Vijaya Lakshmi
Published on Jul 13 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?తిరుమలలో గరుడవాహన సేవకు విశిష్టమైన స్థానం ఉంది. మామూలు రోజుల కన్నా గరుడవాహన సేవ రోజు మరింత రద్దీగా మారతాయి తిరుమల మాడవీధులు. గరుడవాహనం మీద ఊరేగే స్వామిని కనులారా దర్శించాలని తహతహలాడతారు వెంకన్న భక్తులు. అలాంటి తిరుమల వేంకటేశ్వరుని భక్తులకు ఈ నెల మరింత భాగ్యం కలగబోతోంది.
ప్రతినెల పౌర్ణమి రోజున ఈ విశిష్టమైన గరుడవాహన సేవ నిర్వహిస్తారు. అయితే జూలై మాసంలో ఈ భాగ్యం రెండుసార్లు కలగనుంది. జులై మాసంలో గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నట్టు ttd ప్రకటించింది.
జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. స్వామి వారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ. గరుడుడిని వేదస్వరూపుడిగా వర్ణించారు వేదాలు, ఆచార్యులు. అందుకే గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, పాపలు ప్రక్షాళన కావడం మాత్రమే కాదు సర్పదోష నివారణం జరుగుతుందని , దివ్యమైన జ్ఞానం కలుగుతుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. అందుకే గరుడుని మీద విహరించే స్వామిని దర్శించుకోడానికి తహతహలాడతారు భక్తులు.
దాసునిగా, భక్తునిగా చెలికానిగా వాహనంగా ఎదో ఒక విధంగా నిరంతరం ఆ శ్రీమన్నారాయణుని సేవించే వైనతేయడు గరుడుడు పున్నమి సందర్భంగా వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని నాలుగు మాడవీధుల్లో విహరిస్తాడు. 108 వైష్ణవ దివ్యదేశాలలో స్వామికి జరిగే ఉత్సవాలలో కూడా ఈ గరుడవాహనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంత ప్రధానమైనది కాబట్టే తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది. ఇక బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సేవ లో కంటే పున్నమి నాడు జరిగే గరుడ వాహన సేవకు మరో ప్రత్యేకత ఉంది. స్వామివారు మాడవీదులలో ఊరేగుతున్నపుడు కొన్ని చోట్ల ఆగి, హారతి స్వీకరించడం భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. అలా స్వామి గరుడవాహనం మీద ఉన్నప్పుడు ప్రదక్షిణ మార్గంలో నాలుగు సార్లు దర్శం చేసుకుంటే నాలుగు తరాల వారికి ఉత్తమగతులు లభిస్తాయని చెప్తారు.
అయితే బ్రహ్మోత్సవాలలో అలా ప్రదక్షిణ మార్గంలో నాలుగు సార్లు స్వామిని దర్శించుకోడం అసాధ్యం కాబట్టి పున్నమి గరుడసేవలో ఇలా దర్శించుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి అలా దర్శించుకోవాలని పండితులు చెప్తారు. స్వామివారికి జర్గే బ్రహ్మోత్సవాలలో కూడా అయిదోరోజు రాత్రి జరిగే ఈ గరుడవాహన సేవకు ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాదు, శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాల సమయంలో బ్రహ్మోత్సవాలకు వేంచేయమని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే.
ఏడాదిలో అన్నిరోజులూ ధ్రువబేరానికి అంటే గర్భాలయంలో మనందరం దర్శించాలని తహతహలాడే స్వామివారి మూల విగ్రహానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. గరుడ వాహనంపై ఉన్న మలయప్పస్వామికి ద్రువబేరంగా ఉన్న స్వామికి ఎలాంటి బేధం లేదని చెప్పడమే ఈ అలంకరణ వెనక ఉన్న ఉద్దేశ్యమని చెప్తారు పెద్దలు. అదేవిధంగా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసి మాలలు పుష్పమాలికాలను గరుడ వాహనం పై విహరించి శ్రీవారికి అలంకరించటం పరిపాటి. ఉభయ దేవేరులతో కలిసి మాడవీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఈ గరుడవాహన సేవలో మాత్రం ఒంటరిగా వైనతేయుడుని అధిరోహించి దర్శనమిస్తారు భక్తులకు.
గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శించడం అత్యంత పవిత్రమని పురాణాలు చెప్తున్నాయి. సకల సౌభాగ్యాలు కలుగుతాయని, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ముక్తిని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గరుడవాహన సేవ అంత విశిష్టత సంతరించుకుంది. ఈ వాహన సేవలో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు తహతహలాడతారు.