మహానటి | నవల పార్ట్ 13 | మావూరు.విజయలక్ష్మి | Telugu novel Mahanati 13th part

Vijaya Lakshmi

Published on Oct 17 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

        2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల


                   “మహానటి” ధారావాహిక – 13


                      రచన : మావూరు.విజయలక్ష్మి


ఉదయాన్నే నిద్ర లేచి, తన నిత్య కృత్యాలని ముగించుకుని వంట గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చాడు విజయ్. లేచిన దగ్గర్నుంచి కొడుకును గమనిస్తూనే ఉందావిడ. ప్రొద్దున్నే నిద్ర లేవడం... త్వర త్వరగా పనులు ముగించుకోవడం అతడికి అలవాటే. అయినా ఈరోజు ఏదో తేడా కనబడుతోందతని దినచర్యలో. చాలా రోజుల నుంచి నిర్లిప్తంగా కనబడే కొడుకు ఈరోజు ఉత్సాహంగా కనబడుతున్నాడు ఆవిడ కళ్ళకి.

“అమ్మా! టిఫిన్ ఏం చేశావు?” అడిగాడు విజయ్.

“ఇడ్లికి మినప్పప్పు నానబెట్టడం మర్చిపోయానురా. అందుకే ఉప్మా చేశాను. ఇవాల్టికి దాంతో అడ్జస్ట్ అయిపో...” అందావిడ.

“పర్వాలేదులే అదే పెట్టేయ్! నేను తొందరగా వెళ్ళాలి” అన్నాడు. త్వరగా వెళ్లకపోతే మళ్లీ తార ఎక్కడైనా వెళ్ళిపోతుందేమో... ఈరోజు కలుసుకోవడం కుదరదేమో అని అతని భయం.

ఆశ్చర్యంగా చూసిందావిడ కొడుకు వైపు. విజయ్ కి ఉప్మా అస్సలు నచ్చదు. ఇంకేమైనా తింటాడు కానీ ఉప్మా అంటే మాత్రం, “అబ్బా! అదేం టిఫిన్! సరేలే... ఈరోజుకి కాలేజీ క్యాంటీన్లో ఏదైనా తింటాలే” అని టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతాడు తప్ప ఉప్మా వైపు కన్నెత్తి కూడా చూడడు. అలాంటిది... ఈవేళ ఉప్మా చేశానంటే కూడా అది తింటానంటున్నాడంటే ఏదో గట్టి విశేషమే ఉందనిపించింది.

ప్లేట్ లో ఉప్మా వేసి స్పూన్ పెట్టి కొడుక్కి  అందించింది. “విజయ్! కాలేజీకి ఇంకా టైం ఉంది కదా... ఇంత తొందరగా బయలుదేరుతున్నావేం?” అని అడిగింది.

“ఈరోజు కాలేజీకి వెళ్లనమ్మా... ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను.” ఖాళీ ప్లేట్ అక్కడ పెట్టి మంచినీళ్లు తాగి లేచాడు.

“వస్తానమ్మా! నేను వచ్చిన తర్వాత విషయం ఏంటన్నది చెప్తాను” చెప్పి వెళ్ళిపోయాడు.

ముందుగా తను పనిచేసే కాలేజీకి వెళ్లి లీవ్ లెటర్ ఇచ్చి, అక్కడ నుంచి తార ఇంటికి చేరుకున్నాడు. స్కూటర్ స్టాండ్ వేసి గేటు తీసి లోపలికి అడుగు పెట్టాడు. తలుపు తీసే ఉంది. హాల్లోకి అడుగుపెట్టిన విజయ్ కి ఎదురుగా వస్తూ కనబడింది తార. అప్పుడే పూజ ముగించుకుని వస్తున్నట్లుంది. చేతిలో కాఫీ కప్పు ఉంది. తలంటుకున్న జుట్టు చివరన ముడి వేసి వదిలేసింది. గుండ్రంగా దిద్దుకున్న తిలకం క్రింద చిన్న కుంకుమబొట్టు ఆమెకి ఇంకా అందాన్ని ఇచ్చింది. అందం కంటే కూడా ఎంతో స్వచ్ఛంగా ప్రకాశవంతంగా కనబడుతుంది.

