మహానటి | నవల పార్ట్ 11 | మావూరు.విజయలక్ష్మి | Telugu novel Mahanati 11th part

Vijaya Lakshmi

Published on Oct 15 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల


           “మహానటి” ధారావాహిక – 11


              రచన : మావూరు.విజయలక్ష్మి


ఉదయం లేచిన దగ్గర్నుంచి చాలా ఆందోళనగా ఉంది సుబ్బలక్ష్మికి. ఈరోజు ఆవిడ కూతురు రజనికి పెళ్లి చూపులు. అన్నీ సర్దుకుని పెళ్లి వారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇప్పటికే పాతిక పెళ్లిచూపులు అయి ఉంటాయి ఆ అమ్మాయికి. కనీసం ఈ సంబంధమైనా కుదిరితే బాగుంటుంది అని దేవుడికి ఎన్నెన్నో మొక్కులు మొక్కుతోంది. ఎలాగైనా తొందర్లోనే కూతురికి పెళ్లి చేసి పంపాలని తెగ తాపత్రయ పడుతోంది. ఆవిడంత ఆత్రుత పడుతుందంటే కారణం, ఆ అమ్మాయేదో వయసు మీరి పోయిందని మాత్రం కాదు. ఆ పిల్ల పెళ్లి విషయంలో ఆవిడకి ఎదురైన అనుభవాలు అలాంటివి మరి! మొదట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు కొంతమంది వచ్చి పిల్లను చూసి, అన్నీ మాట్లాడుకుని, తీరా తన వృత్తి విషయం వచ్చేసరికి బెడిసి కొట్టేది. ‘నేను నాటకాలు వేస్తే... నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఏంటి బాధ!? వాడు చేసుకునేది నన్నా? నా కూతుర్నా?’ అనుకునేది కసిగా. తర్వాత అలా కాదని ముందే తన వృత్తి తన పూర్వపరాలు అన్నీ చెప్పి, వాటికి అభ్యంతరం లేదంటేనే పిల్లను చూడడానికి రమ్మనేది. అలాగే వచ్చేవారు కూడా. తీరా వచ్చాక ఎంతో ఆదర్శంతో అమ్మాయి వెనకున్న లోపాలను పట్టించుకోకుండా పెళ్లికి అంగీకరిస్తున్నాం కాబట్టి... ఘనమైన కట్న,కానుకలతో తమ ఆదర్శాన్ని ఆదరించాలని పరోక్షంగా హెచ్చరించేవారు కొందరు. సుబ్బలక్ష్మి దగ్గర వారి ఘనతను అందు’కొనే’పాటి డబ్బు లేకపోవడంతో అవి కూడా తప్పిపోయాయి. అమ్మాయి బాగాలేదని, చురుకుతనం లేదని కొన్ని తప్పిపోయాయి. ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందావిడకి. మొన్నామధ్య, తన సహనటుడు ప్రసాద్ రావు కూతురికి ఎంత తేలిగ్గా పెళ్లి చేసేసాడు! అసలు ఆ అమ్మాయి పెళ్లి విషయంలో వాళ్ళ నాన్న నటుడు అన్న విషయం ఏ మాత్రం అడ్డంకిగా పరిణమించలేదు. పైగా అందరూ కళాకారుడు... కళాకారుడు... అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడారు. మరి... మరి... తన విషయంలో ఎందుకు ఇలా అవుతుంది!? అంటే... మగాడు స్టేజ్ ఎక్కి నటిస్తే తప్పులేదు గాని, ఆడది స్టేజ్ ఎక్కి నటిస్తే మాత్రం చెడిపోయిందాని కింద లెక్కన్నమాట.

సుబ్బలక్ష్మి ఇలాంటివన్నీ పట్టించుకోవడం మానేసి చాలాకాలం అయింది. మొదట్లో ఇలాంటి వాటికి చాలా బాధపడేది. కానీ రానురాను రకరకాల అనుభవాలన్నీ ఎదుర్కొని రాటు తేలిపోయి మొండిగా... ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే... మొరటుగా, డోంట్ కేర్ అన్నట్టుగా తయారైపోయింది. కానీ ఇది కన్నకూతురి జీవిత సమస్య. అందుకే ఇంతగా ఆందోళన పడుతోంది.

