Vijaya Lakshmi
Published on Jun 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఒక్కో క్షేత్రానికి ఒక్కో రకమైన ఉత్సవాలు ప్రసిద్దిగా ఉంటాయి. అంటే తెలంగాణలో బోనాల పండుగ, ఒడిషాలో పూరీ జగన్నాథుని రథయాత్ర, ఎలాగో అలా ఆయా ప్రాంతాలకు మాత్రమె ప్రత్యేకమైన కొన్ని ఉత్సవాలు ఉంటాయి. అలాగే పండరీపురం క్షేత్రానికి మాత్రమె ప్రత్యేకమైన ఉత్సవం వార్కరీ ఉత్సవం. ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి రోజున పండరిపుర క్షేత్రంలో నిర్వహంచే ఉత్సవమే వార్కరీ వేడుక. ఇరవైఒక్క రోజుల పాటు కొనసాగే పాదయాత్ర. ఈ 21 రోజుల పాదయాత్రనే మరాఠీలు వార్కరీ యాత్ర అని పిలుస్తారు.
అసలేంటీ వార్కరీ?. వారీ అంటే యాత్ర. కారీ అంటే యాత్రికులు. వార్కరీ యాత్ర చేసే యాత్రికులు. మైళ్ళ కొలదీ దూరాన్ని కాలి నడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని పదిమందికీ పంచడమే వార్కరీ వేడుక పరమార్థం. ఒక రకంగా భక్తి ఉద్యమం. ఇంకా సులువుగా అర్థమయ్యేవిధంగా చెప్పాలంటే తొలిఎకాదశి ఉత్సవాలే ఈ వార్కరి ఉత్సవాలు.
పండరీపురంలో జరిగే ప్రధానమయిన ఉత్సవాలు ఆషాఢమాసంలో తోలిఎకాదశి ఉత్సవాలు లేదా వార్కరి యాత్ర. ఆషాఢ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా జన సంద్రంలాగా కోలాహలంగా మారిపోతుంది. ఆషాఢ శుద్ధఏకాదశి నాడు పండరీ పురానికి మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాలనుండి లక్షలాది భక్తజనం పెద్ద ఊరేగింపుగా ,యాత్రగా వస్తారు. ఏటా ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో వార్కరీ ఉత్సవం జరుగుతుంది
.
వారి అంటే యాత్ర... కారి అంటే నిర్వహించేవారు అని అర్థం. ప్రయాణం చేస్తూ పరమార్థాన్ని పదిమందికీ పంచడమే వార్కరీ సంప్రదాయం. క్రీ.శ 13వ శతాబ్ధానికి చెందిన పాండురంగని మహా భక్తుడైన జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి క్షేత్రం అళంది నుంచి, క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి ఉన్న దేహు నుంచి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. ఆ రెండు క్షేత్రాల నుంచి నిర్వహించే 250 కిలోమీటర్ల పాదయాత్రనే వార్కరీ యాత్రగా పిలుస్తారు.
ఇందులో భాగంగా అళంది నుంచి జ్ఞానేశ్వర్ పాదుకలను, దేహు నుంచి తుకారం పాదుకలను పల్లకీల్లో తీసుకెళతారు. 21 రోజులపాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలిఏకాదశి ముందురోజు పండరీపురం చేరుకుంటాయి. భక్తులు ఎంతో దీక్షతో, క్రమశిక్షణతో సాగించే భక్తియాత్ర ఇది.
ఇందులో పాల్గొనే భక్తులు కఠోర నియమాలు పాటిస్తారు. మద్యమాంసాలు, ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు లేకుండా నడుస్తారు. మెడలో తులసిమాల ధరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భక్తుణ్ణి పాండురంగడిగా భావించి ఆదరిస్తారు. కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమూహాలుగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు.
ఈ వార్కరీ ఉద్యమం మొదట్లో మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా జరిగేది. అయితే తరువాతి కాలంలో అది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా యాత్ర జరుగుతుంది. అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యాత్రలు చేస్తారు.
ఎన్నో ప్రత్యేకతలున్న ఈ క్షేత్రానికి మరే క్షేత్రానికి లేని ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది. అదే ఇక్కడ భగవంతునితో పాటు భక్తుడు కూడా సమాన ప్రాధాన్యత సంతరించుకోడం. విఠలుడు ఇక్కడ కొలువుతీరడానికి కారణమైన పుండరీకుడేకాదు, ఇక్కడ స్వామిని కొలిచి, స్వామితో ఆడి, పాడి, సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి,నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్ధ రామదాసు, పురందరదాసు ఇలా చెప్పుకుంటూ పొతే ఎడతెగకుండా చెప్పుకుంటూనే ఉండాలి.
వారిలో మొట్టమొదట చెప్పుకోవలసినది పుండరీకుడు. పుండరీకుని మందిరం. చంద్రభాగా నదీతీరంలో లోహదండ తీర్తానికి సమీపంలో స్వామివారి ఆలయానికి సమీపంలోనే ఉన్న నదీఘాట్ లో ఉంటుంది పుండరీకుని మందిరం. ఈ మందిరంలోని పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే.. స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు. అందుకనే భక్తులు ఇక్కడి ఘాట్లో స్నానాలు చేసి, మొట్ట మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు.
