మహానటి | నవల పార్ట్ 10 | మావూరు.విజయలక్ష్మి | Telugu novel Mahanati 10th part

Vijaya Lakshmi

Published on Oct 14 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన


 “మహానటి” ధారావాహిక – 10


   రచన : మావూరు.విజయలక్ష్మి


తల్లి మరణం ప్రభావం నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న తరుణంలో తారకు తగిలిన మరో పెద్ద షాక్ జ్యోత్స్న మరణం.

ఈమధ్య తరచుగా తారను వెంటాడే ప్రశ్న ఒక్కటే... ‘ఏమిటీ జీవితం! ఏ తోడు అనుబంధం లేకుండా ఒంటరి బ్రతుకు బ్రతికి మాత్రం ప్రయోజనం ఏంటి?’ అని. తనకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి, నిరంతరం తన గురించే తపన పడిన తల్లి తన గురించి బెంగతోనే అశాంతితోనే కన్నుమూసింది. తన మనసుకు దగ్గరగా వచ్చి ఆత్మీయత పంచిన స్నేహితురాలు బలవన్మరణం పాలయింది. జీవితాంతం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తనకు తోడునీడగా తన పక్కన ఉంటాడని నమ్మిన మనిషి తను నటినన్న ఒకే ఒక్క కారణం చూపించి మొహం చాటేసాడు. ఇలా ఆత్మీయులు అనుకున్న వారిని ఒక్కొక్కరినే దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన తను బ్రతికి ఏం సాధించాలి?

తన ఒంటరితనాన్ని... వృత్తిని ఆసరాగా తీసుకుని, ప్రతివారు తన జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నించే వాళ్లే. దీనికంతటికీ తల్లి మాట వినకుండా తను తీసుకున్న నిర్ణయమే కారణమా! హాయిగా ఆనందంగా బ్రతకవలసిన వయసులో, 30 ఏళ్లకే మూడు కాళ్ల ముసలమ్మలా... ఇలా ప్రతిక్షణం భయపడుతూ భంగపడుతూ భారంగా బ్రతకవలసి రావడం తన స్వయంకృతమేనా?’ ప్రతిక్షణం ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఒంటరిగా ఉంటే చాలు ఇవే ప్రశ్నలు బుర్రను తొలిచేస్తున్నాయి.  ఒంటరిగా ఉండకుండా ఎలా...!

తన బ్రతుకే ఒంటరి బ్రతుకు. నాటకాల రిహార్సల్స్ కు, ప్రదర్శనలకు వెళ్లడం, ఇంట్లో ఉన్నప్పుడు నాటకం తాలూకా స్క్రిప్ట్ చదివి తన పాత్ర వరకు చేసి చూసుకోవడం, వండుకోవడం ఏదో తిన్నాను అనిపించి పడుకోవడం... ప్రతినిత్యం ఇదే మార్పులేని దినచర్య. ఈమధ్య నిద్ర కూడా సరిగా రావడం లేదు బుర్రను వేడెక్కించే ఈ ప్రశ్నలతో. తను ఎన్నుకున్న వృత్తిని తల్లి ఎందుకంతగా వ్యతిరేకించిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

