Vijaya Lakshmi
Published on Jun 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అక్కడెక్కడో అగ్ని వర్షం కురిసిందట. ఇంకెక్కడో కప్పల వర్షం, చేపల వర్షం కురిసాయట. కొన్ని చోట్ల వాటంతటవే వేడి నీటి ఊటలు ఏర్పడతాయట ఇలాంటి కథలు మనం చాలా చాలా వింటుంటాం. కానీ ఏకంగా కొన్ని కిలో మీటర్ల పొడవునా ప్రవహించే మరిగే నది బోయిలింగ్ రివర్ ఒకటుందంటే నమ్ముతారా! నమ్మాలి. నమ్మకతప్పదు. అమెజాన్ అడవుల్లో ఉన్న ఆ బోయిలింగ్ రివర్ గురించి ఎన్నో వింత కథలు. అవి కేవలం కథలు కాదు ఆ మరిగే నది బోయిలింగ్ రివర్ నిజంగానే ఉందన్న నిజాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు యువ పరిశోధకుడు.
ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలను చూస్తుంటాం. అందులో కొన్ని మనం కళ్లారా చూసినా కూడా నమ్మలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..అహ్లాదంగా ఉంటాయి..
మరికొన్ని ప్రాంతాలు భయంకరంగా..చూస్తేనే గుండె ఆగిపోయేంత భయాన్ని కల్పిస్తాయి. ఆ నది గురించి వింటే అలాంటి అనుభూతే కలుగుతుంది..
సాధారణంగా నదులు ప్రశాంతంగా చల్లగా ఉంటాయి.కానీ ఆ నది మాత్రం ఎప్పుడూ మరుగుతూ, పొగలు కక్కుతూ,సెగలు కక్కుతూ వేడి వేడిగా ఉంటుంది. సుమారు 4 మైళ్ళు పొడవు, 82 అడుగుల వెడల్పు 20 అడుగుల లోతున్న నది అది. ఆ నది గురించి ఎన్నో కథలు. వింత వింత కథలు.
దక్షిణ అమెరికాలోని అమెజాన్ సముద్ర తీరంలో ‘మయానటుయాకు’ అనే ఓ నది ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వింత నది. ఇపుడు కాదు శతాబ్ధాల నుంచి దాని గురించి స్థానికులు కథలు, కథలుగా చెబుతున్నారు. ఆ నదిలోకి దిగితే ఇక అంతే.. క్షణాల్లో చనిపోతారు, కేవలం స్థానిక దైవారాధకులు మాత్రమే అక్కడ వరకు వెళ్లగలరు. అందులోని నీళ్లు వేడినీళ్లలా మరుగుతూ ఉంటాయన, ఎన్నో జీవులు అందులో పడి చనిపోయాయని కొందరు అంటారు. ఇంకొందరేమో ఆ నీళ్లు విషపూరితమైనవని అంటుంటారు. మరికొందరు అసలు అక్కడ నదే లేదని అదంతా కల్పిత కథేనని ఇంకొందరు చెబుతారు. మరి ఆ నది నిజంగానే ఉన్నట్టా? లేనట్టా? ఉంటే అందులోని నీళ్లు నిజంగానే మరుగుతూ ఉంటాయా? మరుగుతూ ఉంటే అదెలా సాధ్యం?
సరిగ్గా ఇలాంటి ప్రశ్నే ఆండ్రెస్ రూజో లో కూడా ఉదయించింది. చిన్ననాటి నుంచి ఆండ్రెస్ రూజో తాత దగ్గర బోయిలింగ్ రివర్ గురించి ఈ వింత కథలు వింటూనే పెరిగాడు. వయసుతో పాటు ఆ బాయిలింగ్ రివర్ మీద ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అమ్మ మాటలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. బాయిలింగ్ రివర్ గురించి అడిగితే... అవును బాయిలింగ్ రివర్ నిజంగానే ఉంది. ఆ నదిలో మేము ఈత కూడా కొట్టేవాళ్ళం అంది అమ్మ. అమ్మ మాటలు రూజో లో మరింత ఆసక్తిని పెంచాయి.
