అసలక్కడ ఏం జరిగింది? తెల్ల చీరతో తిరిగే ఆమె ఎవరు? | Begunkodar west bengal most haunted railway station

Vijaya Lakshmi

Published on Jun 03 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అది పశ్చిమ బెంగాల్ లోని బెగంకోదర్ రైల్వే స్టేషన్. దూరంగా రైలోస్తున్న చప్పుడు. స్టేషన్ లో పాల లాంటి తెల్లటి చీర కట్టుకున్న యువతి రైలు కోసం ఎదురుచూస్తూ పట్టాల పక్కన నిలబడి ఉంటుంది. రైలు వచ్చింది. ఆగింది. ఆ యువతి రైలిక్కింది. లోపలికి వచ్చి నిలబడ్డ చోటే క్రమంగా ఆవిరిగా మారిపోయింది. ఇది వాస్తవ కథ.


మీరు అతీంద్రియ శక్తిని నమ్ముతారా? దయ్యాలు ఉన్నాయా? లేదా అనే చర్చ ఎవర్ గ్రీన్ టాపిక్. దెయ్యాలు గియ్యాలు జాన్తా నై అంటా ట్రాష్. అని కొందరంటే… దేవుడున్నప్పుడు దెయ్యం కూడా ఉంటుందిగా అంటారు మరి కొందరు. ఈ చర్చల సంగతెలా ఉన్నా కొన్ని మిస్టరీ కథలు విన్నపుడు మాత్రం నమ్మక తప్పదనిపిస్తుంది. అలాంటిదే పశ్చిమ బెంగాల్ లోని **బేగున్ కోడ్ స్టేషన్** కథ.


ఒకప్పుడు జనాలతో కిక్కిరిసిపోయే రైల్వే స్టేషన్. పాతబడి, పాడుబడి, పిచ్చి మొక్కలుగా మొలిచి తుప్పలుగా మారిన తుప్పల మధ్య, గట్టిగా మూయబడిన తలుపులు, రైలే రాని పట్టాలు, ఒక చప్పుడు కూడా వినిపించని ప్లాట్‌ఫాములు.

కానీ అసలు ప్రశ్న. అక్కడ చప్పుళ్లు నిజంగానే లేవా… లేకేం ఉన్నాయి. కాని వింటే గుండాగిపోతుంది.



భారతదేశంలోని ఘోస్ట్ స్టేషన్ల మాట్లాడుకుంటే మొట్టమొదట చెప్పుకోవలసింది పశ్చిమ బెంగాల్‌లోని **బేగున్ కోడ్ స్టేషన్** గురించి. ఈ స్టేషన్ గురించి రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు చెప్పే కథలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. భారత దేశంలోని టాప్ టెన్ ఘోస్ట్ రైల్వే స్టేషన్లలో ప్రముఖంగా చేరింది.


బేగున్ కోడ్ స్టేషన్ – పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న పట్టణంలో ఉన్న ఈ స్టేషన్, అప్పట్లో చురుకుగా పనిచేసేది. సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని రాంచీ డివిజన్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ 1960 లో ప్రారంభమైంది. సంతాల్ రాణి లచన్ కుమారి ఈ స్టేషన్ ఏర్పాటు చేయడంలో ప్రముఖపాత్ర వహించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన భూమిలో ఎక్కువ భాగాన్ని రైల్వేలకు విరాళంగా ఇచ్చిందట ఆమె. ఈ స్టేషన్ ఏర్పాటు దంగల్, బామ్నియా, బెలాడి, దుర్కు, కనుడి మరియు పత్రతు వంటి పొరుగు గ్రామాలకు ఒక వరంలా మారింది. వారికి రవాణా సౌకర్యం మేరుగుపరచిన్చ్ది. కొన్నాళ్ళు బాగానే నడిచింది. అయితే ఆ తరువాత అక్కడ జరిగిన ఒక అమానవీయ ఘటన, దీని స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసింది. అసలక్కడెం జరిగింది. ఒక యువతి పట్నా నుంచి హౌరా వెళ్తుండగా, స్టేషన్ సమీపంలో కొందరు దుండగులు ఆమెను బలాత్కరించి హత్య చేశారు. ఆ తరువాత నుంచి ఆ స్టేషన్ లో భయంకర దృశ్యాలు మొదలయ్యాయి.