పెళ్లి వారి కోసం చూసి... చూసి విసిగిపోయింది. ఇక రారని నిర్ణయించుకుని కాసేపు నడుం వాలుద్దామని లేచింది. పెళ్లి వారు వస్తారని ఉదయం నుంచి ఇల్లంతా శుభ్రంచేసి కుర్చీలవి నీట్ గా సర్ది, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లవీ చేసుకుని, ఇంటి పనంతా త్వర త్వరగా ముగించుకోవడంతో చాలా అలసటగా ఉంది. ‘ఇంత శ్రమపడి ఏర్పాట్లు చేసి, వాళ్లకోసం ఎదురు చూస్తే, చెప్పపెట్టకుండా రావడం మానేస్తారా? పోనీ రావడం లేదని కబురు చేస్తే వీళ్ళ సొమ్మేం పోయిందో!’ కసిగా తిట్టుకుంటూ పడుకుంది.

ఇంతలో గేటు చప్పుడవడంతో గబగబా లేచి వెళ్ళింది... ఆ వచ్చింది పెళ్లి వారేమోనని. తీరా చూస్తే గేటు తీసుకుని వస్తోంది తార. “నువ్వా తారా! లోపలికి రా” అంది సుబ్బలక్ష్మి.

“అవునండి... కాస్త పనుండి ఇటు వెళుతూ, త్రోవలోనే కదా మిమ్మల్నోకసారి చూసి వెళదామని వచ్చాను” అంది తార.

ఇద్దరికీ బాగా స్నేహం కుదిరినా, తార ఫీల్డ్ లోకి వచ్చేసరికి సుబ్బలక్ష్మి నటిగా బాగా స్థిరపడిపోవడం... దానికి తోడు ఆవిడ వయస్సులో తనకంటే బాగా పెద్దది కావడంతో అండి అనే మాట్లాడుతుంది తార.

“ఎవరికోసమన్న ఎదురు చూస్తుంటే నేను వచ్చానా!” ఆవిడ ఆహ్వానించిన తీరు చూసి అడిగింది తార.

“అవును. ఇవాళ రజినీని చూసుకోవడానికి వస్తామన్నారు. ఇంకా రాలేదు. వాళ్లకోసమే చూస్తున్నాను.”

“ఓ! అలాగా! సరే... నేను ఇంకోసారి వస్తాలెండి” వెళ్లడానికి విద్యుత్తురాలు అవుతూ అంది.

“ఉదయం తొమ్మిది గంటలకల్లా వస్తామన్నారు. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇంకేం వస్తారులే నువ్వు కూర్చో. హు... దీనికి ఆ కళ్యాణ గీత రాశాడో లేదో ఆ భగవంతుడు” ఈ హడావిడితో తనకేం సంబంధం లేనట్టు లోపలి గదిలో దీక్షగా టీవీ చూస్తున్న కూతుర్ని చూసి అంది.

“అదేంటండి! అలా అంటారు?” అంది ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తార.

“మరేంటి తారా! దీని పెళ్లి కోసం నేను పడే పాట్లు ఆ భగవంతుడికే తెలుసు. ఎన్ని సంబంధాలని చూడను...! ఒకటా... రెండా? ఇప్పటికి పాతిక సంబంధాలు చూసినా... ఏ ఒక్కటీ కుదిరి చావట్లేదు. కొందరికి నా జీవితం, జీవన విధానం నచ్చలేదు. మరికొందరికి అసలు పిల్లే నచ్చలేదు. ఇంకొందరికి నా వెనకున్న డబ్బు చాలలేదు. ఈరోజు చూసావా... ఉదయం వస్తామన్నారు. ఇంతసేపు ఎదురు చూశాను. కనీసం రావడంలేదని కబురు చేయొచ్చు కదా... వెధవలు” అంది.

తారస్థానంలో ఇంకెవరైనా ఉంటే, ఆవిడ మాటలకు వాళ్ళ బుర్ర తిరిగిపోయేది. కానీ.. ఆవిడ మాట తీరు, మొరటితనం బాగా తెలిసింది కాబట్టి, ఆ మాటలకు పెద్దగా కంగారు పడలేదు తార.

“పోనీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయకపోయారా? తన కాళ్ళ మీద తను నిలబడితే కొంత నయం కదా!” అంది.

“సరేలే! నీకింకా దాని గురించి పూర్తిగా తెలియదు కదూ... అందుకే అలా మాట్లాడుతున్నావ్. అదిగో... చూసావా! నేను దాని గురించి ఇంత ఆందోళన పడుతున్నానా... అది మాత్రం ఈ ఆందోళనతో తనకేం సంబంధం లేనట్టు, పసిపిల్లలా టీవీ చూస్తూ ఎలా కేరింతలు కొడుతుందో చూడు” అంటూ కూతుర్ని పిలిచింది. “రజినీ ఇలా రా!” అని.