బాయిలింగ్ రివర్ లో పడితే ఎవ్వరూ బతికి బట్ట కట్టరని, అందులో పడి ఎన్నో జీవులు చచ్చిపోయాయని తాత చెప్పాడు. అమ్మేమో తానూ అందులో ఈత కొట్టానంటోంది. ఇందులో ఏది నిజం? అమ్మ అబద్ధం చెప్పిందా? ఈ జిజ్ఞాసే.... బాయిలింగ్ రివర్ గురించి పరిశోధనకు పురికొల్పింది రూజో ని.
యాండ్రెస్ రుజో పిహెచ్‌డీ పూర్తిచేశాక బాయిలింగ్ రివర్ గురించి పరిశోధనకు పూనుకున్నాడు. 2011 సంవత్సరంలో తొలిసారిగా అమెజాన్ అడవులకు వెళ్లాడు. భయంకరమైన అమెజాన్ అడవుల్లో తన పరిశోధన మొదలుపెట్టాడు. అమెజాన్ అడవులు ఆరితేరిన పరిశోధకులకు కూడా గుండెల్లో దడ పుట్టించే పేరది. అలాంటి అడవుల్లో కథల్లోనూ, ఊహల్లోను తప్ప బయటి ప్రపంచానికి తెలియని, కేవలం షామన్ లుగా పిలువబడే స్థానికి దైవారాధకులు మాత్రమే వెళ్ళగలరని చెప్పుకునే బాయిలింగ్ రివర్ ను చూడడానికి ముండుకురికాడు యాండ్రెస్ రూజో. అతని పరిశోధన ఫలించింది. చిన్ననాటి నుంచి ఎన్నో రకాలుగా ఊహించుకున్న బాయిలింగ్ రివర్ ను మొట్టమొదటిసారిగా కళ్లారా చూశాడు రుజో.
తన ఊహకు అందనంతగా అందంగా ఉందా నది. వెంటనే తన చేతివేళ్లను ఆ నదిలో ముంచాడు. వేడిసెగ తగలడంతో వెంటనే చేయి బయటకు తీశాడు. యాండ్రెస్ వెంటనే తన పరిశోధనను మొదలు పెట్టాడు. తన థర్మల్ స్కానర్లతో మొత్తం నది ఉష్ణోగ్రతల లెక్కల్ని తీశాడు. అతడు ఆశ్చర్యపోయేలా ఏదో కొద్ది మీటర్ల వరకో నది మరగడం లేదు. వందల మీటర్లు దాటిపోయాడు. వేల మీటర్లలోకి దారితీశాడు. ఒక్కో చోట 90 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది వేడి. అంటే నీరు ఆవిరి అయ్యేందుకు కొద్ది డిగ్రీలు చాలు. ఆ నీటిలో క్షణం పాటు ఉన్నా థర్డ్ డిగ్రీ గాయాల కన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఆ నదిలో పడి ఉడికిపోయిన పక్షుల్ని ఇతర జంతువుల్ని చూశాడు యాండ్రెస్. ఈ నదిలో కప్పలు,పాములు, ఇతర జంతువులు పడి చనిపోవడం తన కళ్లారా చూశాడు రుజో. ఆ వేడిని తట్టుకోలేక అవి చనిపోయాయి. అంటే.... తాత చెప్పింది నిజమేనన్నమాట. అయితే బాగా పెద్దవర్షం కురిసినపుడు ఈ నీళ్లు చల్లారడం, ఆ సమయంలో మనుషులు ఈత కొట్టడం, జీవులు సేద తీరడం కూడా చూసాడు. సో... అమ్మ మాట అబద్ధం కాదు నిజమే అని రుజువయింది అంటాడు రుజో.
కుంభవృష్టి కురుసినపుడు తప్ప మిగతా సమయాల్లో బాయిలింగ్ రివర్ అలా మరుగుతూ ఉండడానికి కారణమేంటి? ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. ఈ బాయిలింగ్ రివర్ లో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరుగుతూ ఉంటుంది. ఈ నీరు ఇంత వేడిగా ఉండటానికి కారణం నది అడుగున అగ్నిపర్వతం ఉండివుంటుందన్నది కొందరు శాస్త్రవేత్తల మాట. కానీ నదికి దగ్గరలో గాని లోపల గాని అగ్నిపర్వతాలు లేవన్నది పరిశోధనల్లో తేలిన విషయం. ఈ మరెందుకు ఆ నది సెగలు కక్కుతుంది? కారణం ఏమై ఉంటుంది? ఈ విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అసలు రహస్యం బయటపడనే లేదు. పరిశోధనలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.