Vijaya Lakshmi
Published on Aug 06 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?కర్మభూమి, ఆధ్యాత్మిక భూమి, వేదభూమి ఇలా ఎన్నో విశేషణాలతో పిలుస్తారు భారతదేశాన్ని. అలాంటి భారతదేశంలో అద్భుతమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయం ఒక ప్రత్యేక చరిత్రతో ముడిపడి ఉంటుంది. ఎన్నో రహస్యాలు మరెన్నో అద్భుతాలకు నిలయమైన, మహిమాన్వితమైన, అద్భుతమైన 5 శివాలయాల గురించి తెలుసుకుందాం...
అతి రహస్యమైన శివాలయాల్లో ప్రధానమైనది స్తంభేశ్వర్ మందిర్. ఆ స్తంభేస్వార్ మందిర్ గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. దీనినే స్తంభేస్వార్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు.
అరేబియా సముద్రతీరంలో ఉన్న ఈ స్తంభేస్వర ఆలయం ప్రస్తావన స్కందపురాణంలో కూడా ఉందని చెప్తారు. ఈ స్తంభేస్వర్ ఆలయం నిరంతరం అరేబియా సముద్రంలో మునిగి ఉంటుంది. అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయ దర్శనం. సముద్రపు అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతూ భక్తులు ఆలయంలోకి వెళ్లే అవకాశం వస్తుంది. మళ్లీ అదే క్రమంలో క్రమక్రమంగా సముద్రంలోకి మునిగిపోతుంది.
ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని చూడడం కోసం భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అరేబియా సముద్రతీరం వద్దనే వేచి ఉంటారు. ఈ వింతతో పాటు 4 అడుగుల పొడవు 2 అడుగుల వ్యాసం తో ఉండే ఈ శివలింగం చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా మారుతూ దర్శనమిస్తుంది. స్కంద పురాణం, శివపురాణం రుద్ర సంహిత మొదలైన గ్రంధాలలో ప్రస్తావించబడినట్టు చెప్పే ఈ శివలింగానికి ఆలయం మాత్రం సుమారు 150 ఏళ్ల క్రితమే నిర్మించబడిందట.
ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం శివభక్తుడైన తారకాసురుడనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి, శివుడిని మెప్పించి కేవలం ఆరురోజుల ఆయుష్షు కలిగిన వాడు, ఆరుముఖములు కలిగినవాడు, నీపుత్రుడైన వాడితోనే తన సంహారం జరగాలి తప్ప ఇతరుల చేతిలో మృత్యువాత పడగూడదని వరాన్ని పొందాడు. వరగర్వంతో ముల్లోకాలను జయించి లోకాన్ని పీడిస్తూ ఉండగా, దేవతలు వాడి పీడనుండి విముక్తులను చేయమని మహాదేవుని కోరారు. ఆవిధంగా లోకరక్షణార్థమై షణ్ముఖుడైన కార్తికేయుని జననం జరిగింది. భగవానుడైన షణ్ముఖుని చేతిలో ఆ తారకాసురుడు సంహరించబడ్డాడు. తారకాసురుడు లోకకంటకుడే అయినా మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు చాలా బాధపడ్డాడట. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు.
కార్తికేయుని బాధను చూసిన విష్ణుమూర్తి ఒక సలహా చెప్పాడు. ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ అందువలన ఒక శివలింగాన్ని స్థాపించి పూజించమని చెప్పాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.
రోడ్డు మార్గం ద్వారా వడోదర నుండి 75 కి.మీ.దూరంలో కవికంబోయి ఉన్నది. వడోదర నుంచి ప్రైవేట్ కాబ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక రైలు మార్గం ద్వారా కూడా కవికంబోయ్ స్టేషన్ కి చేరుకొని ఆలయానికి వెళ్ళవచ్చు.
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. వాటిని గురించి వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటి ఓ మహాద్భుత శివాలయమే నిష్కలంక్ మహాదేవ మందిర్.
