Vijaya Lakshmi
Published on Oct 16 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?కార్తికమాస విశిష్టత
మాసాలలో విశిష్టమైన మాసం కార్తికమాసం అంటారు. కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అంటారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో అంటే నదులలోను చేరువుల్లోను స్నానం చేయడం, ఆ దేవదేవునికి నిత్యమూ అభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం, రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం... ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో సంప్రదాయాల సమాహారం కార్తీకం. మాఘ మాసం స్నానానికీ, వైశాఖమాసం దానానికీ, కార్తికమాసం దీపానికీ ప్రశస్తమైనవి అంటారు. అయితే స్నానం, దీపం, దానం, ధ్యానం... ఇలా అన్నిటికి ప్రశస్తమైన మాసం కార్తీకమాసం అని చెప్తారు.
కార్తీకమాసం ప్రాశస్త్యం, విశిష్టతలు
కార్తీకమాసం శివకేశవులకే కాదు అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చిన మాసానికి ‘కార్తిక మాసం’ అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించడమే దీప యజ్ఞంగా చెప్తారు.
కార్తీకమాసంలో వేకువనే స్నానం చేసి, ఇంట్లోను ఆలయాల్లో దీపాలను వెలిగిస్తాం. ఇవన్నీ కూడా అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించే తత్త్వానికి సంకేతంగానే చెప్తారు. అలా కార్తికంలో స్నానం, దీపం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని కూడా పురాణాలు చెప్తున్నాయి.
కార్తిక స్నానం ప్రాధాన్యత
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలోగాని చెరువుల్లోగాని అవేవీ అందుబాటు లేనప్పుడు ఇంట్లో అయినాసరే, తలస్నానం చేయాలి. అలా తెల్లవారుఝామునే లేచి తలస్నానం చేస్తేనే అది కార్తీకస్నానం అవుతుంది. ఇలా చేసే స్నానం కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
కార్తిక దీపం
కార్తీకమాసంలో స్నానం తరువాత మరో ముఖ్యమైన అంశం దీపం. కార్తీకంలో దీపారాధన అత్యంత మహామహిమాన్వితమైనదిగా చెప్తారు. కార్తీకమాసంలో ఎవరైనా, తెలిసిగాని, తెలియకగాని, ఇంట్లో గాని, ఆలయంలో గాని ఎక్కడైనా సరే దీపం పెట్టడం వలన వచ్చే ఫలితం వారి సర్వ పాపాలు హరింపవేస్తుందని పురాణ కథనం. కార్తీకంలో దీప దానం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీపదానం వలన నరకభయం ఉండదని చెప్తారు. సూర్యా స్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసిపూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థికబాధలు తొలగుతాయని కూడా చెప్తారు.
కార్తికంలో ఆహార నియమాలు
ఇక కార్తీకమాసములో ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు, మాంసాహారం భుజించుట కూడా నిషిద్ధమని పురాణాలు చెప్తున్నాయి.
పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగురంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పూరాణము చదివినవారికి, వినినవారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెబుతోంది.
కార్తికంలో ఉసిరి ప్రాధాన్యత
కార్తీక మాసంలో ధాత్రి అంటే ఉసిరికి కూడా ప్రాధాన్యత ఉంది. ఉసిరిక లక్ష్మీదేవికి నివాసమని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైందని చెప్తారు. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుదని నమ్ముతారు. ఉసిరివృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదరుడ్ని పూజించి, బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేస్తారు. ఇవే వన భోజనాలుగా ప్రసిద్ధి చెందాయి.
శివ,కేశవులకు ఇష్టమైన మాసం
కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో నదీస్నానం... దీపారాధన.. జపతపాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ మాసంలో చేసే దానధర్మాలు అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఈ మాసంలో ఎవరికి తోచినంతలో వాళ్లు దాన ధర్మాలు చేస్తుంటారు. కార్తీకమాసంలో ఏ వస్తువును గాని ఏ చిన్న దానం చేసినా అది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుందని పురాణంలో చెబుతారు.
కార్తికంలో పండుగలు
ఇక పండుగల విషయానికి వస్తే కార్తీక మాసమంతా పండుగలే. బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం, నాగుల చవితీ, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తిక సోమ వారములు, ఇలా ఎన్నో పున్యదినాలు...పర్వదినాలు.
శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో శయన ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని బోధన ఏకాదశి, దేవ ప్రభోధీని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున, రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగరణ చేసి విష్ణు నామ స్మరణతో గడిపి మరుసటి రోజు భక్తితో విష్ణుమూర్తిని అర్చించి, శక్తి కొలది బ్రాహ్మణులకు, భోజనం పెట్టాలి. మన శక్తిని అనుసరించి ధన, కనక, వస్త్ర దానము లియ్యవలెను. ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువను శ్రద్ధతో పూజించి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి.
క్షీరాభ్ది ద్వాదశి
కార్తీక మాసం శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి గా పిలుస్తారు. అమృతం కోసం క్షీర సాగర మధనం జరిగిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశియనీ పిలుస్తారు. మధనం అంటే చిలుకుట యని అర్ధం కనుక చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు.ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రిని (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. లక్ష్మీ నారాయణుల కళ్యాణం చేస్తారు. తులసి కొమ్మలను ఉసిరి కొమ్మలను కలిపి, దీపాలను వెలిగించి, శ్రద్ధగా పూజలు చేసుకుంటారు.
ఇక కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున, రోజంతా ఉపవాసముండి, 365 వత్తులతో దీపములను వెలిగించి పూజిస్తారు. ఉసిరిక దీపాలు, అరటి దీపాలు వెలిగిస్తారు. అరటి దీపాలు, ఉసిరి దీపాలు అంటే ఉసిరికాయను ప్రమిదవలె చేసి, లేత అరటి కాడను వత్తిగా అమర్చి దీపాలను వెలిగిస్తారు. అవకాశం ఉన్నవారు అరటి దోప్పలలో దీపాలు వెలిగించి నదులలో, కొలనులలో, చెరవులలో వదులుతారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేయటం చాలా పుణ్యం.
పరమేశ్వరుడు అల్ప సంతుష్టుడు. భోలాశంకరుడు. శివ లింగానికి కాసిని నీళ్ళతో అభిషేకిస్తే చాలు ప్రసన్నుడవుతాడు. అందుకే అవకాశం ఉన్న వాళ్ళు ఇంటివద్ద కానీ, దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం చేయించటం చాలా మంచిదని కూడా పురాణాలు చెప్తున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కార్తీక మాసం మించిన సమయం మరొకటి లేదని చెప్తారు. అందుకే కార్తికంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. అయ్యప్పస్వామి వారి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతల సమాహారం కార్తీక మాసం.