ఆఖరికి నాటకాల వాళ్లకి ఇల్లు అద్దెకిచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు ఇల్లు గలవాళ్లు. తల్లితో కలిసి ఉన్న ఈ ఇంట్లో ఈ పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతుంటే, అనుక్షణం తల్లి జ్ఞాపకాలతో గుండె బరువెక్కిపోతోంది. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఉండడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఈ ఇంటినమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసుకుని, ఎక్కడైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండాలని నిర్ణయించుకుంది. ఆ ఉద్దేశంతోనే ఇళ్ళ వేటకు బయలుదేరిందీ మధ్య. ఆ వేటలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ‘టూ-లెట్’ బోర్డ్ ఉన్న ఒక ఇంటికి వెళ్లి అడిగితే, ఆ ఇల్లు గల ముసలావిడ మరీ చాదస్తురాల్లా  ఉంది సవాలక్ష ప్రశ్నలు వేసి కండిషన్లు పెట్టి, చివరకు తేల్చిందేంటంటే... నాటకాల వాళ్లకి, ముఖ్యంగా నాటకాల్లో వేసే ఒంటరి ఆడవాళ్ళకి ఇల్లు ఇవ్వమని. వాళ్లంత పాపం ఏం చేశారో మరి! అదే మాట ఆవిడని అడిగితే, ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే... నాటకాల వాళ్లయితే ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లడం రావడం జరుగుతుందని. దానివల్ల తమకు ఇబ్బంది అవుతుందని. బయటికి అలా చెప్పినా ఇంకేదో తేలిక భావం ఆవిడ మాటల్లో ఉందనిపించింది తారకు. ఏమో! అది తన భ్రమ కూడా కావచ్చు. ఆవిడ చెప్పిన కారణం నిజమేనేమో! తనకి ఎదురైన అనుభవాల వలన అలా అనిపించిందేమో! ఇంకో అద్దె ఇంట్లో, నాటకాల్లో వేషాలు వేయడంతో పాటు తను ఒంటరిగా ఉంటాను అనడం మరో మైనస్ పాయింట్ అయి కూర్చుంది. వాళ్ళు ఫ్యామిలీకి తప్ప ఒంటరివాళ్ళకి ఇల్లు ఇవ్వరట. ఈ అద్దె ఇళ్ళ వేట ఓ  ప్రహసనంగా మారింది.

“అమ్మాయి తారా!” పిలుస్తూ వచ్చింది ప్రక్క వీధిలో ఉండే అమ్మ స్నేహితురాలు. తన ఆలోచనలను పక్కనపెట్టి, “రండి...” అంటూ ఆమెను ఆహ్వానించింది.

“బాగున్నావా... తారా”

తనేదో సమాధానం చెప్పబోయేంతలో మళ్ళీ ఆవిడే అంది. “ఏం బాగుంటావులే! నీకున్న ఒక్కగానొక్క తోడు... మీ అమ్మ. ఆవిడ చూస్తే అలా అర్థంతరంగా నీ గురించి బెంగతోనే కన్నుమూసింది. ఇక నువ్వు చూస్తే పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ... ఏం బావుంటావులే...” అంది.

శూలంతో గుచ్చినట్టు అయింది తారకు. ఆవిడ మాట తీరే అంత. ఎదుటివారు బాధపడతారనే కనీస ఇంగితం కూడా లేకుండా నోటికి ఎంతవస్తే అంత, ఏదిపడితే అది మాట్లాడేస్తుంది. ఇలాంటి వాళ్ళు తమ నోటికి పని కల్పిస్తారే తప్ప... ఆ నోటి ప్రభావం ఎదుటి మనిషిమీద ఎలా పడుతుందని ఆలోచించరు’

“అవును గాని తార! ఇల్లు అమ్మకానికి పెట్టావని విన్నాను? నిజమేనా?”

 “అవునండీ... మీరు విన్నది నిజమే.”

“ఇప్పుడు అంత అవసరమే వచ్చింది తారా!?”

“అవసరమని కాదండి. అమ్మ తిరిగాడిన ఈ ఇంట్లో ఉంటే నిరంతరం అమ్మే గుర్తుకొస్తుంది. ఆమె జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. అమ్మను మరిచిపోవాలని, అసలు మర్చిపోగలనని కాదుగాని, ఈ పరిసరాల నుంచి దూరంగా ఉంటేనన్నా కాస్త మనసు దిట్టపు చేసుకోగలనేమో అని...” నెమ్మదిగా చెప్పింది తార.

