Vijaya Lakshmi
Published on Jun 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?కనీసం పాండురంగని ఆలయం ముందు కూడా ఉండనివ్వకుండా ఆలయ పెద్దలు తనని తోసి పారేయడంతో బాధతో తన నివాసానికి చేరుకున్నాడు చోకమేల. తన స్వామిని చూడలేని దురవస్థకు బాధతో చంద్రభాగ నదీతీరంలో అభంగాలు పాడుకుంటూ ఉన్న చోకమేల కోసం తానే గర్భగుడి నుంచి కదిలాడు విఠలుడు.
ఆ రోజు చంద్రభాగ తీరంలో తన గుడిసె ముందు అరుగుపై కూర్చొని అభంగాలు పాడుకుంటూ తన పని చూసుకుంటున్నాడు చోకమేల. సరిగ్గా అప్పుడే తన భక్తుని కోసం, తన స్థానం నుంచి కదిలాడు పాండురంగడు. నెమ్మదిగా నదీతీరం వైపు సాగిపోయాడు. చోకమేల ఎదురుగా నిలబడ్డాడు. హఠాత్తుగా తన ఎదురుగా నిలబడిన తన స్వామిని చూసి, నిర్ఘాంతపోయాడు. కంగారుపడిపోయాడు. "స్వామీ... స్వామీ... నాకోసం కదిలి వచ్చావా! ఈ అంటరానివాడి కోసం... ఈ దీనుడి కోసం నువ్వే వచ్చావా!" అంటూ కలవెళపడిపోయాడు.
"వచ్చాను లేవయ్యా చోకమేలా... నీను ఈ భూమ్మీద అవతరించినదే మీలాంటి వారికోసం. అలాంటి మీరే నాకు దూరంగా ఉంటే ఇక నా సన్నిధిలో కళే లేదు. నా సన్నిధి వెలవెలబోతోంది. రావయ్యా రా... నీతో చాలా ముచ్చటించాలి" అని చెప్పి, చెయ్యిపట్టి తనతో తీసుకుపోయాడు. గుడి తలుపులు తీయకుండానే గర్భగుడిలోనికి తీసుకుపోయాడు. తన భక్తుని ప్రేమగా చూస్తూ పాండురంగడు... తన స్వామిని ఆరాధనగా రెప్పవేస్తే ఎక్కడ కనులు స్వామిని చూడలేకపోతాయో అని స్వామి పాదాల దగ్గర చతికిలపడి ఆర్తిగా చూస్తున్న చోకమేల ఇద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు.
తెలతెలవారుతోంది. గుడిని తెరిచే సన్నాహాలు చేస్తున్నారు పూజారులు. ఇంతలోనే వారికి లోపలినుంచి మాటలు వినబడుతున్నాయి. పూజారులు భయపడిపోయారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. లోపల ఎవరు ఉన్నారు. మాటలు వినబడుతున్నాఏంటి? ఏంటీ విచిత్రం. ఎవరైనా దొంగలు లోపలికి ప్రవేశించారా? అని ఆలోచనలో పడిపోయారు. చూస్తె వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తాళాలు కూడా వేసే ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు. పూజారులు కంగారు పడిపోయారు. భయపడిపోయారు.
గబగబా తలుపులు తెరిచి చూసారు. లోపల చోకమేల ఉన్నాడు. అతడిని చూసి భగ్గుమన్నారు. కోపంతో రగిలిపోయారు. ఎంత ఘోరం చేసావు... అసలు ఆలయంలోనే రాకూడదు అంటే, ఏకంగా గర్భగుడిలోకే వచ్చావా? స్వామి విగ్రహాన్నే తాకుతూ కూర్చున్నావా? ఎంత ధైర్యం? ఎంత ఘోరం? దొంగతనం చెయ్యడానికి వచ్చావా... అసలు లోపలి ఎలా వచ్చావు... అంటూ ఎగిరిపడ్డారు.
ఈ ఆరోపణలకు వణికిపోయాడు చోకమేల. గజగజా వణుకుతూ, లేదయ్యా ఇదిగో విఠోబా నన్ను తీసుకువచ్చాడు. ఇదిగో చూడండి విఠోబా నాతొ మాట్లాడుతున్నాడు అన్నాడు చోకమేల.
