Vijaya Lakshmi
Published on Jun 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మన భావన ఎలా ఉంటే అలాగే కనబడుతుంది ఏదైనా. అదే నానుడి భక్తి భావంలోకి తీసుకుంటే, మనం ఆరాధించే స్వామి మన భావనలకు అనుగుణంగా మన కళ్ళముందు నిలబడతాడు. అందుకే ఉడుపిలో బాలకృష్ణయ్యగా, బృందావనంలో రాధాకృష్ణుడుగా, నవద్వీపంలో నవనీత చోరుడుగా, వంగ దేశంలో జగన్నాథుడిగా, పండరీపురంలో పుండరీక విటలుడిగా దర్శనమిచ్చాడు భక్తులకు ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు.
నల్లనయ్య కృష్ణయ్య తన భక్తుడైన పుండరీకుని కోసం మనందరం నిత్యం చూసే స్వరూపానికి భిన్నంగా నడుమ్మీద చేతులు పెట్టుకొని తలపై లింగంలా కనిపించే పొడవాటి కిరీటంతో విలక్షణమైన రీతిలో వెలసిన క్షేత్రం పండరీపురం. మహారాష్ట్ర లోని షోలాపూర్ జిల్లాలో భీమానదీ తీరాన పుండరీక విఠలుడు గా కొలువుతీరిన కృష్ణయ్య విఠోబా గా ఆరాధించబడుతున్నాడు ఇక్కడ.
మహారాష్ట్రలో పాండురంగ ఆరాధన ఎక్కువగా కనబడుతుంది. క్రిష్ణయ్యను పాండురంగడు, విఠలుడు, విఠోబా, ఇలా వివిధ నామాలతో కోలుచుకుంటారు. రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని, ఇటుక మీద నుంచుని దర్శనమిస్తాడు పాండురంగడు.
పండరీపురంలో పాండురంగని నిలబడ్డ భంగిమ, ఆకారం... ఆహార్యం... అన్నీ భిన్నంగానే ఉంటాయి. మిగిలిన ఏ క్షేత్రంలోను కృష్ణయ్య ఈ విధంగా దర్శనమివ్వడు. కృష్ణయ్య వివిధ నామాలతో, వివిధ క్షేత్రాలలో వెలిసినా, ఏ రెండు క్షేత్రాలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట ఏదో ఒకవిధమైన పోలిక కనీసం ఒక్కటైనా కనబడుతుంది. కాని పండరీపురంలో మాత్రం పూర్తి భిన్నంగా కనబడతాడు స్వామి. ఎందుకిలా?
మిగిలిన అన్ని క్షేత్రాలకు భిన్నంగా స్వామి విలక్షణ భంగిమలో ఇలా కొలువు తీరడానికి కారణమేంటి. అసలు ఈ క్షేత్రంలో కృష్ణయ్య పాండురంగడు గా ఎందుకు పిలవబడుతున్నాడు... ఒక భక్తుడి కోరిక మీద కృష్ణయ్య ఇక్కడ పాండురంగడిగా విలక్షణ భంగిమలో కొలువుతీరాడు అని సాధారణంగా వినబడే కథనం మరి అందరూ చెప్పుకుంటున్నట్టు ఆ నల్లనయ్య తన భక్తుడి కోసమే ఇక్కడికొచ్చి వేలిసాడా... లేక మరేదైనా కారణముందా... పండరీపురం పాండురంగడు అనగానే భక్తీ పారవశ్యంతో కనుల నుంచి జల జల నీళ్ళు రాలేంత అద్భుత కథనాలు, భక్తుల కళ్ళముందు కదలాడతాయి.
సాధారణంగా రుక్మిణీదేవి కృష్ణ భగవానుని అనుసరించే ఉంటుంది. మరిక్కడ మాత్రం స్వామి వారి సరసన కాకుండా స్వామి ఆలయానికి కాస్త దూరంగా కొలువుతీరి ఉంటుంది. ఎందుకని... రుక్మిణీదేవి ఇలా దూరంగా కొలువుతీరడానికి కారణమేంటి?
