మహానటి | నవల పార్ట్ 12 | మావూరు.విజయలక్ష్మి | Telugu novel Mahanati 12th part

Vijaya Lakshmi

Published on Oct 16 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల


        “మహానటి” ధారావాహిక – 12


         రచన : మావూరు.విజయలక్ష్మి


“ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ పుచ్చిపోయిన భావాలు ఏంటండీ బాబు! డాక్టర్లుగాను, టీచర్లుగాను, ఆఫీసుల్లోనూ ఎంతోమంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు. అలాగే ఇది కూడా ఒక వృత్తి అంతే! అయినా... నాకు తెలియక అడుగుతాను గాని... నాటకాల్లో వేసినంత మాత్రాన ఏంటి తప్పు!?” ఆవేశంగా అంటున్నాడు కృష్ణ.

వింటున్న తారకు, ఒకప్పుడు తను అమాయకంగా అనితతో ఇలాగే వాదించడం గుర్తొచ్చింది. ‘ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తెలియదు అంటారు అందుకే!’

“ఏంటండీ నవ్వుతున్నారు? నా మాటలు మీకు నవ్వులాటగా ఉన్నాయా?” తనలో తను నవ్వుకుంటున్న తారను చూసి, ఉడుకుమొత్తనంగా అడిగాడు కృష్ణ.

డిగ్రీ పూర్తి చేసిన కృష్ణ ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, అప్పుడప్పుడు హాబీగా స్టేజి నాటకాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనూ వేస్తుంటాడు. ఆదర్శాలను వల్లించడమే కాదు... వాటిని ఆచరణలో పెట్టి చూపించాలన్న తపన బాగా ఉన్నవాడు నలుగురూ ఖాళీగా కూర్చున్న సమయంలో ఎప్పుడైనా ఇలాంటి చర్చలు వస్తే ఆవేశాన్ని దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాడు. తన భావాలను నిస్సంకోచంగా బయటపెడుతూ ఉంటాడు. అందుకే అతనున్నప్పుడు ఏదో ఒక విషయంలో చర్చ లేవదీసి, అతను ఆవేశ పడిపోతుంటే సరదాగా చూస్తుంటారు తోటివారు.

“ఉపన్యాసాలు చెప్పినట్టు కాదు నాయనా! ఆదర్శాలను ఆచరణలో చూపించాలి...” అతన్ని మరింతగా రెచ్చగొడుతూ అంది చంద్రమణి.

“మీరు అలా చూస్తూ ఉండండి... ఎప్పుడో ఒకరోజు మీ చేతే అనిపిస్తాను, ఈ కృష్ణ మాటలవాడే కాదు చేతలవాడు కూడా అని” అన్నాడు కృష్ణ.

యధాలాపంగా ఈ సంభాషణ వింటున్న తారకు, అనుకోకుండా సుబ్బలక్ష్మి కూతురు రజని మదిలో మెదిలింది. ‘రజినిని పెళ్లి చేసుకుంటాడేమో కృష్ణను అడిగితే... కృష్ణ గాని ఒప్పుకుంటే రజని జీవితం హాయిగా గడిచిపోతుంది. కృష్ణ మాటల్లోగాని చేతల్లోగాని కల్మషం అన్నది కనబడదు. రజని కాస్త మైల్డ్ గా ఉంటుందన్న మాటేగాని, ఇంటిపనులన్నీ చక్కగా చేసుకుంటుంది. మనిషి కూడా చూడచక్కగానే ఉంటుంది... అడగనా?’ ఆలోచనలో పడింది తార.

“అయితే కృష్ణ! ఇన్ని ఆదర్శాలు వర్ణిస్తున్నావు కదా! నీ ఆదర్శాలకు తగినవిధంగా ఎవరైనా ఒక చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకోకూడదు” అంది తార.

“నేనూ అదే చూస్తున్నానండి. కానీ ఏది... ఆ కన్యామణి ఇంకా నాకంట పడందే...”

“పోనీ... నన్ను చేసుకోరాదు!” సరదాగా అంది చంద్ర.

“నిన్నా తల్లి! నిన్నుగాని చేసుకుంటే... నాకు వచ్చే నెలజీతం అంతా నీ చీరలకే ఖర్చు పెట్టేసి, నాకు తిండిపెట్టకుండా మాడ్చి చంపేస్తున్నాడురా బాబు! అంటూ మహిళాసంఘాలకు అప్పచెప్పేస్తావ్. నన్ను వదిలేయ్ తల్లి!” అంటూ దండం పెట్టాడు కృష్ణ.

