గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో తెలుసా? | Nava Tirupati - Nine Abodes of Lord Vishnu

Vijaya Lakshmi

Published on Sep 30 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో తెలుసా? నవ తిరుపతులు ఈ క్షేత్రాల గురించి మీరు విన్నారా? తిరుమల వేంకటేశ్వర స్వామి, తిరుపతి అంటే అందరికీ తెలుసు. కానీ నవ తిరుపతులు, ఒకే నది ఒడ్డున, ఒక్కో గ్రహం కోసం వెలిసిన తొమ్మిది క్షేత్రాల గురించి విన్నారా? ఈ రోజు ఆ పవిత్ర యాత్రను గురించి తెలుసుకుందాం. నవ తిరుపతులు ఎక్కడ ఉన్నాయి? అసలు ఈ క్షేత్రాలను నవతిరుపతులు అని ఎందుకంటారు? ఈ క్షేత్రాలు గ్రహదోషాలను ఎలా పోగొడతాయి? ఏడుకొండల మీద తిరుమల మాదిరిగానే.. ఈ తొమ్మిది క్షేత్రాలను దర్శిస్తే ప్రత్యేకమైన పుణ్యఫలం లభిస్తుందని ఎందుకు నమ్ముతారు? ఇలాంటి విశేషాలను ఈ రోజు బ్లాగ్ లో తెలుసుకుందాం.

నవ తిరుపతులు అంటే...

నవ తిరుపతులు... తిరుమల వెళ్లలేని వారి కోసం... భగవంతుడు స్వయంగా ఒకే నది ఒడ్డున తొమ్మిది రూపాల్లో వెలిశాడని, ఆ క్షేత్రాలే నవతిరుపతులని మీకు తెలుసా? ఆ తొమ్మిది తిరుపతి క్షేత్రాలు ప్రతి ఒక్కటి, ఒక గ్రహానికి అధిపతి. వాటినే 'నవ తిరుపతులు' అంటారు. భక్తిని, మనశ్శాంతిని, గ్రహదోష పరిహారాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ క్షేత్రాలు అద్భుత వరాలు. ఈ నవతిరుపతులలో స్వామివారి  ఒక్కోరూపం ఒక్కో గ్రహానికి అధిపతి. సూర్యుడి నుంచి శని, రాహు, కేతువుల వరకు తొమ్మిది గ్రహాలకూ తొమ్మిది దేవాలయాలు. వీటినే 'నవ తిరుపతులు' అని పిలుస్తారు.

నవ తిరుపతులు ఎక్కడున్నాయి?

నవ తిరుపతి ఆలయాలు తమిళనాడులో, తిరుచెందూర్–తిరునెల్వేలి మార్గంలో, తామ్రపర్ణి నది ఒడ్డున వెలిశాయి. తామ్రపర్ణి అంటే రాగి రంగు. ఈ నదిలో ఎర్రని ఇసుక, నీటి రంగు వల్ల ఆ నదికి తామ్రపర్ణి అన్న పేరు వచ్చిందని చెబుతారు.  

వైష్ణవ దివ్యదేశాలు

108 వైష్ణవ దివ్యదేశాలుగా చెప్పబడే దేవాలయాలలో ఈ నవతిరుపతులు కూడా ఉన్నాయి. ఒకే నది ఒడ్డున... తొమ్మిది పవిత్ర వైష్ణవ క్షేత్రాలు! ప్రతి ఆలయ ప్రధాన దేవుడు వేంకటేశ్వరుడి రూపాలు.

నవగ్రహ ఆలయాలు

ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో శ్రీమహావిష్ణువు... ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత... ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ తొమ్మిది ఆలయాలకు నవగ్రహాలతో సంబంధం ఉందని భక్తుల విశ్వాసం! అందుకే వీటిని సాధారణంగా తొమ్మిది విష్ణు ఆలయాలు అని కాకుండా... "నవ తిరుపతులు" అని పిలుస్తారు. ఆళ్వార్లలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ ఈ ప్రాంతంతో ప్రత్యేకంగా అనుబంధం కలిగి ఉన్నారని చరిత్ర చెబుతోంది. నవ తిరుపతులలోని స్వామివారిని స్తుతిస్తూ నమ్మాళ్వార్ రచించిన పాశురాలు ఈ క్షేత్రాల ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత పెంచాయి.