కలియుగంలో సామాన్య మానవులను ఉద్ధరించడానికి, తరింపచేయడానికి వెలసిన పరమ పుణ్యక్షేత్రం పండరీపురం. ఆ పవిత్రస్థలిలో రాయి రప్పా, చెట్టు పుట్ట కొండ కోన దేనిని కదిలించినా ఆ విఠలుని కథలే చెబుతాయి... చివరికి గాలి కూడా భక్తీ పారవశ్యంతో గానం చేస్తుంది. అదీ ఇదనేముంది... ప్రక్రుతి లోని ప్రతి పదమూ ఆ విఠలుని స్మరణతో తరించిపోతుంది.
ప్రకృతే కాదు విఠలుడు... పాండురంగడు అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే పేరు పాండురంగని భక్తుడు పుండరీకుడు. పుండరీకుడే కాదు ఓ జానాబాయి... ఓ సక్కుబాయి... ఓ తుకారాం... ఓ నామదేవ్... ఓ చోఖమేలుడు ఇలా ఎందరో భక్తుల జీవితాలు ముడిపడి ఉన్నాయి. వీరందరూ సాధారణ భక్తులేనా... వీరి జీవితాల్లో పాన్డురంగని పాత్ర ఏంటి? అన్నిటి కంటే ముఖ్యంగా పండరీపురంలో పాండురంగని ఆలయంలో స్వామి భక్తులు నామదేవ్, చోకమేల ప్రత్యేక స్థానాల్లో కనబడతారు... ఎందుకని అంతమంది భక్తుల్లో వీరు మాత్రమె ఇంత ప్రత్యేకంగా ఎందుకు ఉంటారు...
పరమ పావనమైన నదీమతల్లి చంద్రభాగా నది. ఆ చంద్రభాగ నదీతీరంలో పుణ్యస్నానాలు చేసి రంగడిని ఆరాధించిన ఎంతోమంది భక్తులు ముక్తిపధాన్ని చేరుకున్నారు. అసలు రంగడు వెలసిన ఈ చంద్రభాగ నదికీ ఓ అద్భుత పురాణ కథనం ఉంది.
ఈ క్షేత్రంలో దేవరుషి నారదుని ఆలయం కూడా ఉంటుంది. అయితే అది నీట మునిగి ఉంటుంది. ఎందుకని...?
ప్రతి పుణ్యక్షేత్రంలోను ఎన్నో తీర్థాలుంటాయి. అలాగే ఈ క్షేత్రంలోను ఓ తీర్థముంది. అదే లోహదండతీర్థం. ఈ తీర్తానికి ఇంత విచిత్రమైన పేరు ఎందుకొచ్చింది?
పండరీపురం క్షేత్రం పేరు వినగానే పుండరీకుడు, సతీ సక్కుబాయి, జానాబాయి, నామదేవుడు, చౌకమేకల ఇలా మనకు జ్ఞాపకం వచ్చే భక్తుల పేర్లు ఎన్నో ఉంటాయి. అలాగే దేవరుషి నారదునితో కూడా ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. అలాగే దేవరాజు ఇంద్రునికి కూడా ఈ క్షేత్రంతో గట్టి సంబంధమే ఉంది... ఏంటా సంబంధం...?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్ర, విలక్షణ అంశాలు తెరమీదికోస్తాయి. ఒకటి రెండు కాదు దక్షిణ కాశీ పండరీపురం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అలాంటి అద్భుత పండరీపుర క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందామా...
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భీమానదీ తీరాన ఉంది దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పండరీపురం క్షేత్రం. మహారాష్ట్ర... ఋగ్వేదములో రాష్ట్ర అని, అశోకుని శాసనాలలో రాష్ట్రీకం అని హువాన్త్సాంగ్ వంటి విదేశీ చరిత్రకారుల ద్వారా మహారాష్ట్ర అని ప్రస్తావించబడిన ప్రాంతం. ఒకప్పుడు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి... ఎందరో వీరులకు, శూరులకు నిలయమైన వీరభూమి. అలాంటి మహారాష్ట్ర ఆద్యాత్మిక ఆవాసాలకు, ఆలయాలకు, పెట్టింది పేరు. భక్తులకు నిలయం.