“నీ పిచ్చి గాని... ఎక్కడకని పారిపోగలవు? అసలు మొదటే నువ్వు మీ అమ్మ మాట వినుంటే... పోనీ మీ అమ్మయినా నిన్ను గట్టిగా అదుపులో పెట్టగలిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండకపోను. ఇప్పుడేం అనుకుని ఏం లాభంలే. నేనన్నానని కాదు గాని తారా... ఇప్పటికైనా ఎవరినైనా పెళ్లి చేసుకుని స్థిరపడొచ్చు కదా! ఇలా ఎంతకాలం నాటకాలు వేస్తూ బ్రతికేస్తావు? మీ అమ్మ ఉన్నప్పుడే ఎంతో ప్రయత్నించింది నీ పెళ్లి కోసం. అయినా అవన్నీ ప్రయత్నాలు కానీ మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఆ దారి కూడా లేదు. ఏమిటో! ఆ దేవుడు ఇలా రాసి పెట్టాడు నీ జీవితాన్ని. ఏమిటోనమ్మా! ఉండబట్ట లేక ఏదో అంటున్నాను. ఏమీ అనుకోకు. ఏదో... స్నేహితురాలి కూతురివి కదా! ఆ అభిమానంతోనే చెబుతున్నాను. ఏదైనా సహాయం కావలసి వస్తే మొహమాటపడకుండా అడుగు. మరి నేను వెళ్ళొస్తానమ్మా.” వచ్చిన పని అయిపోయింది కదా! ఇక ఉండడం అనవసరం అన్నట్టు బయలుదేరిందావిడ.

ఆవిడను గేటు వరకు సాగనంపి వచ్చింది తార. ఆమె మనసులో ఆవిడన్న మాటలే మెదులుతున్నాయి. ‘ఎంత వ్యంగ్యమో! మాటల్లో. నాటకాలు వేస్తూ బ్రతికేస్తున్నానట! తనపై సానుభూతి చూపుతునట్టే ఉన్నా, ఆ మాటల్లో ఎంత ఎగతాళి తొంగి చూస్తోంది! అమ్మ తనను అదుపులో పెట్టుంటే ఇలా జరిగేది కాదట. అదుపులో పెట్టడానికి తనంత బరితెగించి, కాని పనులు ఏం చేసింది? ఆఖరికి అమ్మ కూడా కూతుర్ని అదుపులో పెట్టలేదని నిందలు పడాల్సి వచ్చింది. తన ఎదురుగానే ఇలా మాట్లాడుతున్నారంటే... వెనక ఇంకెంత హీనంగా మాట్లాడుకుంటున్నారో! ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప ప్రశాంతంగా బ్రతకలేనేమో! అంతలోనే ఇంకో ఆలోచన ఆమె మనసులో... ఆంటీ అన్నట్టు... ఎక్కడకని పారిపోగలదు? ఈ పరిస్థితులనుండి అయితే దూరంగా వెళ్లగలదు. కానీ ఎక్కడికి వెళ్లినా అక్కడ మాత్రం ఇలాంటి మనుషులు ఉండరా? మనుషులు మారడమే తప్ప మనస్తత్వాల్లో అంతగా మార్పు ఉండదు కదా! అయినా ఇంత దూరం వచ్చాక ఇలా భయపడ్డం రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవడం లాగే ఉంటుంది. ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది తార, ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అని.

సగం జీవితమైన గడవలేదు... ఇప్పుడే ఇలా భయపడి పారిపోతే, ఇక ముందు ముందు ఎలా జీవిస్తుంది. ఇప్పుడే ఏమైంది... భవిష్యత్తులో ఇంకెలాంటి అనుభవాలు ఎదురవుతాయో! తను ఇప్పుడే ధైర్యాన్ని కోల్పోతే... ముందు ముందు మరీ దుర్భరంగా తయారవుతుంది తన బ్రతుకు. అసలు వాళ్లు... వీళ్లు... అన్న మాటల్ని, చేష్టల్ని పట్టించుకుని తనెందుకు ఇంతగా బాధపడడం!? అది వాళ్ళ వాళ్ళ సంస్కారం అంతే. ఎవరి వృత్తి వారిది... ఎవరి జీవితం వారిది.’ తార మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. వాటికి అంతం లేకుండా పోయింది. తలలో సన్నగా పోటు మొదలైంది ఈ మధ్య తరచుగా తలనొప్పి వస్తోంది. మొదట్లో చిన్నగా మొదలయ్యే నొప్పి రాను రాను ఉదృతంగా భరించలేనంతగా మారి ఏడుపొచ్చినంత పనవుతోంది. ఈ బాధపడలేక డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకుంది. ఏవో మందులు రాసిచ్చాడు డాక్టర్. విపరీతంగా ఆలోచించడం వలన, టెన్షన్ కారణంగా ఇలా వస్తుంది అని చెప్పి, మందులు వాడడం కంటే... ముందు ఆలోచనలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అని చెప్పాడు డాక్టర్. తనకూ ప్రశాంతంగా ఉండాలనే ఉంది... కానీ వద్దంటున్నా వచ్చి బుర్రను తొలిచేస్తున్నాయి ఆలోచనలు. ఏం చేయడం?’ లేచి వెళ్లి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. నిద్ర వస్తే కదా! ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.

