Vijaya Lakshmi
Published on Oct 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అనుకోకుండా లభించిన విజయం కూడా ఒక మత్తు పదార్థం లాంటిదే మనిషికి గొప్ప కిక్కిస్తుందది. అయితే... మత్తుమందులు మనిషి పతనానికి మెట్లు వేస్తే, విజయం అతడి ఉన్నతికి దారితీస్తుంది.
ఒకసారి ఆ మత్తును అనుభవించిన వ్యక్తి అందులో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. ఆ నిషా లాంటి అనుభవం మళ్లీ మళ్లీ కావాలనుకుంటాడు. అదిగో! సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది తార.
“కంటి చూపుతో కళను పండించిన నయనతార”
“మాటలతో పని లేకుండా కేవలం కళ్ళతోనే భావాలను పలికించి అద్భుతమైన నటనను ప్రదర్శించి, కాలేజీ వార్షికోత్సవాన్ని రక్తి కట్టించిన విద్యార్థిని”
పేపర్లో తన ఫోటోతో సహా ఉన్న ఆ వార్తను చూసి ఉద్వేగంగా అరిచింది తార
“అమ్మా! అమ్మా! ఒక్కసారి ఇలా రా! తొందరగా రావాలి...”
“ఏమైందే? ఎందుకా గావుకేకలు?” కంగారుగా పరిగెత్తుకొచ్చింది పార్వతి.
“చూసావా... నీ కూతురి ప్రతిభ! నిన్న కాలేజీ ఫంక్షన్లో నాటకం వేసాను. అందులో నా నటనను మెచ్చుకుంటూ పేపర్లో వేశారు. చూడు... ఇదిగో ఫోటో కూడా వేశారు”
“అబ్బ! దీని కోసమా అలా అరిచావు! ఇంకా ఏమైపోయిందో అని పడలిపోయి పరిగెత్తుకొచ్చాను...”
తల్లి అలా, ‘ఓస్! ఇంతేనా!’ అన్నట్టు మాట్లాడేసరికి, ఉత్సాహం అంతా నీరు కారిపోయింది తారకు.
“అంటే... నేను ఇంత సంతోష పడుతుంటే... నీకేమీ కాదన్నమాట. అవున్లే... మొదటినుంచి వద్దు... వద్దంటూనే ఉన్నావు కదా! కనీసం ఇప్పుడు పేపర్లో ఈ వార్తా... ఫోటో... చూసాకైనా సంతోషిస్తావనుకున్నాను” మూతి ముడుచుకుంటూ అంది తార.
కూతురి మొహం చూసేసరికి జాలనిపించింది పార్వతికి.
“అబ్బా! అలా మొహం మాడ్చుకోకు. ఏది... ఆ పేపర్ ఇలా ఇవ్వు” అంటూ పేపర్ తీసుకొని సింది.
పేపర్ లో చదివి... “బాగుంది బాగానే రాశారు. సరే! ఇకనైనా ఈ వార్షికోత్సవాలు, నాటకాలు కట్టిపెట్టి సీరియస్ గా చదువు. అసలే ఫైనలియర్ కూడాను...” అంది పార్వతి.
ఆవిడలా కట్టే... కొట్టే ...తెచ్చే... అన్నట్టు, ఏదో తప్పదన్నట్టు, మెచ్చుకోకపోతే బాగోదు అన్నట్టు, బావుంది... అని సింపుల్ గా తేల్చేయడమే కాకుండా, కొంపలు మునిగిపోతున్నట్టు పరీక్షల గురించి కూడా అప్పుడే హెచ్చరించడంతో ఉక్రోషం ముంచుకొచ్చింది తారకు.
కూతురి ఉక్రోషాన్ని చూసి నవ్వొచ్చిందామెకు. నవ్వితే మరీ ఉడుక్కుంటుందని వస్తున్న నవ్వుని ఆపుకుని నెమ్మదిగా ఆ అమ్మాయి తల నిమురుతూ అంది, “నా కూతురు నలుగురిలోను గొప్పదానిగా గుర్తింపు తెచ్చుకుంటే నాకు మాత్రం గర్వంగా ఉండదూ... కానీ నీ విషయంలో నాకు ఇంతకంటే ఆనందకరమైంది మరొకటి ఉందమ్మా”
సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అర్థమైంది తారకు
“అబ్బబ్బ మళ్లీ మొదలా నీ గొడవ!” విసుగ్గా అంది.