“పోనీ నేనొక సంబంధం చూడనా...” అడిగింది తార.

“ఓ... మీరు చూస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను కమిషన్ అది ఇచ్చుకోలేను మరి... సరదాగా అన్నాడు కృష్ణ.

“నీ కమిషన్ నాకేం అక్కర్లేదు గాని... వివరాలు విన్న తర్వాత మళ్లీ సంబంధానికి వంకపెట్టి నన్ను తిట్టకూడదు...”

“కృష్ణ జాగ్రత్త! నిన్ను ఎక్కడో ఇరికించేసే ప్రయత్నంలో ఉన్నట్టుంది తార.” హెచ్చరికగా అంది చంద్ర.

“ఏం పర్వాలేదులే! తారగారు చెప్తున్నారు కాబట్టి పెళ్లికూతురు నీలాంటి గయ్యాళి మాత్రం అయ్యుండదు. మీరు చెప్పండి తారగారు...”

“అదే మన సుబ్బలక్ష్మి గురించి నీకు తెలుసు కదా! ఆవిడ కూతురు రజనీని నువ్వు చాలాసార్లు చూసావు. ఆ అమ్మాయిని చేసుకుంటావా?” అడిగింది తార.

కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. “ఏమిటోయ్ ఆదర్శపురుషా! బదులు పలకవేమి? నేరక ఇరుక్కొంటినని చింతించుచుంటివా?” ఎగతాళిగా అంది చంద్ర.

“నేనిలా అడుగుతున్నానని అపార్థం చేసుకోకు కృష్ణ. రజనికి అపారమైన తెలివితేటలు లేకపోవచ్చు... చురుకుదనం కాస్త తక్కువగా ఉన్న మాట నిజమే, కానీ ఏ రకంగానూ నిన్ను బాధ పెట్టకుండా, నీకు అనుగుణంగా నడుచుకొనే అణకువ, వినయం  ఉన్నాయామెలో. ఇందులో బలవంతం ఏమీ లేదు. నువ్వు బాగా ఆలోచించుకునే చెప్పు...” అంది తార మౌనంగా ఉన్న కృష్ణను చూసి.

“అబ్బే! ఇందులో అపార్ధానికేం ఉందండి! నాకు కొంచెం టైం కావాలి” అన్నాడు కృష్ణ.

“తప్పకుండా టైం తీసుకో. ఇది తొందరపడే విషయం కాదు. బాగా ఆలోచించుకునే చెప్పు,

“ఏ విషయం వారం రోజుల్లో చెప్తాను మీకు. మరి నేను వెళ్ల్లోస్తాను. వస్తానండి చంద్ర గారు...” చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ.

“గురుణ్ణి బాగా బెదరగొట్టేసావే తార! ఆదర్శం... ఆదర్శం... అంటూ ఎగిరేవాడు. ఆదర్శం చూడు ఎలా పారిపోతుందో పాపం!” ఎగతాళిగా అంది చంద్ర వెళుతున్న కృష్ణని చూసి.

“అలా అనకు చంద్ర... కృష్ణను చూస్తుంటే నాకెందుకో మంచివాడు లాగానే కనిపిస్తున్నాడు. అయినా పెళ్లంటే మాటలు కాదు. ఆదర్శం పేరుతో త్వరపడి నిర్ణయాలు తీసుకుని, ఆనక తీరికగా విచారించి తను బాధపడటమే కాకుండా, తనను అనుసరించుకున్న వారినికూడా బాధ పెట్టడంకంటే ముందే బాగా ఆలోచించుకోవడం మంచిది...” ఆలోచనగా అంది తార.

“అది నిజమేలే! సరే... ఇక మనమూ బయలుదేరదామా... చూడు! అప్పుడే ఎలా చీకట్లు కమ్మేస్తున్నాయో...” అంటూ లేచింది చంద్ర. ఆమెను అనుసరించింది తార.

ఇద్దరు నాటకం డైరెక్టర్ తో చెప్పి ఇంటిదారి పట్టారు.