"ఏంటీ! స్వామి నీతో మాట్లాడుతున్నాడా? ఏదీ!ఎక్కడ! ఎక్కడ కనబడుతున్నాడు?" అని గద్దించారు. అక్కడ చూస్తే వారికి చోకమేల ఒక్కడే కనబడుతున్నాడు. కాని చోకమేలకు మాత్రం స్వామి సజీవంగా కనబడుతున్నాడు. వీరికి మాత్రం అక్కడ స్వామి విగ్రహం, చోకమేల కనబడుతున్నారు.
దాంతో, "ఏంటి! దొంగ దొరికాక తప్పించుకోడానికి అబద్ధాలు చెబుతున్నావా?" అంటూ చోకమేలను బయటికి ఈడ్చుకొచ్చి చెంపలు వాయించేశారు.కొట్టి పడేసారు. ఇలా గుడిలోపలికి వచ్చి గుడిని అపవిత్రం చేసినందుకు ఇతనికి శిక్ష వెయ్యలనుకున్నారు. యితడు పందరీపురంలోనే ఉంటే ఇలాగే మాటిమాటికీ గుడిలోపలికి వస్తాడని భావించి, అతడికి పుర బహిష్కారం శిక్షగా విధిస్తారు. చోకమేల ఇక పండరీపురంలో ఉండడానికి వీల్లేదని నదికి ఆవలి వైపుకి వెళ్ళిపోవాలని తీర్మానించారు. వెళ్ళిపోక తప్పదని నిర్భందించారు.
సరేనని పెద్దలు తీర్మానించిన విధంగా నదికి ఆవలి వైపుకి వెళ్ళిపోయాడు చోకమేల. ఒకరోజు తన గుడిసె ముందు ఒక చెట్టు నీడలో కూర్చొని భోజనం చేస్తుంన్నాడుడు చోకమేల. అతని భార్య సాయిరా భర్తకి వడ్డిస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు పాండురంగ విఠలుడు.
"ఏమయ్యా చోకమేలా! నాకు పెట్టకుండానే తింటున్నావే! నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. భోజనం పెట్టవయ్యా" అనడిగాడు విఠలుడు. స్వామిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు చోకమేల, సాయిరా దంపతులు.
విఠలుని సగౌరవంగా ఆహ్వానించి, పూజించి, భోజనం వడ్డించారు. అలా వడ్డిస్తున్న సమయంలో తనకు పెరుగు కావాలని అడుగుతాడు విఠలుడు. సాయిరా పెరుగు వడ్డించబోతుంది. అలా వడ్డిస్తున్నపుడు, స్వామిని చూసిన ఆనందమో... కంగారో... భయమో తెలియదు గాని సాయిరా చేయి వణికి పెరుగు తొణికింది. దాంతో పెరుగు కాస్తా స్వామి పంచేమీద పడింది.
జరిగిన దానికి చోకమేల, "అయ్యో... అయ్యో... ఏంటీ నిర్లక్ష్యం! స్వామి మీద పరుగు పడిందే... స్వామివారి బట్టలన్నీ పాడయ్యాయే అని కంగారుపడి, భార్యను కసురుకున్నాడు. ఎంత పని చేసావు... సరిగా చూసుకోనవసరం లేదా? నీ దృష్టి ఎక్కడుంది? ఇలా చేసావు..." అని అరిచాడు.
అయితే సరిగ్గా అదే సమయంలో ఆలయ పూజారి అటువైపు వెళుతూ చోకమేల గద్దింపు విన్నాడు. 'ఓహో ఈ చోకమేల తానూ రావడం చూసి పరోక్షంగా తననే ఇలా అంటున్నాడని' భావించి, వెంటనే కోపంగా వెళ్లి, ఓ చోకమేలా నీకు ఎంత అహంకారం! నన్నే గద్దిస్తావా? అంత గొప్పవాడివయ్యావా? చిన్న పెద్ద, మంచి చెడు ఏం లేదా!? అంటూ చోకమేలను చెంప మీద గట్టిగా కొట్టాడు పూజారి. ఈ గలాభాకు విఠలుడు అదృష్యమయిపోయాడు. ఇక చోకమేల ను కొట్టిన పూజారి మాత్రం, అలా కొడుతున్నపుడు అంటరానివాడైన చోకమేలను తాకినందుకు అక్కడే ఉన్న నదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్ళిపోయాడు.
