Vijaya Lakshmi
Published on Oct 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఉదయం లేస్తూనే... ఈరోజు ఎలాగైనా విజయ్ ని కలవాలని గట్టిగా నిర్ణయించుకుంది తార. ఎన్నిసార్లు కలుసుకోవాలని ప్రయత్నించినా ఏదో ఒక పని ఉందని తప్పించుకు తిరుగుతున్నాడు. ఫోన్ చేస్తే, ఉండి కూడా లేడు అనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో... అసలు అతని మనసులో ఏముందో తెలుసుకోవాలని మరోసారి దృఢంగా అనుకుంది.
పనులన్నీ ముగించుకుని సాయంత్రం నాలుగు అవుతుండగా అతడు పని చేస్తున్న కాలేజీకి చేరుకుంది. గేటు బయటే ఎదురయ్యాడు విజయ్. తనని చూడగానే ఒక్కసారిగా అతని మొహం కాంతివంతమై అంతలోనే ముడుచుకు పోయింది. దగ్గర్లోనే ఉన్న రెస్టారెంట్ వైపు దారి తీసారు ఇద్దరు. కాస్త ఖాళీగా ఉన్న చోటు చూసుకుని కూర్చున్నారు.
టీ కి ఆర్డర్ ఇచ్చి దానికోసం ఎదురు చూడ్డమే తన ధ్యేయం అన్నట్టు కూర్చున్నాడు విజయ్. అతని ప్రవర్తనకు చాలా అసహనంగా ఉంది తారకు. ఎంతసేపు ఇలా మౌనవ్రతం పాటిస్తావో నేను చూస్తాను అన్నట్టు కూర్చుందామె కూడా. టీ వచ్చింది. కప్పు చేతిలోకి తీసుకుంటూ, ఇక తప్పదన్నట్టు అడిగాడు విజయ్.
“ఏంటి ఇలా వచ్చావు?”
ముఖ పరిచయస్తురాలిని పరామర్శిస్తున్నట్టున్న ఆ ప్రశ్నకు అవమానంతో ముఖం ఎర్రబడిందామెకు. అతడి ప్రవర్తనకు, ఆ ప్రశ్నకు... చేతిలో ఉన్న టీ కప్పు విసిరి కొట్టి, అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఎంతగానో అనిపించింది. అతి కష్టం మీద అవమానాన్ని దిగమింగి, “విజయ్! మీరీమధ్య బాగా బిజీ అయినట్టున్నారు కదా!” అంది.
ఆ ప్రశ్నలోని వ్యంగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, “అవును తారా! కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాల్సి వస్తోంది. దానికి తోడు నా రీసెర్చ్ వరకు ఉండనే ఉంది కదా!” అన్నాడు.
“నా పెళ్లి గురించి మా అమ్మ చాలా తొందర పడుతోంది విజయ్...” అతని మొహంలోని ఫీలింగ్స్ గమనిస్తూ అంది.
“సహజమే కదా ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉండే ఆరాటమే అది” అన్నాడు విజయ్.
తారలో తెచ్చి పెట్టుకున్న సహనం నశించిపోతోంది. ‘ఎంత ఆచితూచి మాట్లాడుతున్నాడు! ఇంకెవరి సమస్యనో చర్చిస్తున్నట్టు ఎంత నిర్లిప్తత ఆ మాటల్లో!’
“అందుకే విజయ్, మీతో మాట్లాడిన తర్వాత మన విషయం మా అమ్మతో చెబుదామని... అర్ధోక్తిలో ఆపేసింది.
కొన్ని క్షణాలు ఏం చెప్పాలో తోచినట్టు మౌనంగా ఉండిపోయాడు విజయ్. తర్వాత నెమ్మదిగా అన్నాడతను... “సారీ తారా! నేను ఇంత తొందరలో వివాహం చేసుకోదల్చుకోలేదు.”
“మీకు తొందర లేకపోవచ్చు విజయ్. కానీ మా అమ్మ గురించి ఒక్కసారి ఆలోచించండి. నా పెళ్లి చూసైనా ఆవిడ కాస్త తేరుకుంటుందని నా ఆశ.”
