Vijaya Lakshmi
Published on Jun 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?తల్లిదండ్రులను, భార్యను నిర్లక్ష్యం చేస్తూ, వ్యసనాలకు బానిసగా మారిన పుండరీకుడు దైవ వశాన తన తప్పులను తెలుసుకున్న పరిస్తితుల్లోనే అతడికి ఒక వింత సంఘటన ఎదురయింది.
ఒక ముని ఆశ్రమం ముందు వాకిలి శుభ్రం చేసిన ముగ్గురు కురూపులైన స్త్రీలు హఠాత్తుగా అత్యంత సౌందర్యవంతులు అయిన సంఘటన చూసాడు.ఆ విచిత్రం చూసి, ఇదెలా సాధ్యమయింది అన్న ఆశ్చర్యంతో పరుగు పరుగున ఆ స్తీల దగ్గరకు వెళ్ళాడు. అమ్మా మీరు ఇప్పటి వరకు అతి వికార రూపులై ఉన్నారు. కాని అంతలోనే చూస్తుండగానే ఇలా ఇంత సుందరంగా ఎలా మారిపోయారు. ఈ వింతకు కారణమేంటి? అని ప్రశ్నించాడు పుండరీకుడు.
దానికి వారు నాయనా..., మేము గంగ, యమున, సరస్వతులనే నదులము. లోకంలోని సమస్త జనులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోడానికి మా దగ్గరికు వస్తారు. మాలో మునిగి వారి వారి పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. వారి పాపాలు పక్షాలన అవుతాయి కాని, మాలో మునిగిన వారి పాపాలవల్ల ఆ ప్రభావం మాకు అంటుతుంది. దాంతో మేము ఇలా కురూపులుగా మారిపోయిన దుస్ధితి వస్తుంది. అందుకే ఆ పాప ప్రక్షాళన చేసుకోడానికి కుక్కుటముని సేవ చేసుకొని ఆ పాపపంకిలాన్ని పోగొట్టుకొని మళ్ళీ యధా స్ధితికి వస్తాము, అందుకే కుక్కుటముని ఆశ్రమాన్ని శుభ్రం చేసి, వారికి సేవ చేస్తున్నామని చెప్పారు.
అది విని ఈ నదీ దేవతలే పరమ పావనమూర్తులు. మరి ఇంతటి మహా మహిమాన్వితులైన నదీమతల్లులకు అంటిన పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగలిగిన శక్తి ఒక సామాన్య మునికి ఎలా కలిగిందని ఆశ్చర్యపోయాడు పుండలీకుడు. ఆ విషయం తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే కుక్కుటముని ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. ఆశ్రమంలో పరమ భాగవతోత్తముడైన కుక్కుట ముని తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ కనిపించారు. వెంటనే పుండలీకుడు ముని దగ్గరకు వెళ్లి నమస్కరించి, తన సందేహాన్ని ముని ముందు వ్యక్తపరిచాడు. స్వామీ నేను మీ కుటీరం వెలుపల ఒక విచిత్ర సంఘటన చూసాను. నమ్మశక్యం కాని సంఘటన. కాని స్వయంగా నా కళ్ళతో నేను చూసాను కాబట్టి నమ్మక తప్పదు. మానవులకు సంభవించిన పాపాలను పోగొట్టే శక్తి పరమ పవిత్రమైన నదులకు ఉన్నదని పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. అందులోను గంగ,యమున,సరస్వతులు. అలాంటి పవిత్రమైన నదీమతల్లులకు అంటిన పాపాలను సైతం మీరు ప్రక్షాళన చేయగలుగుతున్నారని విన్నాను. మరి ఇంతటి శక్తి మీకెలా వచ్చింది అని అడిగాడు.
అప్పుడా ముని, నాయనా నేను సాధారణమైనవాడినే. నాకు ఎలాంటి శక్తులు లేవు. ఎలాంటి సాధనాలు తెలీదు. నాకు తెలిసిందొక్కటే. మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం చెబుతోంది. ఆ వాక్య ఆచరణే నాకు తెలిసిన సాధన. నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ నా జీవితం గడుపుతున్నాను. ఇంతకూ మించిన సాధనలేవీ నాకు తెలియదు అని చెప్పాడు.