తల్లి గట్టిగా పిలవడంతో, “ఏంటమ్మా! టీవీ చూస్తుంటే మధ్యలో పిలుస్తావేంటి?” అంటూ వచ్చింది.

“అక్కకి కాస్త మంచినీళ్లు తెచ్చి పెట్టమ్మా!”

“” అంటూ లోపలికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది రజిని.

“అన్నట్టు అమ్మా! ఇవాళ పెళ్లి వారు వస్తారన్నావు. రాలేదే...” అమాయకంగా అడిగింది రజిని.

 “ఏమో నాకు తెలియమ్మా... ఎందుకు రాలేదో?”

“సరే అయితే! నేను టీవీ చూస్తాను. మంచి సినిమా వస్తుంది” అంటూ వెళ్లి టీవీ ముందు కూలబడింది. ఎక్కువగా మాట్లాడకపోయినా అమ్మాయిని చూసిన తర్వాత ఆ పిల్లలో ఏదో అసహజత్వం కనబడుతోంది.

“చూసావా తారా! దీనికి శరీరం ఎదిగినంతగా మైండ్ పెరగలేదు. అందుకే నాకింత బెంగ. ఏదైనా పని చెప్తే మాత్రం చక్కగా చేస్తుంది. మనం ఇలా చేయమ్మా... అంటే తూ.చా. తప్పకుండా అలాగే చేస్తుంది. గొడ్డులా కష్టపడి ఎంత చాకిరీ అయినా చేస్తుంది. కానీ తన స్వంతంగా తన బుద్ధితో ఆలోచించే తెలివి లేదు. అందుకే ఏవో తంటాలుపడి, త్వరగా పెళ్లి చేస్తే... కనీసం దానికి రక్షణ అయినా ఉంటుందని నా ఆశ.”

“మరి మీరు డాక్టర్లకు చూపించలేదా?” అడిగింది తార.

“అదీ అయింది. నా శక్తి మేరకు చేయవలసిందంతా చేశాను. ఇక అంతకుమించి ముందుకు వెళ్లడానికి నా ఆర్థికస్థితి చాలలేదు.”

“అసలెందుకిలా అయింది? పుట్టుకనుంచి ఇలాగే ఉందా?”

“అదెందుకు అడుగుతావులే తారా! నా వృత్తి తాలూకా ప్రభావం నా మీదే కాదు నా కూతురు మీద కూడా పడింది. జీవనోపాధిని వదులుకోలేక, తప్పనిసరి పరిస్థితుల్లో పసిపిల్లను నిద్రపుచ్చి వంటరిగా ఇంట్లో వదిలిపెట్టి తలుపులు వేసుకొని వెళ్లిపోయేదాన్ని. నేను లేనప్పుడు మధ్యలో లేచి ఏడవకుండా పాలల్లో నిద్ర మాత్రం కలిపి పట్టేసేదాన్ని. తారా! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇలా కూడా చేస్తారా? అని నమ్మలేకపోతున్నావు కదూ? కానీ నేను చేశాను తారా. పాపం... నేను మళ్ళీ వచ్చే వరకు అలాగే మత్తుగా నిద్రపోయేది. అలా దాన్ని చూస్తుంటే ఎంత ఏడుపు వచ్చేదో తెలుసా! ఏం చేయను మరి! పిల్లను చూసే దిక్కులేదు. పనిమనిషిని పెట్టుకునే స్తోమత లేదు. నాతో పాటు తీసుకుపోయే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం కనిపించలేదు. నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకెవరూ ఉండరేమో కదూ తారా! చూసావా...! అనాలోచితంగా నేను చేసిన దౌర్భాగ్యపు పనికి నా కూతురు అనుభవిస్తోందిప్పుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది... ఇది భూమ్మీద పడకముందే నేను ఇంత విషయం తిని చచ్చిపోయి ఉంటే, అప్పుడిద్దరికీ ఈ బాధ లేకపోను కదా!” బాధగా అంది సుబ్బలక్ష్మి.

మతి పోయినంత పనయింది తారకు. తను వింటున్నది నిజమేనా! తనసలు స్పృహలోనే ఉందా! పసిపిల్లకు మత్తుమందు ఇచ్చి ఒంటరిగా ఇంట్లో వదిలి పెట్టేయడమా! వింటున్న తనకే ఎలాగో ఉంది... అలాంటిది కన్నకూతురిని... పసిదాన్ని... అలా కర్మానికి వదిలేసి వెళుతున్నప్పుడు, ఆవిడ ఎంత వేదన పడిందో నరకం అనుభవించిందో. భగవంతుడా! పగవాళ్ళకి కూడా ఇంతటి దయనీయమైన స్థితి రానివ్వకు తండ్రి! బాధగా అనుకుంది తార.

