Vijaya Lakshmi
Published on Jun 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అహల్యాబాయి హోల్కర్... ఏ ఆలయ చరిత్ర చూసినా తప్పక వినబడే పేరు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, జ్యోతిర్లింగాలు ఇలా అనేక పుణ్యక్షేత్రాల స్థల పురాణాల్లో ఆమె పేరు తప్పనిసరిగా వినబడుతుంది. భారతదేశమంతటా... ఆసేతు హిమాచలం వరకు మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక వందల ఆలయాలను పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన పుణ్య చరితురాలు. ఆలయాలను, నదీ తీరాలలో స్నాన ఘట్టాలను, ధర్మశాలలను నిర్మింపచేసి యాత్రికులకు యాత్రామార్గాలను సుగమం చేసిన పుణ్యాత్మురాలు.
భారతదేశం అంతటా ముఖ్యంగా దేశం ధార్మికంగా అల్లకల్లోలంగా, హిందూ ధర్మం, సంస్కృతికి విఘాతం ఏర్పడినపుడు, మన సంస్కృతికి, ధర్మానికి పట్టుకొమ్మలయిన దేవాలయాలను పునరుద్ధరించారు.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, పరిపాలనాదక్షకురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ముఖ్యంగా ఆలయాల నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీ శక్తిని దేశ నలుమూలలా చాటిన మహానుభావురాలు ఆమె. నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం... ఆమే రాణీ అహల్యాబాయి హోల్కర్.
అఖండ భారతదేశంలో ప్రసిద్ది చెందిన ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఆలయ చరిత్ర చూస్తే ఆ ఆలయాన్ని రాణి అహల్యాబాయి జీర్ణోద్దరణ చేయించారనో, రహదారి బాగుచేయించారనో, సత్రాలు కట్టించారనో ఇంకేదో ఆలయ అభివృద్ధి కార్యక్రమం చేసారనో ఉంటుంది. అక్కడో ఇక్కడా అని కాదు, ఏ ఒక్కచోటో మాత్రమె కాదు, కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథ ఆలయం, బద్రీనాథ్, బేలూరు, నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే దేశం నలుమూలలా ఆ పుణ్యమూర్తి చేసిన ధర్మ కార్యాలు ఎన్నో ఎన్నెన్నో. ఇప్పటికే వందలాది పుణ్య తీర్థాలలో, ప్రసిద్ద క్షేత్రాలలో దేవీ అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్ లు ధార్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. కాశీలో శ్రీ తారకేశ్వర్, శ్రీ గంగాజీ, అహల్య ద్వారకేశ్వర్, గౌతమేశ్వర్ ఆలయాలతో సహా 9 ఆలయాల పునర్ నిర్మాణం; మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, జననా ఘాట్, అహల్య ఘాట్, శీతల ఘాట్‌తో సహా ఎన్నో ఘాట్‌ల నిర్మాణం; ఉత్తరకాశీ ధర్మశాల నిర్మాణం, రామేశ్వర పంచకోశి ధర్మశాల, ఇలా ఆమె చేసిన ధార్మిక కార్యక్రమాలు, నిర్మాణాలు ఎన్నో ఎన్నెన్నో...
హిందూ దేవాలయాలను పునరుద్ధరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది, ముఖ్యంగా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నాశనం చేసిన దాదాపు ఒక శతాబ్దం తర్వాత, 1780లో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆమె పునర్నిర్మించారు. 1782లో సోమనాథ్ ఆలయాన్ని కూడా పునర్నిర్మించింది. ఇవే కాదు భారతదేశం అంతటా పవిత్ర స్థలాలను పునరుద్ధరించడంలో ఆమె చేసిన కృషి చిరస్మరణీయం. అందుకే ఆమెను అందరూ "పుణ్య శ్లోక్" అని గౌరవించేవారు. రాణి అహల్యాబాయి అపరిమితమైన ధైర్య సాహసాలు, దైవభక్తి, ధార్మిక కార్యక్రమాల రూపకర్తే కాదు అమోఘమైన రాజనీతిజ్ఞురాలు. ఆంగ్లేయుల కుటిలత్వాన్ని గ్రహించలేక, వారి గురించి సరిగ్గా అంచనా వెయ్యలేక, మరాఠా పేష్వా సతమతమవుతున్న సందర్భంలో 1772లో పేష్వాకు రాసిన లేఖలో, వారి నిజ స్వరూపాన్ని గ్రహించి ఆమె ముందే పీష్వాను హెచ్చరించిందట. బ్రిటిష్ వారిని ఎలుగుబంటి కౌగిలింతగా వర్ణిస్తూ పులుల లాంటి క్రూర జంతువులను బలం లేదా కుట్రతో చంపవచ్చు, కానీ ఎలుగుబంటి అలా కాదు. దాని శక్తివంతమైన పట్టులో చిక్కుకున్న వారిని నేర్పుగా వారికే తెలియనంత నేరుగా వారిని మట్టుపెడుతుంది. ఆంగ్లేయుల తీరు కూడా అలాంటిదే అని హెచ్చరించింది పీష్వాను.
