Vijaya Lakshmi
Published on Jun 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పుండరీకుని భక్తికి మెచ్చిన పాండురంగడు తన భక్తుని కోరిక మీద పండరీపురంలో విలక్షణ రీతిలో స్వయంభువుగా వెలిసాడు. పండరీపురం ఆలయం సాక్షాత్తూ భూలోక వైకుంఠన్గా అలరారుతోంది.
మహారాష్టల్రోని షోలాపూర్ జిల్లాలో ఉన్న పండరీపురం ఒకప్పుడు అతి చిన్న గ్రామం. కాని ప్రస్తుతం వేలాదిమంది భక్తులకు గమ్యస్థానం. నిరంతరం భక్తులతో కళకళలాడుతూ సందడికి మారుపేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రతిపాదించే చంద్రబాగా నదిని భీమా నది అని కూడా పిలుస్తారు. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే పండరీపురం పాండురంగ విఠలుని మందిరం అత్యంత మహిమాన్వితమైన విశిష్టత గలది. తేజోవిరాజమైన పాండురంగ విఠలుని మందిరం శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయం నిత్యం పాండురంగా... విఠలా... విఠోబా అన్న నామస్మరణలతో మారుమోగిపోతుంది.
ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం ఏ కాలంనాటిదని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 12-13శతాబ్దాల కాలంనుంచే ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని రచనల వలన తెలుస్తోంది. ఇక ఆలయంలో ఉన్నవిఠలుని మూలమూర్తి అంతకన్నా ప్రాచీనమైనదని చెబుతారు. అత్యంత మహిమాన్వోపేతమైన పండరీపురం శ్రీ పాండురంగస్వామి (విఠలుని) ఆలయం నిరంతరం భక్తజనంతో అందంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికతకు మారుపేరుగా ఉంటుంది. మహారాష్ట్రలో చంద్రభాగ నదీతీరంలోని పండరీపురంలో శ్రీకృష్ణుడే పాండురంగడిగా వెలిసాడు. ఆ పాన్డురంగాడినే విఠలుడిగా ఆరాధిస్తారు. ఇక్కడ విఠలుని రూపం మిగిలిన శ్రీకృష్ణ రూపాలకు భిన్నంగా కనిపిస్తుంది.
సాధారణంగా ఎక్కడ చూసినా శ్రీకృష్ణ రూపంలో నెమలిపింఛం, చేతిలో వేణువు ప్రస్ఫుటంగా కనబడతాయి. వేణువు, నెమలిపించం లేని కృష్ణయ్యను అసలు ఊహించుకోలేం. కాని ఇక్కడ ఈ విఠలుని రూపంలో మాత్రం ఆ చిహ్నాలు కనిపించవు. రెండు చేతులు నడుముపై పెట్టుకుని ఉన్న బాలుడి రూపంలో దర్శనమిస్తాడిక్కడ స్వామి . మూడడుగుల తొమ్మిది అంగుళాల నల్లటి విగ్రహం శోభాయమానంగా దర్శనమిస్తుంది. తలపై ఉన్న పొడవాటి కిరీటం లింగరూపంలో కనిపిస్తుంది. అందుకే స్వామిని శివకేశవ రూపంగా కూడా భావిస్తారు.
పాండురంగస్వామి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన ... ప్రాచీనమైన క్షేత్రాలలో 'పండరీపురం' మొదటిదిగా చెబుతుంటారు. ముఖ్యంగా కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన కృష్ణ దేవాలయాలలో ప్రధానమైనది. ఆది శంకరా చార్యులు ఈ క్షేత్రంలోనే శ్రీపాండురంగాష్టకం రచించారు. ఆ గ్రంధంలో శైవ, వైష్ణవ మతాలకు భేదం లేదని ఆ విషయం
తెలియజేయడం కోసమే పాండురంగడు ఇక్కడ ఈ రీతిగా వెలిసినట్లు చెప్పారు. పాండురంగనికి అభిషేకం చేసే సమయంలో దర్శించుకునే భక్తులకు పాండురంగని తల పైభాగం లింగాకారంలో కనిపిస్తుంది.
