మహానటి | నవల - 7 | మావూరు.విజయలక్ష్మి | Mahanati 7th part Telugu novel

Vijaya Lakshmi

Published on Oct 11 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల


     “మహానటి” ధారావాహిక – 7


       రచన : మావూరు.విజయలక్ష్మి


విశాలమైన ఆడిటోరియం జనంతో నిండిపోయింది. వేదిక మీద అద్భుతమైన ప్రేమ కథా నాటకం చక్కటి ఎఫెక్ట్స్ తో, చిన్న సైజు సినిమాలా ప్రదర్శించబడుతోంది. నాయకగా అద్భుతమైన నటనను పండిస్తోంది తార. ప్రేక్షకుల్లో ముందు వరుసలో కూర్చుని చూస్తున్న విజయ్ కళ్ళకు ఆమె చూపుతున్న అభినయం కంటే, ఆమె హీరో కౌగిట్లో ఒదిగిపోయిన వైనం పదేపదే కనబడుతోంది. హీరో ఆమెతో అంత సన్నిహితంగా మసులుతుంటే అది నాటకమే... అని, నటనని తెలిసి కూడా సహించలేకపోతోంది విజయ్ మనసు. ఒక్క ఉదుటున వెళ్లి ఆమెను ఇవతలకి లాక్కు రావాలనిపిస్తోంది.

“అబ్బ!పాలకోవాలా ఏం ఊరిస్తోందిరా!”

“దాన్ని తన కౌగిలిలో నలిపేస్తున్న ఆ హీరో ఎంతైనా అదృష్టవంతుడు రా!”

“ఆహా! ఏమి విరహం ఒలకబోస్తోంది రా! ఒరేయ్... నువ్వు ట్రై చెయ్యకూడదూ! లైన్ లో పడుతుందేమో...”

 వెనకనుంచి చిన్నగా వినిపిస్తున్న కామెంట్స్ కి చివ్వున వెనక్కి తిరిగాడు విజయ్. సరిగ్గా అతని  వెనకగా కూర్చున్న ఇద్దరు యువకులు నాటకం చూస్తూ మాట్లాడుకుంటున్నారు. వెలసిపోయిన జీన్స్ ప్యాంట్, చౌకబారు బనియన్లు ధరించి, చూడగానే వాళ్ళలో సంస్కారం ఏమాత్రం లేదని అర్థమయ్యేలా ఉన్నారు వాళ్ళు.

విజయ్ తమ కేసి విసురుగా తిరగగానే మాటలు ఆపేశారు. నో’రు మూస్తావా? లేదా?’ అన్నట్టున్నఅతని చూపుల్ని, విసురుగా వెనక్కి తిరిగిన పద్ధతిని చూసి, ఆ ఇద్దరిలో ఒకడు దూకుడుగా ఏదో అనబోయాడు. అంతలోనే... ఎరుపు రంగుకి తిరిగిన అతని కళ్ళలో ఏం కనిపించిందో గానీ, జంకినట్టై కామ్ గా కూర్చుండి పోయాడు.

విజయ్ కళ్ళు నాటకం చూస్తున్నా... అతడి అంతరంగం మాత్రం కుతకుతలాడ సాగింది. వెనకనున్న వాళ్ళ వ్యాఖ్యానాలే గుర్తుకొస్తున్నాయి. తారను గురించి ఇలా అసభ్యంగా... ఇంకెంత మంది వాగుతున్నారో! ఎంత సరిపెట్టుకుందామన్నా సర్దుకోలేకుండా ఉన్నాడు విజయ్. ఛ! ఈ ప్రోగ్రాం కి రాకుండా ఉన్నా బాగుండేది. అసలు తను రాననే అన్నాడు. ఎప్పుడూ ఇలాగే తన నాటకం చూడ్డానికి ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నానని కోప్పడి బలవంతంగా లాక్కొచ్చింది తార. కుర్చీలో స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు. లేచి బయటకు దారి తీసాడు. బయటికి వచ్చేస్తుండగా వెనకవాళ్ళు తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. అతనికి ఒక్కసారి వెనక్కు తిరిగి చూడాలన్న కోరికను బలవంతంగా ఆపుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు.

