Vijaya Lakshmi
Published on Oct 13 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?చేతులో కాగితం వైపు మరోసారి చూసింది తార. చిరపరచితమైన లేత గులాబీ రంగు కాగితం. మంచులో తడిసినట్టున్న జంట గులాబీలు ముద్దుగా పలకరిస్తున్నాయి. గబగబా లోపలికి వచ్చి ఉత్తరం చదవసాగింది.
“తారా! జరిగిన విషయం తెలిసింది. నువ్వు ఎదుర్కొంటున్న లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక అస్తిత్వాన్ని ఇచ్చి, గోరుముద్దలు తినిపించి, లాలించి, నీ తప్పటడుగులు తప్పుటడుగులు కాకుండా, అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న అమ్మను మర్చిపోవడం అంత సులభం కాదు. కానీ ఒక్క విషయం... నువ్వు నటివి, నీకు నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
రంగస్థలం మీద ఒక పాత్ర పరిధి ముగియగానే రంగస్థలం దిగిపోక తప్పదు. అలాగే ఈ ప్రపంచం అనే నాటకరంగం మీద ప్రతి మనిషి తన పాత్ర కాలం ముగియగానే దిగంతాలకు తరలిపోవడం అని వార్యం... ఇదేమిటి! వేదాంతం అనుకుంటున్నావా... ఇది వేదాంతం కాదు జీవిత సత్యం. ఇవి నా సొంత మాటలు కూడా కాదు. ఎవరో పెద్దలు చెప్పినవే. చూడు తారా! నువ్వు అలా ఇంట్లో కూర్చుని కుములిపోతుంటే పోయిన అమ్మ తిరిగి వస్తుందా? అలా బయటకు వచ్చి పనిలో పడితే, నలుగురితోను కలిస్తే, కాస్తైనా ఉపశమనం కలుగుతుంది. కాదంటావా? ప్రయత్నించి చూడు... నీకే తెలుస్తుంది. ప్రయత్నిస్తావు కదూ!
ఇక ఉండనా! నీ నేస్తం”
ఉత్తరాన్ని మళ్లీ మళ్లీ చదువుకుంది తార. చదువుతుంటే ఏదో తెలియని ఊరట కలగసాగింది. ఎంత చక్కటి ఓదార్పు! ఇంతకీ ఈ అజ్ఞాతవ్యక్తి ఎవరు? హఠాత్తుగా బుర్రలో మెరుపు మెరిసినట్టయింది. అవునూ...! అంతకుముందు వారానికి ఒకటిగా వచ్చే ఈ ఉత్తరాలు విజయ్ తో తన పరిచయం మృతి చెంది, ప్రేమగా మారుతున్న దశలో ఆగిపోయాయి. మళ్ళీ ఇంత కాలానికి అదే విజయ్ తో తనకు విఘాతం ఏర్పడిన ఈ సమయంలో... ఈ ఓదార్పులేఖ. ఆలోచిస్తుంటే చాలా వింతగా అనిపించ సాగింది. ఏంటీ మిస్టరీ!!??
********************
ఇంకో వారం రోజుల్లో వెయ్యబోయే నాటకం స్క్రిప్ట్ చూస్తూ కూర్చుంది తార. ఇప్పుడిప్పుడే తల్లి మరణం ప్రభావం నుంచి బయటపడుతుంది. ఇప్పుడు చూస్తున్న నాటకం తనను మొదటిసారిగా ఈ రంగానికి పరిచయం చేసిన రామారావుగారిది. ప్రస్తుతం బిజీగా ఉన్నా, సహృదయుడైన ఆయన మాట కాదనలేక ఆయన మీద ఉన్న గౌరవంతో ఒప్పుకుంది.
రంగస్థలం మీదకు వెళ్లే వరకు స్క్రిప్ట్ జాగ్రత్తగా చదివి తన పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం దానికి తను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను. ఆ పాత్ర ఇంకా బాగా రావాలంటే ఎలా నటించాలి... డైలాగ్ మాడ్యులేషన్ సరి చూసుకోవడం... ఇలా ప్రతి అంశాన్ని ఇంటి దగ్గర కూడా ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవడం బాగా అలవాటామెకు. ఎప్పటిలాగే నాటకం రాత ప్రతిని చూసుకుంటూ మనసులోనే మననం చేసుకుంటుంది.
ఇంతలో ఇంటిముందు ఆటో ఆగిన శబ్దానికి అటు చూసింది తార. ఆటోలో నుంచి దుమికినట్టుగా దిగి లోనికి పరిగెత్తుకొని వచ్చింది తన సహనటి చంద్రమణి. మనిషి చాలా కంగారుగా ఆందోళనగా ఉంది.
“రా చంద్ర! ఏంటంత హడావిడిగా ఉన్నావు?” లోనికి ఆహ్వానిస్తూ అంది.
“తారా! మాటలు తర్వాత. ముందు నువ్వు అర్జెంటుగా ఇంటికి తాళం పెట్టి బయలుదేరు.”
“ఎక్కడికి బయలుదేరడం? ఆ కంగారు ఏంటి? ఏమైంది చంద్ర?” కుశల ప్రశ్నలు కురిపించింది తార.
“అవన్నీ త్రోవలో చెప్తాను. ముందు నువ్వు తలుపులు వేసుకుని రా”
“అబ్బబ్బ... అసలు సంగతి చెప్పకుండా ఆ తొందర ఏంటి?
తారా! జోత్స్నా... జోత్స్నా...” వాక్యం పూర్తి చేయలేకపోతోంది చంద్ర.
“ఆ... జ్యోత్స్న...!? సరిగ్గా చెప్పు.” ఇంతవరకు చంద్ర మాటల్లో ధ్వనించిన దానికి రెట్టింపు ఆందోళన ధ్వనించింది తార మాటల్లో.
“జ్యోత్స్న... హాస్పిటల్లో బర్న్స్ వార్డులో ఉంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.”
“వ్వా...ట్! నువ్వు... నువ్వు చెప్పేది నిజమా?”
“అబ్బ... అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. ముందు నువ్వులే...” బలవంతంగా తారను లేవదీసింది చంద్ర.
తార గబగబా ఇంటికి తాళం పెట్టి వచ్చేసరికి ఆటోని పిలిచింది చంద్ర. ఇద్దరు ఆటోలో కూలబడ్డారు.
“చంద్రా! ఇది... ఇది ఎలా జరిగింది?” ఏడుపు గొంతుతో అడిగింది తార.
“ఎలా జరిగింది అన్నది నాకు తెలియదు. ఒక టీవీ సీరియల్ లో మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. రోజు నేను తన దగ్గరకు వెళ్లేదాన్ని ఇద్దరం కలిసి షూటింగ్స్ స్పాట్కి వెళ్లేవాళ్ళం. అలాగే ఇవాళ కూడా వెళ్లాను. నేను వెళ్లేసరికి తన ఇంటికి తాళం వేస్తుంది. పక్కవాళ్ళను అడిగితే జ్యోత్స్నాకు బాగా ఒళ్ళు కాలి హాస్పిటల్ లో జాయిన్ అయిందని మాత్రం చెప్పారు వాళ్లు. హాస్పిటల్ కి వెళ్లి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో కనబడింది. జ్యోత్స్న స్పృహ వచ్చినప్పుడు అల్లా నిన్నే అడుగుతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. తనకు తెలిసిందంతా చెప్పింది చంద్ర.
“మరి... మౌళి ఎక్కడున్నాడు?”
“ఆ వెధవ కూడా కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తూ అక్కడే ఉన్నాడు. అసలు వాడే జ్యోత్స్నను చంపడానికి ప్రయత్నించాడేమో అని నా అనుమానం” కసిగా చెప్పింది చంద్ర.
తార కళ్ళ ముందు అమాయకమైన, అందమైన జ్యోత్స్న మోమే కథలాడుతోంది. అక్కా! అంటూ పిలిచే ఆమె ఆప్యాయమైన పిలుపే వినబడసాగింది. ‘భగవంతుడా! ఆ పిల్లని కాపాడు...’ కనిపించని దేవుడిని పదేపదే వేడుకోసాగింది. ఆమె కళ్ళ నుంచి ఆగకుండా స్రవిస్తున్న కన్నీళ్లు బుగ్గులపై నుండి కిందికి జారిపోతున్నాయి. వాటిని తుడుచుకోవాలనే ధ్యాస కూడా లేని ఆమెకు, కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో జ్యోత్స్నకు తనకు జరిగిన సంభాషణ మదిలో మెదిలింది.
