Vijaya Lakshmi
Published on Aug 22 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?గణేశ చతుర్ధి, వినాయక చవితి... పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరికీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నిచ్చే పండుగ. మరికొన్ని రోజుల్లో రాబోయే వినాయకచవితికి అప్పుడే వాడవాడలా సన్నాహాలు మొదలయిపోయాయి.
గణేశ ఉత్సవాలంటేనే సామూహిక సంబరాలకు నెలవు. ఊరు, వాడా, పల్లె, పట్టణం అన్నీ హోరెత్తిపోతుంటాయి. గణేశ ఉత్సవాల నెలరోజులు ఉత్సవాల సన్నాహాలు, చందాల వసూళ్లు, గణేశుడిని తేవడం, నిలబెట్టడం, అక్కడినుంచి ప్రతిరోజూ ప్రతి వీధి హోరెత్తిపోతుంది. సందడే సందడి. మరి ఏ ఇతర పండుగకు లేనంత సంరంభం గణేశ ఉత్సవాలకు ఉంది.
అప్పటి వరకు నువ్వెవరో, నేనెవరో అన్నట్టున్న జనం ఈ ఉత్సవాలలో మాత్రం కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటారు. అదిగో అక్కడే.. ఆ పోయింటే పట్టుకుని ఈ సామూహిక ఉత్సవాలకు నాంది పడిపోయింది. ముఖ్యంగా పరాయి పాలనలో, మన ఇంట మనమే భయపడుతూ బ్రతుకుతున్న తరుణంలో స్వాతంత్ర్యఉద్యమంలో గణేశ ఉత్సవాలు ప్రముఖమైన పాత్ర వహించాయి. అంతవరకూ ఇళ్ళలో ఎవరికీ వారు జరుపుకునే వినాయకచవితి పండుగ వీధుల్లోకి వచ్చింది. ఉత్సవంగా రూపుదిద్దుకుంది.
ఇంతకీ ఈ గణేశ ఉత్సవాలు సామూహికంగా జరుపుకోవడం ఎప్పుడు ప్రారంభం అయింది? ఎందుకు ప్రారంభం అయ్యాయి? స్వాతంత్రోద్యమంలో ఈ సామూహిక గణేశ ఉత్సవాలకు నాంది పడినట్టు కొన్ని చరిత్ర కథనాలు చెబుతుంటే, సాధారణ శకానికి పూర్వమే ఈ సామూహిక వినాయక చవితి ఉత్సావాలు జరిగినట్టు మరికొన్ని కథనాలు చెబుతున్నాయి.
ఇళ్ళల్లో భక్తితో జరుపుకునే ఈ పండుగ సామాజిక పండుగగా మార్చిన ఘనత లోకమాన్య బాలగంగాధర తిలక్ దే. మరాఠా ప్రాంతానిదే. 1983లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్... చవితి వేడుకను సామాజిక పండుగగా మార్చారు.
అప్పట్లో... స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ... బ్రిటిష్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిన సమయంలో, ముఖ్యంగా సామాజిక, రాజకీయ సమావేశాలపై గట్టి నిషేధం విధించడంతో బాలగంగాధర్ తిలక్ తమ సమావేశాలకు ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టుకున్నారు. ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి, ప్రజలందరినీ ఒక్కదగ్గర చేర్చడానికి సరైనదిగా వినాయక చవితి పండుగను ఎంచుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ పండుగగా జరపడం మొదలుపెట్టారు.
పేద, ధనిక, వర్ణ భేదాలు లేకుండా అందరూ ఏకతాటి పైకొచ్చి సామూహికంగా వేడుకలను జరుపుకుంటే ప్రజల మధ్య తారతమ్యాలు సమసిపోతాయని, తద్వారా ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని భావించారు బాలగంగాధర్ తిలక్. అందుకే గణేష్ వేడుకలను తిలక్ బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా నిర్వహించడం మొదలుపెట్టారు.