ఆలయంలోకి వెళ్ళిన పూజారికి అక్కడ వింత దృశ్యం కనిపించింది. విగ్రహంగా ఉన్న విఠలుని కళ్ళనుండి కన్నీరు స్రవిస్తోంది. పాండురంగని చెంప ఎవరో కొట్టినట్టు ఎర్రగా కందిపోయి ఉంది. రంగని ముఖం వెలవెలబోతోంది. దీనంగా ఉంది. ఇలా స్వామిని చూసిన పూజారికి అర్థమయిపోయింది. తాను చోఖమేలుని పట్ల చూపిన అనుచిత ప్రవర్తనకు ఫలితమే ఇది అని గ్రహించాడు. తాను చోకమేలుని పట్ల చూపిన దురుసుతనం తన భక్తుని బదులు విఠలుడు తాను తీసుకున్నాదన్నమాట ... అయ్యో! ఎంత పని జరిగింది!ఇపుడేది దారి? అనుకుంటూ పెద్దల దగ్గరకు పరుగులు పెట్టాడు పూజారి.
జ్ఞానుల దగ్గరకు వెళ్లి చోకమేల పట్ల తాను చేసిన దురాగతం, దాని ఫలితంగా, ఆలయంలో పాన్డురంగాని స్తితి వారికి చెప్పి నాకు తరుణోపాయం చెప్పిండి అని వారి కాళ్ళావేళ్ళా పడి ప్రాధేయపడ్డాడు.
భక్తుల పట్ల చూపిన దురాగతాలను స్వామి ఎప్పుడూ సహించదు. ఇలాంటి సమయంలో, ఈ విషయంలో మాత్రం స్వామిని ఎవ్వరూ శాంతపరచలేరు. మళ్ళీ స్వామిని మామూలు స్తితికి తీసుకురావాలంటే ఆ భక్తులకే సాధ్యపడుతుంది. కాబట్టి నీవు వెళ్లి ఆ చోకమేలనే వేడుకో. అతి తప్ప మరో మార్గం లేదు. ఆ చోకమేలుడే నిన్ను ఈ స్తితి నుంచి కాపాడగలదు. అని సలహా ఇచ్చారు పెద్దలు.
హుటాహుటిన చోకమేల దగ్గరికి పరుగులు పెట్టాడు. అయ్యా చోకమేలా నీవు వెంటనే నాతొ పాటు రావాలి. నువ్వు వస్తేనే స్వామి సాంత్వన పొందుతాడు.. అంటూ అతని చేతులు పట్టుకొని దీనంగా అర్ధించాడు పూజారి.
"అయ్యో! ఇదేంటయ్యా! నేను అంటరానివాడిని. మీరు నన్ను తాకుతున్నారేంటి? ఇది తగదయ్యా!" అంటూ దూరం జరిగాడు చోకమేల.
" అయ్యో... ఇంకా అంటరానివాడు, అగ్రకులస్తుడు ఏంటయ్యా... ఆ అహంకారంతోనే... అజ్ఞానంతోనే నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను. అందుకు ఫలితం ఆ విఠలుడు వెంటనే నాకు చూపించాడు. ఇక నా అజ్ఞానం, అహంకారం అణిగిపోయాయి. నీవు వెంటనే నాతొ పాటు వచ్చి స్వామిని సాంత్వన పరచాలి." అంటూ స్వయంగా ఆ చోకమేలను తీసుకొని ఆలయానికి బయలుదేరాడు పూజారి.
ఆలయానికి చేరుకొని, స్వామి చెంత చేరి విఠలుని స్తితిని చూసి, కన్నీళ్ళతో కదిలిపోయాడు చోకమేల. అయ్యో స్వామి నా కారణంగా నీవు ఇంతగా బాధపడ్డావా... స్వామీ నీవే ఇలా ఉంటే ఇక మాకు దిక్కేవరయ్యా. అజ్ఞానులం... మా అజ్ఞానాన్ని మన్నించి శాంతించవయ్యా ... అంటూ పరిపరివిధాల ప్రార్ధించాడు చోకమేల. తన భక్తుడి ఆర్తికి మళ్ళీ మామూలు స్తితికి వచ్చాడు పాండురంగడు.