         ఇంతవరకు తననుభవించినవే భరించలేని కష్టాలనుకునేది. సుబ్బలక్ష్మి కథ విన్న తర్వాత ఆవిడ కష్టం ముందు... ఆవిడ పడిన వేదన ముందు... తన కష్టం ఏ పాటిది అనిపిస్తోంది.

చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ, కేర్ లెస్ గా కనబడే సుబ్బలక్ష్మి వెనక ఇంతటి వ్యధభరితమైన కథ ఉందని అసలు ఊహించలేదు. కూతురి జీవితం ఏమవుతుందో అని బాధపడుతున్న ఆమెను ఏ విధంగా ఓదార్చాలో తెలియలేదు తారకు.

“బాధపడకండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా!” అని మాత్రం అనగలిగింది. ఆ తర్వాత ఓ అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి భారమైన మనసుతో ఇంటిదారి పట్టింది.

*************************

సాయంత్రం అయిదవుతోంది. వేసవికాలం పొద్దు కావడంతో ఐదవుతున్నా ఇంకా ఎండగానే ఉంది. అప్పటివరకు ఎండకు జడిసి మూసుకుపోయిన ఇళ్ల తలుపులు ఒక్కొక్కటిగా నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి.

ఎండలో బయట తిరగవద్దని గుడ్లురిమిన తల్లులకు జడిసి, బలవంతంగా ఇళ్లలోనే ఉండిపోయిన పిల్లలు... ఇక ఆగలేమన్నట్టు ఒక్కొక్కరే బయటకు వచ్చి ఆటల్లో పడ్డారు. అప్పటికప్పుడే క్రికెట్ టీం తయారైపోయింది. అప్పటికే పెచ్చులూడిపోయి అధ్వానంగా తయారైన ఆ రోడ్డు మీద ఎక్కడి నుంచో మూడు కర్రపుల్లలను తీసుకొచ్చి పాతేసారు. పిల్లలు ఆట మొదలుపెట్టారు. అసలు క్రికెట్ ఆటగాళ్లు మా ముందు బలాదూర్ అన్నట్టు, వీరలెవెల్ లో ఆడడం మొదలుపెట్టారు. వాళ్ళ అరుపులతో కేకలతో వీధంతా సందడిగా తయారైంది.

టీ కప్పు చేత్తో పట్టుకుని, వాళ్ళని చూస్తూ కూర్చుంది తార. రోజూ సాయంత్రం అయ్యేసరికి వీధి వరండాలో కూర్చుని, పిల్లల అల్లరిని, ఆటలను చూస్తూ టీ తాగడం ఒక అలవాటుగా మారిందామెకు. అలా చూస్తూనే ఆలోచనలో పడిపోయింది.

మొన్నొకరోజు చీరలు కొనుక్కుందామని బయలుదేరింది. షాపింగ్ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అయింది. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో బస్టాండ్లో నిలబడింది. లంచ్ ఓవర్ కావడంతో బస్సులు రావడం లేదు. బస్ స్టాప్ లో తనలా బస్సు కోసం నిలబడ్డ అయిదారుగురు తప్ప రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆటో అయినా దొరుకుతుందేమో అని చూస్తే కనుచూపుమేరలో ఎక్కడా కనబడలేదు. ఉసురుమంటూ స్టాప్ లోని స్తంభాన్ని కానుకొని నిలబడింది.

పరధ్యానంగా ఎటో చూస్తూ నిలబడిన తార, స్కూటర్ హారన్ విని ఇటు తిరిగింది. రోడ్డు మీద ఎదురుగా కనబడ్డాడు విజయ్. అతనినక్కడ చూసినా ఎవరో తెలియనట్టు ఉండిపోయింది. నిలబడిన  చోటు నుండి అంగుళం కూడా కదలకుండా.

 స్కూటర్ స్టాండ్ వేసి వచ్చాడు విజయ్. “తారా! షాపింగ్ నుంచి వస్తున్నావా? ఆమె చేతిలో ప్యాకెట్లు చూస్తూ అడిగాడు.

“అవును” ముక్తసరిగా చెప్పింది.

“సరే! ఇంటికేగా... నేను డ్రాప్ చేస్తాను రా.”