“ఇంత వయసు వచ్చింది. నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవేం! నీకు నేను... నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మనకు. నా పరిస్థితీ అంతంత మాత్రం గానే ఉంది. రేపు నాకు ఏదైనా అయితే నిన్నెవరు చూస్తారు? అందుకే... నేనుండగానే నిన్ను ఓ ఇంటిదాన్ని చేస్తే నా బాధ్యత తీరుతుంది” వచ్చిన అవకాశం వదులుకోకుండా క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టింది పార్వతి.
సంభాషణ గాడి తప్పుతోందని గ్రహించిన తార తల్లి దృష్టిని మళ్లించే ప్రయత్నంలో, “అన్నట్టు అమ్మ! ఈరోజు కాలేజీకి కొంచెం తొందరగా వెళ్ళాలి. టిఫిన్ పెట్టేయ్. ఇంతకీ ఇవాళ టిఫినేం చేసావ్” అంది. లేకపోతే ఆవిడ తన ఉపన్యాసం ఇంకా కొనసాగిస్తుందన్న భయంతో.
టిఫిన్ మాట వినగానే, “అరే! దోశలు వేద్దామని పొయ్యి మీద పెనం పెట్టాను నీ మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. అదేమైందో ఏంటో...” అంటూ హడావిడిగా వంటగదికేసి దారి తీసిందావిడ
అమ్మయ్య! ఇప్పటికీ పెళ్లి గోల నుంచి బయటపడ్డాను రిలాక్సింగా అనుకుంది తార. ‘అయినా ఈ మధ్య అమ్మకు మరీ చాదస్తం ఎక్కువైపోయింది. ఏం మాట్లాడటం మొదలుపెట్టినా, తిప్పి... తిప్పి... పెళ్లి దగ్గరకే తీసుకొస్తుంది...’ తల విదిలించి, ఆ ప్రసక్తిని దూరంగా తరిమివేయడానికి అన్నట్టు పేపర్లో తన ఫోటో మరోసారి చూసుకుంది మురుపెంగా. దాని కటింగ్ తీస్తూ ఆలోచనలో పడింది తార.
తనలో కూడా ఒక నటి దాగుందని... తను ఇంత బాగా నటించగలదని ఎప్పుడైనా అనుకుందా!? ఫ్రెండ్స్ మరీ బలవంతం చేయడంతో సరదాగా ఒప్పుకుంది. ఇదే తన మొదటి నాటకం. స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా... స్టేజ్ మీదకు వెళ్లే సమయానికి శరీరమంతా చెమటలు పట్టేసి, కాళ్లు విపరీతంగా వణకడం మొదలుపెట్టాయి. అతి కష్టం మీద భయాన్ని అదుపులో పెట్టుకుని ఎలాగో నటించింది. అరగంట వరకు మామూలు మనిషి కాలేకపోయింది. ఆశ్చర్యం! తను అంత భయపడినా, అందరూ తను బాగా చేసిందన్నారు. పెద్దలంతా అందమైన మాటలతో అభినందిస్తుంటే... స్నేహితులంతా చుట్టుముట్టి ప్రశంసిస్తుంటే... ఆ అనుభూతే వేరు. ఎంత థ్రిల్లింగ్ గా... ఎంత గర్వంగా అనిపించింది. అంతమందిలోనూ తనకు ఒక ప్రత్యేక స్థానం లభించినట్టైంది. ఇప్పుడనిపిస్తోంది... ఒకవేళ భయంతో ఈ వేషం వేయడానికి నిరాకరిస్తే... ఈ ప్రత్యేకత, ఈ గుర్తింపు లభించేవా!? బలవంతంగా తనను ఒప్పించిన స్నేహితులకు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది.
ఇంతలో “టిఫిన్ రెడీ...” అంటూ తల్లి పిలవడంతో ఆ పని కానిచ్చి కాలేజీకి బయలుదేరింది తార.
***************
విశాలమైన ఆ కాలేజీ క్యాంపస్ లో... యవ్వనం ఏరులై పారుతున్నట్టు ఉంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా అమ్మాయిలు అబ్బాయిలు చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది నోటీసు బోర్డులో చూసిన పరీక్షల ప్రకటన గురించి చర్చించుకుంటున్నారు. అంతవరకు పుస్తకాలను పూర్తిగా మరచిపోయిన కొందరు... వాటి బూజులు దులిపే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంటే, కేవలం చదువు కోసం మాత్రమే కాలేజీకి వచ్చేవారు వీరి ఆరాటాన్ని వినోదంగా చూస్తున్నారు.
