మార్గశిర మాసంలో ఈ తల్లిని దర్శిస్తే లక్ష్మీదేవి మీ వెంటే...Seek the blessings of this Divine Mother in Margashira, and Goddess Lakshmi walks with you.

Vijaya Lakshmi

Published on Dec 20 2023

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

మార్గశిరం మాసం అనగానే ఉత్తరాంధ్రులకు... ముఖ్యంగా విశాఖ వాసులకు ఆ అమ్మవారే కళ్ళముందు కదులుతుంది. ఆ ఆలయానికి బారులు తీరుతారు. ఆ ఆలయానికి అన్నీ విలక్షణమైన లక్షణాలే. ఆ ఆలయంలో పూజారి ఉండరు. భక్తులే పూజారులుగా మారిపోతారు. భక్తులు ఏ వేళలోనయినా అమ్మను దర్శించుకోవచ్చు. ఆలయానికి ప్రత్యేక వేళలు ఉండవు. ఆ దేవత బావిలో వెలసిన దేవత. ఒకప్పటి విశాఖ రాజుల కులదేవత. గోపురం లేని గుడి. విశాఖనడిబొడ్డున వెలసినా విశాఖవాసులకో ఉత్తరాంధ్ర వాసులకో మాత్రమె కాదు సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందా దేవత. తమ ఇంట చిన్నమెత్తు బంగారం కొన్నా వెండి కొన్నా తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా బిడ్డ పుట్టినా ఎలాంటి శుభకార్యం జరిగుతున్నా విశాఖప్రాంతవాసులు ఆ విశేషాన్ని ముందుగా ఆ తల్లికి చెప్పి ఆమె ఆశీస్సులు అందుకోవడం ఆచారంగా వస్తోంది. ఆ తల్లి ఎవరో మీకిప్పటికి అర్థమయిపోయిఉంటుంది. అవును కనకమహాలక్ష్మి అమ్మవారు. ఉత్తరాంద్రుల కొంగుబంగారం.

పచ్చని కొండలు.. నీలి సముద్రం.. మనసుదోచే సహజ సిద్ధమైన అందాలు.. వీటన్నిటి కలబోత విశాఖపట్నం. ప్రకృతి రమణీయతకు స్వర్గధామమైన విశాఖ అందాల నగరమే కాదు ఆధ్యాత్మిక నగరం కూడా. విశాలమైన సాగరతీరం, ఎత్తైన కొండలు, ఉద్యానవనాలు,వాణిజ్య సముదాయాలు... ఓ వైపు ఉవ్వెత్తున ఎగిసిపడే అందమైన సముద్రపుటలల సౌందర్యం .. మరోవైపు పచ్చని కొండలు.. ఆ మధ్యలో ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధరామాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో నిండిన విశాఖ నగరంలో దేదీప్యమానమైన తేజస్సుతో కొలువు తీరి ఉంది కనకమహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మి అంటే  లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భావన. ఆ లక్ష్మీ కటాక్షం అందించే దేవతగా శ్రీకనకమహాలక్ష్మీదేవి విశాఖప్రజల నీరాజనాలండుకుంటోంది.

ఇప్పుడు కనకమహాలక్షీదేవిగా కొలుచుకుంటున్న ఆ తల్లి ఒకప్పుడు వైశాఖేశ్వరి. పూర్వం విశాఖనగరాన్ని పాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితోపాటూ కళింగరాజులూ కనక మహాలక్ష్మిని ఆరాధించేవారనీ, మొక్కులూ, కానుకలూ చెల్లించేవారనీ స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి. విశాఖ రాజుల కోటబురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదనీ అందుకే ఆ ప్రాంతం బురుజుపేట అన్న పేరుతొ స్థిరపడిందనీ ఇక్కడివారు చెబుతారు.  ఎక్కడైనా అమ్మవారి విగ్రహం నిండుగా రెండు చేతులతోనూ లేదా చతుర్భుజాలతోను దర్శనమిస్తుంది. కాని ఇక్కడ విచిత్రంగా అమ్మవారి విగ్రహం ఎడమచేతి భాగం భుజం నుండి క్రింది భాగం ఖండించబడి ఉంటుంది. ఇలా ఖండించబడడం వెనక కూడా విభిన్న కథనాలు వినబడతాయి.


ఓసారి కొందరు శత్రు రాజులు వైశాఖీరాజ్యం మీద దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరక్కుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఈ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, ‘నేను కనకమహాలక్ష్మీదేవిని. 

ఈ బావిలో ఉన్నాను. నన్ను బయటకు తీసి, గుడి కట్టించమని’ ఆజ్ఞాపించింది. ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి. దాంతో తనకు వచ్చింది కల కాదనీ అది కనకమహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞనీ భావించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు చెబుతారు.

మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకోవాలని, కాశీకి  ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం వద్ద గల బావిలో స్నానమాచరించి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్టించమని అమ్మ కోరింది. కాని బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించటానికి ఉద్యుక్తురాలయ్యింది. అది చూసి భీతిల్లిన బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా, శివుడు తన దివ్యదృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అంతట మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టూ అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టూ కథనం. అందుకే అమ్మవారు ఎడమచేయి ఖండించబడి, కుడిచేతిలో కలువమొగ్గను ధరించి, అర్ధనిమిళిత నేత్రాలతో కాంతులీనుతూ దర్శనమిస్తుంది అమ్మవారు.


youtube play button



Recent Posts