Vijaya Lakshmi
Published on Jun 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?"మహాబలిపురం … మామల్లపురం" కేవలం ప్రాచీన పట్టణం కాదు కళ్లకు కనిపించేలా చెక్కిన మహాకావ్యం. పల్లవుల కాలంలో నిర్మించబడిన ఈ పట్టణం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచిపోయింది.
మహాబలిపురంలో ఎలియన్స్ తిరిగారా?
మహాబలిపురంగా ప్రసిద్ధి చెందిన మామల్లపురంలో ఉన్న అంతుచిక్కని రహస్యం కృష్ణుని వెన్నబంతిని ఎలియన్సే ఏర్పాటు చేసారా?
ఈనాడు ఎన్నో అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి. రాకెట్ లాంచింగ్ ల గురించి వింటున్నాం.
అయితే శతాబ్దాల క్రితం పల్లవుల రాజ్యంలో ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా?
మహాబలిపురంలో ఉన్న కొన్ని శిల్పాలు ఆ అంతరిక్ష పరిశోధనలకు గుర్తులేనా…?
పాండవుల రథాలు మహాబలిపురంలో ఎందుకున్నాయి?
మహాబలిపురాన్ని మామల్లాపురం అని ఎందుకంటారు? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు...
మహాబలిపురంలో శిల్పాలు, గుహాలయాలు, రథాలు, ఆలయాలు ఏది చూసినా భావోద్వేగం కలిగించే అంశమే. ఇక్కడ నడయాడుతుంటే అడుగడుక్కీ ఒక పురాణ గాధ వినబడుతుంది. ఒక రాజ వంశ చరిత్ర కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఒక కళాకారుడి ఆత్మ కనులముందు ఆవిష్కరిస్తుంది.
మహాబలిపురం – పల్లవుల కళా సామ్రాజ్యానికి ప్రతీక. ఒక సమయంలో పల్లవులకు రెండవ రాజధానిగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం సాధారణ శకం 7 నుంచి 10వ శతాబ్దం వరకు పల్లవరాజుల కాలంలో ప్రముఖ ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. 1200 సంవత్సరాల చరిత్ర కలిగి, పూర్వం మామల్లపురం పేరుతో ప్రస్తుతం మహాబలిపురం పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
తమిళనాడులోని కంచి సమీపంలో రాష్ట్ర రాజధానైన చెన్నై నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో, కంచి పట్టణం నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం బంగాళాఖాతానికి అభిముఖంగా కోరమాండల్ తీరంలో ఉంది.
ఈ పట్టణం అప్పటి పల్లవ ప్రభువైన మామల్ల పేరు మీద కట్టించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆ కాలంలో ఒకటవ నరసింహవర్మ గొప్ప మల్ల వస్తాదు. మల్ల వస్తాదులను మామల్ల అని వ్కాయవహరిస్టారు. కాబట్టి అతనిని మామల్లన్ అన్న బిరుదుతో వ్యవహరించేవారట. అతడి గౌరవార్ధం ఈ ప్రాంతానికి మామల్లపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. పూర్వం రాక్షస రాజైన బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వలన మహాబలిపురం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు.
మహాబలిపురం కేవలం ప్రాచీన పట్టణమే కాదు. ఇది ఒక కళా, జ్ఞాన బీజం, ఒక చరిత్ర పరంపర. రాళ్లపై రాసిన మంత్రముగ్ధ కథలు, తపస్సుతో చెక్కిన ఆలయాలు, సముద్రం పక్కనే సాక్షాత్తు దేవతలు దిగివచ్చినట్టు కనిపించే శిల్ప వైభవం వెరసి మహాబలిపురం.
మహాబలిపురం లేదా మామల్లపురం పల్లవుల శిల్ప కళకు, భక్తి భావానికి, అధికార ప్రతాపానికి, చిహ్నంగా రాతి శిల్పాలు, గుహలు, రథాల రూపంలో నిర్మించబడిన నగరం.
మహాబలిపురంలో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకోవలసి వస్తే, తీర దేవాలయం, పంచరథాలు, అర్జునుని తపస్సు, గుహలు, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుని వెన్న బంతి. దీనినే బేలెన్సింగ్ రాక్ అని కూడా అంటారు… ఇలా చాలానే ఉన్నాయి.