“అది కాదు తారా! నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.”
“ఇందులో చెప్పడానికి... తెలియకపోవడానికి... ఏముంది గనుక?” విసుగ్గా అంది తార.
“నువ్వు రంగస్థలనటి అని తెలిస్తే, మావాళ్ళు ఈ వివాహానికి అంగీకరించకపోవచ్చు” కూల్ గా చెప్పాడతను.
మంచుముద్ద ముఖం మీద విసిరి కొట్టినట్టు నిర్ఘాంతపోయిందా మాటలకు. నోట మాటరానట్టు ఉండిపోయింది. చివరికి ఎలాగో తేరుకొని, ఎర్రబడ్డ కళ్ళతో పెదవులు అదురుతుండగా అడిగింది... “మీవాళ్ళ సంగతి సరే! మీ అభిప్రాయం ఏంటి? అన్నది చెప్పండి”
అతనేం మాట్లాడలేదు.
“మౌనం సమాధానం కాదు విజయ్. నేను అడిగినదానికి జవాబు చెప్పండి” ఉక్రోషంగా అంది.
“ఊరికే అలా చెప్పండి... చెప్పండి... అంటూ ఆవేశపడకు. అవును! నా భార్య పరాయి మగాళ్లతో కలిసి స్టేజ్ ఎక్కి, నటించడం నాకు కూడా ఇష్టం లేదు”
“అంటే...! నేను నటినన్న విషయం ఇప్పుడే తెలిసిందా? మనం ప్రేమలో పడకముందే మీకు ఆ విషయం తెలుసు. మరి ప్రేమకు లేని అభ్యంతరం పెళ్లికి ఎందుకో...” వెటకారంగా అంది.
“ప్లీజ్ తారా! వాదనలొద్దు. నా అభిప్రాయం అడిగావు... చెప్పానంతే! సరే...! నాకు కొంచెం అర్జెంటు పని ఉంది వస్తాను.” నిర్మూహమాటంగా చెప్పి కుర్చీలో నుంచి లేచాడు.
“హు...! పేరుకి పెద్ద లెక్చరర్! నలుగురిని సంస్కరించవలసిన మీ సంస్కారం ఇంత గొప్పదన్న విషయం ఇప్పుడే తెలుస్తోంది. పోనీలెండి... ఇప్పటికైనా మీ బుద్ధి బయట పెట్టుకున్నారు. చాలా సంతోషం. అవును మరి! జాతి లక్షణం ఎక్కడికి పోతుంది” అంటూ విసురుగా బయటకు దారితీసింది తార.
విజయ్ ముందు బయట పడకూడదని బింకంగా మాట్లాడి వచ్చేసింది గాని, ఇంటికి వచ్చాక ఇక దుఃఖం ఆపుకోలేక మంచం పై వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. “ఎందుకు! ఎందుకు? ఇలా ప్రతివారు తన జీవితంతో ఆటాడుకుంటున్నారు. భగవంతుడా! తనేం పాపం చేసింది. అందరూ తననెందుకు ఇంత హీనంగా చూస్తున్నారు!? తను నటి అయినంత మాత్రాన తనను వేధించే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు!? అందరూ తనను వేలెత్తి చూపేవారే. తనేదో ఘోరమైన నేరం చేసినట్టు.
‘మొన్నటికిమొన్న ఆ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఎంత అసహ్యంగా మాట్లాడాడు! ఛ! తలచుకుంటేనే ఒంటిమీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నంత కంపరంగా ఉంది. ఎప్పుడు వెకిలిమాటలతో, జుగుప్సాకారంగా ప్రవర్తిస్తుంటే అది అతని నైజం లే అని సరిపెట్టుకుంది. చివరికి అది అలుసుగా, తన చేతకానితనంగా తీసుకుని ఎంతకు తెగించాడంటే...! ఛీ... ఛీ... మొరటుగా నిన్ను నేను ఉంచుకుంటాను అనలేదు గాని... అంతే అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. పైగా ఇందులో తప్పేంలేదని, ఇష్టం వచ్చినన్నాళ్లు కలిసి ఉంటాం లేనప్పుడు విడిపోతాం... అంటూ వేధించసాగాడు. నిజానికి తనేనాడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. ఎవరికీ చనువు ఇవ్వలేదు. తన పనేదో తను చూసుకుంటుంది. అలాంటిది... ఆ వెధవ... అంత ధైర్యంగా ఎలా ప్రపోజ్ చేయగలిగాడో అర్థం కాలేదామెకు. ఎవరెన్ని విధాల అవమానించినా, హేళన చేసినా భరించింది. కానీ ఈ వేళ... విజయ్... అతను కూడా తిరస్కారంగా ప్రవర్తించేసరికి తట్టుకోలేకపోతోంది. ఎందుకిలా జరుగుతుంది!? తను తప్పు చేసిందా? ఈ నట జీవితాన్ని... అదీ రంగస్థలనటిగా మారి తన పొరపాటు చేసిందా?’