సూర్య క్షేత్రం — శ్రీవైకుంఠనాథన్ పెరుమాళ్ ఆలయం (శ్రీవైకుంఠం) — ఆదివారం

నవ తిరుపతులలో మొట్టమొదటి క్షేత్రం శ్రీవైకుంఠమ్. సూర్యక్షేత్రం. ఇక్కడి స్వామిని శ్రీవైకుంఠనాథన్ పెరుమాళ్ అని పిలుస్తారు. వైకుంఠంలో ఉండే రూపంతోనే ఇక్కడ ప్రత్యక్షమవ్వడం వల్ల ఈ ఊరికి శ్రీవైకుంఠం అని పేరు వచ్చింది. ఇది సూర్య గ్రహానికి సంబంధించిన క్షేత్రంగా చెప్తారు. జాతకంలో సూర్య గ్రహదోషం ఉన్నవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తేజస్సు, ఉద్యోగాభివృద్ధి కలుగుతాయి. సూర్యుడు జీవితంలోని చీకటిని తొలగించేవాడు. ఇక్కడ స్వామి దర్శనంతో సూర్య దోషం, నిరాశ, అంధకారం తొలగి, జీవితం ప్రకాశవంతమవుతుందని భక్తుల నమ్మకం. తిరునెల్వేలి నుండి దూరం : 35 కి.మీ. యాత్ర సాధారణంగా ఇక్కడ మొదలవుతుంది. ఈ ఆలయం సూర్య భగవానునిగా పూజించబడే వైకుంఠ స్వామికి అంకితం చేయబడింది.

ఇక్కడ స్వామివారు నిలబడిన భంగిమలో, ఆదిత్యుని (సూర్యుని) కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకేలా ఆలయ నిర్మాణం ఉంటుంది.

ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు చక్కని ఉదాహరణ. ఎత్తైన రాజగోపురం...విశాలమైన ప్రాకారాలు...అద్భుతమైన శిల్పాలు...ఆలయ ప్రాంగణంలో కనిపించే వివిధ విష్ణు రూపాలు... భక్తులను ఆకట్టుకుంటాయి.

తామ్రపర్ణి నది తీరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం నవ తిరుపతులలో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారిని కల్లప్పిరాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు వెలసిన వైనం గురించి కొన్ని పురాణ కథనాలు కూడా చెప్తారు.

పురాణ కథనాలు – సోమకాసురుని కథ

పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుంచి వేదాలను అపహరించాడు. వేదాలు లేక బ్రహ్మ అశక్తుడయ్యాడు. బ్రహ్మదేవుడు వైకుంఠనాథుని గరించి తామ్రపర్ణి ఒడ్డున గొప్ప తపస్సు చేశాడని, శ్రీమహావిష్ణువ ప్రసన్నుడై, మత్స్యావతారం రూపంలో సోముకాసురుడిని సంహరించి, వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చి, అక్కడే వైకుంఠనాథుడిగా వెలిశాడని స్థలపురాణ కథనం.

నిగూడంగా ఉన్న స్వామి  

ఈ స్వామి చాలాకాలం పాతాళంలో నిగూఢమై ఉండేవాడట. ఒక రాజు మందలో ఒక ఆవు రోజూ అక్కడే తన పాలను అభిషేకించేది. మిగతా ఆవుల్లా ఈ ఆవు పాలు ఇవ్వకపోవడంతో రాజు ఆవు మీద నిఘా పెట్టించాడు. అలా ఒక ఆవు ద్వారా నిగూడంగా ఉన్న స్వామిని ప్రపంచానికి కనబడ్డాడని స్థలపురాణం చెబుతోంది.

శ్రీవైకుంఠం కల్లప్పిరాన్ కథ

శ్రీవైకుంఠంలోని ఈ స్వామిని కల్లప్పిరాన్ అని పిలవడం వెనక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో కాలదూషకుడు అనే దొంగ ఉండేవాడని స్థలపురాణం చెబుతుంది. అతడికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. తాను దొంగిలించిన వస్తువుల్లో సగం శ్రీ వైకుంఠనాథునికి సమర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ కాలదూషకుడు ఏకంగా రాజభవనం నుంచే విలువైన ఆభరణాలను దొంగిలించాడు. అలా దొంగిలిస్తూ రాజభటులకు చిక్కిపోయాడు. రాజ భటులు ఆ దొంగను రాజు ముందు నిలబెట్టారు. ఆ సమయంలో కాలదూషకుడు మనసులో శ్రీ వైకుంఠనాథుడినే ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అప్పుడు భక్తుని ఆర్తిని చూసిన స్వామివారు అతనిపై కరుణించి, దొంగ రూపంలోనే రాజుకు ఆత్మజ్ఞానాన్ని బోధించి, అనంతరం తన నిజరూపాన్ని రాజుకూ, కాలదూషకుడికీ దర్శనమిచ్చారని కథనం. అందుకే ఇక్కడి ఉత్సవమూర్తికి... "కల్లప్పిరాన్" అనే పేరు వచ్చిందని చెప్తారు. అంటే... దొంగ రూపంలో భక్తుడిని రక్షించిన పెరుమాళ్! అని అర్థం.