*************************

ఆరోజు రిహార్సల్సవీ ఏం లేవు. ఇంట్లో చక్కపెట్టాల్సిన పనులు కూడా అంతగా లేవు. కొన్నాళ్లుగా నాటకం ఇల్లు తప్ప మరో ప్రపంచం లేనట్టు గడుపుతున్న తారకు, ఇంట్లో కూర్చుని... కూర్చుని బోర్ కొడుతోంది. ఎక్కడికైనా వెళితే బాగుంటుంది అనుకొంది. ఎక్కడికి వెళ్లాలి...? ‘అనిత దగ్గరికి వెళితే... తనీ టైంలో ఇంట్లో ఉండదు కదా! ఆఫీసులో ఉంటుంది. పోనీ చంద్రమణి దగ్గరకు వెళ్లి, అక్కడ నుంచి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళితే సరి..’ అనుకున్నదే తడవు లేచి మొహం కడుక్కుని తయారవసాగింది చీర మార్చుకుంటుండగా బయట నుంచి చిరపరచితమైన గొంతు వినబడింది “తారా...” అంటూ ఆ గొంతు వినగానే గబగబా చీర కట్టడం ముగించి ఆనందంగా బయటికి వచ్చింది.

 “బాగా బిజీ అయినట్టున్నావు? అన్నట్టు... అమ్మ బాగున్నారా?” సంతోషంగా అడిగింది తార స్నేహితురాలి వాటేసుకొని.

“ఆ...అంతా బాగున్నారు. ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నాను. ఆఫీసు నుండి ఆ బస్సులు పట్టుకుని పడుతూ లేస్తూ వచ్చేసరికి రోజూ ఏడైపోతుంది. ఇక ఆదివారం వద్దామంటే బద్ధకం. ఇవాళ ఏదో ముస్లిం పండగట సెలవిచ్చారు. అందుకే ఇలా వచ్చాను.” అక్కడున్న కుర్చీలో కూలబడుతూ అంది అనిత. “అది సరేగాని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు?” అంది మళ్లీ తనే.

“ఊరికినే. ఇంట్లో ఉండి ఉండి... విసుగు పుడుతుంది. నీ దగ్గరకు వద్దామంటే ఈ టైంలో నువ్వెలాగూ ఇంట్లో ఉండవు కదా. అందుకే నా కో యాక్టర్ చంద్రమణి దగ్గరకు వెళ్లి, అట్నుంచటే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాను. నువ్వొచ్చావు కదా... ఇంకెక్కడికి వెళ్ళను. ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాం.” మాట్లాడుతూనే టీ చేసి తెచ్చింది తార. అనితకో కప్పిచ్చి, తనో కప్పు పట్టుకొని కూర్చుంది.

కబుర్లతో ఒక్కసారిగా కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయారు. ఈ మధ్యకాలంలో తార ఎప్పుడు ఇంత ఉత్సాహంగా కనబడలేదు. కబుర్లలో పడి కాలమే తెలియలేదు ఇద్దరికీ. మాటల మధ్యలో అడిగింది అనిత “అన్నట్టు తారా! విజయ్ ఏమంటున్నాడు. మాకు శుభలేఖలు త్వరగా పంచే ఉద్దేశం ఉందా? లేదా?” తను పరిచయం చేసిన ఆ ఇద్దరు పరిచయస్తుల నుండి ప్రేమికులుగా మారడం చూచాయిగా తెలుసామెకు.

అంత సంతోషంలోనూ విజయ్ ప్రసక్తి రావడంతోనే తార ముఖం మాడిపోయింది. ఇది గమనించిన అనితకు, ‘ఆమె ఎందుకలా అయిపోయిందో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా?’ మనసులోకి ఏదైనా వస్తే దాన్ని దాచుకునే రకం కాదా అమ్మాయి. అందుకే తన అనుమానం బయట పెట్టేసింది.