అలాంటి పుణ్యభూమి మహారాష్ట్ర లోని ఒక పుణ్యక్షేత్రం పండరీపురం. పాండురంగస్వామి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన ... ప్రాచీనమైన క్షేత్రాలలో 'పండరీపురం' మొదటిదిగా చెబుతుంటారు. నిజానికి ఇది విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధి చెందినా శివ కేశవులకు బేధం లేదని చెప్పే అద్భుత క్షేత్రం.
ఆది శంకరా చార్యులు ఈ క్షేత్రంలోనే రచించిన ‘శ్రీపాండురంగాష్టకం’లో, శైవ, వైష్ణవ మతాలకు భేదం లేదని ఆ విషయం తెలియజేయాలనే పాండురంగడు అక్కడ వెలిసినట్లు చెబుతారు. దీనికి సంబంధించి అనేక ఉదంతాలు చెబుతారు.
స్వామిని అభిషేక సమయంలో దర్శించుకునేవారికి పాండురంగని తల పైభాగం లింగాకారంలో కనిపిస్తుంది. శివ కేశవ అబెదాన్ని తెలియచేసే ఒక సంఘటన కూడా ఇక్కడ జరిగిందని చెప్తారు. ఒకసారి పాండురంగస్వామికి కిరీటం, వడ్డాణం చేయించేందుకు ఆగ్రామం లోని స్వర్ణకారుడైన సంత్ శ్రీనరహరి సోనార్ అనే విశ్వబ్రాహ్మణుని పిలిపించారట.
అతడు పరమ శివ భక్తుడు. భక్తుడైనా కూడా పరమ ఛాందసుడు. అతడి మూఢభక్తీ ఏ స్థాయిలో ఉండేదంటే శివనామస్మరణ, శివదేవుని దర్శనం తప్ప, మరో నామాన్ని గాని మరే దైవం దర్శనం గాని అస్సలు ఇష్టపడదు. విష్ణు స్వరూపాన్ని చూడడానికి గాని, విష్ణు సంబంధిత విషయాలను చివరికి పేరును కూడా వినడానికి ఇష్టపడనంత కఠోరమైన శైవుడు. దాంతో విష్ణు స్వరూపుడైన పాండురంగని ఆలయానికి రావడానికి స్వామి కొలతలు తీసుకోవడానికి నిరాకరించాడు నరహరి సోనార్.
దానితో పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే గ్రామంలో పనితనం కలిగిన స్వర్ణకారుడు నరహరి సోనార్. ఎలాగైనా అతడి చేత స్వామికి కిరీటం చేయిస్తే బాగుంటుందనుకున్నారు. కాని నరహరి చూస్తే ఆలయంలోకి రానంటున్నాడు. ఈ పరిస్తితిలో పెద్దలు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.
అతని దగ్గరకు వెళ్లి, విఠలునికి అని చెప్పకుండా ఒక దైవ విగ్రహానికి కిరీటం చేయాలని అయితే ఆ దైవం యొక్క మూర్తిని ఆభరణాలు చేసి అలంకరించే వరకు చూడరాదన్న నియమం ఉంది కాబట్టి కళ్ళకు గంటలు కట్టుకొని ఆ దైవానికి కావలసిన ఆభరణాలకు కొలతలు తీసుకోవాలని చెప్పారు.
సరే అని చెప్పి తన వ్రుత్తి ధర్మంగా వెళ్లాలనుకున్నాడు నరహరిసోన్. గ్రామస్తులు కోరినట్టుగానే అతడు ఆ దేవతామూర్తి కిరీటానికి కొలతలు తీసుకునేందుకు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయంలోకి వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్లిన నరహరి స్వామి వారికి కిరీటం, వడ్డాణం చెయ్యడానికి విఠలుని విగ్రహం, తల భాగం తాకాడు.