అప్పుడు పుండరీకుడు భగవంతుని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం మరొకటి లేదనుకుంటే, దానికి మొదటి మెట్టు జన్మ కారకులయిన తల్లిదండ్రుల సేవే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతనికి తన గతకాలపు నడవడిక, ప్రవర్తన జ్ఞాపం వచ్చింది.
ఇంతకాలం తన ప్రవర్తనతో తన తల్లిదండ్రులను, భార్యను ఎంతగా కష్టపెట్టాడో గ్రహించి, పశ్చాత్తాప హృదయంతో తల్లడిల్లిపోయాడు. అ పరివర్తనతోనే గ్రామానికి చేరుకొని తల్లిదండ్రుల పాదాల మీద పడి తన దుర్గుణాలను, దుర్మార్గాన్ని మన్నించి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులను తీసుకొని బయలుదేరాడు. పవిత్ర చంద్రభాగా నదీతీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తన తల్లిదండ్రులతో పాటు ఆశ్రమంలో ఉంటూ తల్లిదండ్రులకు సేవచేస్తూ కాలం గడపసాగాడు.
అయితే ఎంతటి భక్తులైనా ఏదో సమయంలో... ఏదో ఒక సందర్భంలో భగవంతుడు పెట్టే పరీక్షలను ఎదుర్కోవలసిందే. అదే పరిస్తితి పుండలీకునికీ ఎదురయింది. తన భక్తుడైన పుండరీకుడ్ని పరీక్షించదలచిన ఆ జగన్నాథుడు పాండురంగడు పుండరీకుడి దగ్గరకు వచ్చాడు. ఇంటి బయట నిలబడి పుండరీకా నేను... నువ్వు భక్తితో ఆరాధించే నీ జగన్నాథుడను. నీ ఇంటికి వచ్చాను. నీతో కాసేపు ముచ్చటిద్దామని వచ్చాను అన్నాడట.
అయితే ఆ సమయానికి వృద్ధులైన తన తల్లితండ్రుల కాళ్ళోత్తుతూ వారి సేవలో ఉన్నాడు పుండరీకుడు. తన స్వామి తన కోసం వచ్చినందుకు పరమానందభరితుదయ్యాడు. కాని తల్లిదండ్రుల సేవను మధ్యలో వదిలిపెట్టలేకపోయాడు. అదే విషయాన్ని చెప్పాడు స్వామితో. స్వామీ నాకోసం నీవు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రస్తుతం నేను నా తల్లి తండ్రుల సేవలో ఉన్నాను. వారి సేవను మధ్యలో వదిలి రాలేను. కాసేపు వేచి ఉండు. నా తల్లిదండ్రుల సేవ పూర్తి కాగానే వస్తాను అని చెప్పాడట.
అయితే తల్లిదండ్రుల సేవలో ఉండిపోయిన పుండరీకుడు ఎంతకీ బయటకు రాలేదు. బయట ఎండ మండిపోతోంది. ఎండకు కాళ్ళు కాలుతున్నాయనిచెప్పాడు పాండురంగడు. దాంతో పండరీకుడు లోపలినుంచి ఒక ఇటుక విసిరి, ఆ ఇటుక మీద నిలబడమని పాండురంగడికి చెప్పాడు. భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు. తన తల్లిదండ్రుల సేవ ముగించుకొని వచ్చిన పుండరీకుని భక్తికి, మాతా పితరుల పట్ల సేవాతత్పరతకు మెచ్చి వరం కోరుకొమ్మన్నాడు జగన్నాధుడైన శ్రీమహావిష్ణువు. అప్పుడు పుండలీకుడు ఇప్పుదేలాగైతే ముచ్చటగా అత్యంత సుందరంగా ఇటుకమీద నిలబడి తనకు దర్శనమిచ్చావో భక్తులందరికి దర్శనమిచ్చి వారిని కటాక్షించమని కోరాడు.