****************************

ఆరోజు శుక్రవారం. ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి దేవుడిముందు కూర్చుంది తార. ఓ ఐదు నిమిషాలు భక్తిగా చేతులు జోడించి కూర్చుంది నిశ్చలంగా. తర్వాత దీపం వెలిగించి, తనకు తోచిన విధంగా పూజ చేసి, లలితా సహస్రనామం పుస్తకం చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టింది. నిజానికి మొదటి నుంచి భక్తి విషయంలో కాస్త మందకొడిగానే ఉండేది తార. తల్లి బాగా ఉన్నన్ని రోజుల్లో గుడికి వెళ్ళమని, ఏవేవో పూజలు వ్రతాలు చేయమని, వాటి వలన జీవితం స్థిరపడుతుందని తరచుగా చెబుతుండేది. అయినా అవేమీ పెద్దగా పట్టించుకునేది కాదు తార. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఎప్పుడు చుక్కెదురే. తల్లి దారి తల్లిది... తన దారి తనదే అన్నట్టుండేది. అలాగని తార నాస్తికురాలేం కాదు. దేవుడున్నాడని నమ్ముతుంది. చదువు పూర్తయిన దగ్గర నుండి జరిగిన పరిణామాలు, అనుక్షణం తన కోసమే తపనపడిన తల్లిపోవడం, ఒంటరిగా అయిపోయిన తను ఎదుర్కొన్న అవమానాలు, విజయ్ తో సంఘర్షణ,, తను ఎంతో ఇష్టపడి అడుగుపెట్టిన రంగంలో... తన ఎదురు చూడని భయంకరమైన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో... అంతరాంతరాలలో ఎక్కడో దాగి ఉన్న భక్తి బయటకు వచ్చింది. అశాంతితో నిండిపోయిన హృదయానికి, భగవంతుని సన్నిధిలోనే కాస్తంత శాంతి దొరుకుతుందని, ముఖ్యంగా... తన ఈ నిరంతర పోరాట జీవితంలో జీవనగమనానికి కావలసిన ధైర్యం... మనోధైర్యం లభిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతోంది తార. కాసేపైనా... భూతాల్లా భయపెట్టే సమస్యల నుంచి కందిరీగల్లా ముసురుకునే ఆలోచనల నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది.

అందుకే రోజూ ఉదయాన్నే పూజ చేయడం, కాసేపు ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకుంది. పూజ ముగించి వంటగదిలోకి నడిచింది. కాఫీ కలుపుకుని కప్పు చేత్తో పట్టుకుని హాల్లోకి వచ్చింది. అక్కడున్న సోఫాల్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవసాగింది.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రాగడంతో, ‘ఈ టైం లో ఎవరు వచ్చారు?’ అనుకుంటూ కాఫీకప్పు, పేపరు టీపాయ్ మీద పెట్టేసి, వెళ్లి తలుపుతీసింది. ఎదురుగా రామారావుగారు. “రండి... రండి... లోపలికి రండి. కూర్చోండి.” ఆహ్వానించింది.

“ఏమ్మా బాగున్నావా? ఈ మధ్య నాటకాల్లో ఎక్కడ చూసినా నీ పేరే మారుమోగుతుంది. బాగా బిజీ అయిపోయావు అనుకుంటాను...” అభిమానంగా అన్నారాయన హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

“బిజీ ఏం లేదు సార్. అన్నట్టు... ఈ మధ్య మీకు ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. వద్దామనుకుంటూనే... ఏదో ఒక పనితో కుదరడం లేదు. ఇప్పుడెలా ఉంది సార్?”

“పరవాలేదమ్మా! ఇప్పుడు కాస్త నయంగానే ఉంది. అది సరేగాని నేనిప్పుడు ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను. రాజమండ్రిలోని లీలా ఆర్ట్స్ అకాడమీ తెలుసు కదా! దానికి మన రాష్ట్రంలోని అన్ని సాంస్కృతిక సంస్థల్లోనూ ప్రముఖమైనదిగా పేరు ఉంది. నువ్వు మొదటిసారి నాటక పోటీల్లో పాల్గొన్నావ్ చూడు... అప్పుడు పోటీలు నిర్వహించింది ఆ సంస్థే. అది ప్రతి సంవత్సరం నటీనటులకు, వివిధ సాంకేతిక కళాకారులకు... అవార్డులను ఇస్తూ ఉంటుంది.