చదువు మీద కంటే సరదాల మీదే ఆసక్తిని పెంచుకున్న కొందరు అబ్బాయిలు కాలేజీ గోడల మీద సెటిలై తమ రోజువారి కార్యక్రమం... అమ్మాయిలను రకరకాల పేర్లతో తమ మిమిక్రీ టాలెంట్ తో ఏడిపించడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు వీళ్ళనంతగా పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్నారు.
సరిగ్గా అప్పుడే కాలేజీ ఆవరణలోకి అడుగు పెట్టింది తార. విద్యార్థుల అటెన్షన్ ఆమె వైపు తిరిగింది.
“కనులు మాటలాడునని... మనసు పాట పాడునని...” పాట మొదలుపెట్టారు ఆమెను ఉద్దేశించి.
“ఆహా! ఏమి నటన! ఏమి నటన! అద్భుతం... అత్యద్భుతం! నటనకే భాష్యం చెప్పిన ఓ నటీమణీ! నీకు నా నటనాభినందనలు”
“ఇంతకీ నటనలో ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నట్టు?”
“ట్రైనింగ్ ఎందుకురా మొద్దు! సహజనటి ఆమె”
ఇలా ఒకదాని తరవాత ఒకటి కామెంట్స్ సాగిపోతున్నాయి. వింటున్న తారకు రోజు మాదిరిగా కోపం రాలేదు. చిరాకు కలగలేదు. ఇంతకుముందయితే వాళ్ళ కామెంట్స్ వినగానే చిటపటలాడిపోయేది. కానీ... ఇప్పుడలా కాదు. ఒకప్పుడు కర్ణకఠోరంగా వినిపించిన ఆ అబ్బాయిల వ్యాఖ్యానాలు ఇప్పుడు వీనులవిందు చేస్తున్నాయి. పైగా అవి తన ప్రత్యేకతను గొప్పగా చాటుతున్నట్టు ఫీల్ అవుతోంది. అందుకే వాళ్లతో పాటు తను కూడా ఎంజాయ్ చేస్తోందా మాటలకు.
క్లాస్ లోకి అడుగుపెడుతుండగా... ప్యూన్ వచ్చి, “మీకు ఉత్తరం వచ్చిందమ్మా” అంటూ ఒక కవర్ అందించాడు.
‘ఉత్తరమా! తనకా!’ ఆశ్చర్యంగా కవర్ ని అటు ఇటు తిప్పి చూసింది. ‘తనకు లెటర్ రాసే వారెవరబ్బా! అందులోను... కాలేజీ అడ్రస్ కి!’ ఆత్రంగా కవరు తెరవబోయింది. అంతలోనే తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించి దాన్ని పుస్తకంలోకి తోసేసింది. అందులో ఏముందో చూడమని మనసు తొందరగా చేస్తుంటే... లైబ్రరీలోకి వెళ్లి ఓ మూల ఖాళీగా ఉన్నచోట కూర్చుని కవర్ తెరిచింది.
లోపల నుంచి ఓ అందమైన లేత గులాబీ రంగు కాగితం బయటపడింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఆహ్లాదకరంగా ఉంది. కాగితానికి కుడివైపు కొంచెం ఎగువన ఎర్రటి జంట గులాబీలు ఉన్నాయి. మెరుస్తున్న మంచుబిందువులతో చూడముచ్చటగా ఉంది. కాగితం మధ్యలో “అభినందనలు” అని రాసుంది. అక్షరాలు పొందిగ్గా ఉన్నాయి. కింద సంతకం ఏం లేదు. ‘ఎవరు...!? ఎవరు పంపించి ఉంటారు?’ ఆలోచనలో పడింది
క్లాసులో కూర్చుంది అన్న మాటే గాని... తార మనసంతా సంతకం లేని లేఖ మీదే ఉంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందులో ఏం రాసి లేకపోయినా, ‘అభినందనలు’ అన్న ఆ అక్షరాలనే తరచి తరచి చదవాలనిపిస్తోంది. ‘ఇదీ ప్రేమలేఖ లాంటిదేనా!? అలా అయితే... ఇది తానందుకున్న మొదటి ప్రేమలేఖ. ఓహ్! తలచుకుంటుంటే ఉక్కిరిబిక్కిరి అయినట్టుంది. ఇదీ... అని తెలియని వింత అనుభూతి కలుగుతోంది.
ఆ కాగితాన్ని మరోసారి తీసి చూడాలని చేతులు ముందుకెళ్లాయి. అంతలోనే ఆ ప్రయత్నం విరమించాయి. భయంగా... ‘అమ్మో! ఎవరైనా చూస్తే... ఇంకేమైనా ఉందా? క్లాసంతా గోలైపోదూ!’