1983లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్... చవితి వేడుకను సామాజిక పండుగగా మార్చారు. బ్రిటిష్ పరాయి పాలనలో స్వేచ్చావాయువులు పీల్చడం కోసం భారతీయులు వెల్లువలా ఉద్యమించిన వేళ... స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం... ఆ సమయంలో భారతీయులు ఒకచోట కూడితే తమకు, తమ మనుగడకు ప్రమాదమని భావించిన బ్రిటిష్ వారు ఎన్నో ఆంక్షలు విధించారు. స్వాతంత్య్రం కోసం ఎక్కడైనా కూడి సమావేశాలు ఏర్పాటు చేసి తమపై తిరుగుబాటు చేస్తారనే భయంతో నిషేధాలు అమలు చేసారు.
ముఖ్యంగా సామాజిక, రాజకీయ సమావేశాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒకచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటిష్ ప్రభుత్వం సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధించడంతో తిలక్ ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నారు.
అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ పండుగగా జరిపారు. పేద, ధనిక, వర్ణ భేదాలు లేకుండా అందరూ ఏకతాటి పైకొచ్చి సామూహికంగా వేడుకలను జరుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఏర్పడవని... వారందరూ ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ నమ్మారు. అందుకే గణేష్ వేడుకలను తిలక్ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ఆధ్యాత్మిక ఉత్సవాలలో కలుసుకొని స్వాతంత్రోద్యమం సమాలోచనలు జరిపేవారు. తమ ఉద్యమానికి ప్రణాళికలు వేసుకునేవారు. లక్ష్యసాధనకు పధకాలు రచించేవారు.
మండపాల్లో వినాయకుడి విగ్రహాలు నిలిపి, 9 రోజుల పాటు పూజలు చేసి, ఆ తరువాత నిమజ్జనం చేయడం ఆరంభించారు. అదే ఇప్పటి గణేశ ఉత్సవాలకు మూలం అని చెప్పొచ్చు. తిలక్ చేసిన ఆలోచన వల్ల నిజంగానే అప్పట్లో ప్రజల్లో మార్పు కనిపించింది. ఏటా నిర్వహించే చవితి నవరాత్రుల కోసం చాలామంది ఎదురుచూసేవారు. ఇదే కాలక్రమంలో స్వాతంత్య్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు దోహదపడింది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు గణేష్ చతుర్థి వేడుకలు కారణమయ్యాయంటోంది చరిత్ర.
అయితే ప్రస్తుత గణేశ ఉత్సవాల తీరు చూస్తే, ఐకమత్యం పోయే... ఆర్భాటం వచ్చే అన్నట్టు తయారైంది. ఇప్పుడు కూడా మనం గణేశ ఉత్సవాలను ఉత్సాహంగా ఘనంగానే జరుపుకుంటున్నాం. అయితే ఆ ఉత్సవాల్లో ఐకమత్యం లేదు హంగులు పెరిగాయి. ఆర్భాటాలు పెరిగాయి. ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద గణేశ ప్రతిమలు పెట్టడం దగ్గర్నుంచి, ఎంత పెద్ద ధ్వనితో డి.జె లు పెట్టామో అన్న ఆరాటం కనబడుతోంది. ఈ ఆరాటం కొన్నిచోట్ల కొట్లాటలకు దారితీసి తలలు పగలగొట్టుకున్న సంఘటనలు కూడా వింటున్నాం.
మరీ ముఖ్యంగా బలవంతపు చందాల వసూళ్ళకు అడ్డాలుగా మారాయి. చచ్చీ, చెడీ, ఇష్టమున్నా, లేకపోయినా చందాలు సమర్పించుకోవలసిన పరిస్తితి. అది కూడా నిర్వాహకులు ఎంతంటే అంత ఖచ్చితంగా చెల్లించుకోవలసిందే.