ఆ సంస్థ రజతోత్సవం సందర్భంగా, కొన్ని ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో మహానటి అవార్డు ఒకటి. అతి తక్కువకాలంలో నటనలో ఎదిగి అత్యుత్తమ నటనను ప్రదర్శిస్తున్నందుకుగాను, ఆ అవార్డు నీకే ఇవ్వాలని తీర్మానించుకుందా సంస్థ. ఆ సంస్థ సభ్యుడైన నా స్నేహితుని ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. వెంటనే ఈ శుభవార్తను నీకు స్వయంగా చెప్పాలని వచ్చాను. వారు త్వరలోనే సంస్థ తరఫున ఈ విషయం నీకు తెలియచేస్తారు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా! నేను పరిచయం చేసిన ఒక నటి ఇంత తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి చేరుకుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా! నా అంచనా ఎప్పుడూ తప్పదని మరోసారి రుజువయింది.”. వింటున్న తారకు నోట మాట రావడం లేదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక నటిగా ఉన్నత స్థాయి గౌరవం దక్కినందుకు ఆనందమో లేక అలాంటి గౌరవం తనకు దక్కుతోందని తెలిసిన వేళ... తన సంఘర్షణమయ జీవితమే గుర్తుకొచ్చిందో మరి...!”

ఆమె స్థితిని చూశారు రామారావు గారు.

“ఏంటమ్మా తారా అది! కళ్ళు తుడుచుకో...” అన్నారు. ఆ సమయంలో ఇంకేం మాట్లాడాలో ఆయనకే అర్థం కాలేదు. ఆమె స్థితి... ఆమె మనసులోని అలజడి... ఆయనకు తెలుస్తూనే ఉంది.

ఆమె జీవితంలోని సంఘర్షణ అతనికి చూచాయిగా తెలుసు. అందుకే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు అతను. ‘హాయిగా... ఏ చీకు చింత లేకుండా చదువుకుంటున్న పిల్లను ఈ రంగంలోకి తీసుకొచ్చి తప్పు చేశానా’ అని.

తనలోని కల్లోలాన్ని దాచుకునేందుకు, “కాఫీ తెస్తానుండండి.” అంటూ వంట గదిలోకి నడిచింది తార. స్టవ్ మీద కాఫీకి నీళ్లు పడేసి పెరట్లోకి వెళ్లి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చింది. కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి కప్పునాయన కందించింది. మౌనంగా కాఫీ తాగి లేచారాయన, “వస్తానమ్మా... సంతోషకరమైన వార్త చెప్పాలని వచ్చి, ఒక రకంగా నిన్ను బాధ పెట్టానేమో! అన్నారు.

“లేదు సార్! నేనే... మరీ చిన్నపిల్లలా ప్రవర్తించాను. ఇంత మంచి వార్తను మీరు శ్రమ తీసుకుని వచ్చి చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ సార్” అంది తార.

మరోసారి చెప్పి వెళ్లిపోయారాయన్. ఆయన్ని సాగనంపి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. ఆలోచిస్తోంది. ‘అవును... తను మహానటి! ఈ రంగంలోకి అడుగుపెట్టిన ఈ పదేళ్లలోనే ఎన్నో అవార్డులు, బహుమతులు బిరుదులు ఎన్నో ఎన్నెన్నో సంపాదించుకుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే తనకేం మిగిలింది? ఒంటరితనం... అవమానాలు, అవహేళనలు, ఈ అవార్డులు బహుమతులు చూసుకుంటూ, బిరుదులు తలచుకుంటూ... ఎన్నాళ్ళని బ్రతికేయగలదు! రేపు వయస్సు పైబడిన తర్వాత నాటకాల్లో వేషాలు కూడా రావు. అప్పుడు తన పరిస్థితి....? లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి... అవును... ఏదో ఒకటి చేయాలి...” అనుకుంది.

*************************

పడక మీద అన్యమనస్కంగా  కదులుతున్నాడు విజయ్. అర్ధరాత్రి 12 అయింది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. తను మరీ సంకుచితంగా ప్రవర్తిస్తున్నాడా? ఆదర్శవంతమైన ఉపాధ్యాయవృత్తిలో ఉండి, పిల్లలకు మంచి, చెడు చెప్పవలసిన తనే ఇరుకు మనసుతో ఆలోచిస్తున్నాడా? ఎప్పుడూ సరదాగా ఉండే తను, ఈ మధ్య మరీ మూడీగా అయిపోతున్నాడు. అది చూసి తల్లి తండ్రి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఏ రోజు తనను కష్టపెట్టేలా ప్రవర్తించలేదు పాతకాలం వాళ్ళయినా తనకంటే వాళ్లే నయం అనిపిస్తున్నారు. అనిత ద్వారా తార విషయం చూచాయిగా తెలిసిన తల్లి తండ్రి మొదట్లో కొంత ముభావంగా ఉన్నా, తర్వాత సర్దుకున్నారు. తారని పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆధునికుడు అనిపించుకున్న తనే వెనకడుగు వేస్తున్నాడు. అలాగని ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పడం లేదు. ఆ ఊహె భరించ లేకుండా ఉన్నాడు. తారను మరచిపోలేకుండా ఉన్నాడు. తార నాటకాల్లో వేషాలు వేయడం మానదు. పోనీ తనైనా తన మనసును సమాధానపరుచుకో లేకుండా ఉన్నాడు.

ప్చ్... ఏంటో! ఇక తామిద్దరూ భార్యాభర్తలుగా కలిసి బ్రతకడం సాధ్యంకాదా! తన వాళ్లకు చూసి కనీసం పెళ్లి చేసుకుంటే నైనా చేరుకుంటాడని పెళ్లి చేసుకో అంటూ తెగ కోరుతున్నారు అమ్మ నాన్న. పోనీ నువ్వు ఇష్టపడిన ఆ తారనే పెళ్లి చేసుకో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్పష్టంగా చెప్పారు వాళ్లు. తను నిజంగా పిరికివాడే. బయటకి గంభీరంగా కనపడాలనే తాపత్రయం గల పిరికివాడు. ఎవరో ఏదో అనుకుంటారని అతి ఆలోచనలతో బాధపడే పిరికివాడు.

మొదట్లో బింకంగా ఉన్నా... రానురాను అలా ఉండలేకపోతున్నాడు. ఈమధ్య తరచుగా తార జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. అందులో ఆ మధ్య షాపింగ్ నుంచి వస్తున్న తారను ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పటి నుంచి మరీ మరీ జ్ఞాపకం వస్తోంది. నిజమే! తార అన్నట్టు ఆవిడ వృత్తి అది. ఇందులో తప్పేముంది. తార స్వభావం ఎలాంటిదో... ఆమె వ్యక్తిత్వం ఏంటో... తనకు తెలుసు. అలాంటప్పుడు మిగతా పనికిమాలిన విషయాల గురించి తను ఎందుకు ఇంతలా ఆలోచించడం? భయపడటం! తను బాధపడడమే కాకుండా తారని కూడా ఎంతగానో బాధ పెడుతున్నాడు. అసలు ఎవరో ఏదో వాగారని... ఇంకేదో అనుకుంటారని... తను ఎందుకిలా మధనపడటం?

మొన్న అనిత వచ్చినప్పుడు కూడా తన సంకుచితత్వం గురించి ఒక దులుపు దులుపి వెళ్ళింది. వాళ్ళందరికీ లేని అభ్యంతరం తనని ఎందుకు ఇలా వేధిస్తోంది? స్వార్థం... అవును స్వార్థమే కారణమేమో! తను కట్టుకోబోయే వ్యక్తి కేవలం తన ఇష్టాఇష్టాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలనే స్వార్థం. ఛ! ఇక తను భరించలేడు... తారను కలుసుకోవాలి. ఆమెతో చెప్పేయాలి. అన్ని సంకోచాలను అభ్యంతరాలను వదిలి, ఆమెను ఆమె గానే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆమె వృత్తి తమ ఇద్దరి వివాహానికి ఎలాంటి ఆటంకం కాదని చెప్పాలి. రేపు ఉదయాన్నే వెళ్లి తారని కలుసుకోవాలి. తన నిర్ణయానికి తార ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం... అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. ఇంతకాలం ఈ అంతర్ మధనంతో నిద్రకు దూరమయ్యాడేమో... ఇప్పుడు ఒక మంచినిర్ణయం తీసుకున్నాను... అన్న తృప్తితో హాయిగా నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయాడు.

********************************

సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి

Recent Posts