గడియారం ఎనిమిది గంటలయిందని సూచిస్తూ మోగడంతో, తల్లికి భోజనం పెట్టాలన్న సంగతి గుర్తొచ్చి, తన దుఃఖాన్ని దిగమింగి మంచంమీద నుండి లేచింది.
ఆలస్యంగా భోజనం చేస్తే అరగదని రాత్రిపూట భోజనం పెందలాడే చేసేస్తోంది పార్వతి. త్వరగా తినేసి, ఓ అరగంట గదిలోనే అటు ఇటు పచార్లు చేసి పడుకుంటుంది. ఆరోగ్యం బాగా క్షీణించిన దగ్గర నుండి ఇదే పద్ధతి పాటిస్తోంది. ఎప్పుడైనా ఆవిడ నిర్లక్ష్యం చేసినా తార ఊరుకోదు. టైం ప్రకారం భోజనం చేయకపోతే ఊరుకోదు. ఇప్పుడు పార్వతి ఏ పని స్వయంగా చేసుకోలేకపోతోంది. అన్నీ తారే దగ్గరుండి అమర్చి పెట్టాల్సి వస్తోంది. గబగబా పెరట్లోకి వెళ్లి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంది. చల్లటి నీళ్లు ముఖం మీద పడడంతో కాస్త సేదతీరినట్టు అయింది. వంటగదిలో భోజనానికి అన్నీ అమర్చి పెట్టి, తల్లి దగ్గరకు వచ్చింది.
“అమ్మా! భోజనం చేద్దువు గాని లే...” నెమ్మదిగా పిలిచింది. ఎంతకీ పలకకపోయేసరికి, “భోజనం చేసి పడుకుందువు గాని లేమ్మా...” అంటూ తల్లిని గట్టిగా తట్టి పిలిచింది. అప్పటికీ ఆమెలో కదలిక లేదు. అనుమానంగా వంగి తల్లిని పట్టుకుని కుదిపింది. అప్పటికే ఆవిడ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇంకేం పలుకుతుందావిడ. విషయం అర్థమైన తార, కెవ్వున అరుస్తూ తల్లి మీద వాలిపోయింది.
*********************
తార కి ఇంకా నమ్మశక్యం కాకుండా ఉంది. తల్లి ఈ లోకం వదిలి అప్పుడే రెండు వారాలు గడిచి పోయాయి. ఆవిడ ఏదో ఊరు వెళ్ళినట్టుంది తప్ప... చనిపోయిందనుకోవడానికి మనసొప్పడంలేదు. ‘బతికినన్నాళ్లు మాత్రం తల్లిని తనేం సుఖ పెట్టింది? ఆశలన్నీ తన మీదే పెట్టుకుని బ్రతికిన ఆమె నమ్మకాన్ని నెట్టేట్లో ముంచి, క్షోభ పెట్టింది. ఆమె మాటను ఖాతరు చేయకుండా... ఆమెకిష్టం లేని పని చేసి, ఆమె నలుగురిలోనూ పలుచనవ్వడానికి, మంచం పట్టడానికీ కారణమైంది. ఆఖరికి... తల్లి చావుకి కారణమైంది. అవును... తల్లి చావుకి కారణం తనేనేమో! ఈ ఆలోచన రావడంతోనే దుఃఖపు తెర ఉదృతంగా కమ్మేసింది తారను.
