ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas

Vijaya Lakshmi

Published on Aug 24 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

"సృష్టికి మూలం శక్తి... ఆ శక్తికి ప్రతిరూపం ఆదిపరాశక్తి. సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన ప్రతి ప్రదేశం ఒక దివ్య శక్తిపీఠంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో అమ్మవారి దివ్యరూపాలు కొలువైన క్షేత్రాలు 'శక్తిపీఠాలు'గా విరాజిల్లుతున్నాయి. సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలుగా పురాణాలు చెబుతున్న ప్రధానమైన ఈ శక్తిపీఠాలలో 18 క్షేత్రాలను అత్యంత పవిత్రమైన 'అష్టాదశ శక్తిపీఠాలు'గా వ్యవహరిస్తారు.

అలాంటి మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో మూడు మన ఆంధ్రప్రదేశ్ లోనే వెలసి, వేల ఏళ్లుగా కోట్లాది భక్తులకు ఆశ్రయంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన 3 శక్తిపీఠాల విశిష్టత, వాటి వెనుక ఉన్న పురాణ చరిత్ర, ఆ క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, దర్శన సమయాలు, సమీప రైల్వేస్టేషన్లు వివరంగా తెలుసుకుందాం!

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శక్తిపీఠాల గురించి తెలుసుకునేముందు అసలు శక్తి పీఠాలు ఎందుకు, ఎలా ఏర్పడ్డాయి అన్న కథనం గురించి క్లుప్తంగా మననం చేసుకుందాం.

సతీదేవి కథ

దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. జరిగిన దారుణానికి ఆగ్రహించిన శివుడు సతీదేవి దేహాన్ని భుజాన మోసుకొని, సర్వం విస్మరించి తాండవం చేయడంతో, శివుడు ఇలాగే ఉంటే సృష్టి క్రమం దెబ్బతింటుందని, కాబట్టి సతీదేవి శరీరాన్ని శివుడినుంచి వేరు చేయాలని తలచి, మహావిష్ణువు సుదర్శనచక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు.ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి పీఠంలో అమ్మవారు ఒక ప్రత్యేక నామంతో, భైరవుడు మరో రూపంలో ఆరాధించబడతారు.

AP లో శక్తిపీఠాలు

ఇక ఆంధ్రప్రదేశ్ లో వెలసిన మూడు శక్తిపీఠాల గురించి చెప్పుకుంటే, అందులో మొట్టమొదట చెప్పుకోవలసినది శ్రీశైలంలో భ్రమరాంబాదేవి శక్తిపీఠం. శంకరాచార్యులవారు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాల శ్లోకం ప్రకారం 6వ శక్తిపీఠం.

భ్రమరాంబాదేవి శక్తిపీఠం

నల్లమల అడవుల మధ్య… వేల ఏళ్ల శక్తి దాగిఉన్న స్థలం… శ్రీశైలం!” ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో, మార్కాపురంకు 80 కి.మీ. దూరంలో, దట్టమైన అడవులు, పర్వతాల మధ్య ఈ క్షేత్రం ఉంది. సతీదేవి కంఠభాగం ఈ ప్రదేశంలో పడిందని చెప్తారు.

యోగులు, జ్ఞానులు, భక్తులు చేరే మహా తపోభూమి… శ్రీశైలం. ఇక్కడ ప్రతి రాయి పూజనీయమే. వీచే ప్రతి గాలివీచికలోను మంత్రధ్వనులు ధ్వనిస్తాయి. ఇదే భ్రమరాంబ శక్తిపీఠం. శ్రీశైలం శిఖరం దేవతలే ఎంచుకున్న పర్వతం. దేవి ఇక్కడ స్వయంగా భ్రమరరూపంలో నివసిస్తుందని చెబుతారు.

శ్రీశైల పర్వతం వేల ఏళ్ల క్రితం ఏర్పడిన శిఖరం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు  శ్రీ మల్లికార్జునస్వామి భ్రమరాంబదేవిగా నివసిస్తారు.

శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో ఉన్న ఏకైక క్షేత్రం

శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి, పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అంటే శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఒకే ప్రాంగణంలో ఉన్న అద్భుతమైన, పురాతన క్షేత్రం. అందుకే  హిందూధర్మంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా నిలిచింది శ్రీశైలం.