“తారా... తారా...! ఏ లోకంలో ఉన్నావ్? క్లాసయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు” స్నేహితురాలు గట్టిగా తట్టి పిలవడంతో ఉలిక్కిపడి పుస్తకాలు పట్టుకుని బయటకు నడిచింది తార.
**********
కళ భారతి ఆడిటోరియం విశాఖపట్నం దీపాలంకరణలతో కాంతులు వెదజల్లుతోంది. దాని ముందున్న రోడ్డంతా స్కూటర్లు, కార్లు, మోటార్ సైకిళ్ళు, మోపెడ్లు ఇలా రకరకాల వాహనాలతో కళకళలాడుతోంది. వైజాగ్ లో పేరున్న ఆడిటోరియంలలో అదొకటి. గొప్ప గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ అదే వేదిక.
ఇంకాసేపట్లో అక్కడ దేశ, విదేశాల్లో కీర్తి ప్రతిష్టలార్జించిన ప్రముఖ కూచిపూడి నర్తకి నృత్య ప్రదర్శన జరగబోతోంది. ఆమె ఇంకా రాలేనట్టుంది. ఆమెకు ఆహ్వానం పలికేందుకు గేటు దగ్గరే వేచి చూస్తున్నారు నిర్వాహకులు. స్వాగత సన్నాహాలలో ఉన్న కార్యకర్తల హడావిడితో, కార్యక్రమం తిలకించేందుకు వస్తున్న జనంతో సందడిగా ఉంది ఆ ప్రాంతమంతా. ఇదంతా గమనిస్తూ లోపలికి అడుగుపెట్టారు తార ఆమె స్నేహితురాలు అనిత. అప్పటికే దాదాపు హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది. ఓ మూల ఖాళీగా ఉన్న రెండు సీట్లు చూసుకుని కూర్చున్నారు ఇద్దరూ.
“హమ్మయ్య! దేవుడి దయవల్ల ఎలాగో సీట్లు మాత్రం దొరికాయి. అయినా... నువ్వు కాస్త తొందరగా తయారైతే బాగుండేది. అప్పుడు కొంచెం ముందు సీట్లు దొరికేవి. ఇక్కడి నుంచి చూస్తే చూసినట్టే ఉండదు” సణిగింది అనిత
“ఏం చేయను... అమ్మను ఒప్పించి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. అప్పటికీ వాకట్లోకి అడుగుపెట్టే వరకు... “మరీ పొద్దుపోయే వరకు ఉండకుండా త్వరగా వచ్చేయండి” అని పదేపదే చెబుతూనే ఉంది అమ్మ. “అవునూ... ప్రోగ్రాం అయ్యేసరికి ఎంత టైం అవుతుందంటావు?” అడిగింది తార.
“10 గంటలు దాటుతుందేమో”
“అమ్మో! పదా! ఆ సమయంలో బస్సులు ఉండవు కదా ఎలా వెళతాం?”
“నీకా భయమేం అక్కర్లేదు. ఈ ప్రోగ్రాం కోసం అన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు వేశారు ఆర్టీసీ వాళ్ళు” చెప్పింది అనిత.
మాట్లాడుకుంటుండగానే హాల్లో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. డాన్సర్ వచ్చినట్టుంది. గౌరవంగా ఆమెను వేదిక పైకి ఆహ్వానించి, పూలగుత్తిని చేతికి ఇచ్చారు నిర్వాహకులు. హుందాగా ఆ పూలగుత్తిని అందుకుని, ప్రేక్షకుల వైపు తిరిగి నమస్కరించిందామె. అద్భుతమైన విశ్లేషణలతో ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు నిర్వాహకుల్లో ఒకతను. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఆ దృశ్యాన్ని చకచకా కెమెరాల్లో బంధిస్తున్నారు.
ఇదంతా కళ్ళప్పగించి చూస్తోంది తార. ‘ఏం గౌరవం! ఓ ఏం గౌరవం!! ఎంత అదృష్టవంతురాలామె!!! ఇంత మంది జనం మధ్య అపూర్వమైన గౌరవ మర్యాదలను అందుకుంటుంది. ఆమె రాక కోసం, నృత్యం కోసం ఇంతమంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ‘ఇలాంటి మధుర క్షణాలు తన జీవితంలో ఎప్పటికైనా వస్తాయా? ఆ వేదిక మీద పురస్కార గ్రహీతగా తాను ఎప్పటికైనా నిలబడగలదా’ ఆమె ఆలోచనలో ఉండగానే ప్రదర్శన మొదలైపోయింది.