ఆరోజు తన దగ్గరకు వచ్చేసరికి చాలా దిగులుగా కనిపించింది జ్యోత్స్న. మనసులో దేనికో చాలా మధనపడుతున్నట్టు, బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నట్టు కనిపించింది. యాంత్రికంగా తనతో మాట్లాడుతున్నా, మనసు మాత్రం దేనిగురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న జ్యోత్స్న వైఖరి చూసి, “జ్యోత్స్నా! అలా ఉన్నవేం?” అని అడిగింది తార.
“ఎలా ఉన్నాను! బాగానే ఉన్నానే.”
“నీ తడబట్టే చెప్తోంది... నువ్వు ఎంత బాగున్నావో?”
“అబ్బే...అదేం లేదక్కా!” చిన్నగా నవ్వుతూ తార అనుమానాన్ని కొట్టి పారేసింది జ్యోత్స్న.
ఎందుకో ఆ నవ్వు అసహజంగా అనిపించింది. సంభాషణ దారి మళ్ళించింది తార. ఆ అమ్మాయి చేస్తున్న సినిమాల గురించి, టీవీ ఫిల్మ్ ల గురించి అడిగి తెలుసుకుంది. ఎప్పుడొచ్చినా చెప్పాల్సిన కబుర్లు అన్నీ గబగబా ఒక గంటలో చెప్పేసి, హడావిడిగా ఇంటికి పరుగులంకించుకునే జ్యోత్స్న, ఆరోజు ఇంటికి వెళ్లే ఉద్దేశ్యమే లేనట్టు తీరిక కూర్చుంది. కాస్త గట్టిగా కదిలిస్తే చాలు... ఈ క్షణమో... మరుక్షణమో తన మనసులో కల్లోలాన్ని బయట పెట్టేస్తుంది అన్నట్టుంది ఆమె పరిస్థితి.
ఉన్నట్టుండి అడిగింది జ్యోత్స్న. “అక్కా! నేను ఇక్కడే ఉండిపోనా?”
వింతగా చూసింది తార. అదేం ప్రశ్న జ్యోత్స్నా? దానికి నా పర్మిషన్ కావాలా? తప్పకుండా ఉండు. రాత్రంతా ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుందాం. నీ బిజీ షెడ్యూల్ తో మళ్ళీ తీరిక ఎప్పుడు దొరుకుతుందో” అంది తార.
“నేను అడుగుతున్నది ఈ ఒక్క రోజుకు కాదక్కా. ఇకనుండి నేను కూడా మీ ఇంట్లోనే ఉండిపోనా?”
ఆ అమ్మాయిఅలా ఎందుకడుగుతుందో అర్థం కాలేదు తారకు. ఏదో చెప్పుకోలేని కష్టాల్లో ఉందని మాత్రం అనిపించింది. దానికేం భాగ్యం తప్పకుండా ఉండు జ్యోత్స్నా... ఈ ఒంటరి జీవితం నాకూ కష్టంగానే ఉంది. ఒకరికొకరం తోడుగా ఉండొచ్చు” అంది తార.
కొన్ని క్షణాల మౌనం తర్వాత కూర్చున్న దగ్గరనుంచి లేచి, జ్యోత్స్న పక్కకు వచ్చి ఆమెకు అతి చేరువగా కూర్చుంది తార. ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లగా అడిగింది “జ్యోత్స్నా... నువ్వు ఎప్పుడూ అంటుంటావు నన్ను నీ సొంత అక్కలా భావిస్తానని. నిజమేనా?”
“అవును. ఆ విషయంలో నీకు అనుమానం కలిగేలా ఎప్పుడైనా ప్రవర్తించానా అక్కా?
“ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. నాకు సమాధానం కావాలి”
“అక్కా... నీకు ఒక నిజం చెప్పనా! రెక్కలు వచ్చిన పక్షినన్న అహంకారంతో కోరి ఒంటరితనాన్ని ఆహ్వానించిన నాకు మిగిలిన ఏకైక ఆత్మీయురాలివి నువ్వే.”
“అయితే చెప్పు. నీ బాధ ఏంటి? నీ కష్టాన్ని నేను పూర్తిగా తీసేయగలనని చెప్పను. కానీ మన బాధను ఆత్మీయులతో పంచుకున్నందువలన కొంతైనా ఉపశమనం కలుగుతుంది అంటారు. అందుకే అడుగుతున్నాను. చెప్పు... ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు?”