తారతో ఎన్నెన్నో మాట్లాడాలని తన మనసును అంత విప్పి చెప్పాలని ఎన్నెన్నో అనుకున్న విజయ్ కి ఆమె కనపడగానే గొంతు మూగపోయినట్టయింది. హఠాత్తుగా వచ్చిన అతడ్ని చూసి అలాగే నిలబడిపోయింది తార కూడా. ఆ సమయంలో అతడు వస్తాడని ఊహించలేదేమో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.

అంతలోనే తేరుకొని, “మీరా! రండి... కూర్చోండి” అంటూ సోఫా చూపించింది. మౌనంగా కూర్చున్నాడు విజయ్. తనకని తెచ్చుకున్న కాఫీని అతనికి ఇచ్చేసి, మరో కప్పు తెచ్చుకొని అతనికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది తార.

“ఇప్పుడు చెప్పండి. ఏంటిలా వచ్చారు? ఈరోజు డ్యూటీకి వెళ్ళనక్కర్లేదా?” అని అడిగింది.

“కాలేజీకి సెలవు పెట్టాను. నీతో మాట్లాడాలని వచ్చాను...”

“నాతో మాట్లాడాలా!? ఏంటి చెప్పండి.” ఏదో చెప్పబోయాడు.

ఇంతలో “తారగారూ...” అంటూ లోపలికొచ్చాడు కృష్ణ.

“ఓ... కృష్ణ! రా... రా... ఏంటి? ఎప్పుడూ లేనిది మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? ఆహ్వానిస్తూ అంది తార.

“వచ్చేలా చేశారు మీరు” సోఫాలో విజయ్ పక్కన కూర్చుంటూ అన్నాడు కృష్ణ.

“కృష్ణా... ఈయన విజయ్ అని... కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు. విజయ్... ఇతను కృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. హాబీగా అప్పుడప్పుడు నటిస్తుంటాడు” ఒకరికోకర్ని పరిచయం చేసింది.

హలో అంటే హలో అనుకున్నారు. “ఆ... ఇప్పుడు చెప్పండి కృష్ణ... ఏమిటి విషయం?” అడిగింది తార.

“తారగారూ... పది రోజుల క్రితం మీరొక ప్రపోజల్ చేశారు. సుబ్బలక్ష్మిగారి కూతురు రజినిని పెళ్లి చేసుకోమని. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీరు సుబ్బలక్ష్మి గారితో మాట్లాడండి” ఎలాంటి ఉపోద్ఘాతం... నసుగుడు లేకుండా స్పష్టంగా చెప్పాడు కృష్ణ.

“బాగా ఆలోచించుకున్నావా కృష్ణ? ఇంతకీ మీ అమ్మానాన్న ఒప్పుకున్నారా?”

“మా అమ్మ నాన్న నా ఇష్టాన్ని కాదనరండి. వాళ్లకి నచ్చచెప్పుకోగలనన్న ధైర్యం నాకుంది. మీరు ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు తారగారు...” అన్నాడు కృష్ణ.

“ఇప్పుడే చెప్తున్నాను కృష్ణ... బాగా ఆలోచించుకో. జీవితాంతం కలిసి ఉండేవారు. ఆదర్శం పేరుతో ముందుకు వచ్చి, తర్వాత బాధపడేకంటే ఇప్పుడే బాగా ఆలోచించుకోవడం మంచిది. తర్వాత మళ్ళీ నీ ఆలోచనల్లో మార్పొస్తే ఇద్దరి జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. బాగా ఆలోచించుకున్నావు కదా?” మళ్లీ మళ్లీ హెచ్చరించింది తార.

“బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను తారగారూ. ఆదర్శమనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అన్నది నా అభిప్రాయం. అయినా ఆవిడ నటి అయితే... మరి నేను కూడా నటిస్తున్నాను కదా! మరి అలాంటప్పుడు నేను నటించడానికి లేని అభ్యంతరం, సుబ్బలక్ష్మి గారు నటిస్తే ఏముంది!? అయినా నేను చేసుకునేది ఆవిడ కూతురిని. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది అభ్యంతరం లేదు” అన్నాడు కృష్ణ.

“శభాష్... కృష్ణ! మాటల్లో కాకుండా... ఆదర్శాలను చేతల్లో చూపిస్తున్నావు. అయితే త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నావన్నమాట” అభిమానంగా అంది తార.

వింటున్న విజయ్ కి, సుబ్బలక్ష్మి ఎవరో... రజని ఎవరో... తెలియకపోయినా వీళ్ళ మాటలను బట్టి విషయం పూర్తిగా అర్థమైంది. ‘ముక్కు ముఖం తెలియని ఆడపిల్ల విషయంలోనే ఇతను ఇంత స్థిరంగా నిలబడగలిగితే, మనస్ఫూర్తిగా ప్రేమించిన తార విషయంలో తనెందుకు ఇంత ఊగిసలాటకు గురయ్యాడు!?’ అనుకున్నాడు విజయ్.  

కృష్ణని చూసిన తర్వాత, తన నిర్ణయానికి ఇంకా బలం వచ్చినట్లు అయింది. అతను కూడా మనస్పూర్తిగా అభినందించాడు కృష్ణను.

“అయ్యయ్యో... అప్పుడే పది అయిపోతుంది. ఆఫీసుకు లేటుగా వెళితే మా బాస్ తో అక్షంతలు తప్పవు. వస్తాను తారగారు... వస్తానండి విజయ్ గారు... ఈసారి కలిసినప్పుడు మీతో తీరికగా మాట్లాడతాను” వచ్చినంత హడావిడిగాను వెళ్ళిపోయాడు కృష్ణ.

కృష్ణ ను పంపించి తలుపేసి వచ్చింది తార. మళ్లీ ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలసాగింది. విషయం ఎలా కదపాలో అర్థం కావడం లేదతనికి.

“తారా! స్నేహితురాలు పెళ్లి కుదిర్చావు మరి... నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు?” అన్నాడు విజయ్.

ఆ మాటలతో చురుగ్గా చూసిందతని వైపు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. ‘ఇది నువ్వు అడగవలసిన ప్రశ్నేనా!?’ అని నిలదీస్తున్నట్టుగా ఉందా చూపు.

“అలా చూడకు తారా! నావల్ల చాలా పొరపాటు జరిగింది. నా ప్రవర్తనతో నిన్ను వల్లమాలిన బాధకు గురి చేశాను. ఆ తప్పు ఒప్పుకోవడానికే వచ్చానిప్పుడు...”

“ఓహో! తప్పు ఒప్పుకోవడానికి వచ్చారా? నేనింకా దిద్దుకోడానికి వచ్చారేమో! అనుకున్నాను. సరే... ఒప్పుకున్నారు కదా! వచ్చిన పని అయింది కదా!” ఇక వెళ్ళండి అన్నట్టు వెటకారంగా అంది.

“దీన్ని పెద్దగా పట్టించుకోలేదు విజయ్. తార అలా మాట్లాడడంలో కూడా న్యాయం ఉందనిపించిందతనికి. అందుకే ఆమె ఎంత రెచ్చగొట్టినా, క్రితంసారిలా మౌనంగా వెళ్లకుండా తన మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కాలని నిర్ణయించుకున్నాడు.

సరిగ్గా అప్పుడే లేచి నిలబడింది తార. తను చెప్పేది వినకుండా గదిలోకి వెళ్లి తలపేసుకుంటుందేమో? అన్న భయంతో, చటుక్కున లేచి ఆమె చేయి పట్టుకున్నాడు విజయ్.

“వదలండి. ఏంటిది?” విసుగ్గా అంది.