అద్భుతంగా నృత్యం చేస్తోందా కళాకారిణి. ప్రతి అంశానికి చప్పట్లు మారుమోగుతున్నాయి కెమెరా ఫ్లాష్ లు వెలుగుతూనే ఉన్నాయి. అలా ఓ రెండు గంటలు రెండు నిమిషాల్లా గడిచిపోయిన తర్వాత ఓ పది నిమిషాలు విరామం ప్రకటించారు
అప్పటివరకు తాము చూసిన దృశ్యాలు నెమరు వేసుకుంటూ బయటకు నడిచారరందరూ.టీలు త్రాగడానికి చిరుతిండి తినడానికి.
“హలో” దూరం నుంచి వినిపించడంతో అటు చూశారు ఇద్దరు
“హాయ్ అన్నయ్య!” అంటూ ఆనందంగా అతనికి ఎదురుగా నడిచింది అనిత
“ఎన్నాళ్ళకి కనిపించావు రా అన్నయ్య! ఇంటిదగ్గర అంతా కులాసాయేనా?”
“ఆ... అంతా బాగానే ఉన్నారు. అవును... ఒక్కదానివే వచ్చావా”
“లేదురా. నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను. ఇదిగో... ఈమె తార. నా క్లాస్ మేట్.
“తారా! ఇతను మా పెద్దమ్మ కొడుకు విజయ్. ఇక్కడే గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాడు” పరిచయం చేసింది ఇద్దరికి.
“నమస్తే” విష్ చేసింది తార.
“నమస్తే. ప్రోగ్రాం ఎలా ఉందండి?” అడిగాడు విజయ్.
“ప్రోగ్రామ్ కేం! బ్రహ్మాండంగా ఉంది.” సాగదీస్తూ అంది అనిత.
“అదేం! అంత నీరసంగా చెప్తున్నావు!? మీకు నచ్చలేదా?”
“నచ్చకేవండి. ఎటొచ్చి... బాగా దూరం నుంచి చూడాల్సి వస్తుందని దాని బాధంతా...” నవ్వుతూ చెప్పింది తార.
“అంతా... ఈవిడ గారి వల్లే అన్నయ్యా! మళ్లీ ఎలా నవ్వుతుందో చూడు. పెద్ద రాజకీయ నాయకురాలు లాగా చెప్పిన టైం కంటే గంట లేటుగా తయారైంది. అందుకే, ఇలా దూరంగా కూర్చుని చూడాల్సివస్తుంది” కోపంగా అంది అనిత.
“ఇంతకీ... ఎక్కడ కూర్చున్నారు?”
“గ్యాలరీలో వెనక వరుసలో”
“అరే! అంత దూరంలోనా? మా వరుసలో రెండు సీట్లు ఖాళీ అయిపోయాయి. అక్కడికి వచ్చేస్తారా?”
ఆ మాట వినడంతోనే ఎగిరి గంతేసింది అనిత. “వచ్చేస్తారా అని నెమ్మదిగా అడుగుతున్నావా గంట నుంచి తపస్సు చేస్తున్నాను. భగవంతుడా... స్టేజికి దగ్గర్లో మాకు కాస్త చోటు చూపించవయ్యా... అని. ఇప్పటికి నా తపస్సు ఫలించింది. పదండి... పదండి... లేకపోతే, ఆ సీట్ల కోసం ఇంకెవరైనా తపస్సు చేసే ప్రమాదం ఉంది” అంటూ గబగబా ముందుకు నడిచింది అనిత.
నవ్వుకుంటూ ఆమెను అనుసరించారు తార, విజయ్.
అనుకూలమైన చోటు దొరకడంతో డాన్స్ చూడడంలో లీనం అయిపోయారు ఇద్దరు. ఎందుకో తననెవరో చూస్తున్నట్టు అనిపించి, తల పక్కకు తిప్పి చూసింది తార. తదేకంగా తన వైపే చూస్తున్నాడు విజయ్. కంగారుగా చూపులు తిప్పుకుంది ఈ సంఘటనతో అనీజిగా అనిపించింది. ముందున్నంత ఫ్రీగా ఉండలేకపోయింది. అక్కడున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టు గడిపి ఇంటికి చేరుకుంది తార.
************
సశేషం
తరువాయి కథ రేపటి బ్లాగ్ లో...