అంతే స్వామి మూర్తిని తాకగానే శివలింగాన్ని తాకిన అనుభూతి కలిగిందట అతనికి. ఇదేంటీ చిత్రం అని ఆశ్చర్యపోయిన నరహరిసోన్ కి అనుమానం వచ్చింది. ఆ మూర్తిని చూడాలనిపించింది. వెంటనే కాళ్ళకున్న గంటలు లాగి పడేసాడు. ఎదురుగా శోభాయామానంగా వెలిగిపోతున్న పాండురంగడు తన ఆరాధ్యదైవం శివయ్యగా ప్రశాంతంగా దర్శనమిచ్చాడు. వెంటనే నరహరిసోన్ కి జ్ఞానోదయమయింది. తన ఆరాధ్యదైవం పరమశివుడే పాండురంగడు. పాండురంగడే శివుడు....ఇద్దరికీ బేధం లేదు అని అర్థం చేసుకున్నాడు. తన అజ్ఞానాన్ని,మూర్ఖత్వానికి మన్నించమని విఠలుని ముందు సాగిలపడ్డాడు.
అలా విఠలుడు శివునిగా దర్శనమిచ్చి, శివ , విష్ణు రూపాలకు భేదం లేదని చెప్పి సంత్ నరహరి సోనార్‌ని ఆశీర్వదించాడట. అలా ఈ క్షేత్రం శివకేశవ అబేధమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పండరీపురం క్షేత్ర చరిత్ర గురించి, అసలు పాండురంగడు ఇక్కడ ఎందుకు వెలిసాడు... అది కూడా ఒక విలక్షణ భంగిమలో ఎందుకు వెలిసాడు అన్న విషయానికి వస్తే ప్రధానంగా రెండు కథనాలు చెప్పుకోవాలి. ఒకటి విఠలుని పరమభక్తుడైన పుండలీకునికి సంబంధించిన కథ. మరొకటి శ్రీకృష్ణుని మీద అలిగి వచ్చేసిన రుక్మిణీదేవికి సంబంధించిన కథ. అసలు రుక్మిణీదేవి ఎందుకు అలిగింది... ఆ అలక శ్రీకృష్ణుడు పండరీపురంలో పాండురంగానిగా వెలియడానికి ఎలా కారణమయింది అన్న కథనం గురించి తెలుసుకుందాం.
పాండురంగడు పండరీపురంలో కొలువుతీరడానికి విభిన్న కారణాలున్నట్టు ఆలయ స్థలపురాణం... పురాణ కథనాలు చెప్తున్నాయి. అందులో ఒకటి రుక్మిణీదేవికి సంబంధించినది. పాండురంగడు ఒకరకంగా రుక్మిణీదేవి కారణంగానే పండరీపురంలో స్వయంభువుగా వెలిసాడు అని ఓ కథనం.
శ్రీకష్ణ భగవానుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తరువాత జరిగిన ఒక సంఘటన ఇలా కృష్ణయ్య పాండురంగని గా ఇక్కడ అవతరించడానికి కారణమని చెప్తారు. క్రిష్ణయ్యకు గోపికలకు ఉన్న అనుబంధం, వారి రాసక్రీడలు అన్నీ పురాణ కథల ద్వారా మనందరకూ తెలిసిందే కదా. గోపికలను వదిలి కృష్ణయ్య ఉండలేడు. కృష్ణయ్యను వదిలి గోపికలు అసలు మనలేరు. ఒకరోజు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఒంటరిగా వదిలిపెట్టి గోపికల దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు. గోపికలు నల్లనయ్య కలిస్తే ఆటలకే కొదవా! అక్కడ గోపికలతో ఆటపాటలలో, రాసక్రీడలలో మునిగిపోయాడు కృష్ణుడు. రుక్మిణమ్మ సంగతే మరిచిపోయాడు.