చంద్ర క్షేత్రం — విజయాసన పెరుమాళ్ ఆలయం (నాథం/వరగుణమంగై) — సోమవారం

నవతిరుపతులలో రెండవది విజయాసన పెరుమాళ్ ఆలయం. ఈ క్షేత్రాన్ని తిరువరగుణమంగై, నత్తం అని కూడా పిలుస్తారు. ఇది చంద్రక్షేత్రం. చంద్రుడు మనసును శాంతిపరిచేవాడు. మనం మాట్లాడే మాటలు, మన మనోభావాలు, అంతఃకరణ అన్నింటిపై చంద్రుడి ప్రభావం ఉందని జ్యోతిష్యం చెబుతుంది. విజయాసన పెరుమాళ్ దర్శనంతో భయాలు, మనోవ్యాధులు, అశాంతి తొలగుతాయని భక్తుల నమ్మకం. మనోవ్యాధి పరిహారం అంటే మానసిక ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం, చంద్ర దోష నివారణ కోసం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా దర్శిస్తారు. సోమవారం ఇక్కడ స్వామిని దర్శించడం శుభప్రదం అని చెబుతారు.

ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు విజయాసన పెరుమాళ్. అమ్మవారు వరగుణవల్లి. ఈ క్షేత్రం ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతికి ప్రసిద్ధి. ఈ క్షేత్ర స్థలపురాణం ప్రధానంగా... సత్యం, ధర్మం, పవిత్రత గురించి చెబుతుంది.

పురాణ కథ

వేదవిత్' అనే బ్రాహ్మణుడు విష్ణు మంత్ర సిద్ధి కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశాడని, ఆయన తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ఆసనంపై కూర్చున్న భంగిమలో విజయాసన పెరుమాళ్ గా దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ స్వామివారు విజయాసన పెరుమాళ్. అంటే ధర్మవిజయానికి ప్రతీకగా ఆసీనుడైన స్వామి!  దీనిని శ్రీ మాయకూతర్ పెరుమాళ్ ఆలయం అని కూడా అంటారు. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ ఆలయం నుండి దూరం : 9 కి.మీ దూరంలో ఉంటుంది ఈ ఆలయం.

అంగారక (మంగళ) క్షేత్రం — వైతమణిధి పెరుమాళ్ ఆలయం (తిరుక్కోలూరు) — మంగళవారం

నవ తిరుపతులలో మూడవది తిరుక్కోలూరులోని వైతమణిధి పెరుమాళ్ ఆలయం. శ్రీ మాయకూతర్ పెరుమాళ్ ఆలయం నుండి దూరం : 7 కి.మీ దూరంలో ఉంటుంది.

కుబేరుని శాపం కథ

సంపదలకు అధిపతియైన కుబేరుడు ఒకసారి పార్వతీదేవి కోపానికి గురై తన నవనిధులను, రూపాన్ని కోల్పోయాడు. కుబేరుడు తన శాపవిమోచనం కోసం తిరుక్కోలూరు చేరి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు కరుణించిన శ్రీమహావిష్ణువు వైథమనిధి పెరుమాళ్ గా ప్రత్యక్షమై నిధులను తన వద్ద భద్రపరిచి, తిరిగి కుబేరునికి ప్రసాదించారని పురాణ కథనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుబేరస్థలం అంటారు. స్వామి శయనించి, తన అరచేతిలో ధనం ఎక్కడ ఉందో చూస్తూ ఉంటాడని భావన. ఈ స్వామిని నిధులను కాపాడే స్వామివారు అని కూడా భావిస్తారు. అందుకే సంపద, ఆర్థిక స్థిరత్వం కోసం భక్తులు స్వామివారిని ప్రార్థిస్తారు.

అంబరీషుని కథ

         మరో కథనం ప్రకారం రాజు అంబరీషుడు రాజ్యం వదిలి తపస్సు చేస్తుండగా ఒక సందర్భంలో దూర్వాసుడి కోపానికి గురయ్యాడు. దుర్వాసుడి నుంచి ఆయన్ని భగవంతుడే రక్షించి, శాప విమోచనం చేశాడు. అందుకే స్వామిని అంబరీష వరదర్ అంటారు.