“తారా! ఏంటలా అయిపోయావు? ఏమైంది?” అని.

“ఆ... ఏం లేదు. ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం” మాట తప్పిస్తూ అంది తార.

“ఇంకెప్పుడు మాట్లాడకుంటాం? నువ్వు నేను కలుసుకోవడమే జన్మకో శివరాత్రి. చెప్పు... అసలేంటి ప్రాబ్లం? ఈమధ్య విజయ్ నువ్వు కలుసుకున్నారా? ఏదైనా మాట మాట అనుకున్నారా? అందుకే చెప్తున్నాను... మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే, ఇలా దెబ్బలాడుకుని ఇద్దరు చెరో చోట కూర్చుని బాధపడక్కర్లేదు. హాయిగా ఒకే ఇంట్లో కూర్చొని బాధపడొచ్చు. ఏమంటావ్?” జరిగిందేదో చిన్న విషయమే అనుకుని జోకే గా అంది అనిత.

తనలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా, నవ్వకుండా ముఖం మాడ్చుకునే ఉన్న తారను చూసి, ఏదో పెద్ద గొడవే జరిగిందనుకుంది. తరఛి తరచి అడగ్గా, చివరికి తమ మధ్య జరిగిన సంభాషణ, తను నటినన్న కారణంగా అతడు పెళ్లికి నిరాకరించిన సంగతి చెప్పింది తార.

“అదేమిటి!? మీరిద్దరూ ప్రేమలో పడకముందే నువ్వు నటిస్తున్నావు కదా! ఆ సంగతి వాడికి తెలుసుకూడాను! మరిప్పుడేంటి... ఇలా...? సరే! విజయన్నయ్యతో నేను మాట్లాడతాలే.”

“వద్దు అనితా... ఇలాంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం చేసుకుంటే మరీ ఘోరంగా తయారవుతుంది పరిస్థితి. అతను నాతో పెళ్లికి నిరాకరించడం కంటే, అతడు మాట్లాడిన తీరే నన్ను ఎక్కువగా బాధపెడుతోంది తెలుసా. కనీసం అమ్మ పోయినప్పుడు కూడా... ఏదో పరిచయస్తుడిలాగానే కనబడి వెళ్లిపోయాడు.”

“ఈ మధ్య ఓసారి అన్నయ్య కనిపించాడు తార. చాలా దిగులుగా నిరుత్సాహంగా కనిపించాడు. అప్పటికి మీ విషయాలు ఏం తెలియదు కదా... అందుకే అదంతా నా భ్రమేమో! అనుకుని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది వింటుంటే అనిపిస్తోంది... జరిగిందానికి అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నట్టే ఉంది తార. అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. వాడు అలా మాట్లాడాడంటే నేను... నేను నమ్మలేకుండా ఉన్నాను. అలాగని నువ్వే అనవసరంగా అన్నయ్యను అపార్థం చేసుకున్నావని కూడా అనను. ఎందుకంటే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. కానీ వాడు అలా మాట్లాడడానికి వెనక ఏదో భరించలేని వేదన ఉందని మాత్రం అనిపిస్తోంది. అసలు మీరిఇద్దరు మరోసారి కలుసుకుని మాట్లాడుకుంటే ఈ అపార్ధాలు, ఆవేశాలు తొలగిపోతాయని నా నమ్మకం.” అంది అనిత.

ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది తార. అనిత కూడా ఇంకేమి రెట్టించకుండా టాపిక్ మార్చేసింది. తర్వాత చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు గాని ముందున్నంత ఉత్సాహంగా సంతోషంగా గడపలేకపోయారు.

“అనవసరంగా విజయ్ విషయాలు కదిపి నిన్ను బాధ పెట్టాను. అసలు నిన్ను బాధ పెట్టడానికే వచ్చినట్టు అయింది” అంటూ... చాలా ఫీల్ అయింది అనిత వెళుతూ వెళుతూ.

********************************

సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి

Recent Posts
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే...  | shri sailam bramhmotsavam
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే......
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి వివాహం...  | Who is goddess lingabhairavi? What is bhootshuddhi marriage?
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి...
మానూ మాకును కాను – నవల – 25  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
మానూ మాకును కాను – నవల – 24  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...