************************

మర్నాడు తనను కలుసుకున్న తారతో మునుపటిలా ఫ్రీగా మాట్లాడలేకపోయాడు. ఇద్దరి మధ్య కనిపించని తెర ఏదో అడ్డుపడినట్టు ఫీలయ్యాడు విజయ్.

“నిన్న అలా నాటకం మధ్యలో వచ్చేసారేంటి? నాటకం నచ్చలేదా?” అడిగింది తార.

జవాబు చెప్పలేదు విజయ్. తార మళ్లీ అదే ప్రశ్న వేయడంతో... “తలనొప్పిగా ఉండి వచ్చేసాను” అన్నాడు ముక్తసరిగా.

“విజయ్! నా యాక్షన్ ఎలా ఉంది? నా సహనటులైతే... నా నటనలో బాగా ఇంప్రూవ్మెంట్ కనబడిందని మెచ్చుకున్నారు తెలుసా!” అతడి ముభావాన్ని గమనించకుండా ఉత్సాహంగా చెప్పసాగింది తార.

“నేను అంతగా గమనించలేదు. అయినా నాటకాల గురించి నాకు అంతగా తెలియదు” కొద్దిగా చిరాకు తొంగి చూసింది అతని కంఠంలో.

విసుగ్గా ఉన్న అతని ధోరణికి విస్తుపోయింది తార. “విజయ్! ఏమైంది? అలా ఉన్నారేం? తలనొప్పి ఇంకా తగ్గలేదా?” ఆత్రంగా అడిగింది.

“ఏం లేదులే తార! నాకు కొద్దిగా అర్జెంటు పని ఉంది. మళ్ళీ కలుద్దాం. వస్తాను...” అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు విజయ్.

తుంచినట్టుగా సమాధానాలు చెప్పి, ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్న అతని ధోరణి అర్థంకాక చిన్నబోయిన వదనంతో ఒంటరిగా మిగిలిపోయింది తార.

*****************

సాయంత్రం ఐదవుతోంది. సూర్యుని ప్రభావం అప్పుడప్పుడే తగ్గుముఖం పడుతోంది. కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని, బయటకు చూస్తూ ఆలోచిస్తోంది తార. ఆమె చేతిలో ఆ వారం ప్రముఖ వారపత్రిక ఉంది. అందులో, అతి తక్కువ కాలంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంచలన రంగస్థలనటిగా తనను వర్ణిస్తూ వేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంది.

ప్రస్తుతం తార ఆలోచనలకు కారణం అదే. రెండు వారాల క్రితం ఒక అమ్మాయి వచ్చి ఫలానా పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్నట్టు పరిచయం చేసుకుని, తన గురించి వాళ్ళ పత్రికలో రాయాలనుకుంటున్నట్టు చెప్పి, వివరాలు అడిగింది. మాటల మధ్యలో ఆ అమ్మాయిని అడిగింది తార, “ఇది చాలా శ్రమతో... ముఖ్యంగా రిస్కుతో కూడుకున్న జాబ్ కదా! ఎందుకు ఎంచుకున్నారు?” అని. దానికా అమ్మాయి, ‘జర్నలిస్టు వృత్తిలో ఉండే సృజనాత్మకత, సంఘంలో వారికి లభించే గౌరవ మర్యాదలు తనను ఈ వృత్తిలో ప్రవేశించేలా చేశాయని, తను జర్నలిస్టునన్న విషయం సగర్వంగా చెప్పుకుంటానని’ అంది.

చెళ్ళున కొట్టినట్టు అయింది తారకు ఆ సమాధానంతో. ఆ పిల్లలా, తను కూడా తన వృత్తి గురించి అంత గర్వంగా చెప్పుకోగలదా!? ఆ రంగం పట్ల తనకున్న ఇష్టం కారణంగానైతేనేమి, కొత్తమోజు వల్ల అయితేనేమి... మొదట్లో అంతగా గమనించలేదుగాని... ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది రంగస్థల నటిమణుల పట్ల సంఘంలో ఉన్న అభిప్రాయం ఏంటన్నది. తను ఒక రంగస్థలం నటి అనగానే ఎదుటి వాళ్ళ చూపుల్లోనూ, మాటల్లోనూ కనబడే అదోలాంటి తేలిక భావం తన మనసును చివుక్కుమనేటట్టు చేస్తుంది. సాటి నటులు కూడా తమ పట్ల ప్రవర్తించే తీరు అసహ్యాన్ని, జుగుప్సాన్ని కలిగిస్తోంది. ఒక్కోసారి... సన్నిహితంగా నటించేటప్పుడు... వెకిలిగా ప్రవర్తించడం, వెకిలిమాటలు, జోక్స్ తో చిరాకు తెప్పించడం చేస్తుంటారు. అయితే మర్యాదగా, హుందాగా ప్రవర్తించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ.

