Vijaya Lakshmi
Published on Oct 26 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
“అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు, అదీ సరిగ్గా పరీక్షల సమయంలో వచ్చినప్పుడు, మీ అందరూ చేసిన సహాయం మరువలేనిది. దానికి మేము సర్వదా కృతజ్ఞులం. ముఖ్యంగా ఆయష్కి,నివేదిటకి ప్రత్యేక థాంక్స్” అన్నాడు అడోఫో. చికె ఇంచుమించు అలాగే అంది.
“నాన్నా నివేదిట కాదు. నివేదిత. అలాగే ఆయష్ కాదు. ఆయుష్” అంది గుగు నవ్వుతూ.
“సరేనమ్మా. మేము ఈ దేశం లో ఇప్పుడే కాలు పెట్టాం. నీలా అంతకాలం ఉంటే నీకంటే బాగానే మాట్లాడుతాను” అన్నాడు అడోఫో నవ్వుతూ తన కూతురుతో.
“గుగు మీ పేరెంట్స్ కి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్ళు. వాచ్ మాన్ అక్కడే ఉంటాడు .తాళాలు తీసుకో. నివేదిత నువ్వు కూడా వెళ్ళు. ఓ కే సర్ హావ్ ఏ నైస్ అండ్ హ్యాపీ స్టే ఇన్ ఔర్ కాలేజీ .యు కెన్ విసిట్ నెంబర్ అఫ్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. యు కెన్ కాల్ అపాన్ మీ ఎనీ టైం ఫర్ ఎనీ థింగ్ “” అంటూ అడోఫోకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయుష్.
“థాంక్ యు సో మచ్ ఆయష్” అంటూ భార్య, కూతురుతో గెస్ట్ హౌస్ వైపు వెళ్ళాడు అడోఫో.
గుగుకి తల్లిదండ్రులు ఉన్న వారం రోజులు ఏడు సెకన్లలా గడిచిపోయాయి .
వాళ్ళు వెళ్ళే రోజు వచ్చేసరికి మళ్ళీ బెంగ పెట్టుకుంది .
ఆయుష్ ఇంకా తక్కిన ఫ్రెండ్స్ గుగుని ఉత్సాహపరిచారు .
“ఫ్రెండ్స్. ఇక్కడ మా స్టే చాలా ఎంజాయ్ చేసాం. మీ అందరూ మా గుగుతో ఒకసారి కెన్యా వచ్చి మా ఆతిధ్యం స్వీకరించాలని నా అభ్యర్ధన” అని అంటూ, గుగు స్నేహితులు అందరికీ, భారతీయ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించాడు అడోఫో.
చికె కూడా అందరికి చేతులు జోడించి నమస్కరించింది .
“గుగు మీ వాళ్ళకి అన్నీ నేర్పించేసావే” అంది శరణ్య నవ్వుతూ.
“గుగు మనలా మారిపోలా” అంది స్నేహ.
“గుగు చూస్తుంటే నువ్వు ఇక్కడ అబ్బాయినే పెళ్ళి చేసుకుని ఇక్కడే ఉండి పోయేలా ఉన్నావు” అంది హసిత నవ్వుతూ .
హసిత మాటలు విన్న గుగు తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ గట్టిగా నవ్వారు. గుగు సిగ్గు పడింది. ఆమె క్షణంలో వెయ్యోవంతు ఆయుష్ వైపు చూసి తల తిప్పుకుంది.
ఆయుష్ ఏర్పాటు చేసిన కాబ్ లో ఎక్కి అందరికి చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు గుగు తల్లిదండ్రులు .
గుగు బరువైన హృదయంతో వాళ్ళకి చేతులు ఊపింది. వాళ్ళ కారు కనిపించే వరకు ఆటే చూస్తూ ఉండిపోయింది గుగు.
*******************
పారా క్లినికల్ క్లాసులు మొదలు అయ్యినప్పటినుంచి విద్యార్ధులకి చదువు భారం పెరిగిపోయింది. ఇంతకు ముందు ఆదివారాలు పార్క్ లో రెగ్యులర్ గా కలిసేవాళ్ళు. కాని అది తగ్గిపోయింది. ఏ రెండు, మూడు వారాలకో ఒకసారి కలుస్తున్నారు. అది కూడా గుగు స్నేహితులు అందరూ కలవడం లేదు. ఒకరిద్దరు ఏదో పని ఉందనో, నోట్స్ అప్ టూ డేట్ చేసుకోవాలనో మానేస్తున్నారు.