ఆ ఆప్యాయతకు, ప్రేమపూరితమైన పలుకులకు ఇక ఆగలేకపోయింది జ్యోత్స్న. తనలోని కల్లోలాన్ని దాచుకోలేక, ఒక్కసారి భోరుమంది జ్యోత్స్న. ఆమె భుజాలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె బాధ కన్నీళ్ళ రూపంలో కరిగిపోనీ అన్నట్టు, ఆ దుఃఖపు ఉధృతం తగ్గే వరకు ఆమె తల నిమురుతూ మౌనంగా ఉండిపోయింది తార. కాసేపటికితేరుకున్న జ్యోత్స్న నెమ్మదిగా చెప్పసాగింది.
“తళుకు బెలుకుల సినిమాల మోజుతో, మేకవన్నె పులిలాంటి ఆ దౌర్భాగ్యుడిని నమ్మి మోసపోయానక్కా! ఆ నికృష్టుడి అండతో అందలం ఎక్కుతానని ఆశపడ్డానే గాని... అధోగతి పాలవుతానని ఊహించలేదు. అప్పట్లో అమ్మానాన్నలు నాకు నచ్చచెప్తూ చెప్పిన మాటలన్నీ నా చెవులకు కర్ణ కఠోరంగా వినిపించాయి. పెద్దవాళ్ళం అన్న అహంకారంతో, అధికారంతో నా కోరికకు అడ్డు తగులుతున్నారని అపార్థం చేసుకున్నాను. వాళ్ళని ఎంతో కష్టపెట్టాను. ఇప్పుడిక వాళ్ల దగ్గరకు వెళ్లాలన్నా వెళ్లలేను.
ఇప్పటికే నా గురించి పరిశ్రమంలో ఎలా చెవులు కోరుకుంటున్నారో నాకు తెలుసు. దీనికంతటికీ కారణం... మొదట్లో వేషాల ఆఫర్లు తెచ్చిపెట్టే బ్రోకర్ గా మాత్రమే పని చేసిన వాడు... ఇప్పుడు నాకు బలవంతపు మొగుడై కూర్చున్నాడు.”
ఈ సంబోధనలన్నీ మౌళిని ఉద్దేశించినవేనని అర్థమైంది తారకు.
“ప్రారంభంలో నా ఆదాయ వ్యవహారాలన్నీ చూసి సాయం చేస్తున్నట్టు నటించి, క్రమక్రమంగా నా డబ్బును చేజిక్కించుకోవడం మొదలుపెట్టాడు. అదేమని అడిగితే బుకాయించేవాడు. అక్కడితో ఆగలేదు వాడి నీచ బుద్ధి. ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి ఎక్కువ సమయం నా ఇంట్లోనే గడిపేవాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అసహనంగా అనిపించి నిలదీస్తే, ఇంతకాలం ఒంటరిగా ఉంటూ వాడి సహాయం తీసుకుంటున్నాను కాబట్టి నన్ను అందరూ లేచిపోయిన దానిలాగా అనుకుంటున్నారని, వాడు చెప్పినట్టు చెయ్యకపోతే నా గురించి ఇంకా అసహ్యకరమైన కథలు ప్రచారం చేస్తానని బెదిరించేవాడు. నాకు వేషాలు రాకుండా ఫీల్డ్ లో స్థానం ఫీల్డ్ లో స్థానం లేకుండా చేసి, రోడ్ల వెంట అడుక్కుతినేలా చేస్తానని భయపెట్టేవాడు. వాడి బెదిరింపులకు ఎంతో భయం వేసేది. నిజంగా వాడిని ఎదిరిస్తే... వాడు అన్నట్టే చేస్తే... నా బ్రతుకు ఎంత దిగజారిపోతుందో అని వణికిపోయేదాన్ని. ఇలా నా నిస్సహాయతను ఆసరాగా తీసుకొని రకరకాలుగా బెదిరించి, నన్ను అన్ని విధాలా లొంగదీసుకున్నాడు. ఎప్పుడైనా వాడు చెప్పింది వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడతాడు. వాడి వెకిలిమాటలు, చేష్టలు చూసి ఒళ్ళు జలదరించేది. ఇంతవరకు వచ్చాక ఇంటికి మాత్రం ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను. కాని వాడిని ఇంటికి రానివ్వకుండా చేద్దామంటే పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక్కోసారి ఈ నరకం భరించలేక చచ్చిపోవాలనిపిస్తుండక్కా! కానీ ధైర్యం చాలడం లేదు” దీనంగా చెప్పింది జ్యోత్స్న. అంతసేపు వెక్కుతూనే ఉంది. వింటున్న తారకు హృదయం కలచి వేసినట్టు అయింది.