ఇదంతా భరించలేక, ఈ వృత్తి వదిలెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది. కానీ... ఎలా? వీటిలో పడి చదువును చెట్టెక్కించింది. పీజీలు చేసిన వరకే ఉద్యోగాలు దొరకడం లేదు ఇక డిగ్రీ ఫెయిల్ అయిన తనకేం ఉద్యోగం దొరుకుతుంది. నటన తప్ప మరో పని చేతకాదు తనకు. ఏ సంపాదన లేకుండా ఎలా బ్రతకడం. అదికాక కష్టమో! నష్టమో! ఈ నట జీవితానికి అలవాటు పడిన తర్వాత, మామూలు జీవితం గడపలేని అనిపిస్తుంది.

మరోసారి పుస్తకంలోకి చూసింది తార. ‘నటన అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. పూర్వజన్మ పుణ్యఫలితంగా లభించే దైవదత్తమైన వరం. అలాంటి వరాన్ని సొంతం చేసుకున్న తార అభినందనీయురాలు’ అని రాశారు. అది చదివిన తారకు నవ్వొచ్చింది. కొంతకాలం క్రితం వరకు తను కూడా అలాగే అనుకుంది. తను ఒక నటి అయినందుకు పొంగిపోయింది. మరి... ఇప్పుడు... కృంగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఒక నటిగా తను కష్టపడడం మాత్రమే కాదు, తనకు ఆప్తులైన వారికి కూడా అంతో ఇంతో కష్టం కలిగించక తప్పదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తన కారణంగా తల్లి పడుతున్న వేదన అమితంగా బాధపెడుతోంది తారను. కూతురికి సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసి పంపాలని ఆవిడ ఆరాటం. ఆవిడ ఎంత ఆత్రుత పడుతుందో అంత వెనక్కి వెళ్తోంది ఆ వివాహం. వచ్చిన ప్రతివారు... నాటకాల పిల్లా! అని పెదవి విరిచే వారే. అక్కడికేదో నటి కావడం మహాపరాధం అయినట్టు. ఆఖరికి సొంత వదిన... ఒకప్పుడు నీ కూతురిని నా కోడలు చేయమంటూ వెంటపడిన మనిషి కూడా తేలిగ్గా మాట్లాడి అవమానించడంతో, బాగా కృంగిపోయింది తల్లి. దాంతో పూర్తిగా మంచం పట్టేసింది. తల్లి పడుతున్న ఆవేదన చూసి, విజయ్ గురించి చెప్పి ఆవిడ బెంగను పోగొట్టాలని అనుకునేది ఎన్నోసార్లు. కానీ ఈ విషయాన్ని ఆవిడ ఎలా తీసుకుంటుందో... అన్న భయంతో ఆగిపోయేది. దీనికి తోడు, ‘ఈ మధ్య విజయ్ సంగతి అంతుపట్టడం లేదు. ముభావంగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. అసలతని మనసులో ఏముందో?’ ఈ సంశయాలతో, భయాలతో తల్లి ముందు బయటపడలేకపోతోంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లు అయింది. విసుగ్గా అనిపిస్తోంది. ఈ చికాకులకు తోడు తల్లి పూర్తిగా మంచం దిగకపోవడంతో, ఇంటి బాధ్యతలు కూడా తోడై మనసుకి శరీరానికి కూడా విశ్రాంతి లేకుండా పోయింది తారకు.