సరేనంటూ తానూ నడుము మీద చేతులుంచుకొని నిలబడిన భంగిమలోనే శ్రీహరి పాండురంగడిగా వెలిసాడు. అలా శ్రీహరి శిలారూపుడైపోయిన పుణ్యప్రదేశమే భక్తుడైన పుండరీకుడి పేరుతొ పండరీపురంగా ప్రసిద్ధి చెందింది. అయితే స్వామి వారికి ఎందరో మహామహులైన భక్తశిఖామణులు ఉన్నారు. వారెవ్వరికీ రాని ఈ అదృష్టం పుండరీకునికి ఎలా వచ్చింది?అసలు పుండరీకుడు ఇక్కడ జన్మించడానికి, పాండురంగడు బాలక్రిష్ణయ్య రూపంలో దర్శనమివ్వడానికి వెనక ఓ పురాణ కథనం ఉంది.
సాధారణంగా అక్కడ వెలసిన దేవీదేవతల పేరుతొ ఆయా క్షేత్రాలు ప్రసిద్ది చెందుతాయి. కాని ఆ క్షేత్రం మాత్రం భక్తుడి పేరుతొ ప్రసిద్ధి చెందింది. నిజంగా ఇది చాలా అరుదైన ఘటన. భక్తుడి పేరుతొ ప్రసిద్ధి చెందడమే కాదు భక్తుడి కోరిక మేరకు భగవంతుడు మండుటెండలో సుదీర్ఘకాలం నిలబడి, తాను భక్తికి కట్టుబడేవాడినని రుజువు చేసిన క్షేత్రం.
కృష్ణుని మీద అలిగిన రుక్మిణీ దేవి తపస్సు చేసిన క్షేత్రం. కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన క్షేత్రం. విలక్షణతకు మారుపేరుగా నిలచిన క్షేత్రం. శివ కేశవులకు బేధం లేదని చెప్పే క్షేత్రం. అధ్యాత్మికంగానే కాదు పర్యాటకులకు కూడా స్వర్గధామం గా చెప్పుకునే ఆ క్షేత్రం పండరీపురం. దక్షిణకాశీగా ప్రసిద్ది చెందిన పండరీపురం.
ఆ క్షేత్రంలో అన్నీ నిత్యనూతనమే. ఎన్నో అలౌకిక కథలకు నెలవు. అక్కడ ఉన్న తీర్థాల పేర్లే విచిత్రం. వాటి వెనకున్న కథనాలు మరింత చిత్రాతిచిత్రం. ఎ క్షేత్రంలో అయినా ఆ క్షేత్రంలో వెలసిన భగవంతుని చరిత్రతో గణుతికెక్కుతుంది. కాని ఈ కేష్ట్రంలో మాత్రం క్షేత్రంలో వెలసిన దేవతకు ఎంత ప్రాధాన్యత ఉందొ అంతకు మించిన ప్రాధాన్యత భక్తునికి ఉంటుంది.
ఈ క్షేత్రం గురించి ఇంకా విశిష్టంగా చెప్పుకోవలసిన అంశం, అక్కడ భగవంతునితో పాటు భక్తులకు కూడా సమాన ప్రాధాన్యతతో మందిరాలు ఉండడం. ఆ మందిరాలు భక్తుల పేర్లతో ప్రసిద్ధి చెందడం. దేవరుషి నారదుని తంపులమారి తనానికి ప్రతిఫలం స్పష్టమైన ఉదాహరణగా నిలచిన క్షేత్రం. ఇటు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు, అటు పర్యాటక ప్రేమికులను ఒకే స్థాయిలో అలరించే క్షేత్రం. అందమైన పర్యాటక స్థలాలకే, ఒళ్ళు జలదరింపచేసే చారిత్రిక ఘట్టాలకు పుట్టినిల్లు ఆ ప్రాంతం. భక్తికి కులమత జాతి బేధాలుండవని రుజువు చేసిన క్షేత్రం.
భక్తుని కోసం భగవంతుడే కదిలి వచ్చి, వేచి చూసిన క్షేత్రం. అక్కడి చరిత్రలు అమోఘం... అజరామరం. చివరకు శరీరం దగ్ధమయినా ఆ శరీరం లోని ఎముకలు సైతం భగవంతుని నామజపం చేసే భక్తుల కథనాలు. ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలకు, ఒళ్ళు జలదరింపచేసే ఘట్టాలు, సంఘటనలకు వేదిక. అప్రయత్నంగానే కంట నీరు జలజల రాలిపోయే, హృదయాన్ని ద్రవింపచేసే అద్భుత కథనాలు.