“వద్దులేండి. నేను బస్సులో వెళ్తాను.”

“ఇది లంచ్ టైం. ఇప్పుడప్పుడే బస్సులు రావు. ఎంతసేపిలా ఎండలో నిలబడతావు? రా తారా!”

“వద్దులేండి. నేను మీ స్కూటర్ మీద... మీ వెనక కూర్చుని వస్తే, మీకు లేనిపోని అవమానాలు” అంది నెమ్మదిగా. గతంలో తనన్న మాటలకు ఇలా బదులు తీర్చుకుంటుందని అర్థమైంది అతనికి.

అప్పటికే బస్ స్టాప్ లో వాళ్లంతా కూతుహలంగా ఇటే చూస్తున్నారు. చాలా ఇబ్బందిగా అనిపించిందతనికి.

“ప్లీజ్ తారా! మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు రా.” అన్నాడు.

తార కి కూడా పబ్లిక్ ప్లేస్ లో అలాంటి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. అందుకే ఇంకేం మాట్లాడకుండా అతని వెనకే వచ్చి స్కూటర్ ఎక్కి కూర్చుంది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు.

ఇంటి దగ్గర ఆమెను దింపి, “వస్తాను తారా...” అన్నాడు విజయ్ తన డ్యూటీ అయిపోయిందన్నట్టుగా.

“లోపలికి రండి.” అంది తార... పిలవకపోతే బాగుండదని.

ఆమె పిలుపు కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వెంటనే స్కూటర్ స్టాండ్ వేసి వచ్చాడు. చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది తార. నీళ్లు తాగి గ్లాస్ క్రింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు.

అతడినే చూస్తోంది తార. ‘మనిషి చాలా డల్ గా కనిపిస్తున్నాడు. అనిత చెప్పినట్టు, తమ మధ్య జరిగిన దానికి అతను కూడా బాధపడుతున్నాడేమో! అదేదో నోరు తెరిచి చెప్పొచ్చుగా! అసలు ఏం జరిగిందో... ఆరోజు తొందరపాటుగా ఎందుకలా మాట్లాడవలసి వచ్చిందో చెప్తే, తానర్ధం చేసుకోదా!’ అనుకుంది.

ఏదైనా మాట్లాడాలని ఉంది ఇద్దరికీ. కానీ మాటలు రావడం లేదు. చూసి చూసి చివరికి తారే అంది, “లేవండి! భోజనం చేద్దురుగాని”

“వద్దులే! నేను ఇంటికి వెళ్లి చేస్తాను. నువ్వు చేసి రా...” అన్నాడు కూర్చున్న దగ్గర నుంచి లేవకుండానే. మళ్లీ మౌనం రాజ్యమేలసాగింది. ఆ మౌనం ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. అలాగని అతను వెళ్ళిపోతే బాగుండునని కూడా అనిపించటం లేదు తారకు. అతను ఉండాలనే ఉంది. ఏదైనా మాట్లాడితే బాగుండునని అనుకుంటోంది. ఆమెకే ఆశ్చర్యంగా ఉంది.

ఏమిటిది! అతను కనిపించే వరకు అతని మీద కోపంతో మండిపడింది. అలాంటిది ఇప్పుడు అతను ఇంకా కాసేపు తన ఇంట్లో ఉండాలని అతడి సమక్షాన్ని కోరుకుంటుంది. విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలాంటి స్థితిలో అయినా సమయానుకూలంగా మాట్లాడి, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలవాడని అంటుంటారు తన గురించి తెలిసిన వారంతా. మరి... ఇదేమిటి? తార ముందు ఇలా మూగవాడయిపోతున్నాడు? ఆరోజు తారను బాధ పెట్టేలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో అలా మాట్లాడినందుకు... ఆ తర్వాత తనెంత మధనపడ్డాడో... తారకి ఎలా తెలుస్తుంది? చెప్పాలంటే గొంతుకు ఏదో అడ్డుపడుతోంది.