అపార్ట్మెంట్ లు పెరిగిన తరుణంలో ఈ చందాల వసూళ్లు మరీ అధికారికంగా మారిపోయాయి. గతంలో వీధుల్లో చేసే ఉత్సవాలకు ఇచ్చే ఛందాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని అపార్ట్మెంట్ లు పెరిగిన తరువాత ఖచ్చితంగా ఒక రేటు పెట్టి మరీ వసూళ్లు చేయడం కనబడుతోంది. పోనీ ఇంతా చేసి ఏ ఐకమత్యం, కలయిక కోసం ఉద్దేశించబడిందో, ఆ కలయిక, ఐకమత్యం అక్కడ మచ్చుకైనా కానరాదు. ఒకరి మొహం అటుంటే ఇంకొకరి మొహం ఇటుంటుంది. ఏ గ్రూప్ కి ఆ గ్రూపే. భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు వినాయకుడు.
అలాంటి గణేష ఉత్సవాలు ఇప్పుడు హంగు, ఆర్భాటాలు ఎంత గొప్పగా ఉంటే అంత ఘనంగా ఉత్సవం జరిపినట్టు. ఎంత కొత్త, కొత్త, వింత, వింత ఆకారాలతో వినాయకుడి ఆకృతిని నిలిపితే అంత ఘనత. క్రికెట్ ఆడుతున్న వినాయకుడు, కరోనా వినాయకుడు,డేన్స్ చేస్తున్న గణేశుడు, ఫుట్ బాల్ ఆడుతున్న గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్ గణపతి, బుల్లెట్ గణపతి ఇంకా ఇంకా విభిన్న రూపాలతో, చివరికి వినాయకుడి అసలు రూపాన్ని మరిచిపోయేంత వికృత ఆకారాలకు రూపకల్పన జరిగిపోయింది. ఎవరెంత కొత్త,వింత,వికృత రూపాన్ని నిలిపితే అంత ఘనత.
ఇక నవరాత్రులు చివరి రోజు చేసే హంగామా చూస్తె మతిపోతుంది. తాగడం, ఎగరడం, దూకడం, డప్పులు, డాన్సులు ఇదంతా భక్తి పారవశ్యంతో చేసే డేన్సే సుమా! ఇలా చేసి మన సంస్కృతీ పరువు మనమే తీసుకోవడం కాదా! భయకరమైన సౌండ్ సిస్టంతో పాటలు, టపాసుల మోత, ఆ మోతకు, గోలకు ఎవరికైనా గుండాగిపోతుందేమో అన్నంత భయం కలుగుతుంది. ఇదంతా భరించలేని ఎవరైనా ప్రశ్నిస్తే, వారు కల్చర్ లేనివాళ్ళు, కలిసికట్టుగా ఉండలేనివారిగా జమకట్టేస్తారు. చేసేదిలేక ఎందుకొచ్చిన గొడవ అని వారూ మౌనంగా ఉండిపోతారు.
సరే ఆ విషయం పక్కన పెడితే ఈ సామూహిక గణేశ ఉత్సవాలు స్వాతంత్రోద్యమ కాలం నుంచే కాదు సాధారణ శకానికి పూర్వం 271 వ సంవత్సరం నుంచే జరుగుతున్నట్టు చారిత్రిక కథనాలు చెబుతున్నాయి.
బాలగంగాధర్ తిలక్ సామూహిక గణేశ ఉత్సవాల ద్వారా తీసుకొచ్చిన ఉద్యమస్ఫూర్తిని అలా ఉంచితే, అంతకు పూర్వం కూడా సామూహిక గణేశ ఉత్సవాలు జరిగాయి అనడానికి చారిత్రిక ఆధారాలున్నాయి. ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయన్నడానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ... శాతవాహన, చాళుక్యుల కాలంలో ఈ సామూహిక గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమైనట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.
అలాగే మారాఠ చక్రవర్తి ఛత్రపతి శివాజీ కూడా ... ఈ పండుగను తమ ఆరాధ్య దైవం పండుగగా ఘనంగా జరిపించినట్లు చరిత్ర చెబుతోంది.