ఆ తరువాత ఒకసారి భక్త నామదేవుడు వచ్చాడు పాండురంగని సన్నిధికి. స్వామిని దర్శించుకున్న సందర్భంలో విఠలుని కళ్ళనుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారుతూ ఉండడం చూసాడు. "అయ్యో స్వామీ! ఎందుకలా దుఖిస్తున్నావు.ఎందుకని... నీకేం కష్తం వచ్చిందయ్యా" అన్నాడు ఆర్తిగా నామదేవుడు.
"నీలాగే నా పరమభక్తుడు చోకమేల. అతడు కాసేపటి క్రితమే జన్మ చాలించాడు. ఒక నిర్మాణపు పని చేస్తూ, ఆ పని ప్రదేశంలో గోడ కూలి, ఆ గోడ క్రింద పడి తనువు చాలించాడు". అన్నాడు రంగడు.
"ఆ పరమ భక్తుడికి కైవల్యం ఇచ్చి నీ సన్నిధికి చేర్చుకున్నావా స్వామి" అని నామదేవుడు కూడా కన్నీరు పెట్టుకున్నాడు.
" నీవు నాకోసం ఒక కార్యం చెయ్యాలయ్యా నామదేవా" అన్నాడు విఠలుడు.
" ఏంటి స్వామి చెప్పు" అన్నాడు నామదేవుడు.
"నా భక్తుడైన చోకమేల తనువు చాలించేవరకు నన్ను ఒకే ఒక కోరికను కోరుతూ ఉండేవాడు. కాని ఆ కోరిక తీరనేలేదు. అందుకే ఆ కోరికను ఇప్పుడు తీర్చాలయ్యా. అందుకు నీ సాయం కావాలి" అన్నాడు పాండురంగడు.
" సెలవియ్యి స్వామి" అన్నాడు నామదేవుడు.
చెప్పడం మొదలు పెట్టాడు రంగడు. "చోకమేల ఎప్పుడూ మరణానంతరం తన శరీరం నా మందిరం ఎదుటే సమాధి కావాలని కోరుకునేవాడు. కాని అతని కోరిక తీరలేదు. అక్కడ నిర్మాణపు పనిలో గోడకింద పడి మరణించిన వారందరితో పాటు చోకమేల శరీరం కూడా కలిపి అంత్యక్రియలు జరిపించేసారు. కాబట్టి అతని శరీరాన్ని ఇక్కడ సమాధి చేసే అవకాశం లేదు. కనీసం అతడి అస్తికలయినా తీసుకువచ్చి ఇక్కడ నా మందిరం ఎదురుగా సమాధి చెయ్యు అన్నాడు" పాండురంగడు.
"అయ్యో! విఠలా!అదెలా సాధ్యం? అందరితో కలిపి ఉత్తరక్రియలు జరిపినపుడు... అక్కడ అంతమంది శరీరాలను దహనం చేసినపుడు, నేను ప్రత్యేకంగా చోకమేల అస్తికలను ఎలా తేగలను" అన్నాడు నామదేవుడు.
"అదంత కష్టమేం కాదు నామదేవా. నీకు ఒక ఉపాయం చెబుతా విను. అంటూ చెప్పడం మొదలుపెట్టాడు విఠోబా. నామదేవా! చోకమేల నిరంతరం, సర్వకాల సర్వావస్థలలోనూ నా నామజపం మానడు. అతడు శరీరంతో ఉన్నపుడే కాదు, మరణించిన తరువాత అతని అస్తికలు కూడా నా నామాన్నే జపిస్తాయి. అందుకే నీవు ఆ దహన సంస్కారాలు జరిగిన దగ్గరికి వెళ్లి, ఆ ఎముకల దగ్గర చెవి పెట్టి విను... ఏ ఎముకలనుంచయితే, విఠలా... విఠలా... అని వినబడుతుందో ఆ అస్తికలే చోకమేల అస్తికలు. వాటిని తీసుకువచ్చి ఇక్కడ సమాధి చెయ్యు. అలా అతని కోరిక తీరుతుంది" అని చెప్పాడు పాండురంగడు.