కేవలం 70ఏళ్ళ జీవితంలో ఒక వ్యక్తి అందులోను ఒక స్త్రీ ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు . అందుకే మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఒక మనిషి... స్త్రీ... మాత్రమె కాదు దైవాంశ సంభూతురాలుగా భావిస్తారు.
మహారాష్ట్రలోని ప్రస్తుత అహల్యానగర్ జిల్లాలోని జమ్ఖేడ్ తాలుకాలోని చౌండి లేదా చోండి గ్రామంలో మే 31, 1725 న జన్మించింది . ఆమె తండ్రి, మంకోజీ రావు షిండే, ఆ గ్రామానికి పాటిల్ అంటే ప్రధాన అధికారి. ఆడపిల్లలకు చదువన్నదే తెలియని రోజులవి. కాని మంకోజీరావు షిండే ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమని భావించి ఆమెకు చదవడం రాయడం నేర్పించాడు. అలా అహల్యాబాయి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకొని చదువు సంధ్యలతో పాటు, తల్లి దగ్గర పురాణేతిహాసాలు, ధార్మిక విలువలూ దైవభక్తి అలవరచుకుంది.
అలా ఒక సాధారణ ఆడపిల్లగా ఆటపాటలతో గడిచిపోతున్న అహల్యాబాయి జీవితంలో ఆమె ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. సాధారణ బాలిక నుంచి ఒక రాణిగా మార్చేసింది. ఒకరోజు అహల్యాబాయి ఆలయానికి వెళ్ళింది. అదే సమయంలో మరాఠా సామ్రాజ్యంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దార్ మల్హర్ రావ్ హోల్కర్ పేష్వాను దర్శించటానికి పూణే వెళుతున్నాడు. అలా వెళ్ళే మార్గంలో చోండి గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగాడు. అప్పుడే దేవాలయంలో అహల్యాబాయిని చూడడం జరిగింది. అప్పుడక్కడ పేదలకు ఆహారం పెడుతూ వారితో ఆదరంగా మాట్లాడుతున్న ఆమెను చూసాడు మల్హర్ రావు. అంత చిన్నవయసులోనే ఆమె దైవభక్తీ, సేవా భావం, వ్యక్తిత్వం గమనించి ముగ్ధుడైపోయాడు. అలాంటి ఒక చక్కటి అమ్మాయి తన ఇంట అడుగుపెడితే తమ ఇంటికే కళ వస్తుందనుకున్నాడు. అందుకే ఆమెను తన కుమారునికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు మాల్వా జాగీర్దార్ మల్హర్ రావు. అహల్యాబాయి తండ్రిని సంప్రదించాడు. సంతోషంగా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు మంకోజీరావు షిండే. అలా 1733 వ సంవత్సరం మల్హర్ రావు హోల్కర్ కుమారుడు ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది. 1745 లో పుత్రుడు మలేరావు జన్మించాడు. మరో మూడేళ్ళ తరువాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది.