సముద్ర తీరాన పల్లవుల కళావైభవానికి ప్రతీక అయిన షోర్ టెంపుల్ రెండవ నరసింహవర్మ నిర్మించారు. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
ప్రాచీన కాలంలో మహాబలిపురం చుట్టూ ఏడు ఆలయాలు ఉండేవి. అవే సెవెన్ పగోడాస్. ప్రస్తుతం మాత్రం ఆ వైభవానికి నిదర్శనంగా ఒక్క షోర్ టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది. మిగిలినవన్నీ సముద్రగర్భంలో కలిసిపోయాయని చెప్తారు.
2004 సునామీ తర్వాత సముద్రం కొంత వెనక్కి వెళ్లినప్పుడు, కొన్నిచోట్ల పాత గోడలు, శిల్పాలు కనిపించడం మొదలైంది. ఇది మునిగిపోయిన నగరపు గాధకు నిదర్శనంగా చెప్తారు.
ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవులు కొలువుతీరి ఉంటారు.. ఆలయం చుట్టూ అనేకమైన నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా తీర్చిదిద్దారు. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్యసాహసాలను చాటి చెప్పేదిగా ఉంటుంది.
ఇక మహాబలిపురం అనగానే అందరికీ మదిలో మెదిలేది పాండవుల రథాలు. నిజానికివి రథాలు కావు రథాలుగా చెప్పబడే రాతి దేవాలయాలు. అద్భుతమైన శిల్పకళకు ప్రతిరూపాలు. ఐదు రథాలకు పురాణ పురుషులైన పాండవులు యుధిష్ట, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు. వారి భార్య ద్రౌపది పేర్లు పెట్టారు. ఈ ఆలయాలకు పాండవుల పేర్లు ఉన్నప్పటికీ, మహాభారతంతో పాండవులతో వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి.
పాండవ రథాలన్నిటిలో ధర్మరాజ రథం ప్రముఖంగా చెప్పుకోవాలి. ధర్మరాజ రథంలో పల్లవ లిపిలో నరసింహవర్మన్ యొక్క బిరుదుల నగిషీలు ఉన్నాయి. పల్లవులు దీన్ని శివాలయంగా రూపొందించారని ఒక శాసనంలో పేర్కొనబడింది. అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న శివుని శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
భీముని రథం 12.8 మీటర్ల పొడవు, 7.3 మీటర్ల వెడల్పు, 7.6 మీటర్ల ఎత్తుతో గోపుర శైలిలో నిర్మించబడి ఉంటుంది. శయన మూర్తి రూపంలో ఉన్న విష్ణువు ఇక్కడ కొలువుతీరి ఉంటాడు. అనంతశాయి విష్ణువుకు అంకితం ఇవ్వబడింది. సింహాల బొమ్మలతో అలంకరించబడ్డ ఈ రథం ఆలయం ఇప్పటికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
అర్జునుడి రథం శివునికి అంకితం చేయబడినది. ఒక చిన్న చెక్క గుడి ఆకారంలో, ప్రత్యేక శైలితో ఉంటుంది అర్జున రథం .
ఇది ఏనుగులను పోలి ఉంటుంది. ఈ ఆలయ పైకప్పు కూడా ఏనుగు వీపు ఆకారంలో ఉంటుంది. అర్థనారీశ్వరుని శిల్పం, కూర్చున్న సింహాలతో అలంకరించబదిన స్తంభాలతో ఉంటుంది ఈ రథం.
ఐదు రథాలలో ద్రౌపది రథం చిన్నది. ఈ రథం గడ్డి కప్పిన గుడిసె ఆకారంలో ఉంటుంది. ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయం. అద్భుతమైన కళాకృతితో ఉంటుంది. కమల పీఠంపై కూర్చున్న దుర్గాదేవి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది.. ఆలయానికి బయటి ప్రధాన ద్వారంపై మహిషాసురుడి తలపై దుర్గాదేవి నిలబడి ఉన్న శిల్పం మరో ఆకర్షణ.