పాండుగరండి ఆలయానికి సరిసమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభాయమానంగా, మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండలీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు. పుండలీకుని దర్శించుకున్న తర్వాత పుండలీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు.
ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజాద్రవ్వాలన్నింటిని సేకరించుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ఈ భక్త నామదేవ్ ప్రాధాన్యత, విశిష్టత ఇంతకూ ముందు ఎపిసోడ్స్ లో తెలుసుకున్నాం కదా.
ఇక ప్రధాన ఆలయంలో ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడువైపున చౌకమేళ మందిరం దర్శనం ఇస్తుంది. విఠలుని ఆలయంలో అతి ముఖ్యమైన పాత్ర. అసలు మనం పాండురంగని దర్శనం చేసుకొని మన మనసులో కోరికలు తీర్చమని ప్రార్థిస్తాం కదా. ఆ ప్రార్ధనలన్నీ స్వామి వారి భక్తుడైన ఈ చౌకమేళయే స్వామి వారికి చేరవేస్తాడని చెబుతుంటారు. ఎంతోమంది భక్తులుండగా ఈ చోకమేల కే ఈ విశిష్టత ఎలా వచ్చింది.
సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినపుడు మన గోత్రనామాలు, మన కోరికలు అన్నీ ఆ శివయ్య కంటే ముందు నంది చెవిలో చెప్పుకుంటాం. అలాగే పండరీపురంలో పాండురంగ విఠలుని సన్నిధికి వెళ్ళినపుడు, స్వామిని దర్శించుకునే ముందు ఈ చొఖమేలునికే మన కోరికలు చెప్పుకోవాలని చెప్తారు. ఇంతకీ అసలెవరీ చోఖమేలుడు...
విఠలుని పరమభక్తుడు చోఖమేలుడు. భక్తికి,ఎలాంటి జాతి, కుల, మత బేధాలు లేవని, భక్తుడికి భగవంతుడికి ఎలాంటి అడ్డంకులు ఉండవని, భగవంతుని నుంచి భక్తుడిని ఎవ్వరూ వేరు చేయ్యలేరని వేల సంవత్సరాల కిందటే రుజువు చేసిన మహానుభావుడు చోకమేల. తన భక్తితో, స్వామి పట్ల ఉన్న ఆర్తితో ఆ విఠలుని వారధిగా నిలబడ్డాడు. మహారాష్ట్రలోని ప్రస్తుత బుల్ధాణా జిల్లా, దేవుల్ గావ్ రాజా తాలూకా, మెహూణా రాజా అనే గ్రామంలో జన్మించాడు చోకమేల. పండరీపురానికి సమీపంలోనే ఉన్న మంగళవేద అనే ప్రాంతంలో తన భార్య సోయరా, కొడుకు కర్మమేలాతో నివసిస్తూ ఉండేవాడు. చోఖమేల నిమ్నజాతికి చెందిన వ్యక్తీ. అగ్రవర్ణాలకు చెందిన తోటలు, పంటలకు కాపలా కాయడం వారికి చెందిన పనులు చెయ్యడం చేస్తూ ఉండేవాడు.
ఆ కాలంలో నిమ్న జాతీయుల పరిస్తితి ఎలా ఉండేదో, వారి జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో మనం చాల పుస్తకాల్లో చాడుకున్నాం. పెద్దలు చెప్పగా విన్నాం కూడా. అందుకే మరి అప్పటి నిమ్న జాతీయుల పరిస్తితికి అనుగుణంగానే ఊరికి దూరంగా నివాసం ఏర్పరుచుకుని ఉండేవాడు. అప్పట్లో అంటరానికులంగా, అతి నిమ్నజాటిగా భావించ బడ్డ మహర్ దళిత కులానికి చెందినవాడు కావడం వల చోకమేల ఎన్నో బాధలు పడవలసి వచ్చింది.
మహర్ కులస్థులు గ్రామాన్ని ఊడ్చి శుభ్రంగా ఉంచడం, చచ్చిన పశువులను తొలగించి వాటిని ఊరవతల ఖననం చేయడమేకాక, ఊరికి దూరంగా ఆయా కులస్థులతోపాటే ఉండాలన్నది ఆ రోజుల్లో నియమం. అందరితో కలిసి నిలబదదానికే వీలులేని స్థితిలో ఇక చదువులకు, చదువుకోడానికి ఆస్కారమెక్కడ. తినే తిండిలో కూడా అతి జుగుప్సాకరమైన పరిస్తితి. పై కులస్థులు తినగా వదిలేసిన తిండిని ప్రసాదంలా సేకరించి తినడం ఇలా ఉండేది అప్పట్లో వారి పరిస్తితి. ఇలాంటి బాధలన్నీ చోకమేల కూడా అనుభవించాడు. ఈ బాధలన్నీ ఒక ఎత్తైతే తన ఆరాధ్య దైవాన్ని తనివితీరా చూసుకునే భాగ్యం కూడా లేని దుస్తితి చోకమేల ను చాలా బాధకు గురిచేసింది.
