోయినట్టేగా” అన్నాడు ఆయుష్.

“ఇపుడే అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాను” అంది గుగు హుషారుగా.

“నేను ఎవరితోనన్నా మాట్లాడి, మన హాస్టల్ కి దగ్గరే ఉన్న గెస్ట్ హౌస్ లో, వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తాను “ అన్నాడు ఆయుష్.

అది జరిగిన పదిహేను రోజులకి గుగు తల్లిదండ్రులు రాంపూర్ మెడికల్ కాలేజీ హాస్టల్ కి వచ్చారు.

వాళ్ళని చూడగానే ఇద్దరినీ ప్రేమగా కౌగలించుకుని ఏడ్చేసింది గుగు.ఆమె తల్లి చికె కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది .

తండ్రి అడోఫో “ఏమిటి గుగు! చిన్న పిల్లలా. చూడు మీ క్లాసుమేట్స్ అంతా ఎలా చూస్తున్నారో. నా తల్లి ధైర్యవంతురాలిగా ఉండాలి. ఇలా పిరికిగా ఉంటే ఎలా?” అంటూ గుగు ని దగ్గరికి తీసుకున్నాడు.

సంభాషణ వాళ్ళ మాతృ బాష అయిన “కికుయు“ బాషలో నడుస్తోంది.

“దానికి ఇంత మంది మంచి ఫ్రెండ్స్ దొరకడం మన అదృష్టం అడోఫో. గుగు మేము నాలుగు రోజులు ఉంటాం తరువాత వెళతాం. నువ్వు మీ ఫ్రెండ్స్ తోనే గడపడం, కష్ట సుఖాలు పంచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పడికే చాలా నేర్చుకున్నావనుకో”అంది గుగు తల్లి చికె .

         కాలేజీలో కొంతమంది గుగు తల్లిదండ్రులను ఆసక్తిగా చూస్తే, మరి కొంతమంది ‘ఇదెక్కడి నల్ల మేళంరా? పిల్లకి తోడు పెద్ద ఆకారాలు కూడా కాలేజీకి వచ్చాయే?’ అనుకున్నారు.

“అమ్మా, నాన్నా మీకు మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను” అంటూ “దిస్ ఈస్ అయుష్, దిస్ ఈస్ నివేదిత, దిస్ ఈస్ శరణ్య, దిస్ ఈస్ స్నేహ, దిస్ ఈస్ హసిత” అని తనకి బాగా దగ్గర ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది. అలాగే అక్కడే ఉన్న ఇంకొంత మంది క్లాసు మేట్స్ ని కూడా పరిచయం చేసింది. అడోఫో ,చికె అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అ తరువాత సంభాషణ ఇంగ్లీష్ లో సాగింది.

*****************************

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో 

Recent Posts