‘ఎంత దారుణం! ఈ పిల్ల ఆ మౌళి సాయంతో ఇంటి నుంచి బయటపడినప్పుడే అంతా అనుకున్నారు, ఇలాంటిదేదో జరుగుతుందని. నిండా 20 ఏళ్లు లేని ఈ పిల్లకు ఎంత నరకం రాసి పెట్టాడా భగవంతుడు!’ ఆ అమ్మాయికి ధైర్యం చెబుతూనే మనసులో అనుకుంది తార ఎలాగైనా ఈమె తల్లిదండ్రులకు పరిస్థితి చెప్పి, ఈ ఊబి నుండి బయట పడేయాలని. అంతలోనే వాళ్ళు తిరిగి ఈ అమ్మాయిని చేరదీస్తారా? అని అనుమానం వచ్చింది. జ్యోత్స్న చేసిన పనికి వాళ్ళెంత కోపంగా ఉన్నా, పరిస్థితి చెప్తే కఠినంగా ఉండగలరా? ఎంతైనా కన్న తల్లిదండ్రులు కదా! తప్పకుండా వాళ్ళ దగ్గరకు వెళ్లాలని... అదీ సాధ్యమైనంత త్వరలోనే వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఇంతలోనే ఈ పిడుగు లాంటి వార్త. ఆరోజు నీ దగ్గరే ఉండిపోతాను అక్కా! అన్న జ్యోత్స్న, మళ్లీ అంతలోనే... తన బాధంతా చెప్పుకొని కాస్త సేద తీరగానే, మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతానక్కా... అని బయలుదేరింది.
“అదేమిటి ఇక్కడే ఉంటాను అన్నావు కదా!” అని అడిగితే, అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే బలవంతంగా తన దగ్గర ఉంచేసి ఉంటే... లేకపోతే అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలకు విషయం తెలియజేసి ఉంటే ఇలా జరిగేది కాదేమో. తార మనసులో ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతున్నాయి. ఆటోకుదుపుకి ఈ లోకంలోకి వచ్చి పరిసరాలను గమనించింది తార. హాస్పిటల్ వచ్చేసింది. పక్కనున్న చంద్ర అప్పటికే దిగిపోయి ఆటో ఫెయిర్ చెల్లిస్తోంది. తను కూడా నెమ్మదిగా దిగింది. ఇద్దరూ మౌనంగా బర్న్స్ వార్డ్ వైపు నడక సాగించారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పూర్తిగా , చూడ్డానికి భయం గొలిపేలా ఉన్నవారు కొందరు, పరిస్థితులతో పోరాడే ధైర్యం లేక ఆవేశంతో కాలి బూడిద అయిపోవడానికి సిద్ధపడినా, మధ్యలోనే ఎవరి ద్వారానో రక్షించబడి ఇప్పుడు ప్రాణం మీద తీపితో ఆశ నిరాశల మధ్య త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న వారు కొందరు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ వారు... చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రమాదవశాత్తు ఆ పరిస్థితుల్లో పడ్డవారు... క్షణికావేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వారు... హత్య ప్రయత్నాలకు గురైన వారు ఇలా రకరకాల కారణాలతో అక్కడికి చేర్చబడ్డ వారితో నిండిపోయింది ఆ వార్డు. వారి మూలుగులతో, అరుపులతో భయానకంగా ఉంది అక్కడి పరిస్తితి.
దాదాపు 3వంతులు వరకు కాలిపోయి వికృతంగా తయారైన శరీరంతో మంచంపై పడున జ్యోత్స్నను చూడలేక, కళ్ళు మూసుకుంది తార. బెడ్ పక్కనే ఉన్న బెంచి లాక్కుని కూర్చున్నారు.
“దాహం...దాహం... నీళ్లు... మంచినీళ్లు కావాలి” మగతగా గొనుగుతోంది జ్యోత్స్న. బాధను భరించలేక ఉండుండి గట్టిగా మూలుగుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడెక్కడ కనిపించలేదు. అసలు ఈ సంగతి వాళ్లకు తెలుసో లేదో... అటు వెళుతున్న ఓ నర్సుని పిలిచి అడిగింది తార. హాస్పిటల్ లో వాళ్లకు తెలిసిన డాక్టర్లు ఉండడంతో, ఇన్ఫర్మేషన్ అందచేయడానికి చాలా ప్రయత్నించామని అయితే వాళ్ళు బంధువులు ఇంట్లో పెళ్ళికి వేరే ఊరు వెళ్లడంతో కొద్దిగా లేట్ అయిందని, బహుశా ఈసరికి వస్తూ ఉండవచ్చు అని చెప్పింది ఆ నర్స్.
“అక్కా!” నీరసంగా ఉన్న ఆ పిలుపు విని ఇటు తిరిగింది తార. జోత్స్నకు కాస్త మెలకువ వచ్చినట్టుంది. మెలకువ వచ్చి రానట్టున్న ఆ స్థితిలోనే అతి కష్టం మీద ఏదో మాట్లాడాలని తాపత్రయపడుతోంది.
“అక్కా! నేను... నేను... తప్పు చేశాను కదా! నాకిలాంటి శాస్తి జరగాల్సిందే కదూ!”
“అవేం మాటలమ్మా! నువ్వేం తప్పు చేశావు... బాధపడకు అంత సర్దుకుంటుంది.”
“అక్కా! నేను... నేను... బ్రతుకుతానా? నాకు... నాకు బ్రతకాలని ఉందక్కా... నన్ను కాపాడమని డాక్టర్లతో చెప్పవా...” దీనంగా అంటోంది జ్యోత్స్న.
“నీకేం కాదమ్మా. భయపడకు” ఆ అమ్మాయిని ఓదార్చడానికి అలా అందేకానీ, తార మనసులో “ఆమె బ్రతకడం కష్టం మేడం. అసలు ఇంతవరకు ప్రాణాలతో ఉండటమే గొప్ప విషయం” అన్న నర్స్ మాటలే మదిలో మెదలసాగాయి.
జ్యోత్స్నవైపు చూసింది తార. మగతగా పడుంది. ఆ మగతలోనే ఏదో గొణుగుతుంది. ఏడుస్తోంది... దాహం... దాహం... అంటోంది. ‘భగవంతుడా! ఏం పాపం చేసిందని... ఈ పిల్లకి ఇలాంటి శిక్ష వేశావు? పగవాళ్లకు కూడా ఇలాంటి బాధను కలిగించకు తండ్రి!’ బాధగా అనుకుంది తార.
ఇంతలో జ్యోత్స్న అమ్మానాన్నలు పరిగెత్తుకొచ్చారు. ఆవిడ కూతురి పరిస్థితి చూసి హృదయ విదారకంగా ఏడుస్తోంది. కనిపించిన డాక్టర్లను, నర్సులను పట్టుకుని నా కూతుర్ని బ్రతికించండి అంటూ బ్రతిమిలాడుతోంది. ఆవిడ వేదనను చూస్తే... ఎలాంటి వారికైనా మనసు కరగక తప్పదు. ఆవిడనోదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. బయటికి కనిపించడం లేదు గానీ, ఆ తండ్రి పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏం లేదు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన మౌళిని చూసి, ఆవిడ ఆక్రోశం కాస్తా ఆగ్రహంగా మారిపోయింది. గబగబా తన దగ్గరకెళ్ళి, “వీడే... వీడే నా బిడ్డను పొట్టను పెట్టుకున్న కిరాతకుడు. చెప్పరా... చెప్పు... నా బిడ్డ నీకేం అపకారం చేసిందని దాన్ని స్థితికి తీసుకొచ్చావు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు మనశ్శాంతిగా ఉందా? చెప్పు... చెప్పరా...” అతని పట్టుకుని ఊపేస్తూ రౌద్రంగా అరవ సాగింది.
అక్కడి నర్సులు కలగచేసుకుని, “ఇక్కడ గొడవ చేయకూడదమ్మా... కాస్త కంట్రోల్ చేసుకోండి” అంటూ ఇద్దరినీ చెరోపక్క లాక్కువెళ్లడంతో అంతా సద్దుమణిగింది. రెండురోజులపాటు నరకయాతన అనుభవించి తనువు చాలించింది జ్యోత్స్న. ఆమె చనిపోయినా... “నాకు బ్రతకాలని ఉందక్కా” అన్న ఆమె దీనమైన గొంతే చెవుల్లో ధ్వనించసాగింది తారకు.