1967 లో ఆ స్టేషన్ లో ఒక రైల్వే ఉద్యోగి ఆ స్టేషన్ లో తానూ దెయ్యాన్ని చూశానని చెప్పాడు. ఆ తరువాత అదే స్టేషన్ లో అతను రైలు ప్రమాదంలో మరణించినట్టు కూడా ప్రచారం జరిగింది. అప్పటి అక్కడి స్టేషన్ మాస్టర్ అతని కుటుంబం కూడా అతని క్వార్టర్ లోనే శవాలుగా కనిపించారని, ఇందులో ఆ దెయ్యం ప్రమేయం ఉందని కూడా చెప్తారు.


రాత్రివేళ ఆ స్టేషన్‌కు దగ్గరగా వచ్చే డ్రైవర్లు, గార్డులు, ప్రయాణికులందరూ ఒకే మాట చెప్పడం మొదలయింది…

"ఒక తెల్ల చీర కట్టిన యువతి రైలు పట్టాల పక్కన నిలబడి ఉంటుంది. రైలు ఆగితే, లోపలికి వచ్చి ఆవిరైపోతుంది. మేం చూసాం అని.

ఒక రాత్రి… చిమ్మ చీకటి కటిగా ఉంది. రైలు నెమ్మదిగా స్టేషన్‌లోకి ప్రవేశించింది. సహజంగా వందలమంది ప్రయాణికులు ఉండాలి. **రైలు లోపల** ఎవరూ లేరు. ఖాళీ బోగీలు. అయితే రైలు వెనకాల ఉండే చివరి బోగీ తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల – ఒక తెల్ల చీరకట్టుకున్న యువతి. తల వంచుకుని ఉంది. కదలదు. మాట్లాడదు. ఆమె అక్కడికి ఎలా వచ్చింది? అసలు ఎవరు ఆమె?



కాలక్రమంలో ఆ స్టేషన్ ఉద్యోగులు తరచుగా ఈ భయానక అనుభవాలను ఎదుర్కొన్నారు.

“ఒకరాత్రి, నేను లైట్ ఆఫయ్యాక బయటికి వచ్చాను. స్టేషన్ అంతా వెలుగుతో నిండిపోయింది. లోపల చీకటి. కాని ప్లాట్‌ఫాం మీద ఎవరో నడుస్తున్న చప్పట్లు. ఎవ్వరూ లేరు!” ఇది అక్కడ పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డ్ మాట.

“చివరి రైలు వెళ్లాక నేను రూములోకి వచ్చాను. గడియారం 2:15 చూపిస్తోంది. ఆ సమయంలో నేను చూస్తుండగానే ఆ స్టేషన్ లో ఓ గది తలుపు తానే తానే తెరుచుకుంది. బయట ఆ యువతి… నిలబడి ఉంది. ఇది ఇంకొకరి అనుభవం.

స్టేషన్ మీదుగా ఎ రైలయినా వెళుతున్నపుడు ఆ రైలు వెంట పరుగెడుతూ వెళ్ళేది దయ్యం.పట్టాల మీద గెంతుతుంది.

ఆ స్టేషన్ లో పట్టాల వెంట తెల్లటి చీరతో దెయ్యం తిరుగుతోంది మేం చూసాం… ఇది అక్కడ అందరి మాట.


ఇలాంటి వందలకథలు వినబడడం మొదలయింది. చివరకు బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు. ఇక్కడ మాత్రం పనిచేయాలెం అని చేతులెత్తేశారు ఉద్యోగులు. ఈ వదంతులు ఆగలేదు. చివరికి పరిస్తితి ఎలా మారిందంటే బేగున్ కోడ్ అంటేనే భయం, మౌనం, మిస్టరీ.


పశ్చిమ బెంగాల్‌లోని పురిలియా జిల్లాలో ఉన్న ఈ చిన్న రైల్వే స్టేషన్‌ బేగున్ కోదర్. కలకత్తా నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ఫ్లాట్‌ఫామ్ మీదికి ప్రయాణీకులు రారు. అక్కడ ప్రయాణీకులు దిగరు. అసలక్కడ పనిచేయమని చేతులెత్తేశారు ఉద్యోగులు.

చేసేదిలేక రైల్వే అధికారులు ఈ స్టేషన్‌ను మూసేశారు. 42 సంవత్సరాలపాటు మూసే ఉంది. అక్కడ ఏ రైలూ ఆగదు. అన్ని గేట్లూ మూసివేసి ఉంటాయి. ఆ స్టేషన్ మీదుగా రైలు వెళ్ళినపుడు లోకో పైలట్లు స్టేషన్ ఇంకొంచం సేపట్లో వస్తుందనగా రైలు వేగం పెంచేవారని, వీలైనంత త్వరంగా ఆ స్టేషన్ దాటిన్చేవారని చెపుతారు. రైల్లో కూర్చున్నవారు కూడా స్టేషన్ వచ్చేముందే కిటికీలు తలుపులు అన్నీ మూసేసి బిక్కుబిక్కుమంటూ కూర్చునేవారని స్థానికులు కథలుగా చెబుతారు.


పశ్చిమ బెంగాల్‌లోని హేతువాదుల బృందం ఈ దెయ్యాల భయాన్ని బద్దలు కొట్టడానికి నడుం బిగించింది. టార్చ్ లైట్లు, డిజిటల దిక్సూచిలు మొదలైన పరికరాలతో పోలీసు రక్షణతో రాత్రంతా అక్కడే మకాం వేసి, అక్కడ తమకెటువంటి పారానార్మల్ లక్షణాలు కనబడలేదని, 'దెయ్యాల పర్యాటకాన్ని' ప్రోత్సహించడానికి స్థానికులే ఈ కథలను సృష్టించారని అభిప్రాయపడ్డారు.



అయితే, బెగున్ కోదర్ మావోయిస్ట్ కేంద్రంగా ఉన్నందున, నిరంతరం ఉద్రిక్త పరిస్తితులు ఉండడం కారణంగా అక్కడ పనిచేసే ఎవరూ తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ఇష్టపడకపోవడం, ఈ స్టేషన్ "రెడ్ కారిడార్"లో భాగమైన దట్టమైన అటవీ శ్రేణి అంచున ఉండడం వీటన్నిటి కారణంగా కూడా ఇక్కడ స్టేషన్ లో ఎవరూ పనిచేయడానికి ఇష్టపదకపోవడానికి ఓ కారణం అయి ఉండొచ్చు అన్న వాదన కూడా వినబడుతుంది.


1990ల చివరలో ఆ గ్రామస్తులలో కొందరు ఒక కమిటీని ఏర్పాటు చేసి, స్టేషన్‌ను తిరిగి తెరవాలని అధికారులను కోరారు. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అప్పటి రైల్వేల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిపిఐఎం నాయకుడు బసుదేబ్ ఆచారియాకు తమ స్టేషన్ గురించి తెలిపి దానిని పురరుద్ధరించమని లేఖలు రాసారు. రాశారు. స్తానికుల చొరవతో భారత రైల్వే శాఖ దీనిమీద దృష్టి పెట్టింది. చివరికి ఎన్నో పరిశీలనల తరువాత ఇదంతా కేవలం ఒక ఊహాభయం మాత్రమె అని కొట్టిపారేసింది.



చివరకు 2007లో అప్పటి రైల్వేశాఖమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేస్టేషన్ రీ ఓపెన్ చేయించారు. రైల్వే స్టేషన్‌ను ప్యాసింజర్ రైలు హాల్ట్‌ గా తిరిగి ప్రారంభించారు. **హాల్ట్ స్టేషన్‌గా పనిచేయడం ప్రారంభించింది.** అంటే స్టేషన్‌లో ఆపరేటింగ్ సిబ్బంది ఉండరు. దాదాపు 10 (పది) ప్యాసింజర్ రైళ్లు స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగి, ఆపై బయలుదేరుతాయి. టికెట్ అమ్మకం పగటిపూట (స్థానిక గ్రామస్తుదిన ఒక కాంట్రాక్టర్) ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కూడా, గ్రామస్తులు మరియు ప్రయాణీకులు సూర్యాస్తమయం తర్వాత స్టేషన్‌కు దూరంగా ఉంటారు.


ఇప్పటికీ అక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం వణికిపోతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూజాకార్యక్రమాలు ముగిశాకే స్టేషన్లోకి వస్తారు. రైల్వేస్టేషన్ గోడలపై మొత్తం దేవుళ్ల చిత్రపటాలను పెయింటింగ్లను ఉంచారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఓ రాత్రంతా ఆ రైల్వేస్టేషన్లో గడిపారు కొందరు ఔత్సాహికులు. వాళ్లు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి దెయ్యాలు లేవని.. మేము రాత్రంతా అక్కడ గడిపామని ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దెయ్యాల రైల్వేస్టేషన్‌గా దానికి పేరు పడిపోయింది.


Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...