ఇక్కడ శ్రీకృష్ణుడు కనబడక రుక్మిణీదేవి కంగారుపడింది. దాంతో శ్రీకృష్ణుని వెతుక్కుంటూ బయలుదేరింది. అలా వెతుక్కుంటూ వచ్చి బృందావనంలో గోపికలతో రాసక్రీదలలో మునిగి ఉన్న క్రిష్ణయ్యను చూసింది. తన ప్రాణనాథుడు గోపికల మధ్య సరాగాలలో ఉండడం చూసి కినుక వహించింది. కోపగించుకోని అక్కడినుంచి వెళ్ళిపోయింది. అలా ఈ పండరీపుర ప్రాంతానికి వచ్చి అక్కడి దిండీరవనంలో తపస్సులో మునిగిపోయింది.
ఇక సంగతి గ్రహించిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. రుక్మిణీదేవి తపస్సులో ఉండడం చూసి ఆమెను పలకరించి చూసాడు. ఆమెనుంచి ఎలాంటి స్పందన లేదు. ఆమె ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తూ రెండు చేతులూ నడుం మీద పెట్టుకొని నిలబడి నిరీక్షించసాగాడు. అయితే కోపంతో ఉన్న రుక్మిణీదేవి స్వామిని చూడనట్టే ఉండిపోయింది. ఎంతసేపు వేచి చూసినా, రుక్మిణీదేవి ఎంతకీ పలకకపోయేసరికి విసిగి వేసారిపోయిన స్వామి అక్కడే నిలబడ్డచోటే, నిలబడిన భంగిమ లోనే స్వయంభువుగా శిలారూపం దాల్చాడని చెబుతారు. అలా రుక్మిణీదేవి అలక శ్రీకృష్ణుడు పాండురంగడిగా విలక్షణ భంగిమలో వెలియడానికి కారణమైంది.
అయితే దీనికి సంబంధించి మరో కథనం కూడా ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడే రుక్మిణీదేవి మీద అలిగి ఈ ప్రాంతానికి వచ్చాడని అలా వచ్చినపుడే పుండరీకునికి దర్శనమిచ్చి, తన భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా వెలిసాదని ఓ కథనం కూడా ప్రచారంలో ఉంది.
అయితే పాండురంగడు ఇక్కడ కొలువు తీరడానికి మరో కథ కూడా ఉంది. గజేంద్రుని అనుగ్రహించడం కోసం శ్రీమహావిష్ణువు ఎలా అయితే సిరికింజెప్పఁడు అన్నట్టుగా లక్ష్మీదేవికి గాని, సేవకులకు గాని జయవిజయులకు గాని ఎవ్వరికీ చెప్పకుండా తనెలా ఉన్నాడో కూడా చూసుకోకుండా వైకుంఠం వదిలి వడివడిగా ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నపళంగా గజేంద్రుని దగ్గరకు పరుగులు పెట్టి వెళ్ళాడో అదే విధంగా, పుండరీకుని అనుగ్రహించడం కోసం శ్రీకృష్ణుడు కూడా వడివడిగా కనీసం రుక్మిణీదేవికి కూడా చెప్పకుండా వచ్చేసాడట. దాంతో తన పతిని కానని రుక్మిణీదేవి స్వామిని వెతుక్కుంటూ అన్ని ప్రదేశాలను గాలిస్తూ వచ్చి ఇక్కడ పుండరీకుని కోసం, పుండరీకుని కోరిక మీద పాండురంగడిగా కొలువుతీరడం చూసి, రుక్మిణీ దేవి స్వామి దగ్గరే తానూ, స్వామి తోనే తానూ అన్నట్టుగా, ఆమె కూడా ఇక్కడే ఉండిపోయిందట. అయితే స్వామివారు తనతో చెప్పకుండా అలా వచ్చేయడంతో రుక్మిణీదేవికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతోనే స్వామి మీద అలిగ రుక్మిణీ దేవి దూరంగా ఉండిపోయిందని, అందుకే స్వామికి కొద్ది దూరంలో రుక్మిణీ దేవి కొలువుతీరిందని ఇలా భిన్న కథనాలు చెప్పుకుంటారు.