అయినా తార మరీ మొండితనం చేస్తోంది. పరిస్థితుల్ని అర్థం చేసుకోదేంటి!? ఈ నటనా వృత్తిని వదిలేయచ్చు కదా. ఎదురుగా ఇంత బాగా నటించింది... అంత బాగా నటించింది... అన్న పొగడ్తలే వింటోంది తప్ప, వెనకన ఎంత నీచంగా మాట్లాడుకుంటారో అన్న ఆలోచన కూడా లేదు ఈ పిల్లకు. ఆ రోజు... నాటకానికి వెళ్ళిన రోజు... వెనక సీట్లో కుర్రాళ్ళు ఎంత హీనంగా అసభ్యంగా మాట్లాడారు! అలా ఇంకా ఎంతమంది మాట్లాడుకుంటున్నారో! రేపొద్దున్న పెళ్లయితే తమను చూసి, ఇలాగే నవ్వుకుంటారేమో అందరూ... అది తను భరించగలడా? అయినా తను కూడా ఆ రోజు అలా దురుసుతనంగా మాట్లాడకుండా ఉండవలసిందేమో! తన ప్రవర్తనకు, మాటలకు తార ఎంత బాధపడిందో ... నెమ్మదిగా జరిగిన సంగతి చెప్పాల్సింది.

అన్ని విషయాల్లోనూ ఎంతో... ఆచి తూచి ప్రవర్తించే తను, తార విషయంలో ఎందుకు ఇలా అయిపోతున్నాడు!? నిజమే... తార అన్నట్టు తను ఆమెను ప్రేమించడానికి ముందే ఆమె నటించడం మొదలుపెట్టింది. మరి... అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు? తను పిరికితనంగా ఆలోచిస్తున్నాడా? ఎంత ఆలోచించినా... మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాడు.

హఠాత్తుగా అడిగాడు అతడు, “తారా! నువ్వు నటించడం మానేయలేవా??” అప్పటివరకు దీర్ఘాలోచనలో మునిగిపోయి అతడినే గమనిస్తున్న తార, ఉన్నట్టుండి అతడేలా అడిగేసరికి ఒక్కసారిగా భగ్గుమంది. అప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్న రోషం ఆ ప్రశ్నతో తిరిగి తలెత్తింది. అప్పటివరకు ఈ వృత్తిలోకి ఎందుకు అడుగుపెట్టానా... అయిన వాళ్ళెవరినీ సంతోష పెట్టలేని... కనీసం తనవరకు తనైనా మనశ్శాంతిగా బతకలేని ఈ నట జీవితంలోకి ఎందుకు వచ్చానా? అని మధనపడిన ఆమె, ఆ క్షణం అవన్నీ మర్చిపోయింది.

“నేను నటిస్తే మీకేంటి అభ్యంతరం” మొండిగా అంది.

ఆమె సమాధానం చెప్పిన తీరుకు ఇంకేం మాట్లాడలేదతను. ఈ సంభాషణ మళ్లీ ఏ ఘర్షణకు దారితీస్తుందోనని భయం వేసిందతనికి. మౌనంగా లేచి చెప్పాడు. “సరే! నేనిక వెళ్ళొస్తాను తారా!?

 నిజానికి అతనంత వెంటనే వెళ్ళిపోతాడనుకోలేదామె. తన మొండి సమాధానానికి అతనేదో అంటాడు... అప్పుడు తన ఉక్రోషమంతా వెళ్లగక్కొచ్చు అనుకుంది. కానీ అతను రెట్టించకుండా వెళ్ళిపోవడం నచ్చలేదు తారకు. అతని వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయింది. కళ్ళలో మాత్రం అప్రయత్నంగా నీళ్లుబికాయి.

బయట స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం వినబడింది. అంతవరకు ఉగ్గపట్టుకున్న కన్నీళ్లు ఇక ఆగలేమన్నట్టు బుగ్గలపై జారిపోతున్నాయి ఆమెకు తెలియకుండానే. తార మనసంతా గజిబిజిగా ఉంది. తనకేం కావాలో తనకే తెలియకుండా ఉంది. విజయ్ ఉన్నంతసేపు మొండితనం చూపించింది. ఇప్పుడు... అతని వెళ్ళిపోయేసరికి ఏడుస్తోంది.

“ఔట్... ఔట్...” ఘోల్లుమన్న పిల్లలు అరుపులకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది తార. పిల్లలు ఈ లోకాన్ని మరిచి ఆడుకుంటున్నారు. వాళ్ళెంత సంతోషంగా చీకు చింతా లేకుండా ఉన్నారు. తను కూడా వాళ్ళలాగా అయిపోతే ఎంత బాగుంటుంది దీర్ఘంగా నిట్టూర్చింది.

అప్పుడే చీకట్లు కమ్మేసాయి. ఆలోచనలు కట్టిపెట్టి లేచి ఇంట్లో లైట్ వేసింది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా! అనుకుంటూ వంట ప్రయత్నంలో పడింది.

***********************

సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి

Recent Posts