సరేనని వెళ్ళిన నామదేవుడు అక్కడికి వెళ్లి చూడగా ఎముకల నుంచి "విఠలా... విఠలా..." అన్న నామజపం వినబడింది. దాంతో ఆ అస్తికలను తీసుకు వచ్చి స్వామి మందిరం ఎదురుగా సమాధి చేసాడు నామదేవుడు.
అంతటి పరమభక్తుడు, విఠలునికి ప్రీతిపాత్రుడు, పాండురంగనికే ఆహారం పెట్టిన చోకమేలుడు. అందుకే స్వామి సన్నిధిలో చోకమేలునికి అంత ప్రాధాన్యత. ఇప్పటికి కూడా ఆ భక్తుని సమాధిని దర్శించి, తరువాతే విఠలుని దర్శించుకుంటారు భక్తులు. ఇక ప్రధాన మందిరంలో స్వామిని చూసి పరవశించని జనులుండరు. అంతటి శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాడు పాండురంగవిఠలుడు...
పాండురంగ విఠలుని శోభ చూడడానికి రెండు కనులు సరిపోవు. ఎంతసేపు చూసినా తనివితీరని శోభ స్వామిది. ప్రదానమందిరంలో గర్భగుడిలో ఎతైన అరుగు మీద రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చుని వున్న స్వామి వారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు కాదు కదా మరో రెండు కళ్ళున్నా చాలవనిపిస్తుంది.
ఇక్కడ మిగిలిన ఆలయాలలా దూరం నుంచి కాకుండా పాండురంగస్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకోవచ్చు. స్వామి వారి పాదాలను స్పర్శించినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదోతెలియని తృప్తి కలుగుతుంది. నల్లటి ఆ విగ్రహం చూడగానే అయ్యో... పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి , నిలబడి ఎంత నల్లగా అయ్యావు స్వామి! అనిపించకమానడు. ఇక్కడ స్వామివారిని క్రిష్ణయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన తులసీదళాలతో అర్చిస్తారు.
ప్రధాన ఆలయానికి సమీపంలోనే, ఉపాలయాల్లో రుక్మణి, సత్యభామ ,రాధాదేవి ,కాలభైరవుడు,దత్తాత్రేయుడు,సూర్యనారాయణుడు ,మహాలక్ష్మీ,వేంకటేశ్వరస్వామి కొలువుతీరు ఉంటారు. ఇక్కడ ఉన్న ఎ మందిరంలో అయినా మనం స్వయంగా దేవతామూర్తుల పాదాలు మన చేత్తో తాకి నమస్కరించుకోవచ్చు.
ఇక పండరీపురంలో తప్పక చూడవలసినవి మరో మందిరం విష్ణుపాదాల గుడి. ఈ గుడికి నీళ్ళల్లోంచి వెళ్ళాలి. పడవలోను, ఆటోలోను కూడా వెళ్ళవచ్చు. ఒడ్డున వేరే ఆలయాలుకూడా వుంటాయి. పడవలో వెళ్తే గనక ఆ మిగిలిన ఆలయాలు చూడటానికి మెట్లు ఎక్కి వెళ్ళాలి. పడవలో కాకుండా ఆటోలో వెళ్తే ముందుగా ఆ ఆలయాలు చూసి మెట్లు దిగి అప్పుడు విష్ణుపాదాలు చేరుకోవచ్చు. ఇక్కడ ఒక మండపంమధ్యలో కృష్ణుడు వేణువునూదే భంగిమలో పాదాలు, మామూలుగావున్న పాదాలు, వేణువు, గోవుల పాదాలు వుంటాయి. ఇక్కడవున్న రెండు రాళ్ళమీద కూర్చుంటే ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది. అక్కడనుంచి కదలబుధ్ధికాదు. అంత ఆహ్లాదంగా ఉంటాయి అక్కడి పరిసరాలు.