భ్రమరాంబాదేవి వెలసిన కథ

అసలు అమ్మవారు శ్రీశైలం మీద భ్రమరాంబికాదేవిగా ఎందుకు వెలసింది. దీనికి సంబంధించిన కథనం విషయానికి వస్తే, పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతను చాలాకాలంపాటు గాయత్రీమంత్రం జపిస్తూ బ్రహ్మకోసం తపస్సుచేసి మనుష్యులచేత గాని, జంతువులచేత గాని మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో అరుణాసురిడి ఆగడాలు పెచ్చుమీరడంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీమంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవగురువు బృహస్పతిని చూసి జాతివైరం ఉన్న నా దగ్గరకు నీవు రావడమేంటని ఆశ్చర్యపడ్డాడు. అందుకు నమాధానంగా బృహస్పతి, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీమంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజచేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దాంతో ఆదిశక్తి తాను భ్రమరరూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు భ్రమరరూపం అంటే తుమ్మెద రూపం ధరించి అరుణాసురున్ని సంహరించింది. అమ్మవారు ఇప్పటికీ భ్రమరరూపంతో తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడ భ్రమరనాదం వినపడుతూ ఉంటుందని, చెప్తారు. దానిని భ్రామరీనాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారంచేస్తారు.

శ్రీశైలం సకల వేదాలకూ మూలాధారంగా చెప్తారు. జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే కొండమీద, ఒకే ఆలయప్రాంగణంలో వెలసిన అరుదైన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది శ్రీశైలం. శ్రీశైలయాత్ర, వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన శ్రీశైలం పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. మరాఠా వీరకిశోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. శ్రీశైలం చుట్టూ నల్లమల అడవులు పురాతన శైవయోగులు, అఘోరుల ఆశ్రమాలున్తాయని, అందువల్ల ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక స్పందనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని నమ్మకం. ఇక్కడి పర్వతాలు రాత్రిళ్లు అఘోరమంత్రాలు, హోమధూమాలు మోస్తాయని కొందరు చెబుతారు.”

       నల్లమల అడవుల మధ్య అద్భుత ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణానది సమీపంలో ఉన్న శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబాదేవి ఆలయం.

ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం.

రైలు మార్గం

శ్రీశైలంకి సమీప రైల్వే స్టేషన్ మార్కాపురం రోడ్. మార్కాపురం రోడ్ స్టేషన్ లో దిగి అక్కడినుంచి శ్రీశైలంకి బస్సులో వెళ్ళవచ్చు.  

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలంటే, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు మరియు గుంటూరుల నుండి, రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి కూడా శ్రీశైలానికి సమృద్ధిగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.

విమాన మార్గం

విమాన మార్గం ద్వారా వెళ్ళాలంటే శ్రీశైలంకి దగ్గరలో విమానాశ్రయం  కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం లేదా హైదరాబాద్ విమానాశ్రయం. అక్కడి నుంచి కాబ్ లు, లేదా బస్సులలో వెళ్ళవచ్చు.

పిఠాపురం పురుహూతికాదేవి శక్తిపీఠం

           ఇక ఆంధ్రప్రదేశ్ లోని మరో శక్తిపీఠం పిఠాపురం పురుహూతికాదేవి శక్తిపీఠం. "కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క 'పీఠ భాగం' పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ ప్రాంతానికి 'పీఠాపురం' అనే పేరు వచ్చింది.

           ఇక్కడ అమ్మవారు పురూహుతికా దేవిగా వెలిశారు. ఈ క్షేత్రంలో ఉన్న 'పాదగయ' తీర్థంలో పితృ తర్పణాలు ఇవ్వడం మహా పుణ్యఫలంగా భావిస్తారు." ఈ క్షేత్రం దత్తాత్రేయ స్వరూపుడైన శ్రీపాదవల్లభుల జన్మస్థలంగా కూడా చెబుతారు.

పుష్కరక్షేత్రం

పూర్వం ఈ క్షేత్రాన్ని పుష్కరక్షేత్రం అని పిలిచేవారు. ఈ క్షేత్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిధ్ధి చెందింది. ఇది శివ కేశవ శక్తి క్షేత్రం. 

పిఠాపురం... అష్టాదశ శక్తిపీఠాలలో 10 వ శక్తిపీఠం వెలసిన క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్యం దిక్కుగా పచ్చనిపైరులు, గలగలా పారుతున్న పంట కాలువలు, ఉధృతంగా ప్రవహించే గోదావరినది, సముద్రతీర ప్రాంతాలతో నేత్రపర్వంగా దర్శినమిస్తుంది ఈ ప్రదేశం.

సముద్రమూ, గోదావరి నది కలిసే ప్రదేశానికి అతిసమీపంలోనున్న ప్రాచీనపట్టణం ”కాకినాడ”. తూర్పు కోస్తా ప్రాంతపు రేవులలో కాకినాడ రేవు ప్రాచీనమైనది. పిఠాపురం సంస్థానాదీశులు కాకినాడ పట్టణమును ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణమునకు ఉత్తరదిశవైపుగా సుమారు 19 కి.మీ. దూరమున పిఠాపురం అను చిన్న పట్టణము వుంది.

పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం. నాటి మహారాజుల భవనములు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినాయి. ప్రస్తుతం గతకాల వైభవానికి, ప్రాభవానికి చిహ్నాలుగా కొన్ని పుణ్యక్షేత్రాలు, పట్టణాలు మాత్రం మిగిలాయి.

అమ్మవారి పీఠము (పిరుదులు) పడ్డ ప్రదేశము గనుక ఇక్కడ అమ్మవారిని పీఠాంబిక అని పిలుస్తారు. పిఠాపురంలో ప్రసిధ్ధిచెందిన పురాతన ఆలయం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనే ఉంది ఈ శక్తి ఆలయం. ఆలయం చిన్నదే కాని, ఆలయంలోని గోడలనిండా శక్తిపీఠాలలోని అమ్మవార్ల మూర్తులతో కనువిందుగా వుంటుంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. 

పిఠాపురం ఎలా అయింది

దాక్షాయణీదేవి పీఠభాగం ఇక్కడ పడటం వలన ఈ ప్రాంతానికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. పీఠికాపురమే క్రమ్రకమంగా పిఠాపురంగా మారిందంటారు. అయితే ఈ శక్తిపీఠ దేవత గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక గ్రంధాలలోను, పురాణాలలో చెప్పే పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం ఇక్కడ లేవని, ఇక్కడ అసలైన శక్తిపీఠదేవత హుంకారిని దేవత అని, ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైల్వే స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టిదిబ్బలో భూస్థాపితమై ఉన్నదని పురావస్తు పరిశోధకశాఖవారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని స్థానికులు కథలుగా చెప్పుకుంటారు.

అమ్మవారు  పురుహూతికాదేవి విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఆ నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి. పూర్వకాలంలో ఈ అమ్మవారిని రెండురకాల ఉపాసకులు పూజించేవారు. మొదటివారు అమ్మవారిని పురుహూతలక్ష్మిగా భావించి కమలాన్ని, మధుపాత్రను ధ్యానించేవారు. వీరు సమయాచరంలో పూజలు జరిపేవారు. రెండోవర్గం వారు పురుహూతాంబగా భావించి బీజాలు మరియు పరశువుని ధ్యానించే వారు. వీరు వామాచారంలో పూజలు చేసేవారు. కొన్ని కథనాల ప్రకారం పూర్వం పూజలు జరిగిన ఆ విగ్రహాన్ని భూమిలో పాతి దానిపై కొత్తగుడి కట్టారని చెప్తారు. ఇక్కడి అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

పురుహూతికా దేవి అంటే...

ఇక ఈ అమ్మవారికి పురుహూతిక అనే పేరు రావటానికి ఒక కధ చెబుతారు. పూర్వం ఇంద్రుడు, గౌతమమహర్షి భార్య అయిన అహల్యని మోసం చేయడం, దాంతో గౌతమమహర్షి శాపానికి గురవడం పురాణ కథనాల్లో వింటుంటాం. ఆ శాపం పోగొట్టుకోవటానికి ఇంద్రుడు జగన్మాత కోసం తపస్సుచేసి, ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయిందని పురాణ కథనం.

శ్రీ వ్యాసభగవానులు సతీసమేతంగా కాశీనగరం విడిచి, దక్షిణకాశీ అయిన పిఠాపురం నందలి పాదగయ తీర్థమున స్నానముచేసి, శ్రీహుంకారిణి సహిత శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించుకున్నారట. శ్రీ అగస్త్యులు కూడా సతీసమేతంగా ద్వాదశ క్షేత్రయాత్ర సలుపుతూ భీమమండలం నందలి శ్రీ కుక్కుటేశ్వరస్వామిని, శ్రీ పురుహూతికాదేవిని ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 14వ శతాబ్దం వాడైన శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యమునందు ఈ క్షేత్రమును పీఠికాపురం, పీఠాపట్టణము మరియు పిఠాపురముగా వర్ణించాడు.

పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఉంది. రాజమండ్రికి 62 కి.మీ. సామర్లకోటకు12 కి.మీ దూరంలో ఉంటుంది.

ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి (Travel Guide):

రైలు మార్గం:

ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. పిఠాపురంలో రైల్వే స్టేషన్ (Pithapuram - PAP) ఉంది. అలాగే ప్రధాన రైల్వే జంక్షన్ అయిన సామర్లకోట (Samalkot - ~12 km) కు అతి సమీపంలో ఉంది.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలంటే కాకినాడ, రాజమండ్రిల నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

విమాన మార్గం:

రాజమండ్రి విమానాశ్రయం (~60 km)రాజమండ్రి విమానాశ్రయం నుంచి కేబ్ లలో వెళ్ళవచ్చు.