తల్లి పడుకున్న మంచం వైపు చూసింది. తనను పక్కన కూర్చోబెట్టుకొని తన చేతిని పట్టుకుని నిద్రపోతున్న దృశ్యమే కనిపించసాగింది. అంతవరకు తామిద్దరు ఒకరికొకరు తోడునీడగా ఉండేవారు. ఇప్పుడిక తనకు ఎవరున్నారు? ఇక తన ఆలకలని, కోపాన్ని నవ్వుతూ భరించేదెవరు? తన సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకునేది ఎవరు? ఇప్పుడు తను పూర్తిగా ఒంటరి అయిపోయింది. అవును... తనిక ఒంటరి బ్రతుకు బ్రతకాల్సిందే. అక్కడికీ అనిత, జోత్స్న, సుబ్బలక్ష్మి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. వాళ్ళు ఉన్నంతసేపు కాస్త సంతోషంగా గడుస్తుంది. తర్వాత మళ్లీ మామూలే. ఈ కష్ట సమయంలో ఎవరైతే రావాలనుకుంటుందో... ఎవరి ఓదార్పును, సాన్నిహిత్యాన్ని కోరుకుంటుందో ఆ మనిషి... విజయ్ ఏదో మొక్కుబడిగా కనిపించి వెళ్ళాడు. ఎంతో ఆత్మీయంగా కబుర్లు చెప్పే మనిషి ఇంతలా ఎలా మారిపోయాడు? తను నటినన్న ఒక్క కారణం... ఒకే ఒక్క కారణం చెప్పి, ఎలా విదిలించాడు! ప్రేమకు అడ్డం కాని తన నటన పెళ్లికి అడ్డమైంది. ఈ నటన తనకేమిచ్చింది!? ఆత్మీయులందరినీ దూరం చేసి, చివరికి ఒంటరితనాన్ని మిగులుస్తుందా? బాధగా కళ్ళు మూసుకుంది.’ ఇంతలో “పోస్ట్” అన్న కేక విని, ఆలోచనల నుంచి బయటకు వచ్చి, పోస్ట్ మెన్ ఇచ్చిన కవర్ అందుకుంది. కవర్ తెరిచి చూసిన తార సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడిపోయింది
******************
ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది జ్యోత్స్న. మౌళి ఎప్పుడు ఎప్పుడు వస్తాడా.. అని అసహనంగా ఎదురుచూస్తోంది. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. చేతిలో చూస్తే డబ్బుల్లేవు. ఎలాంటి పరిస్థితి దాపురించింది. ఉంది... లేదు... అన్న చీకుచింతలేవీ లేకుండా హాయిగా అమ్మ పెట్టింది తింటూ, ఆనందంగా తిరగవలసిన తనకి ఈ బాధలబంధీ ఏంటో! జ్యోత్స్నకు తను సమస్యల సుడిగుండంలో కూలిపోతున్నట్టు అనిపించ సాగింది. తన జీవితం ఏం కానుందో... అని దిగులు పట్టుకుంది. ఏదేమైనా ఈరోజు మౌళిని గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకుంది.
గేటు తీసిన శబ్దానికి అటు చూసిన జ్యోత్సకు, మౌళి వస్తూ కనబడ్డాడు.
“అమ్మయ్య! ఇంట్లోనే ఉన్నావా!? ఉంటావో... లేవోనని భయపడ్డాను. నీకు కొత్త ఆఫర్ తీసుకొచ్చాను. రేపటి నుంచి రిహార్సల్స్ మొదలవుతాయి” అమితోత్సాహంతో చెప్పుకుపోసాగాడు.
దాన్నే మాత్రం పట్టించుకోకుండా అడిగింది జోత్స్న. “మొన్న నేను వేసిన నాటకం తాలూకు డబ్బును తీసుకున్నావా?”
“తీసుకున్నాను” నిర్లజ్జగా చెప్పాడు.
“ఎందుకు తీసుకున్నావు?”
“ఎందుకేంటి? అవసరమైంది... తీసుకున్నాను”
“ఏంటో ఆ అవసరం?”