ఆ ఆదివారం చాలా మంది సినిమాకి వెళ్ళారు. ఆయుష్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఆయుష్, గుగు మాత్రం హాస్టల్ లో మిగిలి పోయారు.
ఆయుష్ ఫార్మకోలోజి నోట్స్ తయారు చేసుకుంటున్నాడు. అంతలో ఫోన్ రింగయ్యింది. ఎవరబ్బా ఫోన్ అని అనుకుని ఫోన్ తీసాడు .
“ఆయుష్ నేను గుగుని మాట్లాడుతున్నాను” అన్న మాటలు విని కించిత్ ఆశ్చర్యపోయాడు ఆయుష్. ’ఈ పిల్లకి ఎంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి’ ఏదో నివేదిత లెవెల్లో ఫోన్ చేసి ‘నేను గుగుని’ అనే చెప్పేటంత లెవెల్ కి ఎప్పుడు వచ్చింది. కాని మళ్ళీ తన సంకుచితమైన ఆలోచనకి తనకే సిగ్గు అనిపించింది. గుగు ఎందుకు ఫోన్ చేయకూడదు? ఆఫ్రికన్ అమ్మాయి అనా? అందంగా లేదు అనా? కారు నలుపు అనా? తమ స్నేహానికి అవేమి అభ్యంతరం, అడ్డూ కాకూడదు. కావు కదా. ఏదో నివేదిత చిన్నప్పడినుంచి పరిచయం. కాని ప్రస్తుతం ఇద్దరూ తన క్లాసు మేట్స్. మరి నివేదిత కి గుగు కి తేడా ఏమిటి?’ అనుకున్నాడు ఆయుష్ .
“చెప్పు గుగు “
“ఆయుష్ నాకు బోర్ కొడుతోంది. నీకు తెలుసు కదా. ఈ రోజు మన వాళ్ళు ఎవ్వరూ హాస్టల్ లో లేరు. పార్క్ కి రాగలవా?” అని అడిగింది గుగు.
“సరే ఒక పది నిమషాల్లో వస్తాను. మనం ఎప్పుడూ కూచునే బెంచ్ దగ్గర వెయిట్ చెయ్యి” అన్నాడు ఆయుష్ సాలోచనగా .
ఆయుష్ వెళ్ళేసరికి గుగు వెయిట్ చేస్తూ ఉంది.
“హాయ్ గుగు. ఏమిటి. మీ తల్లిదండ్రులు వెళిపోయారన్న దిగులు పోయిందా?” అన్నాడు ఆయుష్ .
“పోతోంది” అంది గుగు.
‘అబ్బా! ఈ అమ్మాయి తెలుగు బాగా మాట్లాడుతోందే’ అనుకున్నాడు ఆయుష్.
గుగు తన సబ్జెక్ట్ లతో పాటు, పట్టుదలగా, తెలుగు కూడా బాగా నేర్చుకుంది.
చదవడం, రాయడం రాకపోయినా అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుంది.
“ఇంకా పోతోంది ఏమిటి? పోయింది అనాలి” అన్నాడు ఆయుష్.
“గుగు నీ చదువు ఎలా సాగుతోంది?” అని అడిగాడు ఆయుష్.
“పరవాలేదు. పాస్ అవుతాను. భయపడకు. నీ గోల్డ్ మెడల్స్ కి పోటి రాను” అంది గుగు నవ్వుతూ.
‘ చాలా చనువుగా మాట్లాడుతోందే !?’ అనుకున్నాడు ఆయుష్.
“ఏమో.! నీకే గోల్డ్ మెడల్ రావచ్చు. ఎవరు బాగా చదివి, బాగా పరీక్షలు రాస్తే వాళ్ళకి వస్తుంది. అంతే గాని గోల్డ్ మెడల్ ఫలానా వాళ్ళ మొహాన రాసి పెట్టలేదు. అలాగే పలానా వాళ్ళకే వస్తుందని లేదు” అన్నాడు ఆయుష్ .
“నా నల్లటి మోహం మీద అయితే రాయలేదు“ అంది గుగు నవ్వుతూ.