ఇక్కడ పండురంగ విఠలుని దర్శనం రెండు విధాలుగా ఉంటుంది. పాద స్పర్శా దర్శనం, ముఖ దర్శనం. గర్భగుడి ముందునుండి వెళ్లి దూరం నుండే స్వామిని
దర్శించుకొని వెళ్ళాలి. దీనిని ముఖ దర్శనం అంటారు. ఇక పాద స్పర్శా దర్శనం... విఠలుని గర్బగుడిముందువున్న మండపంలో వెండి రేకు తాపడం చేసిన స్తంబం ఒకటి
వుంటుంది. భక్తులు దీనిని కౌగలించుకుని నమస్కారం చేస్తారు. అయితే స్తంభంగా భావించరు. ఆ స్థంభం సాక్షాత్తూ విఠలుడే అని భావిస్తారు. ఆ స్వామిని కౌగలించుకున్నట్టే, ఆయన ఆశీర్వదిస్తున్నట్టే భావిస్తారు. ఇక్కడ స్వామివారి పాదాలు స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు. అందుకే దీనిని పాదదర్శనం అంటారు.
తొలి వాగ్గేయకారుడుగా ప్రసిద్ధి చెందిన పురందరదాసు విఠలునికి పరమభక్తుడు. కర్నాటక సంగీతంలో తొలి పాఠాలు క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన కర్నాటక సంగీత పితామహుడు పురందరదాసు. ఆ మహానుభావుడు, పరమభక్తుడైన పురందరదాసుల వారు ఈ స్తంబము దగ్గరే భజనలు చేస్తూ నుంచునేవారట. అందుకే దీనిని పురందరదాసు స్తంబము అనికూడా అంటారు.
ప్రధానాలయానికి ముందు ద్వారం మధ్య భాగంలో విఠలుని భక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పబడే నామ్‌దేవ్ మహరాజ్ మూర్తి సుందరంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో నామదేవ్ మహారాజ్ మూర్తికి చాలా ప్రాధాన్యత ఉంది. పండరీపురం పాండురంగస్వామి వారి దర్శనంకోసం వచ్చే భక్తులు ముందుగా నామ్‌దేవ్ మహరాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగస్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు. తన భక్తుడికి ఆ విఠలుడు కల్పించిన గౌరవం అంది. దర్జీ కులంలో పుట్టిన నామదేవుడు, పుండరీకునికి పరమభక్తుడైన చొక్కమేళాకు గురువు. తన చరిత్రతో తన కీర్తనలతో భగవంతుని ముందు అందరూ సమానులే అని చాటిచెప్పాడు నామదేవుడు. ఈయన వ్రాసిన 61 కీర్తనలు గురుగ్రంథసాహెబ్ లో కూడా చేర్చారు. పంజాబ్ లో నామదేవుడికి ప్రత్యేకంగా గుడి కూడా కట్టారు.
నామదేవుడి భక్తిని తెలిపే ఎన్నో ఉదంతాలున్నాయి. ఒకరోజు నాగనాథ దేవాలయం ముందు భజన చేస్తుంటే అర్చకుడు అతడిని కసురుకొని గుడి వెనకకు పంపిస్తాడు. అక్కడ నామదేవుడు కృష్ణ భక్తితో నృత్యం చేస్తాడు. దాంతో తన భక్తుడున్న దిక్కుగా పశ్చిమ దిక్కుగా తిరిగిపోతుంది గుడి. ఇప్పటికీ ఆ గుడి పశ్చిమ దిక్కులో తిరిగి వుండటం మనం చూడొచ్చు. ఇలా ఎన్నో ఉదంతాలు నామదేవుని భక్తిని తెలియచేస్తాయి.
నిరంతరం పాండురంగడి నామ స్మరణలోనే ఉండేవాడు నామదేవుడు. కాలినడకన ఎక్కడికి బయలుదేరినా,ఎ పనిచేసినా ఎడతెగకుండా ఆ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. నామదేవుడు విఠలుని కీర్తిసూ పాడుతూ ఉంటే,ఆ పాటలనువిని మిగతా భక్తులు తమని తాము మరచిపోయి ఆ పాటలలో భక్తిలో లీనమయిపోయేవారట. ప్రతిరోజు నామదేవుడు నైవేద్యం సమర్పించగానే, సాక్షాత్తు ఆ పాండురంగడే స్వయంగా వచ్చి వాటిని ఆరగించేవాడట. విఠలునికి ఇంత సన్నిహితుడు, భక్తుడు కాబట్టే ఆలయంలో ఉన్న ఈ నామదేవుని మూర్తికి అంట ప్రాధాన్యత. అందుకే ఈ నామదేవుని మూర్తిని దర్శించుకుంటేనే పండరీనాథుని దర్శనం సంపూర్ణమవుతుందని చెప్తారు.ఇక విఠలుని ఆలయంలో ఉన్న నామదేవుని మూర్తికి సమీపంలో నామ్‌దేవ్‌మహరాజ్ మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలపుడు భక్తులు ఈ మెట్లుమీదుగానే ప్రధానాలయంలోకి చేరుకుంటారు. నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపున భక్తతుకారాం పాదుకలున్నాయి. అలాగే గర్భాలయ మంటపంలో వినాయకుడు, లక్ష్మీనారాయణ మూర్తులున్నాయి. గర్భాలయ మండపం 16 స్తంభాలతో నిర్మితమైంది. గర్భాలయం వెండి ద్వారంమీద స్వామివారి లీలా విశేషాలను తెలిపే మూర్తులున్నాయి.