“ప్లీజ్! తారా! నేను చెప్పేది కాస్త ఓపిగ్గా విను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. అందుకు ప్రతిగా నువ్వు ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు. కానీ ముందు నా మనసులో మాట చెప్పనీ...” అలా అంటూనే ఆమె చేయిపట్టి తీసుకువచ్చి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

మొదటిసారి తారతో నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు, ఆమె నాటికలో హీరోతో సన్నిహితంగా మసులుతున్నప్పుడు, తన వెనక కూర్చున్న వాళ్లు మాట్లాడిన మాటలు... తన మనసులో అలా మొదలైన విష బీజం, ఆమెను పెళ్లి చేసుకుంటే సంఘంలో తెలిసిన వారి మధ్య చులకన అయిపోతానేమోనన్న తన అర్థం లేని భయాలు, అందరూ తన ఎదురుగానే తన భార్య గురించి నీచంగా మాట్లాడతారేమో... అది సహించగలనా? అన్న పిరికితనం... వీటన్నిటి నేపథ్యంలో పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చిన ఆమె పట్ల దురుసుగా మాట్లాడడం, తర్వాత తనెంత బాధపడ్డాడో, అన్నీ వివరంగా అక్షరం దాచుకోకుండా చెప్పసాగాడు.

అతను చెప్పిందంతా మౌనంగా వింటోంది తార. “నిన్ను దూరంగా ఉంచానే... గాని నీ పట్ల నా ప్రవర్తనకు నేనెంత బాధపడ్డానో తెలుసా తారా? అసలు ఎన్నోసార్లు నిన్ను కలవాలని, నా బాధంతా నీతో వివరంగా చెప్పాలని అనుకునేవాడిని. కానీ ఏదో జంకు ఆ రోజు నిన్ను షాపింగ్ నుంచి ఇంటిదగ్గర డ్రాప్ చేశాను చూడు... ఆ రోజు ఎలాగైనా నా మనసులో బాధనంత బయటపెట్టి మన విషయాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నాను. కానీ నా పిరికితనానికి తోడు నీ నిర్లక్ష్యధోరణ కూడా తోడవడంతో నేను చెప్పాలనుకున్నదంతా గొంతుకలోనే ఆగిపోయింది. ఇప్పుడు చెప్పు... నువ్వే కనుక నా స్థానంలో ఉంటే ఇలాగే చేయవా?” బాధగా అన్నాడు విజయ్.

తార ఏం మాట్లాడలేదు. అలాగే శిలలా కూర్చుంది. ఆ అమ్మాయి మనసులో ఏముందో అర్థం కాలేదతనికి.

“తారా! ఇంతకాలం కారణం ఏదైతేనే ఇద్దరం బాధపడ్డాం. ఇంకా ఆ బాధలోనే బ్రతకదల్చుకోలేదు నేను. నిన్ను కూడా బాధపడనివ్వను. నీకు అభ్యంతరం లేకపోతే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. నీ నటన మన పెళ్ళికి ఏమాత్రం అడ్డం కాదు. నువ్వు నటించడం... నటించకపోవడం అనేది పూర్తిగా నీ ఇష్టం. మన పెళ్లికి మా అమ్మ నాన్న కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇక కావాల్సినదల్లా నీ అంగీకారం మాత్రమే నేను చెప్పవలసినది అంతా చెప్పాను. ఇక చెప్పవలసింది నువ్వే. ఏ నిర్ణయం తీసుకున్నా సరే...” అంటూ ముగించాడు.

అంతసేపు తార చేతిని అలా పట్టుకునే ఉన్నాడతను. అలా ఎంతసేపు కూర్చుండిపోయారో ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు.

కాసేపటి తర్వాత, “నువ్వేం మాట్లాడలేదు తారా!” ఎంతో ఆత్రంగా చూస్తూ అన్నాడతను. ఎంతో ఆత్రంగా చూస్తున్నాడతను ఆమె వైపు. అప్పటికి తార ఏం మాట్లాడలేదు. విజయ్ కి అర్థమైపోయింది. మెల్లగా ఆమె చేతిని వదిలేశాడు. నిరాశతో లేచాడు. 

****************************

సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి

Recent Posts