ఈ గుడిలోకి వెళ్ళాలంటే సాహసయాత్రే అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం సముద్రపు అలలు వుప్పొంగినా, సమయం దాటిపోయినా, మనం సముద్రంలో కలిసి పోవలసిందే.
ఈ నిష్కళంక మహాదేవ మందిర్ గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపంలోవున్న కులియాక్ అనేగ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కి.మీ లోపల వుంది ఈ టెంపుల్. మామూలు సమయాల్లో సముద్రంలో కేవలం ఒక జెండా మాత్రమె కనిపించే ఈ ఆలయం మధ్యాహ్నంపూట మాత్రమె కనబడుతుడి. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కివెళుతుంది.మధ్యాహ్నమంటే సుమారు 1గంట సమయంలో అలా సముద్రం వెనక్కివెళ్ళిన తర్వాత ఆ ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళాలి.
మళ్ళీ కొన్ని గంటలలోనే సముద్రం మళ్ళీ ముందుకు వస్తుంది.గుడిని ముంచెత్తుతుంది. దాంతో గుడి కనిపించదు. పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. కేవలం ఆలయ జెండా మాత్రమే కనబడుతుంది,ఇది అక్కడ జరిగే అద్భుతం.ఆలయంలో ఎత్తుగావుండేది ధ్వజస్థంభం.సుమారు ఆ లెవల్ వరకు అంటే 20మీలఎత్తు నీళ్ళు వచ్చేస్తాయ్. ఆ లోపలే ఆలయ దర్శనం చేసుకొని వచ్చేయాలి లేకపోతే సముద్రంలో మునిగి పోవలసిందే. ఇలాగ కొన్ని వందల, వేల సం||ల నుంచి జరుగుతుందట అక్కడ.
ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. పాండవులు పూజలుచేసి ప్రతిష్టించిన 5శివలింగాలు ఇప్పటికి ఆలయంలో చెక్కు చెదరకుండా వున్నాయ్. పౌర్ణమిలో చంద్రుని వెన్నెల కాంతిలో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా గుడిని తీసుకుపోవటం అద్భుతంగా కనిపిస్తుందట అక్కడ. పాండవ కౌరవ యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు జయకేతనం ఎగురవేశారు.
ఎంతోమంది రక్తసంబంధీకులనూ పెద్దలనూ ఈ యుద్ధంలో భాగంగా చంపాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. అదే విషయాన్ని కృష్ణభగవానుడికి విన్నవించుకున్నారు. అందుకు పరిష్కారంగా ఆయన పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. 'ఈ ఆవును వదిలేయండి. ఈ జెండా చేత పట్టుకొని దాని వెంట నడవండి. ఏ ప్రాంతంలో అయితే ఆ ఆవు రంగూ, జెండా రంగూ తెల్లగా మారతాయో, అక్కడే మీరు పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించండి' అని చెప్పాడు.
పాండవులంతా ఆ ఆవునడచిన దారిన నడిచారు.
ఓ రోజు సముద్ర తీరం వెంట నల్లావు ప్రయాణించ సాగింది. అలా నడుస్తూ ఉండగా ఓ చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే సోదరులంతా కూర్చుని మహాదేవుడ్ని ధ్యానించారు. భోళాశంకరుడు కరిగిపోయాడు. ధ్యానముద్రలో ఉన్న ఆ ఐదుగురు అన్నదమ్ముల ముందూ ఐదుశివలింగాల రూపంలో ఉద్భవించాడు. ఆ శివలింగాలను చూసిన పాండవులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.
అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిలుచుంటే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. అదే శివుడు వెలసిన ప్రాంతానికి గుర్తు. పోటు తగ్గినప్పుడు కాలి నడకన ఇక్కడికి వెళ్లొచ్చు. 500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఆ ప్రాంగణంలోనే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి. అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి.
17వ శతాబ్దంలో భావ్‌నగర్ మహారాజు భావ్‌సింగ్ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు. ఆ రోజు భావ్‌నగర్ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు.
మరుసటేడాది మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలు సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు.
