Vijaya Lakshmi
Published on Jun 26 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నేత్రేశనాయనారు ఇలా అంటే చాలామందికి తెలియకపోవచ్చు.
కాని కన్నప్ప… భక్త కన్నప్ప అంటే అందరికీ తెలుస్తుంది. ఆ భక్త కన్నప్పే తిన్నడు.
కాళహస్తి అన్న పేరు వినగానే కాళహస్తీశ్వరుడి తో పాటు వెంటనే జ్ఞాపకం వచ్చేది కాళహస్తీశ్వరుని పరమ భక్తుడు కన్నప్ప. భగవంతుడు ఏదో చేస్తాడన్న భయంతో భక్తి చూపడం కాదు ... ఆ భక్తి ప్రేమపూర్వకంగా గా ఉండాలి...నిస్వార్ధంగా ఉండాలి...ప్రేమే అసలైన భక్తీ అని నిరూపించిన నిజమైన భక్తుడు కన్నప్ప. భక్త కన్నప్ప.
నిజానికి కన్నప్ప పూర్వజన్మలో ఒక వీరాధివీరుడు. పరాక్రమానికి మారుపేరయిన ఆ వీరుడెవరు.. బోయవాడైన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు. కన్నప్ప పూర్వజన్మ వృత్తాంతమేంటి? కన్నప్పను నేత్రేశనయనార్ అని ఎందుకంటారు?
భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. నిజానికి కన్నప్ప అనేది అతని పేరు కాదు. పరమేశ్వరుడి మీద అతనికున్న నిష్కల్మషమైన భక్తే అతనికి కన్నప్ప అన్న పేరు తీసుకొచ్చింది. కన్నప్ప ఒక బోయవాడు. వేటాడడం వృత్తిగా జీవించేవాడు. కన్నప్ప అసలు పేరు తిన్నడు.. చారిత్రిక కథనాల ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు తిన్నడు.
అంధకారం ఆవరించిన అటవీ మార్గంలో, అశేషమైన భక్తితో శివుని నామాన్ని జపిస్తూ సాగుతున్నాడు ఒక వేటగాడు. అతనికి జ్ఞాన సంపద లేదు, వేదాల పఠనం తెలీదు, శివార్చన నియమాలూ తెలియవు. కానీ, అతని గుండె నిండా అపారమైన ప్రేమ, ఆరాధన! తన కళ్లెదుటే రక్తసిక్తమైన శివలింగాన్ని చూసి, తన దేహాన్ని, చివరికి తన కళ్ళను కూడా అర్పించడానికి సిద్ధపడిన మహనీయుడు - భక్త కన్నప్ప. భక్తికి కులం, భాష, జ్ఞానం అవసరం లేదని, నిష్కపటమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం ఉంటే చాలని నిరూపించిన పరమ శివభక్తుడు. కాలాన్ని జయించిన ఆయన అమరగాథ, తరతరాలుగా భక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
భక్త కన్నప్ప కథ శివుని పరమ భక్తులలో ఒకరిగా, నిస్వార్థ భక్తికి ప్రతీకగా హిందూ పురాణాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అతని అసలు పేరు తిన్నడు. తమిళనాడులోని శ్రీకాళహస్తి ఆలయంతో ఈ కథ ముడిపడి ఉంది.శ్రీ కాళహస్తీశ్వరుని పేరుతొ పెనవేసుకుపోయిన అపర భక్తుడు తిన్నడికి సంబంధించి ఒక పురాణకథనం ఉంది. పాండవ మధ్యముడైన అర్జునుడే ఈ తరువాతి జన్మలో వేటగాడిగా జన్మించాడని ఒక కథనం ఉంది. అసలు అర్జునుడు తరవాతి జన్మలో వేటగాడిగా ఎందుకు జన్మించాడు. తిన్నడు కాళహస్తిశ్వరుడి సన్నిధికి ఎలా చేరాడు.
ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు వ్యాస మహర్షి పాండవులకు ఒక సలహా ఇచ్చాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఈ పనికి తగినవాడు అర్జునుడే అని అర్జునిడిని పంపించారు. అర్జునుడు శివుని గూర్చి కఠినమైన తపస్సు చేసాడు. తపస్సులో ఉన్న అర్జునిడిని పరీక్షించడానికి శివుడు వేటగాడి రూపంలో రావడం, ఒక అడవిపందిని అటు శివుడు ఇటు అర్జునుడు ఒకేసారి బాణాలు వేసి పడగొట్టడం, ఆ అడవిపంది తన బాణం వల్లే పడిపోయిందని, ఒకరంటే కాదు నా బాణం కారణంగానే అని ఇంకొకరు ఇద్దరూ వాదనకు దిగడం, ఆ తరువాత జరిగిన యుద్ధంలో అర్జునుడు శివుడ్ని గుర్తించడం, అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు పాశుపతాస్త్రమును ఇవ్వడం ఈ కథనం మనం వింటుంటాం. అయితే అర్జునిడి తపస్సుకు మెచ్చి శివుడు పాశుపతాస్త్రముఅయితే ఇచ్చాడు గాని, మోక్షం ప్రసాదించలేదట. మోక్షం కోరుకున్న అర్జునునితో నువ్వు కలియుగంలో బోయ వాడుగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు చెప్పినట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊడుమూరులోని బోయకుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని అనుగ్రహాన్ని అందుకున్నారన్నది ప్రతీతి.