ఒకప్పుడది ఓ చిన్న గ్రామం. కాని ఇప్పుడు భగవంతుని పాదస్పర్షతో, భక్తుల పుణ్యచరిత్ర లతో పునీతమై, వేలాదిమంది జనులను ఆకట్టుకునే అద్భుత క్షేత్రం. అన్నిటినీ మించి క్రిష్ణభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఆది శంకరుల వారి పాండురంగాష్టకం ఇక్కడే ఆవిర్భవించింది. ఓ సక్కుబాయి.. ఓ నామదేవ్... ఓ జానాబాయి... తుకారాం, జ్ఞానదేవ్, గోమాబాయి, రామానుజాచార్యులు, శంకరాచార్యులవారు ఇలా ఎంతోమంది దర్శించి పునీతమైన పుణ్యస్థలం.
తెలుగువారికి ఒక తిరుమల, ఒక శబరిమల ఎంత ముఖ్యమైనవో మరాఠీలకు ఈ క్షేత్రం అంత ముఖ్యమైనది. ఒకప్పుడు ఔరంగజేబు ,బహమనీ సుల్తాన్ ల చేతిలో దెబ్బతిన్న ఈ ఆలయం, అహల్య బాయ్ హోల్కర్, శివాజీ సర్ధారులు పేష్వాలు పునరుధ్ధరించి , పునః వైభవం తెచ్చారు . ఆ క్షేత్రంలో వెలసిన స్వామి దర్శనం అత్యంత అరుదైన దర్శనం. ఎందుకో ఎంత సేపు చూసినా తనివి తీరనీ దర్శనం. కొన్ని కోట్లజన్మల పుణ్యఫలం ఆ స్వామి అపూర్వమైన దర్శనం.
ఏ క్షేత్రంలో అయినా స్వామిని ఆరాధించి, ఆ ఆరాధనలోనే జీవితం ధాన్యం చేసుకొని మరణ కాలంలోనో, మరణించిన తరువాతో, లేదా స్వప్నంలోనో భక్తులు స్వామిదర్శనం పొందిన కథనాలు, సంఘటనలు మనం వింటూ ఉంటాం. కాని ఇక్కడ మాత్రం సజీవంగా... నిరంతరం భక్తులు అలవోకగా స్వామితో సంభాషించిన కథనాలు... స్వామి వారితో సరిసమానంగా కూర్చిని ముచ్చట్లు చెప్పిన కథనాలు కోకొల్లలు.
కేవలం భక్తి ఒక్కటే కాదు పర్యటన అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే ఎన్నో చారిత్రిక ఘట్టాలు, వీర చరిత్రలు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలు ఈ ప్రాంతం సొంతం. వీరుల రక్తంతో తడిసిన భూమి ఈ భూమి. ఎందరో త్యాగధనుల త్యాగాలతో పునీతమైన భూమి. మరెందరో భక్తుల పాదస్పర్శతో పవిత్రమైన భూమి. అదే మహారాష్ట్రలోని పండరీపురం. ఓ వైపు మహిమాన్వితమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు, మరోవైపు అలౌకిక అందాలకు నిలయమైన అద్భుతాలకు నెలవు ఆ క్షేత్రం అదే పండరీపురం. మహారాష్ట్రలో ఉన్న పండరీపురం.
మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. ఓం నమో పాండురంగాయ..ఓం నమో పుండరీక వర్మయా..ఓం నమో నారాయణాయ..ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ..విఠోబా...విఠలా అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఆ అద్భుత దివ్యధామం పండరీపురంతో ముడిపడిన పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక కథనాల గురించి, పాండురంగని లీలా విశేషాలతో ముడిపడిన క్షేత్రం.