ఇక ఈ క్షేత్రంలో స్వామికి ఎంత వైభవం ఉంటుందో ఇక్కడ జరిగే ఉత్సవాలు కూడా అంత సంబరంగానూ ఉంటాయి. ప్రతి ఏకాదశికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా ఆషాఢమాసం, కార్తీక మాసాలలో శుధ్ధ ఏకాదశిలలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏకాదశిలకు ముందు ఒక వారం రోజులనుంచీ పౌర్ణమి వెళ్ళేదాకా భక్తులు చాలా అధిక సంఖ్యలో వుంటారు.
మాఘ, చైత్ర ఏకాదశి రోజుల్లో కూడా కొద్ది సంఖ్యలో భక్తులు విఠోబాను దర్శించుకుంటారు. పండరీపురంలో ప్రధానంగా నాలుగు యాత్రలు జరుగుతాయి. అవి చిత్రి యాత్ర,ఆషాఢ యాత్ర, కార్తిక యాత్ర, మాఘి యాత్ర.
చైత్రి యాత్ర అంటే, చైత్ర మాసంలో చైత్ర శుద్ధ ఏకాదశి నెలలో పదకొండవ రోజు. ఈ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఈ కామద ఏకాదశి రోజున పండరీపురంలో సంవత్సరంలో మొదటి తీర్థయాత్ర జరుగుతుంది. విఠలుని దర్శనం చేసుకోవడానికి చాలా మంది వార్కారీ భక్తులు ఈ సమయంలో పండర్‌పూర్‌లో వస్తారు.ఆ సమయంలో ఒక్క మహారాష్ట్రలోనే కాదు.పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో ఇసకేస్తే రాలనంత జనంతో పండరీపురమంతా భక్తజన సంద్రంగా మారుతుంది.
పండరీపురంలో జరిగే మరో అతి పెద్ద యాత్ర ఆషాడయాత్ర. దీనినే ఆషాధి ఏకాదశి తీర్థయాత అని పిలుస్తారు. ఈ తీర్థయాత్ర భక్తులకు అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. ఈ సమయంలో పండరీపూర్‌లో అత్యధిక సంఖ్యలో వార్కరీలు తరలివస్తారు. ఈ ఏకాదశిని దేవశయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి పాండురంగ విఠలుడు తన నిద్రను ప్రారంభిస్తాడని నమ్ముతారు. ఈ రోజు నుండి చాతుర్మాస పవిత్ర కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వీలైనంత ఎక్కువ సమయం భక్తులు విఠలుడిని ఆరాధిస్తారు.
ఈ రోజే పాండురంగని పరమ భక్తురాలు, సాధ్వీమణి అయిన సతీ సక్కుబాయి పరమపదం చెంది విఠలుని చేరుకుందని చెప్తారు. అందుకే ఈ రోజు సక్కుబాయి ప్రత్యేక తిధులు నిర్వహిస్తారు. ఆరాధనలు చేస్తారు. ఈ సమయంలో ఇరవై నాలుగు గంటల పాటు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తులందరికీ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఉత్సవంలోనే పండరినాథుని పరమ భక్తులైన జ్ఞానేశ్వర్, మరియు తుకారామ్ యొక్క డిండి అంటే వారి పాదాలతో కూడిన పల్లకితో పాటు, వివిధ ప్రాంతాల నుంచి వేలాది ఇతర దిండిలు లక్షలాది మంది భక్తులతో పందారిపురానికి వస్తాయి. పండరీపురం నిజమైన శోభ చూడాలంటె ఇప్పుడే చూడాలంటారు. మహారాష్ట్ర నలుమూలల నుండి డిండిలతో వఖారి గ్రామంలోని శాంతానగర్‌లో కలుస్తారు. ఈ డిండిలన్నీ ఆషాఢ శుద్ధ దశమి రోజున ఒకదానికొకటి కలుస్తాయి, అదే రోజు సాయంత్రం భక్తులందరూ, అలాగే వారికి సంబంధించిన డిండిలు నెమ్మదిగా పంఢర్‌పూర్ వైపు కదులుతాయి. అక్కడికి చేరుకున్న తర్వాత వారు స్థానికుల చేత చంద్రభాగ అని పిలవబడే బీమానదిలో పవిత్ర స్నానం చేసి, ప్రదక్షిణగా పండరీపురం చుట్టూ తిరిగి నడక యాత్ర ముగిస్తారు.