శ్రీ మాణిక్యాంబాదేవి శక్తిపీఠం

ఆంధ్రప్రదేశ్ లో మరో శక్తిపీఠం  ద్రాక్షారామం. ఇది సతీదేవి "కణత భాగం" పడిన ప్రదేశం, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 12 వ శక్తిపీఠం.

ఈ క్షేత్రం దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశంగా చెప్తారు. ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటిగా ... త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.

ఇక శక్తిపీఠం విషయానికి వస్తే  ద్రాక్షారామ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీతీరంలో మహామహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో అమ్మ మాణిక్యాంబదేవి శక్తిపీఠదేవతగా విరాజిల్లుతోంది. మాణిక్యాంబాదేవి విగ్రహాన్ని ఆదిశంకరులవారు ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఆధారాలు చెబుతున్నాయి.

దక్షుని యజ్ఞం జరిగిన స్థలం

దక్షుని కుమార్తెలలో ఒకరైన సతీదేవికి, పరమేశ్వరునికి ఇక్కడే వివాహం జరిగిందని చెప్తారు. నవబ్రహ్మలలో ఒకరైన దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినట్లు పురాణ కథనం. అందుకనే ఈ ప్రాంతం ‘దక్షవాటిక’ అయింది.

దక్షారామమా? ద్రాక్షారామమా?

దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రమ్ దక్షారామం అని పేరు పొంది ఆ తరువాతికాలంలో 'దాక్షారామం', క్రమంగా 'ద్రాక్షారామం' అని పేర్లను సంతరించుకొంది

సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఒక బృహత్‌ యజ్ఞాన్ని తలపెట్టి, తన అల్లుడైన శివుణ్ణి తప్ప అందరు దేవతల్నీ ఆహ్వానించాడు. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళదాం అని శివుణ్ణి అడుగుతుంది. పిలవని పేరంటానికి వెళ్లడం తనకిష్టం లేదని తిరస్కరిస్తాడు శివుడు. భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిశ్చయించుకొంటుంది. తల్లితండ్రులు తనను ఆదరిస్తారనీ, అక్కున చేర్చుకుంటారనీ భావించిన సతీదేవికి దక్షవాటికలో ఆదరణ కాదు అవమానం ఎదురయింది. అవమానాన్ని భారించలేక ముఖ్యంగా తన తండ్రి భర్తను నిందించడం భరించలేక ఆమె అక్కడే ప్రాణత్యాగం చేసింది. దాక్షాయణి కాలి బొటన వేలితో నేలపై రాసి నిప్పు రవ్వలు సృష్టించి ఆ యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకొంటుంది. సతీ వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపటలం అయిన దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మశరీరాన్ని భుజస్కందాలపై ధరించి, నటరాజు విలయ తాండవం చేస్తాడు.  శివుడ్ని మామాలు స్థితికి తీసుకురావడానికి శ్రీమహావిష్ణువు తన చక్రంతో ఆమె దేహాన్ని ఖండాలుగా చేశాడు. 18 భాగాలుగా మారిన ఆ శరీరభాగాలు పడిన ప్రాంతాలు 18 శక్తి పీఠాలయ్యాయి. ఆ శక్తిపీఠాలలో ద్రాక్షారామం 12వ శక్తిపీఠమయింది.

ఇక్కడ శివుడు భీమేశ్వరస్వామిగా దర్శనమిస్తారు. ఒకే ఆలయంలో శైవం, శాశాక్తేయ  కలయికగా చెప్తారు. తూర్పు చాళుక్యుల శిల్ప వైభవానికి పెట్టింది పేరు దాక్షారామ క్షేత్రం.

ఎలా వెళ్లాలి?

సమీప రైల్వే స్టేషన్: ద్రాక్షారామం (లేదా కాకినాడ/రాజమండ్రి)

సమీప విమానాశ్రయం: రాజమండ్రి

ఇక రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలంటే, రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సు సౌకర్యం.

        ఇవి ఆంధ్రప్రదేశ్ లోని మూడు శక్తిపీఠాలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ మూడు మహా శక్తిపీఠాలు... కేవలం ఆలయాలు మాత్రమే కాదు... మన సంస్కృతి, పురాణ సంప్రదాయం, భక్తి, ఆధ్యాత్మికతకు జీవంతమైన చిహ్నాలు.

మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాలను తప్పక దర్శించండి. 


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...