దేశంలో అతిప్రాచీన దేవాలయాలు అనేకం. అందులో అత్యంత మహిమలు కలిగిన ఆలయాలు కూడా ఎన్నో.. అలాంటి అలయాల్లో ప్రత్యేకలు వున్న అలయాలు కూడా అనేకం. అలాంటి విశిష్టత, ప్రాముఖ్యత, ప్రత్యేకత కలిగిన ఆలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ అలాయం కూడా ఒక్కటి. ఈ శివాలయంలో లింగస్వరూపూడిగా దర్శనమిచ్చే పరమేశ్వరుడు.. సాలగ్రామస్వరూపుడిగా వుంటాడు, స్వతహాగా శివలింగం సాలగ్రామరూపంలోనూ లేదా స్పటిక రూపంలో శ్వేతవర్ణం వుంటాయి.
మూడు రంగుల్లో శివలింగం
అయితే అచలేశ్వర మహాలింగం మాత్రం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ శివలింగం రోజుకూ మూడు రంగుల్లో కనిపిస్తూ భక్తులకు అభయప్రధానం చేస్తుంది, రోజుకు మూడుకాలలుగా పరిగణించడం అనాదిగా వస్తుంది. అందుకనే త్రికాలం యం పఠేనిత్యం.. అంటూ మంత్రాలలో కూడా చేర్చివుంది. అలాగే ఇక్కడ శివలింగం రోజులో మూడుసార్లు రంగులు మారుతూ ఉంటుంది. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో మరియు సాయంత్రం వేళ చామనఛాయగా కనిపిస్తుంది.
ఈ శివలింగం ఎందుకిలా రంగులు మారుతుందో అని చాలా పరిశోధనలే చేసారట. కొందరు పరిశోధకులు సూర్యుని కాంతి శివలింగం మీద పడటం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నా, ఇప్పటి వరకు సైన్టిఫిక్ గా ఎవరూ నిరూపించలేదట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆలయంగా చెబుతారు అక్కడి స్థానికులు. ఆలయంగా శివుడిని లింగ రూపంలో పూజిస్తారు.
అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే శివుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. అయితే అఛల్ ఘర్ లోని అఛలేశ్వర మహాదేవ్ ఆలయంలో మత్రం శివుడి కుడికాలు బొటన వేలును పూజిస్తారు. ఈ బొటన వేలుకు విశేష పూజలు చేయడం పురాణ కాలం నుంచి వస్తోందని చెబుతారు. ముఖ్యంగా ఈ బొటన వేలుకు శివుడికి ఇష్టమైన రోజులైన సోమవారం, శివరాత్రి, పౌర్ణమి తదితర రోజుల్లో ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు. ఆ జలం పరమ పవిత్రమైనదిగా భావించి భక్తులు దానిని ఇళ్లకు కూడా తీసుకువెళుతారు.
కాశీని సందర్శించడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పూజలు చేయడం వల్ల అందులో సగం వస్తుందని భక్తుల నమ్మకం అందువల్లే ఈ మౌంట్ అబులోని ఈ అచలేశ్వర్ దేవాలయాన్ని అర్థ కాశీ అని స్థానికంగా పిలుస్తారు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే 108 శివుడి దేవాలయాలు ఉన్నాయి.
స్కంధ పురాణం ప్రకారం భూలోక పర్యటన చేసే సమయంలో ఈ మౌంట్ అబు పర్వతానికి శివుడు ఒకసారి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటు వంటి సాధు పుంగవులు ‘స్వామి మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటూ మమ్ములను అనుగ్రహించండి' అని వేడుకున్నారు. ఇందుకు స్వామి వారు నేను ఒకే చోట ఉండటం కుదరదు. అయితే నా శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలి బొటనవేలుకు సంబంధించిన గుర్తును ఇక్కడ వదిలి వెలుతున్నానని చెబుతాడు. దీనిని పూజిస్తే నన్ను పూజించినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరో కథనం ప్రకారం ఈ మౌంట్ అబు పూర్వ కాలంలో అర్బుదారణ్యం అని పిలిచే వారు. ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల ప్రజలు, ప్రాణులు నశించేవి. సమస్య పరిష్కారం కోసం శివుడు తన కాలి బొటనవేలితో తొక్కి పెట్టారని అందువల్లే ఇక్కడ శివుడి బొటనవేలును పూజిస్తారని చెబుతారు.