పాండురంగడిని మరాఠీలు ఎక్కువగా విఠోబాగా ఆరాధిస్తారు. పండరీపురంలో వెలసిన పాండురంగడి ఆవిర్భావాన్ని గురించి భిన్న భిన్న కథనాలు చెబుతారు. ఆ ఆవిర్భావ కథనాలలో కాస్త వైవిధ్యమున్నా అందరూ ఒప్పుకునేది మాత్రం ఒకటుంది. ఎవరో శిల్పి చెక్కిన స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించలేదు. ఆ శ్రీకృష్ణుడు విఠలుడుగా స్వయంభువుగా ఇక్కడ వెలిసాడన్నది మాత్రం అందరూ ముక్తకంఠంతో ఒప్పుకునే మాట.
విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండలీకుడి చుట్టూనే తిరుగుతాయి. స్కాంద పురాణం లో కూడా పుండలీకుడి ప్రస్తావన ఉందని చెబుతారు. ఈ పుండలీకుడినే పుండరీకుడు అని కూడా వ్యవహరిస్తారు.
పూర్వం ఈ ప్రాంత్రంలో విష్ణు భక్తులైన దంపతులు ఉండేవారు. వారి కుమారుడే పుండరీకుడు. తల్లిదండ్రులు ఎంత విష్ణు భక్తులో ఈ పుండరీకుడు అంత దైవానికి దూరంగా ఉండేవాడు. ఊహ తెలిసిన నాటి నుంచి దైవ ధ్యానానికి దూరంగా ఉంటూ వ్యసనాలకు బానిస అయ్యాడు. జీవితం గాలిబుడగ అంటారు కదా... ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఉన్నపుడే జీవితాన్ని అద్భుతంగా అనుభవించాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు అన్న మూర్ఖపు వాదనలతో బాధ్యత లేకుండా తిరుగుతూ చెడు సావాసాలకు, వ్యసనాలకు అలవాటు పడి, పెడదారి పట్టాడు. కనీసం వివాహం చేస్తే అయినా బాగుపడతాడని చక్కటి బాలికను తెచ్చి కొడుక్కి వివాహం చేసారు. పుండరీకుని తలితండ్రులు. భార్య వచ్చిన తరువాత భార్య మీద వ్యామోహంతో తల్లిదండ్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయసాగాడు పుండరీకుడు. మరికొంతకాలానికి ఆ భార్యను పక్కన పెట్టి వేశ్యాలోలుడై తల్లిదండ్రులతో పాటు భార్య మనసుకి కూడా కష్టం కలిగించాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది.
పుండరీకుని ఆగడాలను భరించలేని అతని తల్లిదండ్రులు, తమ కొడుకును మార్చమని ఆ శ్రీహరిని వేడుకున్నారు. ఈ పరిస్తితుల్లోనే వేశ్యలోలుడైన పుండరీకునికి కొన్ని చేదు అనుభవాలు ఎదురై అతనికి జీవిత పాఠాన్ని నేర్పాయి. వ్యసనాలనుండి బయటపడి భక్తి ఒక్కటే శాశ్వతమైనదని అతడు గ్రహించాడు.
అదే సమయంలో పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్నముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెడుతున్నారు. అలా ముగ్గులు పెట్టగానే అంతవరకూ అందవికారంగా ఉన్న ఆ స్త్రీలు అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోసాగారు. ఇది చూసి ఆశ్చర్యపోయాడు పుండరీకుడు.
మరి పుండరీకుడికి అక్కడ ఎదురైన వింత సంఘటన ఎక్కడికి దారితీసింది ...? ధారావాహిక రెండవ భాగంలో...