ఆ యాత్రలో పుండలిక వరద, హరివిఠల్, జయ జయ రామకృష్ణ హరి, విఠలా, రంగా, పాండురంగా అన్న నామస్మరణ ధ్వనులు పంఢరపూర్ అంతటా ప్రతిధ్వనిస్తాయి. మారోమోగిపోతాయి. ఏకాదశి మధ్యాహ్నం ప్రత్యేకంగా రూపొందించిన రథంలో శ్రీ రాధారాణి సహిత విఠల్ మరియు రుక్మిణి విగ్రహాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు ప్రదక్షిణ మార్గంలో వెళుతుంది, ఈ వేడుక మొత్తం ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజున ముగుస్తుంది, దీనిని గోపాలకళ అని కూడా అంటారు. పంఢర్‌పూర్‌లో గోపాల్‌పురా అని పిలువబడే ప్రదేశం ఉంది, ఇక్కడ అన్ని డిండిలు మరోసారి సమావేశమై హాజరైన వారందరికీ పంపిణీ చేయబడతాయి.
ఇక ఇక్కడ జరిగే మరో ప్రసిద్ధ యాత్ర కార్తికి యత్ర. ఈ కార్తీక యాత్రను కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున భగవాన్ విఠలుడు నిద్ర నుండి లేస్తాడని నమ్ముతారు. వేడుకలో భాగంగా చంద్రభాగ నది ఒడ్డున అన్ని ప్రదేశాలలో కీర్తనలు భజనలతో సందడి చేస్తారు. అంతకుముందు రోజు అక్కడ కిక్కిరిసిన భక్తులందరూ రాత్రంతా జాగారంచేసి భజనలతో స్వామిని ఆరాధిస్తారు.. పౌర్ణమి రోజున గోపాల్ పూర్‌లో గోపాలకళ తర్వాత తీర్థయాత్ర ముగుస్తుంది.
పండరీపురంలో జరిగే నాలుగవ ప్రసిద్ధ యాత్ర మాఘి యాత్ర. ఈ యాత్ర మాఘ మాసంలోని శుద్ధ ఏకాదశిలో జరుగుతుంది. ఈ ఏకాదశినే జయ ఏకాదశి అంటారు. ఇతర రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా పందరీపురంలో వాతావరణం అంతా భక్తి భావంతో నిండిపోతుంది.
ఇవే కాకుండా ఇక్కడ కృష్ణ జన్మాష్టమి వైకుంఠ ఏకాదశి, ఉగాది, రాదాష్టమి ఇంకా శ్రీక్రిష సంబంధమైన అన్ని పండుగలు అత్యంత భక్తి శ్రద్ధలతో, సంబరంగా జరుపుతారు.
ఇక పండరీపురంలో పండరినాథుని సమక్షంలో స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్వామి భక్తులకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుందని చెప్పుకున్నాం కదా. దానిని రుజువు చేస్తూ స్వామి భక్తులైన పుండరీకుడు, నామదేవుడు,జ్ఞానదేవుడు, సక్కుబాయి, గోమాబాయి లాంటి భక్తులకు చిన్న, చిన్న మందిరాలు కూడా ఉంటాయి.
పండరీపురం క్షేత్రానికి సమీపంలో ఉన్న గోపాలపురంలో జానాబాయి, సక్కుబాయి వాడిన బిందెలు, తిరగలి, కుండలను, పాత్రలు వారి జీవితాన్ని ప్రతిబింబించే వస్తువులను మనం దర్శించుకోవచ్చు. ఆ వస్తువులను దర్శించి వారి భక్తిని, వారి జీవితచరిత్రను తెలుసుకుంటూ, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు పడినా పాండురంగని మీద చెరిగిపోని, చెదిరిపోని వారి అకుంటిత భక్తిని తలచుకున్నపుడు మన కనులు చెమ్మగిల్లక మానవు. ఇలా ఈ క్షేత్రరాజంలో భక్తుల మందిరాలు ఎక్కువగా కనిపించడానికి కారణం కేవలం ఈ పాండురంగడు భక్తజన పక్షపాతి కాబట్టే అని చెప్పక తప్పాడు. ఇలాంటి అద్భుతం, ప్రత్యేకత మరే క్షేత్రంలోను మనకు కనబడదు. అందుకేనేమో ఈ క్షేత్రానికి ఇంత ప్రాధాన్యత వచ్చింది.