ఆలయ సమీపంలోనే పరమ పవిత్రమైన భీమానది ప్రవహిస్తూవుంటుంది. మన సంస్కృతిలో పుష్కరాలకు ఒక మహోన్నతమైన స్థానముంది. ఈ పుష్కరాలు నదులకు నిర్వహిస్తారు. అలా అని అన్ని నదులకు పుష్కరాల్ జరగవు. పరమ పవిత్రమైన పన్నెండు నదులకు మాత్రమే జరుగుతాయి. అలాంటి మహాత్వపూర్నమైన పుష్కరాలు జరుపుకునే పుష్కర, పుణ్యనది భీమానది. ఇంత పవిత్రమైన ఈ భీమానది చరిత్ర పరమేశ్వరునితో ముడిపడి ఉంది.
పరమపవిత్రమైన పుష్కర నది బీమానది ఒడ్డున ఉంది పండరీపురం క్షేత్రం. సాధారణంగా ఆ క్షేత్రానికి, క్షేత్ర దేవతకు ఎంత పాముఖ్యత ఉంటుందో ఆ క్షేత్రంలో ఉన్న నదులకు తీర్ధాలకు కూడా అంటే ప్రాధాన్యత ఉంటుంది. ఆ జీవనదుల చరిత్రను వినంతనే, ఆ నదులను స్మరిన్చుకున్నంతనే అపరిమితమైన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. పండరీపురాన్ని ఆనుకొని ఉన్న భీమానది కూడా అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర పరమేశ్వరునితో ముడిపడి ఉంది. ఈ నది ప్రస్తావన మత్స్య, బ్రహ్మ, వామన, బ్రహ్మాండ, వాయు, కూర్మ పురాణాల్లోను, రామాయణ, భారత ఇతిహాస గ్రంధాలలోను కనబడుతుంది.
పశ్చిమ కనుమల్లో సహ్య పర్వత వరుసలో ఉద్భవించింది భీమానది. శంకరుడు త్రిపురాసురులతో యుధ్ధం చేసేటప్పుడు పరమేశ్వరుని స్వేదం ధారగా కారి భీమానదిగా ప్రవహించిందని పురాణ కథనం. అక్కడి నుంచి ప్రవహించి పండరీపురం చేరుతుంది. పండరీపురం చేరేసరికి ఈ భీమానదిని చంద్రభాగానది అని పిలుస్తారు. దానికి కారణం ఈ నది
ఇక్కడవున్న వంతెన దగ్గరనుంచి, విష్ణుపాదాలదాకా చంద్రవంకలాగా వంకర తిరిగి వుంటుంది. అందుకే ఇక్కడ ఈ నదిని చంద్రభాగ అని పిలుస్తారు.
ఈ నది ఒడ్డున 11 ఘాట్ లు ఉంటాయి. ఆ ఘాట్ లలో స్నానం చేసి భక్తులు విఠలుని దర్శించుకుంటారు. పండరినాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఘాట్ లోనే పరమభక్తుడైన పుండరీకుడి మందిరం, అతడి తల్లిదండ్రుల సమాధులు, మరికొందరు క్రిష్ణభక్తుల మందిరాలు కూడా చూడొచ్చు.
ఈ నడిలోనే మునిగిపోయి ఉంటుంది దేవరుషి నారదుడి ఆలయం. ఎంతోమంది భక్తుల మందిరాలు ఇక్కడ కొలువుతీరి ఉండగా, ఒక్క నారదుడి ఆలయం మాత్రమె ఎందుకిలా నదిలో మునిగిపోయింది. ఇక్కడ ఒక సందర్భంలో కలహాభోజనుడైన నారదుడు శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి కి తగవులు పెట్టాడట. అలా తన స్వామికి తనకు తగవులు పెట్టినందుకు కోపగించుకున్న కారణంగా రుక్మిణీదేవి శపించిందట. అందుకే నారదుని ఆలయం అలా నీట మునిగిపోయిందని చెప్పుకుంటారు స్థానికులు.