ఇది మహాభక్తుడు మధురకవి ఆళ్వార్ జన్మస్థలంగా కూడా చెప్తారు.

మంగళ దోషం ఉంటే పెళ్లిళ్లు ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు రావాదం జరుగుతుంది. ఇక్కడ దైవ దర్శనంతో ధైర్యం, సంకల్పం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

బుధ క్షేత్రం — తిరుప్పుళియంగుడి పెరుమాళ్ ఆలయం — బుధవారం

నవ తిరుపతులలో నాలుగవది తిరుపుళింగుడి క్షేత్రం. ఇది బుధ క్షేత్రంగా చెబుతారు. ఇక్కడి స్వామివారిని భూమిపాలక పెరుమాళ్ అని పేర్కొంటారు. శయనభంగిమలో భూదేవి సమేతంగా దర్శనమిస్తారు

ఈ క్షేత్రం...బుధ గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. బుధుడు అంటే జ్ఞానం, మేధస్సు, వాక్చాతుర్యం, విద్య. అందుకే విద్యాభ్యాసం, బుద్ధి వికాసం కోసం భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు.

తిరుపుళింగుడిలో వెలిసిన పెరుమాళ్ బుధ దోషాలను తొలగించి, జ్ఞానాన్ని, వాక్ సిద్ధిని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. విద్యార్థులు, వ్యాపారులు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. బుధవారం ఇక్కడ దర్శనం శుభప్రదం.  

స్థలపురాణం

స్థలపురాణం ప్రకారం యజ్ఞశర్మ అనే వ్యక్తి వశిష్ఠ మహర్షి కుమారుల శాపానికి గురయ్యాడు. ఆ శాపవిమోచనం కోసం అతడు ఈ క్షేత్రంలో శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. చివరకు స్వామివారి దివ్య పాదస్పర్శతో యజ్ఞశర్మకు శాపవిమోచనం లభించిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రంలో భక్తులు దైవకృపను, పాపవిమోచనాన్ని ప్రత్యేకంగా స్మరిస్తారు.

భూదేవి అలక

అలాగే భూమిదేవితో స్వామివారు ఇక్కడి చింతచెట్ల వనంలో విశ్రాంతి తీసుకుంటుండగా, లక్ష్మీదేవి అలక వహించిందని అప్పుడు స్వామి ఇద్దరినీ సమానంగా ఆదరించి పవళించిన భంగిమలో దర్శనమిచ్చారని స్థల పురాణ కథనం.

గురు (బృహస్పతి) క్షేత్రం — ఆళ్వార్ తిరునగరి.— గురువారం

నవ తిరుపతిలలో 5వది ఆళ్వార్ తిరునగరి క్షేత్రం. తిరునగరి పెరుమాళ్ ఆలయం.  ఇది అన్నిటికంటే ప్రత్యేకమైన క్షేత్రం. మహాభక్తుడు, తొమ్మిది క్షేత్రాలనూ కీర్తించిన నమ్మాళ్వార్ జన్మస్థలం ఇది. నమ్మాళ్వార్ పుట్టినప్పటి నుండి ఏడు సంవత్సరాలు మౌనంగా, నిశ్చలంగా చింతచెట్టు కింద కూర్చున్నారని, ఆయన శిష్యుడు మధురకవి ఆళ్వార్ ఒక ప్రశ్నకు మాత్రమే ఆయన నోరు తెరిచి, దివ్యజ్ఞానాన్ని ప్రసాదించారని కథనం.  ఇక్కడ 3000 ఏళ్ల నాటి పవిత్ర చింతచెట్టు ఉందని, దాని కిందనే నమ్మాళ్వార్ దైవిక ధ్యానంలో గడిపారని చెబుతారు. జ్ఞానం, సంతాన ప్రాప్తి, గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ దివ్యదేశాన్ని భక్తులు దర్శిస్తారు

జ్ఞానం, ధర్మం, శుభం ఇచ్చేవాడు గురువు అంటే బృహస్పతి. గురుదోషం ఉంటే సంతాన ఆలస్యం, విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. గురువారం ఇక్కడ దర్శనంతో గురుకృప కలిగి శుభాలు కలుగుతాయని  భక్తుల నమ్మకం.

శుక్ర క్షేత్రం — మకర నెడుంకుజై కన్నన్ ఆలయం (తేన్దిరుప్పెరై) — శుక్రవారం

నవ తిరుపతిలలో ఆరవ క్షేత్రం తెన్ తిరుప్పిరై.  మకర నెడుంకుజై కన్నన్ ఆలయం. ఇక్కడ మకర కుండలాలు ధరించిన విష్ణుమూర్తి రూపం దర్శనమిస్తుంది.