ఈ క్షేత్రానికి చుట్టూ మరెన్నో అద్భుత పున్యక్షేత్రాలున్నాయి. తుల్జాపూర్ భవానీ మాత, షిర్డీ సాయి క్షేత్రం, శ్రీరామ చరితతో ముడిపడిన దండకారణ్యం, శక్తిపీఠాలు ఇలా ఎన్నో క్షేత్రాలున్నాయి. అలాగే మరాఠీ చరిత్రను తెలియచేసే కోటలు, బురుజులు ఉన్నాయి. ఈ కపండరీపుర క్షేత్ర దర్శనంతో పాటు అవన్నీ కూడా చూసి రావచ్చు.
ఇక ఇంత అద్భుత క్షేత్రం పండరీపురానికి ఎలా వెళ్ళాలో చూద్దాం... మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లాలోవున్న ఈ క్షేత్రానికి అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు రవాణా సౌకర్యాలున్నాయి. షోలాపూర్‌కు వరకూ రైలులో వెళ్లి అక్కడినుంచి బస్సులో 74 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
ముంబయి నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రైలు మార్గంలో షోలాపూర్ ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి షోలాపూర్ కి రైలు సౌకర్యం ఉంది కాబట్టి షోలాపూర్ వరకు రైలులో వెళ్లి అక్కడినుంచి షోలాపూర్ నుంచి బస్‌లో వెళ్ళడమే మంచిది.
ఇక షిర్డీ వెళ్ళేవారు కూడా తరచుగా పండరీపుర యాత్ర చేస్తారు. ఎందుకంటే అక్కడినుంచి కూడా పండరీపురం సులువుగా వెళ్ళొచ్చు. షిర్డీ నుంచి వెళ్ళడానికి బసులు ప్రయివేట్ వాహనాలు కూడా ఉంటాయి.
పండరీపురంలో ఊరి మధ్యలోనే బస్‌స్టాండ్ ఉంటున్ది. ఊరికి ఒక చివర నది ఒడ్డున ఆలయం ఉంటుంది. బస్‌స్టాండ్ నుంచి ఆలయం సుమారు ఒకటిన్నర కి.మీ. దూరంలో
ఉండే ఆలయానికి వెళ్ళడానికి సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు దొరుకుతాయి. యాత్రికులకు వసతి సౌకర్యం కూడా బాగానే ఉంటుంది. దేవస్థానం సత్రాలతో పాటు,
ప్రైవేట్ సత్రాలు కూడా ఉంటాయి. ఇవి పండరేపురంలో లాడ్జీలు కూడా ఉంటాయి.అయితే ఉత్సవాల సమయంలో మాత్రం ఎక్కడెక్కడి నుంచో వేలు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వసతి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వసతి ముందుగా ఏర్పాటు చేసుకొని వెళ్ళడం మంచిది.
ఇక ఇక్కడికి వెళ్ళడానికి అనువైన సమయం గురించి చెప్పుకోవాలంటే, వేసవిలో ఈ యాత్రకు అస్సలు ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేసవిలో విపరీతమైన వేడి ఉంటుంది. తట్టుకోవడం కష్టం. అలాగే వర్షాకాలంలో వర్షాలు కూడా ఎక్కువే. పైగా నదులు పొంగి వరదల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ఇక్కడికి వెళ్ళడం మంచిది.
ఇలా అన్ని చక్కగా ప్లాన్ చేసుకొని వెళితే మాత్రం మహారాష్టలోని పండరీపురం యాత్ర కలకాలం గుర్తుంచుకోవలాసిన యాత్రగా మిగిలిపోతుంది. మరచిపోలేని మధురమైన జ్ఞాపకాల్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకేనేమో పండరీపుర యాత్రను చెయ్యడానికి భక్తులు అంతగా ఆతర పడతారు.