తల్లిదండ్రుల దగ్గర చదువు, సంస్కారం, దార్మికత, దైవభక్తి అలవరచుకున్న అహల్యాబాయి మామగారి దగ్గర రాజ్యపాలన, రాజనీతి నేర్చుకుంది. ఆహల్యాబాయి ప్రతిభను గమనించిన మామగారు మల్హర్ రావు రాజ్యపాలనలో, యుద్ద వ్యుహాలలోనూ ఆమెతో సలహా, సంప్రదింపులు జరిపేవారు. మామగారి తర్ఫీదు వల్లనే అహల్యాబాయి తను స్వయంగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు అనేక యుద్దాలలో కూడా స్వయంగా పాల్గొన్నది. ఆవిడ ఏనుగు అంబారీ నాలుగువైపులా నాలుగు ధనస్సులు బాణాలతోకూడిన తూణీరాలతో ఉండేదట. ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారని, సైన్యాన్ని తన సమర్ధతతో నాయకత్వంతో చక్కగా నడిపించేదని చరిత్ర కథనాలు చెబుతున్నాయి.
అయితే ఎప్పుడూ ఒకేలా సాగిపోతే అది జీవితమెందుకవుతుంది! ఆనందకరంగా సాగుతున్న అహల్యాబాయి జీవితంలో చెడురోజులు దాపురించాయి. 1754లో కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణిస్తారు. అప్పటి ఆచార, సంప్రదాయాలను అనుసరించి తానూ కూడా భర్త చితితో సహగమనం చేస్తానని అహల్యాబాయి సంకల్పించుకుంది. తన సహగమనానికి మామగారిని అనుమతి అడిగింది. కాని మామగారు సహగామనానికి అంగీకరించలేదు. ఇప్పటికే కన్నకొడుకును పోగొట్టుకొని వేదన పడుతున్నాం. కొడుకును దూరం చేసుకున్న నా కుడిబుజం విరిగిపోయినట్టయింది. ఈ సమయంలో నువ్వు కూడా నీ భర్తను అనుసరించి వెళ్ళిపోతే ఇక ఈ రాజ్యం, ఈ ప్రజలు ఏమవుతారు. వీరిని ఎవరు చూసుకుంటారు? ముఖ్యంగా అతి చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా?? వద్దు తల్లీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు. కొడుకు దూరమైనా నాకు ఇప్పుడు నువ్వే కొడుకువి. నా తదనంతరం ఈ రాజ్యబాధ్యత నువ్వే తీసుకోవాలి అని అన్నారు. దాంతో అహల్యాబాయి సతీ సహగమనం ‘ విరమించుకొని మామగారికి రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది. అలా 29 ఏళ్ల అతి పిన్న వయసులోనే వితంతువుగా మారినా, పరిస్తితులను దైర్యంగా ఎదుర్కొని రాజ్యపాలనా భారాన్ని చేపట్టింది అహల్యాబాయి హోల్కర్.
అక్కడితో ఆగలేదు. ఆమె పరీక్షలు. 1766లో మల్హర్ రావు మరణించాడు. దాంతో అహల్యాబాయి ఏకైక కుమారుడు మాలే రావు హోల్కర్ ఆమె రాజ్యాధికారం కింద, ఆమె కనుసన్నలలో సింహాసనాన్ని అధిష్టించాడు. కాని దురదృష్టం ఆమెను వెంటాడుతూనే ఉంది. సింహాసనం అధిష్టించిన కొన్ని నెలలకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించాడు. జరిగిన సంఘటనలు అహల్యాబాయిని ఎంత కృంగదీసినా ధైర్యాన్ని కోల్పోలేదు. వెంట వెంటనే ఎదురయిన ఈ దెబ్బలను ఎదుర్కొని అహల్యాబాయి ధైర్యంగా నిలబడింది. తనకు కలిగిన ఈ కష్టం రాజ్యానికి, ప్రజలకు నష్టం కలిగించకూడదనుకుంది. రాజును కోల్పోయిన తన రాజ్యపాలన భారాన్ని తానే తీసుకుంటానని, పేష్వా అనుమతితో సింహాసనాన్ని అధిష్టించి, 1767 డిసెంబర్ 11న ఇండోర్ పాలకురాలు అయ్యింది రాణి అహల్యాబాయి.