భూదేవి శాపం

భూదేవి దూర్వాస మహర్షి శాపం వల్ల కాంతిని కోల్పోయి, ఈ క్షేత్రంలో తామ్రపర్ణి నదిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించిందట. ఆ సమయంలో నదిలో రెండు 'మకర కుండలాలు' చేప ఆకారపు చెవి ఆభరణాలు లభించాయి. భూదేవి వాటిని స్వామివారికి సమర్పించగా, స్వామివాటిని ధరించి నెడుంకుజై కన్నన్ 'గా వెలిశారని స్థలపురాణం.

 ఇది శుక్ర గ్రహ క్షేత్రం. శుక్రుడు సంపదకు, సౌందర్యానికి, సుఖభోగాలకు, భార్య-సంతాన ప్రీతికి అధిపతి. శుక్ర దోషం ఉంటే ఆర్థిక నష్టాలు, సుఖ జీవితానికి ఆటంకాలు రావచ్చు. మకర నెడుంకుజై కన్నన్ — శుక్రదోషాన్ని తొలగించి, సంపద, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. శుక్రవారం ఇక్కడ దర్శనం శుభం.

శని క్షేత్రం — శ్రీనివాస పెరుమాళ్ ఆలయం (తిరుక్కుళందై) — శనివారం

నవతిరుపతులలో మరో క్షేత్రం తిరుక్కుళందై.  శ్రీనివాస పెరుమాళ్ ఆలయం. ఈ స్వామి సాక్షాతూ తిరుమల శ్రీనివాసుదిగానే భావిస్తారు.  ఇది శని క్షేత్రంగా చెప్తారు. శని దోషం ఉంటే కష్టాలు, పనులలో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. తిరుక్కుళందైలో వెలిసిన శ్రీనివాస పెరుమాళ్ తిరుమల వేంకటేశ్వరుడి రూపమే అని భక్తుల నమ్మకం.  ఈ స్వామి శని దోషం, శని దశలో ఉన్నవారికి రక్షణగా నిలుస్తాడని విశ్వాసం. శనివారం ఇక్కడ దర్శనం చాలా శుభప్రదం.

రాహు-కేతు క్షేత్రాలు - ఇరట్టై తిరుపతి (తోలవిల్లిమంగళం)

నవ తిరుపతులలో తరువాత చెప్పుకోవలసినవి ఇరట్టై తిరుపతి క్షేత్రాలు. అంటే జంట తిరుపతి. ఇక్కడ ఒకే ప్రదేశంలో పక్కపక్కనే రెండు దేవాలయాలు — దేవపిరాన్ ఆలయం, అరవిందలోచనార్ ఆలయం. అందుకే దీన్ని 'ఇరట్టై తిరుపతి' (జంట తిరుపతి) అంటారు.

ఇవి రాహు కేతు క్షేత్రం. రాహు-కేతు దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు, అసంతృప్తి, అనుకోని ఎదురుదెబ్బలు రావచ్చు. ఈ జంట తిరుపతిలో ఈ రెండు దేవాలయాల దర్శనం చేసుకుంటే రాహు-కేతు పరిహారం జరుగుతుందని భక్తుల నమ్మకం.

నవ తిరుపతుల మహాత్మ్యం & గరుడ సేవ ఉత్సవం

ఈ తొమ్మిది దేవాలయాలు నాళాయిర దివ్య ప్రబంధంలో కీర్తింపబడ్డాయి. ముఖ్యంగా నమ్మాళ్వార్ ఈ క్షేత్రాలను ఎంతో పవిత్రంగా గౌరవించాడు. ప్రతి ఏడాది వైకాసి (మే–జూన్) నెలలో ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ జయంతి సందర్భంగా — తొమ్మిది క్షేత్రాల దేవతలు గరుడ వాహనంపై విచ్చేస్టారు. అత్యంత వైభవంగా జరిగే ఈ గరుడసేవ దృశ్యాన్ని ప్రశాంతమైన తామ్రపర్ణి ఒడ్డున చూడడం ఒక అద్భుతం.

Recent Posts
గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో తెలుసా?  | Nava Tirupati - Nine Abodes of Lord Vishnu
గ్రహ దోషాలు పోగొట్టే నవ తిరుపతులు ఎక్కడున్నాయో...
1000 ఏళ్ల హంపి విరూపాక్ష ఆలయం  |  అంతుచిక్కని రహస్యాలు  | hampi Karnataka temples
1000 ఏళ్ల హంపి విరూపాక్ష ఆలయం ...
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...