వ్యసనాలకు బానిసైన పుండరీకుడు దైవ కృపతో ఆ వ్యసనాల బారినుండి బయటపడి తల్లిదండ్రుల సేవలో, సన్మార్గంలో జీవనం సాగిస్తున్న పుండరీకుడు, తనను పరీక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణుని పరీక్షలో కూడా నెగ్గాడు. పరీక్షలో నేగ్గడమే కాకుండా తనను పరీక్షించడానికి వచ్చిన స్వామిని ఆడే భంగిమలో అక్కడే కొలువుతీరేలా చేయ్యగాలిగాడు. తానూ మోక్షాన్ని పొందాడు. భక్తిలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరి పుండరీకుడు ఇంతటి పుణ్యఫలితం ఎలా పొందగలిగాడు అంటే అదంతా అతడి గతజన్మ సుకృతం.
పురాణ కథనాల ప్రకారం ఈ పుండరీకుడు గతజన్మలో ముచికుందుడనే రాజు. పూర్వకాలంలో అంటే కృతయుగంలోను త్రేతాయుగంలోను దేవతలకు, రాక్షసులకు నిరంతరం యుద్దాలు జరుగుతూ ఉండేవని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా. అలాగే త్రేతాయుగంలో ఒకసారి దేవతలకు, అసురులకు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దానవుల ధాటికి దేవతలు తట్టుకోలేని పరిస్తితి ఏర్పడింది. అలాంటి సమయంలో ముచుకుందుడు వీరికి సహాయం చేసాడు.
ఇక్షాకు వంశస్తుడైన... ఈ ఇక్ష్వాకు వంశాన్నే సూర్య వంశం అని కూడా చెప్తారు. ఆ ఇష్వాకు వంశస్తుడైన మాంధాత కుమారుడు ముచుకుందుడు. భక్త అంబరీషుడు ఇతడికి సోదరుడవుతాడు. ఆ ముచికుందుడనే రాజు దేవాసురుల యుధ్ధంలో దేవతల తరపున పోరాడి దానవులను తరిమికొట్టి, దేవతలకు సహాయం చేసి, వారికి విజయాన్ని సాధించి పెట్టాడు. అయితే సుదీర్ఘకాలం సాగిన ఆ యుద్ధంలో విరామం, విశ్రాంతి లేకుండా పోరాడటం వల్ల ముచుకుందుడు అలసిపోయాడు. దాంతో తానూ ఎలాంటి ఆటంకం లేకుండా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అయితే తన నిద్రకు ఎవ్వరూ భంగం కలిగించకుండా ఉండాలని అనుకున్నాడు. అదే సమయంలో దేవరాజు ఇంద్రుడు వచ్చి తమకు ఇంత సహాయం చేసి, తమ దాయాదులైన రాక్షసుల నుంచి విజయాని సాధించి ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీకు ఏదైనా వరమిస్తాం కోరుకోమన్నాడు.
అప్పుడు ముచికుందుడు ఇలా చెప్పాడు... ఇంద్రా...! వేల సంవత్సరాలు విరామం లేకుండా యుద్ధం చేయడం వలన బాగా అలసిపోయాను. ఆ అలసట అంతా పోవాలంటే శరీరానికి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి నిద్ర ద్వారానే వస్తుంది. కాబట్టి నాకు ఆటంకం కలగకుండా సుదీర్ఘ మైన నిద్రను ఇవ్వండి. అలాగే నా నిద్రకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. నా నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారు ఆ క్షణమే... నా చూపు పడిన వెంటనే భస్మమైపోయే విధంగా వరమివ్వండి అని అడిగాడు. దేవరాజు ఇంద్రుడు ముచికుందుడు అడిగిన విధంగా వరాన్ని ఇచ్చాడు. అలా దేవతలనుంచి వరం పొంది, ఏ ప్రాణి సంచారం లేని ఒక గుహలోకి వెళ్లి నిద్రపోసాగాడు ముచికున్దుడు.
అలా వేల, లక్షల సంవత్సరాలు నిద్రపోతూనే ఉన్నాడు. ముచికుందుడు నిద్రలో ఉండగానే యుగం మారిపోయింది. ద్వాపరయుగం వచ్చి నడుస్తోంది. అయితే అదే సమయంలో శ్రీ కృష్ణుడు యాదవులను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్న కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ, అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ఇలాంటి వర ప్రభావి అయిన రాక్షసుడిని శక్తితో కాకుండా యుక్తితోనే సంహరించాలని గ్రహించి, అతడినుంచి పారిపోతున్నట్టు నటించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి దూరాడు.