దాంతో సహజంగానే, ఒక స్త్రీ సింహాసనాన్ని అధిష్టించి రాజ్యపాలన చేయడమా అని రాజ్యంలో లుకలుకలు మొదలైనాయి. ఆమె దగ్గర మంత్రిగా పనిచేస్తున్న గంగాధరరావు ఎలాగైనా ఆమె చేతినుంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో మంత్రాంగం మొదలు పెట్టాడు. ఆ పరిస్తితిలో తన తెలివితో అతడి ఆటలను కట్టించింది అహల్యాబాయి. ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా గెలవచ్చని భావించిన రాఘోబా వంటి మరాఠా సర్దార్లకు బుద్ధిచెప్పి, అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు అద్భుతం, అమోఘం అంటాయి చారిత్రిక కథనాలు. అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరటం, తద్వారా రాఘోబాను ఒంటరిని చెయ్యడం, పీష్వా మాధవరావు వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం , ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చెయ్యకుండా సూటిగా హెచ్చరికలు పంపడం. రాఘోబాతో యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యటం వంటి చర్యలన్నీ ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలకు అద్దం పడతాయి అంటారు చరిత్ర పరిశీలకులు. అలా సింహాసనాన్ని అధిష్టించిన ఆమె దాదాపు 30 సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది.
ఆమె రాజ్యాన్ని భయంకర దోపిడీదారులు ధగ్గుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించడం, యుద్ధాలలో స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించడం ఇలా ఎన్నో సంఘటనలు, ఆమె ధైర్య, స్తైర్యాలకు, రాజనితిజ్ఞతకు ఉదాహరణలుగా చెప్తారు చరిత్రకారులు. ఆ సమయంలోనే దగ్గులు, దోపిడీదారుల నుంచి రాజ్యాన్ని రక్షించడంలో తనకు కుదిబుజంగా పనిచేసిన వీరుడు యశ్వంతరావు సామర్థాన్ని గుర్తించి తన కుమార్తె ముక్తాబాయినిచ్చి వివాహం చేసింది.
ఇతర రాణీవాస స్త్రీల మాదిరిగా ఆమె పర్దా పధ్ధతిని అంటే ఘోషాను పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి బాగోగులు స్వయంగా చూస్తూ రాజ్యపాలన చేసింది. మహేశ్వర్ రాజధానిగా మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు రాణి అహల్యాబాయి. ఇప్పుడు మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాం. కాని శతాబ్దాల క్రితమే మహిళలను విస్త్రుతంగా ముందుకు నడిపించిన ఘనత అహల్యాబాయిది. యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరచడం, వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేయడం, వారు దత్తత తీసుకునే హక్కు, వారు తమ కాళ్ళపై తాము నిలబడేలా చర్యలు తీసుకోవడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
ఇంత ఘనతను సాధించినా రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపిందని చెబుతున్నాయి చారిత్రిక కథనాలు. మల్హర్ రావు దత్తపుత్రుడుగా భావించే సుఖోజి రావు హోల్కర్ ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేవారు రాణి అహల్యాబాయి. ప్రస్తుతం ఏంతో అభివృద్ధి చెందిన పట్టణంగా ఉన్న ఇండోర్ ఒక నగరంగా అభివృద్దిచెందటానికి ముఖ్యకారణం అహల్యాబాయి హోల్కరే. పురాణ కాలం నుంచి ప్రసిద్ది గాంచిన మాహిష్మతీనగరం అనే పేరుగల మహేశ్వరం ప్రాంతానికి తన రాజ్య రాజధానిని మార్చి ఆ ప్రాంతం ఆర్ధికంగా, సాంస్కృతిక పరంగా, ధార్మికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి. భిల్లులు, గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటుచేయడమేకాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు . శతాబ్దాల క్రితమే తన రాజ్యంలో నిరుద్యోగం అన్నది లేకుండా ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించింది. ఆ పరిశ్రమల పునాదులు ఎంత బలమైనవంటే, మహేశ్వర్ ప్రాంతంలో ఆమె ప్రారంభించిన వస్త్ర పరిశ్రమ నేటికీ వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది.