“ఎందుకు గుగు నిన్ను నువ్వు అలా కించపరుచుకుంటావు!? నలుపులో ఎంతో అందం ఉంది. మా పురాణాలలో కృష్ణుడు నలుపు. కాని ఎంత అందగాడో తెలుసా? మనం చూస్తున్న కోయిల నలుపు. ఎంత మధురంగా గానం చేస్తుంది. అసలు మనసు తెలుపుగా ఉండాలి గాని మనిషి ఎలా ఉన్నా పరవాలేదు” అంటూ తనకి తెలయకుండా ఆవేశంగా మాట్లాడాడు ఆయుష్. అలాగే తనకు తెలియకుండా తనమీద
గుగుకి ఆశలు చిగురింపచేసాడు.
“కాని ఆయుష్! మీ నలుపు వేరు . మా నలుపు వేరు” అంది గుగు.
“ఏం గుగు మీరు మనుషులు కాదా? అసలు మనందరం ఒకటే. ఈ రూపు రేఖలు, రంగులు మనం ఉన్న భౌగోళిక పరిస్థుతలను పట్టి, జెనెటిక్ బ్యాక్ గ్రౌండ్ ని బట్టి ఏర్పడినవి. మనం చదువుకున్నాం కదా గుగు... మనందరం “హోమో సేపియన్స్” జాతికి చెందిన మానవులం. నిజం చెప్పాలంటే ఈ దేశపు సరిహద్దులు, మతం, కులం మనం సృస్టించుకున్నవే. కాదంటావా?” అన్నాడు ఆయుష్.
అతని మాటలకు ఆశ్చర్యపోయింది గుగు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయుష్ అంటే ఒక తెలివైన, అందమైన యువకుడు అని మాత్రం గుగుకి తెలుసు. కాని అతనిలో ఇంతటి విశాలమై ,అభ్యుదయ భావాలూ ఉన్నాయని, జీవితాల్లో అంశాల్ని ఇంత బాగా విశ్లేషిస్తాడని తెలుసుకోలేకపోయింది. అతనిని మనస్సులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
“అవుననుకో... కాని వచ్చిన కొత్తలో అందరూ నన్ను తుమ్మమొద్దు, నల్లపిల్ల అని అనుకోవడం
చాలాసార్లు విన్నాను. మొదట్లో కొన్నాళ్ళు బాధ పడ్డాను. తరువాత నాకు అలవాటు అయిపోయింది. స్టూడెంట్స్ కూడా నన్ను గురించి వింతగా అనుకోవడం మానేసారు” అంది గుగు.
“చూడు గుగు నువ్వేదో అందవికారంగా ఉన్నవని కాదు దాని అర్థం. మేము అమెరికా వెళితే మమ్మల్ని నల్లవాళ్ళుగా భావిస్తారు అక్కడ జనం. కొత్తగా కనిపించే వాళ్ళని గురించి ఏదో కామెంట్ చేయకుండా ఉండరు. అంతెందుకు నేను మీ కెన్యా వచ్చాననుకో. అందరూ నన్ను ఒక వింత జంతువుని చూసినట్టు చూస్తారు. పిచ్చి, పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తారు. అది సహజం. నేటి ఆధునికతో ప్రపంచం మొత్తం ఒక అతి చిన్న గ్రామంగా మారిపోయినా మనుషుల మనసులు అతి చిన్నవి అయిపోతున్నాయి, మనుషులు అంతకంటే కుంచించుకు పోతున్నారు. కనుక నువ్వు ఎప్పుడూ, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎవరి అందం వారిది. అదంతే. నీకు తెలియనది కాదు. అసలు ఈ అందం, కురూపత్వం, మంచితనం, దుర్మార్గం లాంటివి అన్ని రిలేటివ్ టర్మ్స్. దేనికి నిర్వచనం ప్రపంచంలో ఎక్కడా లేదు” అన్నాడు ఆయుష్.
అతని మాటలకి గుగు ఆయుష్ కేసి మంత్రముగ్దురాలిలా చూస్తూ ఉండిపోయింది.