ఇక్కడి మరొక ఆకర్షణ నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్ని పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు, ముస్లీమ్ ఆక్రమణదారులు ఈ ఆలయం మీద దండెత్తినప్పుడు ఈ విగ్రహం తేనెటీగలతో దాడి చేసిందట. ఆలయం లోని శివలింగం స్వయంభూ లింగాలలో ఒకటి. కొంత మంది ప్రజలు శివలింగం స్వయంభూ కదా? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు. ఇలా ఎన్నో అద్భుతాలను, రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న ఆలయం అచలేశ్వర్ మహాదేవ మందిర్.
ఈ బిజిలి మహాదేవ మందిర్ హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. 12 ఏళ్లకోసారి ఇక్కడొక అద్భుతం జరుగుతుంది. బిజిలి మహాదేవ్ మందిర్ గుడిపై 12 ఏళ్లకోసారి ఉరుములు… మెరుపులతో పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ మందిరం మాత్రం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు.
మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అసలక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది.
దీని వెనకున్న మిస్టరీ ఏంటో కనిపెట్టడానికి పరిశోధకులు పరిశోధనలు చేస్తుంటే ఇది కేవలం శివలీల అని భక్తిపారవశ్యంలో మునిగిపోతారు భక్తులు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. కొన్ని రహస్యాలు అంతే ఎప్పటికీ అంతుచిక్కవు.
ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం. అయితే ఇలా జరగడానికి ఒక పురాణ కథనం ప్రచారమో ఉంది.
పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం.
అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల స్థలపురాణ కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని… ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి.
ఈ లక్ష్మేస్వర్ మందిర్ లక్ష్మణుడు స్థాపించినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఖరోద్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఖరోద్.
ఈ క్షేత్రానీకున్న ప్రాధాన్యతను బట్టి దీనిని ఛత్తీస్గఢ్ కాశీ అని కూడా పిలుచుకుంటారు. శ్రీరాముడు ఖరదూషణాదులను ఇక్కడే సంహరిమ్చినట్టు చెప్తారు. అందుకే ఈ ప్రాంతానికి ఖరోద్ అని పేరొచ్చినట్టుగా కూడా ఓ కథనం ఉంది. చెప్పుకోవలసిన విషయమేమిటంటే ఈ శివలింగం లక్షశకలాలతో కూడి ఉంటుంది. అందుకే దీనిని లక్షలింగ్ అని కూడా పిలుస్తారు. ఈ లక్ష లింగాలలో ఒక ఒకటి పాతాళంలోకి ఉంటుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే ఆ లింగంలో ఎంత నీరు పోసినా లోపలి ఇంకిపోతుంది తప్ప బయటకు రాదు.
ఒక్కటిగా ఉన్న ఈ లక్షలింగాలను అభిషేకించిన జలం అక్కడ ఉన్న ఒక కుండంలోకి చేరుతుంది. ఇది ఎప్పటికీ ఎండిపోదట. అందుకే ఇది అక్షయకుండ్ అని ప్రసిద్ధి చెందింది. ఈ లక్షలింగ్ భూమ్మీద నుంచి 30 అడుగుల ఎత్తుంటుంది. రావణ వధ జరిగిన తరువాత అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు విపరీతమైన చర్మవ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. అప్పుడు ఈ ప్రదేశంలో లక్ష శివలింగాలను చేసి శివుడిని ఆరాధించాడు. దాంతో శివుడు ప్రసన్నుడై ఆ వ్యాధిని నయం చేసాడని అప్పుడు లక్ష్మణుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించాడని స్థల పురాణం చెప్తోంది. ఆ లక్షలింగాల కలయికే ఈ లక్ష్మేస్వార్ మందిర్ లోని శివలింగం.