రాణి అహల్యాబాయి గురించి చెప్పుకోవలసిన మరో ముఖ్య విషయం ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, సత్రాలు ధర్మశాలలు నిర్మించడం, యాత్రికులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం లాంటి ధార్మిక కార్యక్రమాలు. తన రాజ్యమయిన ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లోనే కాకుండా యావత్భారతదేశంలోనే అసేతుసీతాచలం ఎన్నో హిందూ ఆలయాలను పునరుద్ధరించారు. తూర్పున గుజరాత్ లోని ద్వారక నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ వంటి ప్రాంతాలలో ఎన్నో ఆలయ పురరుద్ధరణలు, ధర్మశాలలు నిర్మాణం చేశారు. మహమ్మదీయుల దాడులలో శిదిలమయిపోయి పాడుబడినట్టుగా మిగిలిపోయిన తోలి జ్యోతిర్లింగం సోమనాథ్ సోమనాథేశ్వరాలయాన్ని కూడా పునర్నిర్మించారు. ముఖ్యంగా మహమ్మదీయుల దాడులలో శిధిలమై మిగిలిపోయిన ఎన్నో ఆలయాలను పునర్మించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత అహల్యాయి హోల్కర్ దే అని చెబుతున్నాయి చరిత్ర కథనాలు.
అహల్యాబాయి హోల్కర్ పరమ శివ భక్తురాలు. ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారట. తానూ రాణి అయినా ఆమె తనను తాను ఎన్నడూ పాలకురాలిగా భావించలేదు. శివ భగవానుడి ఆశీర్వాదాలతో శివుడి తరపున ఒక దూతగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టుగా భావించేవారట.
ఇంతటి పుణ్యాత్మురాలికి కష్టాలు ఒకదాని తరువాత ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి. కళ్ళముందే తన భర్తను, కొడుకును, తనకెంతో స్ఫూర్తి నిచ్చిన మామగారిని పోగొట్టుకున్న అహల్యాబాయి అతి పిన్న వయస్సులోనే తన కూతురు ముక్యాబాయి కొడుకు తన ప్రియమైన మనవడు కేవలం పదహారేళ్ళ వయసులోనే మరణించడం చూసింది. ఇది జరిగిన ఏడాదికే అల్లుడు కన్నుమూసాడు. దాంతో భర్తతో సహగమనం చెయ్యడానికి సిద్దపడింది కూతురు ముక్తాబాయి. ఇలాంటి పని వలదని అహల్యాబాయి ఎంత వారించినా, తల్లికి నచ్చచెప్పి సహగమనం చేసి తల్లిని వదిలి ప్రాణత్యాగం చేసింది కూతురు. ఇలా కళ్ళముందే అయిన వాళ్ళందరినీ పోగొట్టుకొని కూడా ఆ దుఃఖాన్ని దిగమింగి, ధైర్యంతో, స్థైర్యంతో రాజ్య పాలన చేసి ప్రజలను కన్నబిడ్డల వలే పరిపాలించింది రాణి అహల్యాబాయి హోల్కర్.
చివరికి అహల్యాబాయి 1795 ఆగస్టు 13న 70 సంవత్సరాల వయసులో మరణించింది. అహల్యాబాయి తర్వాత ఆమె సైన్యాధిపతి, నమ్మకస్తుడు దగ్గరి బంధువు అయిన తుకోజీ రావు హోల్కర్ అధికారంలోకి వచ్చాడు.
దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య అంటూ దేశప్రజలు కీర్తిస్తారని వర్ణించాడు జొన్నా బిల్లీ అనే ఆంగ్లేయుడు. బ్రిటిష్ గవర్నర్ జాన్ మాల్కం 1823లో రాసిన 'ఎ మెమోయిర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా' అనే పుస్తకంలో అహల్యాబాయి హోల్కర్ గురించి అద్భుతంగా వర్ణించారు. వీరే కాదు ఎంతోమంది ఆంగ్లేయులు, పాలకులు ఈమె రాజ్యపాలనా పరంగాను, ధార్మికంగాను, సాంస్కృతికంగాను కూడా ఈమె అసాధారణ ప్రతిభను కొనియాడారు.
భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఆమె గొప్పతనానికి నిదర్శనంగా ఆమె పేరిట ఎన్నో కార్యాలయాలు, భవనాలు వెలిసాయి.