కృష్ణుణ్ణి వెంబడిస్తూ వచ్చిన కాలయవనుడు గుహలోపలికి వచ్చి ముసుగుపెట్టి నిద్రపోతున్న వ్యక్తిని చూసాడు. ముసుగులో నిద్ర నటిస్తున్నది శ్రీకృష్ణుడే అని భ్రమపడి, నిద్రపోతున్న ముచికుందుని కాలితో తన్ని, పిరికిపండా! నాకు భయపడి వచ్చి ఇక్కడ నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా కృష్ణా! అంటూ ముసుగులాగాడు.
అంతే! సుదీర్ఘ నిద్ర నుంచి బయటకు వచ్చాడు ముచికుందుడు. తనకు నిద్రాభంగం కలిగించినదేవరా అని కోపంగా కళ్ళు తెరిచి చూసాడు ముచికుందుడు. ముచికుందునికి ఉన్న వరం వలన అతడి చూపునుంచి అగ్నిజ్వాలలు వచ్చి, ఆ అగ్నిలో కాలయవనుడు దగ్ధంయ్యాడు. అలా కాలయవనుడు అంతరించాడు. ఆ తరువాత ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం అయింది. శ్రీకృష్ణున్ని చూస్తూ మహానుభావా నీవెవరవు... నేనెంతకాలం నుంచి ఇలా నిద్రపోతున్నాను? నా చూపు పది మరణించినవాడెవరు? అనడిగాడు ముచికుందుడు.
నీవు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలా నిద్రపోతూనే ఉన్నావు. ప్రస్తుతం ద్వాపరయుగం నడుస్తున్నది. నహుషుడనే చక్రవర్తి కొడుకు యయాతి. యయాతి మహారాజుకు ఐదుగురు కుమారులు. అందులో పెద్దవాడు యదువు. ఆ యదువు పేరిట యదు వంశం ఏర్పడింది. ఆ వంశంలో పుట్టినవాడే వసుదేవుడు. ఆ వసుదేవునికి దేవకిదేవి కి జన్మించినవాడను నేను వాసుదేవుడను. నన్ను కృష్ణుడంటారు. ఇపుడు నీ చూపుకు ఆహుతి అయినవాడు నా ప్రబల శత్రువు కాలయవనుడు అంటూ చెప్పాడు శ్రీకృష్ణుడు.
దాంతో ముచుకుందుడు శ్రీకృష్ణుడు అవతార పురుషుడుగా, విష్ణ్వవతారుడుగా గ్రహించాడు. కృష్ణుని ముందు అంజలి ఘటించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన ప్రబల శత్రువైన కాలయవన రాక్షసుడని సంహరించినందుకు ప్రతిగా ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ముచుకుందుడిని.
అప్పుడు ముడుకుందుడు, స్వామీ! సుదీర్ఘ నిద్రలో ఉండి నీ అవతార విశేషాలైన బాలకృష్నుడి లీలలు చూడలేకపోయాను. అందువలన నాకు నీ బాలకృష్నుడి రూపంలో దర్శనం ఇవ్వు అని వరం కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నీ వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడట.
ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు. ఆ పుండరీకునికి జగన్నాథుడు బాలకృష్ణుని రూపంలో దర్శనిమిచ్చి అతని కోరిక తీర్చాడని పురాణ కథనం. ఈ పుండరీకుడి ప్రస్తావన స్కాంద పురాణంలో, పద్మపురాణంలో కూడా ఉందని చెబుతారు.
ఇంత చరిత్ర కలిగిన పుండరీకుని కోరిక మీద పాండురంగడు వెలసిన పండరీపురం సాక్షాత్తూ భూలోక వైకుంఠముగా భాసిల్లుతోంది. పండరీపురం క్షేత్ర విశేషాలు మరికొన్ని పండరీపురం పాండురంగ వైభవం – ధారావాహిక తరువాతి భాగంలో తెలుసుకుందాం.