Vijaya Lakshmi
Published on Oct 24 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“మరికొద్ది నెలల్లో గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి. 2027 లో గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎక్కడ జరుగుతాయి? దక్షిణ భారతదేశపు కుంభమేళాగా పేరుగాంచిన గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ఈసారి ప్రత్యేకత ఏమిటి? ఏయే ప్రాంతాల్లో ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు? పుష్కర స్నానం ఎక్కడ చేయాలి? గోదావరి పుష్కరాలకు సంబంధించిన పురాణం ఏమిటి? అసలు పుష్కరాలు అంటే ఏంటి? ఎలా ఏర్పడ్డాయి. గోదావరి పుష్కరాలలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఏయే ముఖ్య క్షేత్రాలను దర్శించాలి? పుష్కరస్నాం నిజంగానే మన పాపాలను హరిస్తుందా? పుష్కరస్నానం ఎలా చెయ్యాలి? పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ గోదావరి మహా పుష్కరాల గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ముఖ్య సమాచారాన్ని ఈ బ్లాగ్ లో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను.
భారతీయ సంస్కృతిలో నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు. అవి జీవనదాతలు.అందుకే గంగా, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి వంటి నదులను మన పూర్వీకులు దేవతా స్వరూపాలుగా భావించారు. అలాంటి పవిత్రనదులకు వచ్చే అతి పెద్ద పండుగ పుష్కరాలు. దాదాపు 8 నుండి 10 కోట్ల మంది ఒకే నదిలో, పన్నెండు రోజుల పాటు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్న అద్భుత ఘట్టం. అదే 2027 గోదావరి పుష్కర మహోత్సవం. పుష్కర కాలంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల సప్త జనాల పాపాలు తొలగిపోతాయని, సమస్త నదీ దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోదావరి పుష్కరాలకు తెలుగురాష్ట్రాలు ఆంద్రప్రదేశ్, తెలంగాణా లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
గోదావరి నది ప్రవహించే భూభాగమంతా ఒక మహా ఆధ్యాత్మిక యాత్రా మార్గంగా మారుతుంది.
మొట్టమొదట అందరూ తెలుసుకోవాలనుకునే ముఖ్య విషయం 2027 లో గోదావరి పుష్కరాలు ఎప్పుడు? "హిందూ సాంప్రదాయం ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న 2027 గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం 2027 జూన్ 26వ తేదీ శనివారం నుంచి గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభమై, జూలై 7వ తేదీ వరకు సరిగ్గా 12 రోజుల పాటు కొనసాగుతాయి. టీటీడీ ఆస్థాన సిద్ధాంతులు, పండితుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది
పుష్కరాల్లో ఈ మొదటి పన్నెండు రోజులను సాధారణంగా ఆది పుష్కరాలు అంటారు. 2027లో: జూన్ 26 – జూలై 7 వరకు జరిగే ఈ పన్నెండు రోజులానే ఆదిపుష్కరాలు అని వ్యవహరిస్తారు. ఈ సమయంలో భక్తులు: పుష్కర స్నానంతో పాటు పితృ తర్పణం, పిండప్రదానం, నదీ పూజ, దానం, అన్నదానం, ఆలయ దర్శనం, జపం, పారాయణం, వంటి ఆచారాలను నిర్వహించడం సంప్రదాయం.
అయితే పుష్కరాల పండుగ అక్కడితో అయిపోలేదు. చాలామందికి పుష్కరాలు అంటే మొదటి పన్నెండు రోజులే అనిపిస్తుంది. కాని పుష్కర సంవత్సరం చివరిలో పన్నెండు రోజుల పాటు అంతర్య పుష్కరాలు కూడా జరుగుతాయి.
.పుష్కర తేదీల సమాచార ప్రకారం గోదావరి అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి.
బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో చేసే స్నానం అత్యంత ఫలప్రదమని భక్తులు నమ్ముతారు.పుష్కర స్నానం ఎక్కడ చెయ్యాలి, పుష్కర ఘాట్ లు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న వివరాలు తెలుసుకునేముందు అసలు పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి, పుష్కరాల విశిష్టత ఏంటన్న విషయాలు తెలుసుకుందాం.
పుష్కరాలు అనేవి కేవలం నదీ స్నానాలు కావు. వాటి వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉందని హిందూ సంప్రదాయం చెబుతుంది. పురాణాల ప్రకారం, తుందిలుడు అనే ధర్మాత్ముడు బ్రహ్మ దేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన బ్రహ్మ, "ఏం వరం కావాలి?" అని అడగగా, "స్వామీ, నాకు మీలో శాశ్వతంగా ఉండే వరం ప్రసాదించు" అని కోరాడు. ఆ కోరికను మన్నించిన బ్రహ్మ, అతనికి "పుష్కరుడు" అని పేరు పెట్టి, తన కమండలంలోని పవిత్ర జలంలో స్థానం కల్పించాడు. దాంతో ఈ పుష్కరుడికి సమస్త తీర్థాలను, నదులను పవిత్రం చేసే శక్తి లభించిందట.