నిజానికి ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకోని అసంపూర్తి నిర్మాణాలు. కాని నేటికీ ఇవి **ఒక కళా విజ్ఞానంగా పరిగణించబడుతున్నాయి.** ఒకే రాతి శిలను ఇలా చెక్కడం అనేది ప్రపంచంలోనే అరుదైన విషయంగా పరిగణిస్తారు. అందుకే అంత ప్రసిద్ధి చెందాయి. ఈ పాండవుల రథాలు. ఈ రథాలను చూడడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. .
ఇక మహాబలిపురంలో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి శ్రీకృష్ణుని వెన్న బంతి. దీనినే బేలేన్సింగ్ రాక్, కృష్ణుని వెన్న ముద్ద, బట్టర్ బాల్ లాంటి పేర్లతో పిలుస్తుంటారు.
ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుండి పడిపోకుండా అలానే ఉంది. ఇది చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది. దాదాపు 200 టన్నులు వున్న ఈ రాయి దొర్లిపోకుండా చెక్కుచెదరకుండా వుండటమే ఇప్పటికీ మిస్టరీగా మారింది. దాదాపు 20అడుగుల పొడవు, వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో ఉంటుంది. 1200 సంవత్సరాలకు పైగా భయంకరమైన సునామీలు, భూకంపాలు, తుఫానులు వచ్చినా కూడా కదలకుండా స్తిరంగా ఎక్కడున్నది అక్కడే ఉంది. ఈ బంతిని దాని స్థానం నుంచి కదిలించడానికి ప్రయత్నించారు. కానీ అది ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇలా ఏటవాలుగా ఉన్న ఈ శిల వచ్చే పర్యాటకులకు ప్రమాదకరం అని, ఈ రాయిని తొలిగించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఎవరూ ఇంచు కూడా కదిలించలేకపోయారు.
1908 వ సంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్ధర్ ఆలీ అనే బ్రిటీష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం అని తొలగించాలని ప్రయత్నించారు. దీని కోసం 7 ఏనుగులను తెప్పించి ఎత్తు నుంచి పల్లంలోకి పెద్దపెద్ద క్రేన్ల సహాయంతో ఆ రాయిని దోర్లించడానికి చాలా ప్రయత్నాలే చేసారు. ఇంత చేసినా వారు ఆ రాయిని కొంచెం కూడా కదిలించలేక నిరాశతో వెళ్ళిపోయారని చరిత్ర చెబుతుంది.
ఆనాటి పల్లవుల రాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయి అని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని కూడా చెబుతారు. ఇది గుడి కోసం తెచ్చిన రాయి దాన్ని మధ్యలోనే వదిలేసారని మరికొందరి వాదన.
ఆ రాయి గ్రహాంతర వాసుల ఎగిరే పళ్ళాలని ఒక వాదన కూడా ఉంది. దాదాపు 250టన్నులు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో మానవమాత్రులకు సాధ్యమయ్యేపని కాదని, ఈ రాయి ఖచ్చితంగా ఎలియన్స్ కు సంబంధించిందని చెబుతుంటారు. దానికి వాళ్ళు చెప్పే వివరణ ఎలా ఉంటుందంటే, ఇలాంటి అంటే ఈ మహాబలిపురంలో ఉన్న ఈ కృష్ణుని వెన్నబంతి రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల వున్నాయి. అవి మెక్సికన్ నగరం, పెరూ వంటి నగరాలు. అక్కడ ఎలియన్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారని, దానికి ఎన్నో ఆధారాలున్నాయని చెబుతారు. సో అక్కడ ఉన్నటువంటి రాళ్ళ లాంటిదే ఈ బేలన్సింగ్ రాక్ కూడా. కాబట్టి ఈ రాయి ఖచ్చితంగా ఎలియన్స్ కి సంబంధించినదే. ఇక్కడ ఎలియన్స్ తిరిగారని కూడా కొన్ని కథనాలున్నాయి.
ఇక ప్రముఖంగా చెప్పుకోవలసిన మరో విషయం. ఆ కాలంలోనే ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు జరిగాయా అన్న ప్రశ్న. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్షపరిశోధనలకు శ్రీకారం చుట్టారనటానికి ఇక్కడ వున్న శిలాశిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని చెప్తారు.