“మీ అక్కకు ఒంట్లో బాలేదు. మందులు కొనాల్సి వచ్చింది”
“మా అక్కకా!?” ఆశ్చర్యంగా చూసింది జోత్స్న.
ఏంటలా నోరెళ్ళబెట్టావు? నా రెండో పెళ్ళానివైనా నీకు నా మొదటి పెళ్ళాం అక్క కాక మరేమౌతుంది?” వెకిలిగా చెప్పాడు.
ఛీ... ఛీ... ఆపు! నీ వెధవ వరుసలు. ఆ మాటనొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా... నేను కష్టపడి సంపాదించిన సొమ్ము నీ కుటుంబానికి వాడుకోవడానికి సిగ్గులేదూ...” చీత్కరించింది.
“ఏంటే వాగుతున్నావు... వెధవ వరసలా! నేనింకా మంచోడిని కాబట్టి ఏదోలే... నువ్వేడ్చిపోతావని, మర్యాదగా రెండో పెళ్ళాన్ని అన్నాను సంతోషించు. సంఘంలో నీ స్థానం ఏంటో తెలుసా? లేచిపోయిన దానివి. నువ్వు లేచిపోయినదానివి. ఇప్పుడు నాకు ఊంపుడుగత్తెవి.”
“అవును మరి! నీలాంటి నికృష్టుడిని మర్యాదస్తుడని భ్రమపడినందుకు, నమ్మినందుకు నాకు అంతకంటే మంచి స్థనం ఎలా దొరుకుతుంది?” కసిగా అంది.
“నోర్ముయ్యి... ఏంటే... ఊరుకుంటుంటే ఎగిరెగిరి పడుతున్నావ్. నువ్వు ఎంత ఎగిరిపడినా, ఒడ్డునపడ్డచేపలా గిలగిలా కొట్టుకుచావల్సిందే. నువ్విక కుక్కిన పెనులా పడుండవలసిందే. నీకిక నేను తప్ప దిక్కెవడే...” అంటూ చెంపమీద కొట్టాడు బలంగా.
చెంప భగ్గుమందామెకు. ఆ బాధకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. “ఇలాగే హింసిస్తుండు. ఎప్పుడో ఒకరోజు నీ పేరు రాసిపెట్టి మరి ఉరిపోసుకుంటాను. అప్పుడుగాని నీ పీడ నాకు విరగడవ్వదు...” ఏడుస్తూ అంది జోత్స్న.
“ఏమిటేమిటీ! ఉరిపోసుకు చస్తావా... నాకేం అభ్యంతరం లేదు. అవునూ... నా పేరు రాసిపెట్టి మరీ ఛస్తానన్నావు కదూ! మరి... రాయడానికి కాగితం, పెన్ను వద్దా? ఉండు... కాగితం పెన్ను తెస్తాను. ఏదీ ఆ చచ్చే కార్యక్రమం ఏదో త్వరగా కానీ మరి! ఎప్పుడూ చస్తాను... చస్తాను... అనడమే గాని ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసావా? ఇదిగో తాడు... ఉరిపోసుకుంటానన్నావుగా... కానీ మరి. చస్తుందట... చస్తుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడే రకాన్ని కాదే నేను. నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు నీకు. నాతో పెట్టుకోకు...” అలా అంటూనే ఆమె జుట్టు పట్టి వంచి గోడకేసి కొట్టి వెళ్ళిపోయాడు.
ఉన్నచోట నుండి లేవడానికి కూడా శక్తి లేనట్టు అలాగే ఉండిపోయింది జ్యోత్స్న. కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. తల్లి, తండ్రి గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి తనని ఎంత ముద్దుగా చూసుకున్నారు... గట్టిగా ఒక్క దెబ్బ కొట్టి ఎరుగరు. అలాంటిది... తనకేమీకాని వెధవ చేత ఇన్ని దెబ్బలు తింటుంది. తనను ఒక గౌరవప్రదమైన స్థానంలో చూడాలని ఎంత తాపత్రయపడ్డారు అమ్మానాన్న. కానీ ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకొని నిలవలేని స్థితిలో పడిపోయింది. ఏడ్చి... ఏడ్చి... సొమ్మసిల్లి పడిపోయిదలాగే.
******************************