“ఏంటి తారా! అంత దీర్ఘాలోచన?” హఠాత్తుగా వినిపించిన పలకరింపుకు ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా సహనటి సుబ్బలక్ష్మి కనిపించింది.

“మీరా! రండి... కూర్చోండి. ఇప్పుడు చెప్పండి... ఏంటి సంగతులు?” మంచినీళ్లు అందిస్తూ అడిగింది తార.

“ఏమున్నాయి. మామూలే... కొద్దిగా పని ఉండి ఇటు వెళుతూ, నిన్ను కలిసి చాలా రోజులైంది కదా అని ఇలా వచ్చాను. మీ అమ్మగారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?” పిచ్చపాటి మాట్లాడుతూ మధ్యలో అడిగింది సుబ్బలక్ష్మి, “తారా! ఈమధ్య వెంకటేశ్వర్లు డైరెక్షన్లో నటించేందుకు నువ్వు తిరస్కరించావని విన్నాను. నిజమేనా?”

“అరే! ఇది జరిగి రెండు రోజులు అయింది.అప్పుడే మీ వరకు వచ్చిందా విషయం?” సంప్రమాశ్చర్యాలతో అడిగింది తార.

“ఆ మాత్రం వ్యవధి చాలు... ఈ ఫీల్డ్ లో చిలవలు, పలవలతో ప్రచారం కావడానికి. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు నటించను అన్నావు?” రెట్టించిందామె.

“ప్రత్యేకమైన కారణమేం లేదు” ముక్తసరిగా ఉంది జవాబు.

కాసేపు మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్య. తిరిగి సుబ్బలక్ష్మే అంది, “తారా... నీ భయం నాకు తెలుసు. చెప్పడం ఇష్టం లేకపోతే నేను బలవంతం చెయ్యను. కానీ నీకంటే పదేళ్లు ముందుగా ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన దాన్ని. ఎన్నో అవమానాలు... ఆటుపోట్లు ఎదుర్కొన్న దాన్ని. నా గురించి నీకు తెలియదు తారా. ఒక మగాడి మోసానికి బలై పెళ్లి కాకుండానే బిడ్డ తల్లినయి, ఏ విధమైన అండ లేక బ్రతుకుతెరువు కోసం నటినైన నేను ఎదుర్కొన్న అవమానాలకు, అవహేళనలకు లెక్కేలేదు. ప్రతి అడ్డమైన వెధవా నా ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకోవాలనుకున్న వాడే. నేనెంచుకున్న వృత్తి కూడా అందుకు దోహదపడింది. నేను ఈ రంగంలో ప్రవేశించిన కొత్తలో, ఈ పరిస్థితులకు ఇమడలేక, మనసులో బాధ చెప్పుకునే తోడు లేక, నలిగిపోయే దాన్ని. విపరీతమైన మానసిక సంఘర్షణతో ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి పారిపోవాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ... అన్నెంపున్నెం  ఎరుగని నా బిడ్డను ఈ పాడు లోకంలో ఒంటరిగా వదిలిపోలేక హృదయాన్ని మెలిపెట్టే అవమానాలను గరళంలా  గొంతులోనే దాచుకొని, నిర్లిప్తంగా బ్రతుకుతున్నాను. ఆ అనుభవంతోనే... అలాంటి పరిస్థితి నీకు రాకూడదన్న ఉద్దేశంతోనే అడిగాను తప్ప, నిన్ను మరింత యాగి చేయాలని కాదు” గాద్గదికంగా అంది సుబ్బలక్ష్మి.

ఆమె మాటల్లో ధ్వనించిన ఒంటరితనం ఆవేదన, ఆర్తి గమనించిన తారకు హృదయం కలచి వేసినట్టు అయింది. ఏదో చెప్పాలని నోరు తెరిచింది. కానీ గొంతు పట్టుకున్నట్టయి  మాటలు పెగిలి  రాలేదు.

సుబ్బలక్ష్మికి ఆమె పరిస్థితి అర్థం అయింది. అందుకే ఇంకేం మాట్లాడలేదు. ఆమె మనసులో చెలరేగుతున్న కల్లోలం తెలిసినట్టు మౌనంగా ఉండిపోయింది.

************************************


సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో ...


ఇవి కూడా చదవండి



Recent Posts