ఆ ఆలయంలోని వినాయకుడు విగ్రహం పైన రాకెట్ లాంచ్ వెహికల్ కనిపిస్తుంది. దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇవన్ని శిల్పాలు రాకెట్ లాంచి చేస్తున్నట్టే కనిపిస్తాయి. అప్పట్లోనే అద్భుతమైన టెక్నాలజీ వాడేవారు అనటానికి ఇక్కడున్న బావి ఒక గొప్ప ఉదాహరణగా చెప్తారు. ఆలయ గోపురంపై శూలం, ఒక దేవతా రూపం ఉంటుది. ఆ స్వరూపం తల మీద రెండు కొమ్ములు, అలాగే హెల్మెట్ ధరించినట్లు చిహ్నాలు కనపడతాయి.
ఆ శూలం అచ్చం శాటిలైట్ స్థంభం లాగానూ, ఆ విగ్రహం రోదసిలోకి వెళుతున్న వ్యోమగాముల లాగా కనబడుతుంది. ఇదే కాదు విమానగోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ఆ గుడి ద్వారాలను కట్టారని అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ ని తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇక్కడి ప్రతి గుహ ఒక సంభాషణ, ప్రతి రథం ఒక కథ, ప్రతి శిల్పం ఒక చరిత్ర పుస్తకపు పుట. ఇక్కడ ఉన్న గుహాలయాలు ప్రతి పర్యాటకున్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే ఆ శాస్త్రవిజ్ఞానానికి ఆశ్చర్య పడకుండా ఉండలేరు. ఒకే రాతిలో చెక్కిన ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఇలాంటి అబ్బురపరిచే శిల్పాలు ఎన్నో కనబడతాయిక్కడ. మహాబలిపురంలోని శిల్పాలు ఆనాటి పనితనానికి ధ్రువపత్రాలుగా ఉన్నాయి. ఇక్కడున్న కృష్ణ మండపం, మహాబలిపురం లో ఉన్న పురాతన కట్టడాలతో ఒకటి. మండపంలో వివిధ శ్రీ కృష్ణ లీలలు చూడముచ్చటగా చిత్రీకరించారు.
మహాబలిపురంలో మరో చూడవలసిన ప్రదేశం టైగర్ కేవ్ పర్యాటకుల ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇదొక హిందూ టెంపుల్. ఒకే కొండరాయిని తొలిచి నిర్మించిన ఆలయం. ప్రవేశ ద్వారం లో రాతిమీద చెక్కిన పులుల తలలు ఉండటంవల్ల దీనికి ఆపేరు పెట్టారు. దీనిని పల్లవ రాజులు 8 వ శతాబ్దం లో నిర్మించినట్లు చెపుతారు. మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ గుహల పరిసరాలను భారత పురావస్తు శాఖ నిర్వహిస్తోంది.
మహాబలిపురంలో తప్పక చూడాల్సిన మరో ఆకర్షణ బీచ్. వరాహ గుహాలు, మండపాలు. మొసళ్ళ బేంక్, మామల్లాపురం లైట్ హౌస్ ఇలా ఎన్నో చూడవలసిన విశేషాలు ఉన్నాయి.
మహాబలిపురం చరిత్ర ఓ రాజ వంశ కథ మాత్రమే కాదు – అది కళను శాశ్వతంగా నిలిపే తపస్సు.
ఇక్కడ రాళ్లు శ్వాసిస్తాయి, శిల్పాలు మాట్లాడతాయి.
ప్రతి పటంలో ఓ పురాణం, ప్రతి గుహలో ఓ గాథ కనబడుతుంది.
పూర్తిగా ఇక్కడున్న విశేషాలన్నీ చూడాలంటే మాత్రం రెండు మూడు రోజులు స్టే చెయ్యవలసి ఉంటుంది.
ఇక్కడ భోజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. ఫారినర్స్ కూడా ఎక్కువమంది కనిపిస్తారిక్కడ.
చెన్నై చేరుకొని అక్కడనుంచి కేబ్ ల ద్వారా దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం చేరుకోవచ్చు.
చెంగల్పట్టు జంక్షన్ మహాబలిపురంకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. అక్కడివరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి కేబ్ లలో దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం చేరుకోవచ్చు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఉంటాయి. వాటిలో మహాబలిపురం చేరుకోవచ్చు.