చోఖామేలా ఒకసారి పండరీపురం వచ్చినపుడు విఠలుని పరమభక్తుడు సంత్ నామదేవ్ బోధనలు విన్నాడు. అప్పటికే అతడు తల్లి ద్వారా విఠలుని గురించి విని స్వామిమీద అపరిమితమైన ప్రేమను, భక్తిని పెంచుకున్నాడు. ఇప్పుడిలా పండరీపురంలో నామదేవుని బోధనలు విన్నాడు. ఆ బోధనలు చోఖమేల మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. అతన్ని గురువుగా స్వీకరించి పాండురంగ విఠలుని భక్తుడుగా మారిపోయాడు.
ఆ తరువాత తన స్వామికి చేరువగా ఉండాలన్న కోరికతో తన భార్యా పుత్రునితో పండరీపురానికి నివాసం మార్చుకున్నాడు చోఖమేల. ఎక్కడ ఉన్నా ఆ రోజుల్లో మహార్ కులస్తుల పరిస్తితి ఒకేలా ఉండేది. అందుకే పండరీపురం వచ్చినా చోఖమేల కూడా తన సాటి కులస్థులతో పాటు ఊరి చివరనే ఉండవలసి వచ్చింది.
ఎంతో ఆశతో, తన స్వామిని నిరంతరం చూసుకోవాలనే కోరికతో గుడి లోనికి ప్రవేశం లేకుండా కట్టడి చేసారు ఆలయ పెద్దలు. ఇక చేసేదేం లేక చంద్రభాగ నదిఒడ్డున, ఒక గుడిసె వేసుకొని ఉండసాగాడు. దూరం నుంచైనా స్వామి ఉన్న గుడినైనా చూడవచ్చని ఆశపడ్డాడు.
సమాజంలో మనుషుల మధ్య వ్యత్యాసం ఒకలా బాధపెడితే కనీసం తన స్వామిని కంటితో కూడా చూసుకోడానికి లేకుండా పోయిందని బాధపడేవాడు చోకమేల. ఆ బాధనంతటినీ అభంగ్ లు గానం చెయ్యడం ద్వారా విఠలునికి చెప్పుకునేవాడు. అభంగ్ లంటే మరాఠీ భాషలో పాడుకునే భక్తిపూరితమైన పాటలు, భజనలు.
అప్పట్లో అట్టడుగు వర్గంగా ఉన్న చోకమేల పాడిన ఈ అభంగ్ లు అన్నీ కేవలం తన బాధను ఆర్తిని తెలియచేసేలా నోటిద్వారా పాడినవే కావడం వలన ఈ అభంగ్ లు ఇప్పుడు పూర్తిగా దొరకకపోయినా అనంతభట్ అనే భక్తుడు సేకరించి రాసి భద్రపరచడంతో కొన్ని మాత్రం లభ్యమవుతున్నాయి.
అలా దూరం నుంచి చూస్తూ ఉండలేక ఆలయం దగ్గరికి వచ్చి బైట నుంచైనా నా స్వామిని చూసుకుంటానని అనుకుంటూ గుడి బయట పాడుకుంటూ ఉన్నాడు చోకమేల. అయితే ఒక అంటరానివాడు అలా గుడి దగ్గరకు రావడం అక్కడి పూజారులు, పెద్దలు సహించలేకపోయారు. అతడ్ని తిట్టి, కొట్టి దూరంగా తోసేసారు.
ఏడ్చుకుంటూ దూరంగా వెళ్ళిపోయిన చోకమేల, గుడి ఎదురుగా నదీతీరంలో ఉన్న తన గుడిసె ముందు కూర్చొని, ఆర్తిగా అభంగ్ లు పాడుకుంటూ తన బాధను అభంగ్ ల ద్వారా ఆ స్వామికి చెప్పుకునేవాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ చోకమేల బాధ తీవ్రమవుతోంది. తన స్వామిని కళ్ళారా చూడలేని తన బ్రతుకెందుకు అని తీవ్రమైన వేదనలో పడిపోయాడు. భర్త పరిస్తితి చూసిన చోకమేల భార్య సాయిరా ఆందోళన పడింది. తన భర్త ఏమయిపోతాడో అని భయపడింది.
తన భక్తుడి ఆర్తి ఆ పాండురంగనికి వినిపించిందో... లేక తన దగ్గరికి రాలేకపోతున్న భక్తుని దగ్గరకు తానే వెళితే సరిపోతుంది అనుకున్నాడో మరి! విఠలుడు తానే కదిలాడు.
అలా కదిలిన విఠలుడి వలన చోకమేల ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో తెలిస్తే... ఆ పాండురంగని మహిమలు ఏ విధంగా పరిణమిస్తాయో తెలుసుకుంటే అవాక్కవకమానం... మరి చోకమేల విషయంలో పాండురంగడు చూపిన లీలలు... పండరీపురం పాండురంగ వైభవం – ధారావాహిక తరువాతి భాగంలో తెలుసుకుందాం...