ఇక పైనుంచి ప్రవహిస్తూ వచ్చిన భీమానది ఇక్కడ చంద్రభాగ నదిగా పేరు పది ఇక్కడున్న లోహదండ తీర్ధముతో కలిసి, ముందుకు పారి తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది.
ఈ లోహదండ తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా ప్రక్షాళన అవుతాయని, బాధలన్నీ తీరిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అసలీ తీర్తానికి ఎందుకింత ప్రాముఖ్యం వచ్చింది. ఎందుకంటే స్వయంగా పరమేశ్వరుడు ఏర్పరచిన తీర్థం కాబట్టి.
ఒకసారి శివ పార్వతులు భూలోకంలోకి వచ్చి ఈ ప్రాంతంలో విహరిస్తూండగా, పార్వతీదేవికి దాహం వేసిందట. వెంటనే శివుడు అమ్మవారి దాహం తీర్చడం కోసం తన త్రిశూలంతో భూమిని చీల్చి పాతాళంలోని భోగవతి నీటిని భూమిమీదకి తీసుకొచ్చాడు. ఆ స్ధలమే భీమానదీ తీరంలో ఉన్న పుండరీకుని మందిరం ముందుండే లోహదండ తీర్ధము. పరమేశ్వరుడు ఏర్పరచిన ఈ తీర్తానికి లోహదండతీర్థం అని పేరెలా వచ్చింది?
లోహదండతీర్థం పేరే వింతగా, విచిత్రంగా ఉంది కదూ... ఈ తీర్తానికి ఈ పేరెలా వచ్చిందన్న విషయానికి వస్తే, ఇంద్రునికి సంబంధించిన ఓ కథ చెప్పుకోవాలి. పరమ సాధ్వీమణి అయిన అహల్య మీద వ్యామోహంతో ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వచ్చి గౌతముని భార్య అయిన అహల్యాదేవిని మోసపుచ్చిన విషయం, ఇది తెలిసిన మహర్షి గౌతముడు అహల్యను ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అదృశ్యంగా జడురాలిగా పడి ఉండమని, అలాగే ఒళ్ళంతా స్త్రీ జననాంగాలతో వికృతంగా మారిపొమ్మని ఇందుడ్ని శపించిన కథ మనం పురాణ కథల్లో చదువుకున్నాం కదా.
అయితే ఇంద్రుడు పశ్చాత్తాపంతో అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరించడం కూడా ఉంది. అయినా కూడా ఒళ్ళంతా కన్నులతో వికృతంగా కనిపించడంతో ఈ శాపం నుంచి విముక్తి కలిగించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించాడు.
అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుడికి ఒక ఇనుపదండాన్నిచ్చి, ఏ తీర్ధములో ఔఒతె ఈ ఇనుప దండము తేలుతుందో, అక్కడ స్నానం చెయ్యు అప్పుడు నీ శాపం పోతుందని నీ సుందర రూపం నీకు వస్తుంది అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పిన విధంగానే ఇంద్రుడు భూలోకంలో అనేక తీర్ధాలు తిరిగాడు. ఎక్కడా అతనికి శాపవిమోచనం కలగలేదు.
అలా ఇంద్రుడు ఒక్కో తీర్హం చూసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ తీర్థంలో ఇనుప దండాన్ని నీటిలో వేసినప్పుడు అది నీటిపై తేలిందట. దాంతో ఇంద్రుడు సంతోషంతో అక్కడ స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలోనే శ్రీ మహావిష్ణువు రవిచంద్రులున్నంతకాలం ఈ తీర్ధం లోహదండ తీర్ధంగా ప్రసిధ్ధి చెందుతుందని
వరమిచ్చాడు. అప్పటినుంచీ అది లోహదండ తీర్ధమయింది.
పండరీపురం క్షేత్రం గురించి తలచుకోగానే వెంటనే జ్ఞాపకం వచ్చే అంశాలలో వార్కరి ఉత్సావాలు కూడా ప్రధానంగా చెప్తారు. అసలేంటీ వార్కరి ఉత్సవాలు....వార్కరి అంటే ఏమిటి? వార్కరి ఉత్సవాల వెనక ఉద్దేశ్యమేంటి? ఈ విశేషాల గురించి పండరీపురం పాండురంగ వైభవం – ధారావాహిక నాలుగో భాగంలో తెలుసుకుందాం.