గుగుకి మొదటిసారిగా ఆయుష్ అంటే ఆరాధనా భావం మొదలు అయ్యింది. అంతకు ముందు ఆమెకి ఇష్టమో, ప్రేమో, ఆకర్షనో తెలియని భావం ఉంటే ఇప్పుడు ఆ భావాలూ మిశ్రమంగా తయారు అయి ఆమె మనస్సుని ఆక్రమించాయి.
“ఆయుష్... నేను.. నేను... ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా!” అని అంది చనువుగా.
“ఏమీ అనుకోను అడుగు” అన్నాడు ఆయుష్ .
“నువ్వు నివేదితని పెళ్ళి చేసుకుంటున్నావా ?”
“నీకు అసలు ఆ ఆలోచన ఎలా, ఎందుకు వచ్చింది గుగు !!??” అని అడిగాడు ఆయుష్ .
“అంటే నేను అనుకుంటున్నాను”
“ఎందుకు అని ?” రెట్టించాడు అయుష్ .
‘అమ్మో అయుష్ కి కోపం రాలేదు కదా?’ అనుకుంది గుగు.
“అంటే మీది ఒకే ఊరు. చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. ఒకే కులం అని విన్నాను. మరి...” ఆగిపోయింది .
ఆయుష్ ఒక్కసారిగా నవ్వేసాడు .
“అమ్మ గుగు నువ్వు సామాన్యురాలివి కాదు. భలే ఊహలు అల్లేసుకుంటావు. నువ్వు ఒక పెద్ద రచయత్రివి కావాలి. నువ్వు చెప్పినవన్నీ నిజమే. కాదనను .కాని నీ ఊహనిజం కాదు. కనీసం ప్రస్తుతానికి. ఇంకా మనం చదువు మొదలులో ఉన్నాం...” ఆయుష్ మాటలను మధ్యలోనే త్రుంచేసింది గుగు.
“మరి హసిత పెళ్ళికి రెడీ అయిపోతోంది” అంది గుగు.
“హసిత ఎందుకు తొందరపడుతోందో నాకైతే తెలియదు. మనం ముందు మెడిసిన్ పాస్ అవ్వాలి. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్అవ్వాలి. వీలైతే సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలి... అప్పుడు పెళ్ళి పేరంటాలు. అర్థం అయ్యిందా?” అన్నాడు ఆయుష్ .
“నిజమే. కాని మీ భారత దేశ లో చిన్నప్పుడే సంబంధాలు మాట్లాడుకుని, వయస్సు వచ్చాక పెళ్ళి చేస్తారని విన్నాను.”
“గుగు నువ్వు విన్నదీ మాట్లాడుతున్నదీ చరిత్ర. ఇప్పుడు ఆ పద్ధతులు లేవు. అసలు చిన్నప్పుడు ఇద్దరి మధ్య పెళ్ళి కుదుర్చుకుంటే వాళ్ళు పెద్దయ్యాక మరిపోరని, వాళ్ళ బుద్ధులు మారిపోవని గారంటీ ఏమిటి? అదీకాక ఈ రోజులలో ఎవరిని, ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఇష్టపడతారో తెలియదు” అన్నాడు ఆయుష్.
“ఓ.కే. ఇన్ని చెప్పావు కదా... ను ఒకటి అడుగుతాను. నీకు ఒక చెల్లెలు ఉంది. నీ చెల్లెలికి ఒక నల్ల అబ్బాయినో, లేక ఒక బీద అబ్బాయినో ఇచ్చి పెళ్ళి చేస్తావా?” అని సూటిగా అడిగింది గుగు.
ఇవన్నీ ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు ఆయుష్ కి. కాని గుగు చాలా తెలివైనది అని, మంచి ధైర్యవంతురాలని మొదటిసారిగా అర్థం అయ్యింది ఆయుష్ కి.
“తప్పకుండా. అయితే మళ్ళీ ఒక ఇష్యూ ఉంది. బేసిక్ గా ఆమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడితేనే. నా వరకు నాకైతే అభ్యంతరం లేదు” అన్నాడు ఆయుష్ .
“ఒకవేళ నువ్వు నాలాంటి కురూపిని, నల్లటి అమ్మాయిని చేసుకోగలవా?” అంది గుగు సూటిగా ఆయుష్ కళ్ళల్లోకి చూస్తూ.
గుగు అలాంటి ప్రశ్న వేస్తుందని ఏ మాత్రం ఊహించలేదు ఆయుష్.కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు.
*******************