Vijaya Lakshmi
Published on Jun 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?లక్షలాదిమంది హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి, ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి గాను యాత్ర తేదీలు ఖరారయ్యాయి.
కేవలం కొన్ని రోజులు మాత్రమే దర్శనమిచ్చే మంచు శివలింగం కొలువుతీరిన యాత్ర అమర్నాథ్ యాత్ర. ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్‌నాథ్ యాత్ర 2025లో జూలై 3న ప్రారంభమవుతుందని 'శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డ్' తెలిపింది. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగుతుందని, అంటే జులై 3 వ తేదీన ప్రారంభామయే అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ లేదా రాఖీపున్నమి రోజున ముగుస్తుందని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-మార్చి నెలల్లో అమర్‌నాథ్ మందిరాన్ని తెరిచే తేదీలను పుణ్యక్షేత్ర బోర్డు ప్రకటిస్తుంది.
అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్ మార్గం, అలాగే గాందర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ ఈ రెండు మార్గాల ద్వారా జులై 3న ఒకేసారి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 38 రోజుల పాటు కొనసాగి, ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది అని అమర్నాథ్ జీ బోర్డ్ ప్రకటించింది.
అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా అమరనాథ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్‌నాథ్ యాత్రికులు ముందుగా జమ్ము చేరుకొని అక్కడ నుంచి టాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ క్యాంపులకు చేరుకోవాల్సి ఉంటుంది. బల్తాల్ నుంచి రెండు రోజులు, పహల్గామ్ ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. హెలికాప్టర్ ద్వారా కూడా అమర్‌నాథ్ చేరుకోవచ్చు.
అమర్‌నాథ్ తీర్థయాత్ర 2025 కోసం ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అమర్నాథ్ ఆలయ అధికారిక శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటే బోర్డ్ నిర్ణయించిన బ్యాంకు శాఖలు లేదా రిజిస్ట్రేషన్ కేంద్రాల ద్వారా కూడా వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాత్ర తేదీలు మాత్రం ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీలు ఇంకా ప్రకటించవలసి ఉంది. 13 సంవత్సరాలకు లోపు పిల్లలను అలాగే 70 సంవత్సరాల పైబడిన పెద్దలను యాత్రకు అనుమతించరు.అలాగే ఆరు వారాల పైబడిన గర్భవతులను కూడా యాత్రకు అనుమతించరు.
ఈ రిజిస్ట్రేషన్ మొదలైన ప్రక్రియ స్వంతంగా చేసుకోలేని వారు ట్రావెల్స్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు. అలా ట్రావెల్స్ ద్వారా వెళితే యాత్రకు వెళ్ళడానికి కావలసిన అన్ని ప్రక్తియలు వారే పూర్తీ చేస్తారు. అందుకే చాలా వరకు ట్రావెల్ ఏజన్సీల ద్వారా యాత్రకు వెళుతూ ఉంటారు.
హిమాలయపర్వతాల్లో సముద్రమట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ యాత్రకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం నాలుగు నుంచి 5 లక్షల మంది భక్తులు యాత్రకు వస్తారని బోర్డ్ అంచనా. అనుకూలమైన వాతావరణం రాగానే అమరనాథ్ బోర్డ్ కమిటీ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా భక్తులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అత్యంత కఠినతరమైన, ఎత్తైన హిమాలయ మంచుకొండల్లో చేయాల్సిన యాత్ర కాబట్టి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరవాత మాత్రమే యాత్ర అనుమతిస్తారు. శ్రీ అమరనాథ్‌జీ మందిర బోర్డు ఆమోదించిన వైద్యుడితో ఆసుపత్రి నుండి వైద్య ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలి . అధిక ఎత్తులో ఉన్న పర్వతారోహణ చేయడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యపరీక్షా సర్టిఫికేట్ నిర్ధారించిన తరువాతే యాత్ర వెళ్ళే అవకాశం కలుగుతుంది. అమర్ నాథ్ యాత్రలో కేంద్ర ప్రభుత్వం యాత్రీకులకు దారిపొడవునా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.
జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పహల్గామ్ నుండి దాదాపు 45 కి.మీ దూరంలో ఉంది అమర్ నాథ్ గుహ. అమర్‌నాథ్ యాత్రకు భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నందున, జమ్మూ, శ్రీనగర్, ఇతర ప్రదేశాల్లోని సహాయ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచే చర్యలు, ఈ-కైవైసీ కోసం యాత్రి ఫెసిలిటేషన్ కేంద్రాల నిర్వహణ, ఆర్‌ఎఫ్‌ఐడి కార్డుల జారీ, నౌగామ్, కాట్రా రైల్వే స్టేషన్లు సహా అనేక ప్రదేశాలలో యాత్రికుల స్పాట్ రిజిస్ట్రేషన్ గురించి చర్చించినట్లు బోర్డ్ అధికార ప్రతినిధి తెలిపారు.
అమర్ నాథ్ యాత్రకు పది నుంచి పదిహేను రోజులు పడుతుంది. శ్రీనగర్ నుంచి హెలికాప్టర్ లో అయితే నాలుగు రోజులలోనే యాత్ర చేయవచ్చు. అత్యంత కఠినతరమైన ఈ యాత్ర సజావుగా చెయ్యాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజూ వాకింగ్ చేయడం, ప్రాణాయామం లాంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు చెయ్యడం, యోగా చెయ్యడం లాంటివి నియమబద్దంగా చేస్తే యాత్రలో ఇబ్బంది పడకుండా ఉంటుంది.
అమర్‌నాథ్ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు మూడో కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడింది. ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోందని విభిన్న కథనాలు చెప్తాఋ. శివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచ భూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో శివుడు జల రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ గుహ వద్ద ప్రవేశించే పంచ నదులు సాక్షాత్తు ఆయన జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్‌నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుందనేది? మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.
అమర్ నాథ్ యాత్ర నిజానికి ఆధ్యాత్మిక యాత్రే కాదు... ఒక సాహస యాత్ర కూడా. ఎందుకంటే నిరంతరం సైనిక పర్యవేక్షణలో ఉండే ప్రాంతం... ఓ వైపు ఉగ్రమూకల భయం... మరో వైపు ప్రకృతి ఎప్పుడు ఎలా విజ్రుంభిస్తుందో తెలియని భీతి... మరో వైపు ఎత్తైన కొండలు... కళ్ళు తిరిగే లోయలు... వాతావరణం అనూహ్యంగా ఉంటుంది తరచుగా వర్షాలు కురుస్తాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది... ఇన్ని భయాల మధ్య కూడా కేవలం కొన్ని రోజులు మాత్రమె దర్శమిచ్చే సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం... శివయ్యను దర్శించాలనే తపనతో జై భోలేనాత్... జై అమర్ నాథ్ జీ అంటూ నినదిస్తూ అలవోకగా మంచుకొండల్లో బారులు తీరి సాగిపోయే భక్తజనం.
జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వురుడుని దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ఉగ్ర దాడుల ప్రభావం ఎక్కువగా ఉండడం వలన భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి నిరంతరం గస్తీ కాస్తూ ఉంటాయి.
గతంలో ఈ మంచు లింగాన్ని దర్శించడానికి ఏటా 2,000 నుంచి 3,500 మంది భక్తులు వచ్చేవారు. అయితే, 2011లో రికార్డు స్థాయిలో 6,34,000 మంది సందర్శించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇంత కఠినమైన, సాహసంతో కూడిన యాత్ర అయినా కూడా ఏడాదికేడాది అమరానాథుడ్ని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
అమర్ నాథ్ యాత్ర- ప్రతి శివ భక్తుడు కల! జీవితలో ఒక్కసారి అయినా అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే ఎక్కువ మంది కోరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి దర్శించాలని పరితపిస్తారు. అయితే ఆ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఆనందంగానే ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా ఏటా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. అమర్ నాథ్ పూర్తీ చరిత్ర కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి.