Vijaya Lakshmi
Published on Jun 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?విశాఖపట్నం, వైజాగ్,….అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న పేరు. విశాఖపట్నం.. ఒకనాడు చిన్న బెస్త గ్రామం... మరి నేడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న మెగాసిటీ. విశాఖపట్నం అనగానే సింహాద్రప్పన్న...సింహాద్రి కొండమీద సంపెంగలు కనబడతాయి. కనకమహాలక్ష్మి అమ్మవారు కనబడతారు. కైలాసగిరి, శివపార్వతులు కనబడతారు. డాల్ఫిన్స్ నోస్ కనబడుతుంది. విశాఖకే గర్వకారణం natural హార్బర్, విశాఖను జాతీయంగా, అంతర్జాతీయంగా నిలబెట్టిన పరిశ్రమలు ఇలా వైజాగ్ అనగానే ఎన్నో విశేషాలు కనబడతాయి. అయితే విశాఖపట్నం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి అందమైన బీచ్ లు. ఆ బీచ్ ల మీద ఓ లుక్కేద్దాం....
విశాఖపట్నంలో తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన బీచ్ లు రామకృష్ణా బీచ్, తొట్లకొండ బీచ్, అప్పికొండ బీచ్, రిషికొండ బీచ్,గంగవరం బీచ్, భీమిలి బీచ్,
విశాఖపట్నం బీచ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్. వైజాగ్ వెళ్ళినవారు ఎవ్వరూ కూడా ఈ బీచ్‌ని సందర్శించకుండా వెనక్కి రారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడున్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం కారణంగా ఈ పేరొచ్చిందని చెప్తారు. బీచ్ కి ఎదురుగా రోడ్ కి ఎదురుగా ఉంటుంది ఈ ఆశ్రమం. బీచ్ కి ఎదురుగా ఉన్న రోడ్ లో కొద్దిగా అప్ లోకి నడుచుకుంటే వెళితే అక్కడ విశాలమైన స్థలంలో మరో రామకృష్ణ ఆశ్రమాన్ని కూడా అందంగా అద్భుతంగా నిర్మించారు.
ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఇక్కడ ప్రతిరోజూ ఎంతోమంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ రామకృష్ణ బీచ్ కి కంటిన్యూషన్ గా సమీపంలోనే లాసంస్ బే బీచ్ ఉంటుంది. ఈ రెంటిని కలిపి జంట బీచ్ లు గా పిలుస్తారు. ఈ రామకృష్ణ బీచ్ లో ప్రధాన ఆకర్షణ , ఐ ఎం ఎస్ కుర్సూర సబ్ మెరైన్ మ్యూజియం. నిజానికి ఈ బీచ్ లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆకర్షణలు... అక్వేరియం, కలకత్తా కాళీ టెంపుల్ నమూనాగా కనబడే కాళీ మాత ఆలయం, విశాఖ మ్యూజియం, తీరంలో రకరకాల రెస్టారెంట్ లు లాంటి ఎన్నో ఆకర్షణలున్నాయి.
బీచ్ రోడ్డంతా ఎన్నో అద్భుతమైన దృశ్యాలు... సాగరకన్య విగ్రహం దగ్గరనుండి... ప్రముఖులైన తెలుగు కళాకారులు, పెద్దల శిల్పాలు ఇలా ఎన్నో అద్భుత దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. చాలా తెలుగు సినిమాల షూటింగ్స్ జరిగాయి. జరుగుతున్నాయి కూడా. బీచ్ లో ఈమధ్యకాలంలో సినిమాల ఆడియో లాంచ్, ప్రీ -రిలీజ్, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఎక్కువగా ఈ బీచ్లో జరుగుతున్నాయి. విశాఖపట్నం రైల్వేస్టేషన్, సింహాచలం, విశాఖపట్నం RTC కాంప్లెక్స్ ప్రాంతాల నుండి 28 నెంబర్ బస్సు ఈ ప్రాంతానికి వెళ్తుంది. ఆటల్లో కూడా వెళ్ళొచ్చు.
విశాఖపట్నంలో మరో అందమైన బీచ్ రిషి కొండ బీచ్. దీనిని తూర్పు కోస్తా ఆభరణం అని అని పిలుస్తారు. వైజాగ్ కు ఎనిమిది కి. మీ. ల దూరంలో ఉంది అందమైన రిషికొండ బీచ్ . అలల ప్రవాహం మెల్లగా సాగే ఈ బీచ్ లో అనేక వాటర్ స్పోర్ట్స్ కూడా కలవు.
విశాఖపట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉన్న రుషికొండ బీచ్ ఇసుక తిన్నెలతో, సహజమైన వాతావరణంతో చూపరులకు కన్నులపండుగ గా ఉంటుంది. ఈతకు మరియు పడవ పోటీలకు అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ బస చేయడానికి ఎ.పి టూరిజం వారివి కాటేజ్ లు కూడా ఉంటాయి. సిటీ ఆఫ్ డిస్టెనీగా పిలుచుకునే విశాఖపట్నం లోని రుషికొండ బీచ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ల సరసణ స్థానం సంపాదించింది. అసలేంటీ బ్లూ ఫ్లాగ్ బీచ్.... ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. విదేశీ పర్యాటకులు తమ పర్యటనకు ఎక్కువగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. అది సరే... అసలీ బ్లూఫ్లాగ్ బీచ్ అంటే ఏంటి.... బ్లూ ఫ్లాగ్ బీచ్‌లంటే సురక్షితమైనవి అని అర్థం. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిన బీచ్ లో నీలం రంగులో ఉండే జెండాలను ఎగుర వేస్తారు. అంటే ఈ బీచ్ అత్యంత పరిశుభ్రతమైన, సురక్షితమైనదని అర్థం. వివిధ దేశాల బీచ్‌లను సందర్శించే వారు ఈ జెండాల ఆధారంగానే వాటి మీద ఒక అవగాహనకు వస్తారు.
మరి ఈ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరిస్తారు. 1985లో డెన్మార్క్ లో ప్రారంభించిన 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్' ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ ని ఇస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్ లను తీర్చిదిద్దడం, తీర ప్రాంతంలో ఎలాంటి జల కాలుష్యం లేకుండా, పర్యావరణ అనుకూలంగా ఉండటం వంటి 33 అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన బీచ్ లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అందిస్తారు. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు ఈ సర్టిఫికెట్ పొందాయి.
ఇలా ప్రపంచంలో తొలిసారిగా ఈ సర్టిఫికేట్ బ్లూఫ్లాగ్ పొందిన దేశం స్పెయిన్.
ఇక మనదేశంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని 'చంద్రబాగ్' బీచ్. ఇది 2018 లో చంద్రభాగ్ బీచ్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు మన దేశంలో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ సాధించిన బీచ్ లలో మన వైజాగ్ రుషికొండ బీచ్ కూడా చేరింది.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 900 K బస్స లోను ఆటల్లో కూడా ఈ రుషికొండ బీచ్ కు చేరుకోవచ్చు.
నీలి కెరటాలు… బంగారు వన్నెల ఇసుకు తిన్నెలు….చల్లని గాలి… వీటి మద్య ఓ పురాతన ఆలయం. ప్రక్రుతి ప్రేమికులకు స్వర్గంలాంటి ప్రదేశం. ఆద్మాత్మిక వాదులకు అపురూపమైన, అపూర్వమైన పుణ్య క్షేత్రం. అత్యంత పురాతనమైన శతాబ్దాల చరిత్ర ఉన్న శివాలయం...ఉన్న సముద్రతీరం. సినిమా వాళ్లకయితే ఇక పండగే... అద్భుతమైన లొకేషన్. ఒక్కమాటలో చెప్పాలంటే టూరిస్ట్ లకు, పీల్లలకు, పెద్దలకు, భక్తులకు,సినిమా వాళ్లకు,ఫోటోగ్రాఫర్ లకు అందరికీ ఓ వరం అప్పికొండ బీచ్. తీరమంతా పచ్చని జీడిమామిడి, సరుగుడు, కొబ్బరితోటలు అందమైన తీరం...ఇంత అందమైన లొకేషన్ చేరువలో ఉంటే సినిమా వాళ్ళ కళ్ళలో పడకుండా ఉంటుందా... పడింతరువాత సినిమాలు తియ్యకుండా ఉంటారా.... అందుకే అప్పుడెప్పుడో తీసిన వాణిశ్రీ నటించిన అప్పికొండ సినిమా అలాగే సూత్రధారులు మరెన్నో సినిమాల చిత్రీకరణ జరిగింది
ఇక ఈ అప్పికొండ బీచ్ అందమైన లోకేషన్లతో వనభోజనాలకు అనువుగా ఉంటుంది. కార్తీకమాసంలో అయితే ఈ అప్పికొండ బీచ్ వన భోజనాలకు వచ్చేవల్లాతో సరదాలకు సందడికి మారుపేరు అయిపోతుంది. అందుకే వండర్ ఫుల్ పిక్నిక్ స్పాట్ అప్పికొండ బీచ్ అని చెప్పొచ్చు.
విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోను, గాజువాక కు 20 కిలోమీటర్ల దూరంలోను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పికొండ బీచ్.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి గాజువాకకు ప్రతి నిత్యం సిటీ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి అప్పికొండకు ప్రత్యేకసర్వీసులు నిరంతరాయంగా నడుస్తుంటాయి. అలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నేరుగా అప్పికొండుకు సిటీ సదుపాయం కూడా ఉంది. స్వంత వాహనాల్లో వెళ్ళేవారు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ లో నుంచి నేరుగా అప్పికొండ చేరుకోవచ్చు.
విశాఖపట్నం కు 15 కి. మీ. ల దూరం లో ఉంది యారాడ బీచ్. ఒకవైపు కొండలతోను, మిగిలిన మూడు వైపులా బంగాళా ఖాతం తోను ఈ బీచ్ ఎంతో సుందరంగా వుంటుంది. నిజానికి యారాడ ఓ గ్రామం పేరు. ఆ ప్రాంతం పేరు మీదుగానే ఈ బీచ్‌కి యారాడ బీచ్ అని పేరొచ్చింది. అయితే ఆ ప్రాంతం నావికదళం వారి పర్యవేక్షణలో ఉండడం వల్ల పెద్దగా పర్యాటకులు ఉండరు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు దగ్గరలో ఉంది గంగవరం బీచ్. ఈ ప్రాంతంలో జాలర్లు, బెస్తవాళ్లు ఎక్కువగా నివసిస్తుంటారు.అయితే గంగవరం పోర్టు పనులు ప్రారంభమయ్యాక.. పర్యాటకుల రాక తగ్గింది. విశాఖపట్నంలోని దిబ్బపాలెం గ్రామం వద్ద బొర్రెమ్మ గెడ్డ నది సముద్రంలో కలిసిన ప్రాంతం నుండి ఈ బీచ్ మొదలవుతుంది. ఇక్కడ కూడా సినిమా షూటింగ్‌లు ఎక్కువగానే జరుగుతుంటాయి.
ఆర్.కె.బీచ్ నుంచి నేరుగా భీమిలి బీచ్ రోడ్డు గుండా సుమారు 27 కిలోమీటర్లు వెళితే భీమిలి బీచ్ వస్తుంది. బే ఆఫ్ బెంగాల్ లో గోస్తనీ నది కలిసే దృశ్యాలు భీమునిపట్నం బీచ్ లో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. భీమిలి బీచ్ అందానికే కాదు చారిత్రకంగా కూడా ఏంటో ప్రసిద్ధి చెందింది. 17వ శతాబ్ధం నాటి కోటలు, సమాధులు డచ్ కాలం నాటి వైభవాన్ని కళ్లకు కడతాయి. . ప్రస్తుతం ఈ ప్రదేశం చుట్టూ అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.ఇక్కడి పావురాల కొండపై బౌద్ధ మత ఆనవాళ్లతో పాటు లైట్ హౌస్ చూడడం కూడా ఓ ఆకర్షణ. భీమిలి లో మత్స్యకారుల జీవన విధానాన్ని అతి దగ్గరగా చూడవచ్చు.
తూర్పుతీరంలో అతి ప్రాచీనమైన ఓడ రేవు భీమునిపట్నం ఓడరేవు. తెలుగు, తమిళ భాషలకు సంబంధించి అనేక సినిమాలను ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.