బోయవాడైన తిన్నడికి శ్రీకాళహస్తి ఆలయంతో విడదీయలేని అనుబంధం ఉంది. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉంది. ఈ ఆలయం పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. భక్త కన్నప్ప కథ ఈ ఆలయంతో బలంగా ముడిపడి ఉంది. కన్నప్ప తన కళ్ళను శివుడికి అర్పించిన ప్రదేశం ఇదేనని చెప్తారు. ఆలయం లోపల, భక్త కన్నప్ప విగ్రహం కూడా ఉంటుంది, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ సమయంలో కన్నప్పను ప్రత్యేకంగా పూజిస్తారు.
తిన్నడు రాజంపేట మండలంలోని ఉడుమూరులో జన్మించినట్టు చారిత్రిక కథనాలు శివభక్తుల చరిత్రలు తెలియచేసే పెరియపురాణం అనే తమిళగ్రంధం చెప్తోంది. ధూర్జటి కవి తన కాళహస్తిశ్వర చరిత్ర లో కూడా తిన్నడు ఉడుమూరుకు చెందినవాడని ప్రస్తావించాడు. తమిళులు, కన్నడిగులు కూడా కన్నప్ప తమ ప్రాంతం వాడంటే తమ ప్రాంతం వాడనే వాదనలు చేస్తుంటారు. ఎన్ని వాదనలు వినిపిస్తున్నా తిన్నాడు కడప జిల్లా రాజంపేట మండలం ఉడుమూరులో జన్మించాడని ఆధారాలతో చెప్తారు చరిత్రకారులు.
కన్నప్ప ఒక బోయ కుటుంబంలో తండై, నాథనాథ దంపతులకు జన్మించాడు. బోయ కుటుంబంలో జన్మించినందువల్ల తన కులవృత్తి ప్రకారం ప్రతిరోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడుతూ వేటాడుతూ సువర్ణముఖీ నదీ తీరంలో ఉన్న ఈ కాళహస్తి ప్రాంతానికి చేరుకున్నాడు. వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా నిద్రపోతున్నపుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.
నిద్ర నుండి మేల్కొన్న తిన్నడుకి ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళాడు. అలా వెళ్ళిన తిన్నడికి ఒక దగ్గర సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. అంతవరకూ ఎలాంటి దైవభక్తి గాని, ఆచార వ్యవహారాలు గాని లేని తిన్నడు ఆశ్చర్యంగా ఆ శివలింగం చూడగానే మైమరచిపోయాడు. శివుడి మీద భక్తిభావన ఉప్పొంగింది. అప్పటివరకు కేవలం వేటకే పరిమితమైన అతని జీవితంలో, ఆ కల, పెనుమార్పును తెచ్చింది. ఆ శివలింగాన్ని చూసి తనకెంతో ఆప్తుడిలా భావించి తన ఆప్తుడితో మాట్లాడుతున్నట్టే మాట్లాడడం మొదలుపెట్టాడు.
శివయ్యా! మా ఇంటికి రా అంటూ పిలిచాడు. శివుడు ఉలకలేదు. పలకలేదు. తిన్నడు శివుడ్ని పిలవడం మానలేదు. మహాశివుడు తనతో రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి తానె శివుడి దగ్గర ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.
ఇదంతా చూసిన మరో శివభక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడమెంతి, మాంసం నైవేద్యంగా పెట్టడం
మేంటి అంటూ మండిపడ్డాడు. తన బాధను శివుడితో మొరపెట్టుకున్నాడు.
"మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన, ఘోరాతిఘోరమైన ఈ పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు...'' అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు.
మహాశివుడు అతన్ని ఆపి ''ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..'' అన్నాడు.
ఆ భక్తుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.
అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తిన్నాడు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఇది చూసి "ఎందుకు శివయ్యా… అలిగావా!" అంటూ ఆలోచనలో పడ్డాడు తిన్నడు. శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు. తీరా చూస్తే, శివుడి కంటిలోంచి నీరు కారుతోంది.
రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, దానితో కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుండి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.
తిన్నడు మరింత దుఃఖిస్తూ, అయ్యో శివా నీకెంత కష్టం వచ్చింది అంటూ ఉండు .. నా రెండో కన్ను కూడా తీసి నీకు పెడతాను..'' అంటూ కన్ను పెకిలించాబోయాడు. అంతలోనే మరి కన్ను పెకిలించిన తరువాత ఆ కన్ను శివుడికి అమర్చడానికి నాకు కనబడదు కదా ఎలా… ఏం చెయ్యాలి అని ఆలోచించి, శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర గుర్తుగా పెట్టి, తన రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.
అదంతా వెనకనుంచి చూస్తున్న మొదటి శివభక్తుని ఆశ్చర్యానికి అంతు లేకపోయింది.
ఇక్కడ తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, 'భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు. అలా తన కన్నును ఈశ్వరునికర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు.
నయనార్లుగా ప్రసిద్ధి చెందిన శివభక్తుల్లో ఒకడిగా నేత్రేశనాయనారు అనే పేరుతొ ప్రసిద్ధి చెందాడు.
భక్త కన్నప్ప చరిత్ర కేవలం ఒక పురాణ గాథ కాదు. ఇది మానవాళికి భక్తి, ప్రేమ, విశ్వాసం యొక్క గొప్ప పాఠం. సంప్రదాయాలను పక్కన పెట్టి, నిష్కపటమైన హృదయంతో దైవాన్ని ఆరాధిస్తే, ఆ దైవం స్వయంగా ప్రత్యక్షమై భక్తులను ఆశీర్వదిస్తాడని కన్నప్ప నిరూపించాడు. అతని కథ తరతరాలుగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది, భక్తి మార్గంలో నడిచేవారికి నిత్య స్ఫూర్తిని అందిస్తూనే ఉంది. కన్నప్ప భక్తి యొక్క సారాంశం - నిస్వార్థమైన ప్రేమ, పరిపూర్ణమైన అంకితభావం.