కొంతకాలం తర్వాత, దేవతల గురువైన బృహస్పతి, భూలోకంలోని జీవుల పాపాలను పోగొట్టాలనే సంకల్పంతో బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. బృహస్పతి ప్రార్థనను అంగీకరించిన బ్రహ్మ, పుష్కరుడిని అతనికి అప్పగిస్తూ ఒక ఒప్పందం చేశాడు. ఆ ఒప్పందం ప్రకారం, బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే, ఆ రాశితో సంప్రదాయబద్ధంగా అనుసంధానమైన నదిలోకి పుష్కరుడు ప్రవేశిస్తాడు. బృహస్పతి ఒక్కో రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు సంచరిస్తాడు. అలా పన్నెండు రాశులలో, పన్నెండేళ్ళ పాటు 12 పవిత్ర నదులలో పుష్కరుడు ఉంటాడు. అలా నదులకు పుష్కరాలు ఏర్పడ్డాయి.
ఈ పధ్ధతి పధ్ధతి ప్రకారం బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదిలోకి పుష్కరుడు ప్రవేశిస్తాడని చెబుతారు.
ఇక 2027 జూన్ నెలలో పుష్కరాలు జరుపుకోబోతున్న గోదావరి నది గురించి చెప్పుకోవాలంటే, గోదావరి కేవలం ఒక నది కాదు, భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు జీవనాడి. ఒక పురాణ గాథ ప్రకారం, గౌతమ మహర్షి ఆశ్రమంలో ఒక మాయా ఆవు మరణానికి ఆయన పరోక్షంగా కారణమవుతాడు. ఆ గోహత్యా పాపాన్ని పోగొట్టుకోవడానికి, ఆయన శివుడి కోసం తపస్సు చేసి, గంగను భూమిపైకి రప్పించగా, అదే గోదావరిగా ప్రవహించిందని ఒక నమ్మకం. అందుకే దీనిని "గౌతమి" అని, "దక్షిణ గంగ" అని కూడా భక్తితో పిలుచుకుంటారు.
ఈ పవిత్ర నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వరంలో పుట్టి, మహారాష్ట్ర, తెలంగాణ, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నదీ వ్యవస్థల్లో ఒకటి. కానీ గోదావరి కేవలం ఒక నది మాత్రమే కాదు.దాని ఒడ్డున వేల సంవత్సరాలుగా ఏర్పడిన ఆలయాలు...క్షేత్రాలు...పురాణ కథలు...సంతుల సంప్రదాయాలు...రాజవంశాల చరిత్ర...ప్రజల జీవన విధానం... ఇవన్నీ కలిసిన ఒక మహత్తరమైన సంస్కృతి. అందుకే గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు నది ఒడ్డంతా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుతుంది.
గతంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల వైభవాన్ని మనం మర్చిపోలేం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఆనాడు సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రి నుండి భద్రాచలం వరకు గోదావరి తీర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఆ జ్ఞాపకాలు, ఆ భక్తి పారవశ్యం, పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో, అంతకు మించిన ఏర్పాట్లతో తిరిగి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, భారీ ఏర్పాట్లు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. భక్తుల సౌకర్యార్థం, సుమారు 525 స్నానఘట్టాలను సిద్ధం చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా ఆరు జిల్లాల ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి:
ఇక ముఖ్యంగా గోదావరి పుష్కరాలు జరిగే ప్రదేశాలు చూస్తె డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,
ఏలూరు, కాకినాడ, వీటితో పాటు పోలవరం ప్రాంతంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఎన్ని ప్రాంతాలలో గోదావరి పుష్కరాలు జరిగినా ... రాజమహేంద్రవరం ఈ పుష్కరాలకు కేంద్ర బిందువుగా నిలవనుంది. ఇక్కడి ప్రసిద్ధ పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ లతో పాటు, కొవ్వూరు, నరసాపురం, అంతర్వేది, ధవళేశ్వరం వంటి ప్రాంతాల్లోని ఘాట్లను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో గోదావరి ప్రవహించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి: జ్ఞాన సరస్వతి దేవి కొలువైన ఈ క్షేత్రం బాసర: దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి ముక్తేశ్వర స్వామి ఆలయం ఉన్న త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం, శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం భద్రాచలం వీటితో పాటు మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని సుమారు 96 ప్రాంతాల్లో ఘాట్లను సిద్ధం చేయాలని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తోంది.
2015 అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సుమారు 8 నుండి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసమూహానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు కుంభమేళా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేయాలని సంకల్పించాయి.
వేల కోట్లతో కొత్త రోడ్లు, వంతెనలు, ఘాట్లకు అనుసంధాన మార్గాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిరంతర విద్యుత్, పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
భక్తుల రద్దీని నియంత్రించడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.
భక్తుల బస కోసం భారీ టెంట్ సిటీలు, హోమ్‌స్టేలు, తాత్కాలిక వసతి గృహాల నిర్మాణం వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి ఘాట్ వద్ద బట్టలు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
భక్తులను ఘాట్ల వద్దకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లు, వేల సంఖ్యలో బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరం బయట భారీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి, అక్కడి నుండి ఘాట్లకు షటిల్ సర్వీసులు నడపాలని భావిస్తున్నారు.
మరి 2027 లో జరిగే గోదావరి పుష్కరాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారా... అయితే మీకోసం తరువాతి బ్లాగ్ లో గోదావరి పుష్కరాలకు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం...